పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, జులై 2022, ఆదివారం

*మహాభిజ్ఞుడు...గుర్రంజాషువా*


అతడొక మహా మనీషి
అతడొక మహోన్నత శక్తి
అతడొక మానవతామూర్తి
అతడొక నవ చైతన్య స్ఫూర్తి 
అఖండ ఆంధ్రావని చరిత్రలో
అతడొక మహోజ్వల సాహితీ మూర్తి
అతడొక నవయుగ కవి చక్రవర్తి

అభివర్ణించ గలమా...
అక్షరాలతో అక్కజాలు సృష్టించి
అగ్రవర్ణాలలో అలజడి పుట్టించిన
ఆ అభ్యుదయ కవి దిగ్గజాన్ని 
అక్షరాలు చాలునా ఆ మహాభిజ్ఞుని 
సాహితీ ప్రజ్ఞా ప్రాభవాన్ని ప్రస్తుతించ
అక్షరాలు సరిపోవునా విశ్వవిఖ్యాతమౌ
ఆ "విశ్వనరుని"ఘనకీర్తి గణుతించ
పదివేల మాటలు చాలునా.. 
ఆ పద్య కవీంద్రుని
పద కౌశలాన్ని సన్నుతించ

ఏమని పొగడ గలము
ఎల్లలు దాటిన అద్వితీయ 
సాహితీ సుమ సౌరభాన్ని
ఎంతని కొనియాడగలము
ఆ విశ్వకవి సామ్రాట్టు
కవన ప్రాశస్త్యాన్ని
సమ సమాజ స్ధాపనకై
సాంఘిక ప్రక్షాళనకై
కుల వివక్ష కూకటి వేళ్ళ
పెకలించగ తన కల కరవాలమును ఝుళిపించి
కవన రంగమున దూకె
కవి నారసింహుడై
వెలివాడల బ్రతుకుల్లో
తొలి వెలుగు జాడల ప్రసరించగ

అక్షరాగ్నిని ప్రజ్వలింప జేసిన
ప్రఛండ భాస్కరుండతడు
పంచముడెవరని
పంచభూతాలసాక్షిగా ప్రశ్నించి
కడజాతి కడగండ్ల కడదేర్చ
కబురంపె "గబ్బిలం"తో రాయబారము కాశినాధునికి కడు చిత్రంగా..
తన ఖండ కావ్య మందు
సమత మమత మానవతలే 
తన కవితా పాదాలుగా అభ్యుదయ 
సాహిత్య సేద్య మొనరించె

రసరమ్య ప్రణయామృతాన్నైనా
సాంఘిక దురాగతాన్నైనా
పెల్లుబికిన కన్నీటినైనా
వెల్లి విరిసిన అనుభూతి నైనా
సాహితీ ప్రస్ధానంలో
ఆతను స్పృశియించని
అంశమే లేదంటే అతిశయోక్తి కాదేమో
అట్టడుగు జీవితాలే
పద్య శిల్పాలుగా

మండుతున్న నిరుపేద గుండెలే
ఖండ కావ్యాలుగా  అమృత గుళికనూ, నిప్పు కణికనూ
తన కలాన ఇముడ్చుకొని
ఒకపరి .......
కాల్పనికతతో కలలో విహరింప చేసినా
తదుపరి....
వాస్తవికతను వాడి,వేడిగా వడ్డించినా
ప్రకృతిలో పరమాణువు సైతం
తన కలాన కవనం గావించి
ఒక కవీంద్రుని ఆత్మ నివేదనాన్ని
ఫిరదౌసిలో హృద్యంగా ఆవిష్కరించి

నవ మాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి యంటూ
అనుభవించు కొలంది నినుమడించుచు మరంధము జాలువారు
చైతన్య ఫలమంటూ 
శిశువును అభివర్ణించి
తేలిక గడ్డిపోచలను తెచ్చి
రచించితి వీవు 
తూగుటుయ్యేల
గృహంబు మానవులకేరికి సాధ్యము కాదనుచు,
గిజిగాని నేర్పరితనాన్ని, కొనియాడి ,అఖండ గౌతమీ నది అందాలను రమ్యంగా అక్షరీకరించి
అఖండ ఆంధ్రావనికీ
తన ఖండ కావ్యాల కలకండలిచ్చిన
విశ్వకవి సామ్రాట్టు

అగ్రవర్ణాలకే పరిమితమైన
సాహిత్యాన్ని 
మొట్టమొదటగా
అట్టడుగు జీవితాలకు పరిచయంచేసి
కరుణ రసావిష్కరణం చేసిన
కరుణార్ధ్రమూర్తి

వడగాల్పు నా జీవితమైతే
వెన్నెల నా కవిత్వమని
ఛీత్కారాలు పొందిన
తావుల్లోనే  తన ధిక్కార స్వరంతో
సాహిత్య
సమరం గావించి
సత్కారమందు కొన్న
సత్కవి వరేణ్యులు

మన జాషువా నాటిన
అభ్యుదయ సాహితీ వనంలో
నే గడ్డి పూవయినను చాలు
ఆ కవివరేణ్యుని సాహిత్య బాటలో
నే ఇసుక రేణువయిననూ  చాలు
ఆ అభీకుని కలం విదిల్చిన సిరా బొట్టునయిననూ... చాలు
ఆ మానవీయుని కలాన 
జాలువారిన కవనంలో నేనొక 
ఆక్షరమయిననూ చాలు
ఆ దార్శనికుని కావ్య సంద్రంలో
చిన్ని అలనయినా చాలు

కవి తలపెట్టిన 
సమ సమాజ స్ధాపన మహాయజ్ఞం కొనసాగించుటకై
మన ఉడత.  సాయమందిద్దాం
చిరు కవితాబాణం సంధిద్దాం
అదే మనమహనీయునికిచ్చే
మహత్తర నివాళి...

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
*విశాఖ పట్నం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి