పారిజాత పరిమళాల
ఆ పారవశ్యపు వేళ
కులుకుపూల
పలుకుతేనెలూరేటి ఆవేళ
విరులు వింజామరలై
మరులు మరువపు సరులై ప్రభవించేటి వేళ
కోయిల కువకువలే
వేకువ రాగాలై
పల్లవించేటి ఆవేళ
మలయమారుతమ్ముపై
మది సోలిపోయేటివేళ
మలిపొద్దు నులివెచ్చగా
నెచ్చెలిని చేరి మురిపించేటివేళ
ఆవేళలో
ఆవేళలో
మొదలాయె
వేవేలకదలికలు
వర్ణించగ తరమా
అవి వెన్నెలపరచిన
వలపులదారులు
కన్నియకలలో
వన్నియహొయలు
కలలోకలయికలో
కమ్మనికలహాలో
కన్నుల లోగిలిలో
వన్నెలకావ్యాలో
తలపులో
వలపులో
మరపులో
మైమరపులో
వెచ్చని నిట్టూర్పులో
మురిపాలసరాలో
తొలకరి రసరాగాలో
ఊరించే ఊసులో
ఊహల కెరటాలో
హరివింటిసరాలో
విరివింటి శరాలో
కలకంఠి గుండెల్లో
కమ్మని కథనాలో
ఆ నులివెచ్చని తలపులు
తాకిన ఎద తలుపులు
తలపులు కావవి
వలపుల వరుసలు
అన్నులమిన్నకు
అరమోడ్పు కన్నులపై
కదలాడేఊసులు
అమ్మో !
ఆ ఊసులు ముసిరేమైమరపులు
వినువీధుల పైనే ఊరేగే...ఊయలలు
మానసచోరుని
మధుగోపాలుని
సద్దులుసేయక
నిద్దురలోనే
చేరే తావులు
కమ్మని కలయయి
మురళీ లోలుని
మదిలో మలిచే
ఎదలోకొలిచిన
మనమోహనమదనుని
ఎదుటన నిలిపే మధురమయిన
కలయికగా...
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
pandoorucheruvugattu.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి