పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

18, జులై 2022, సోమవారం

మార్పు మంచిదే*


కవిత రాసామంటే 
కర్తవ్యం రెక్కలు కట్టుకు వాలాలి
కలం కదిలించామంటే 
కాలం కంటే రెండడుగులు 
ముందే నడవాలి
అక్షరం రాల్చిన ప్రతిసారీ 
తీక్షణమైన ఆలోచనకు తెరతీయాలి
మస్తిష్కాన్ని విచ్ఛేదనం చేస్తున్న
ఆ శరాలు నేను రాసిన అక్షరాలే
తప్పొప్పుల తక్కెడలో 
తప్పించుకోగలదెవ్వరు
తిలాపాపం తలా పిడికెడు
నన్ను నేను లోతుగా అన్వేషించాను 
అంతర్యుద్ధం అనంతరం 
చూపుడువేలును 
సారించడం నచ్చడంలేదు 
సమాజ ముఖచిత్రాన్ని 
సమీపంగా వీక్షిస్తున్నాను
శూన్యం పొత్తిళ్ళలోకి చూపులకత్తులు
చొప్పించాక రాలిపడ్డవి 
సమాధానాలు కావు
చురకత్తులవంటి ప్రశ్నలే
తెరలు తెరలుగా  ఆక్రమిస్తున్న
ఆలోచన పరంపరలు 
మంచి మార్పునే సూచించాయి
మనుష్యుల గుంపులో 
నేనూ అంతర్భాగమే 
లోకం పోకడను
ఆవిష్కరించే క్రమంలో 
నన్నూ ముద్దాయిగానే
పరిగణించింది నాకలం
సమాజాన్ని నడిపించే 
బృహత్తర బాధ్యత 
భుజాలకేసుకున్నప్పుడు
మొట్టమొదటగా ఆత్మప్రక్షాళనకు
సమాయత్తమవ్వాలి 
తక్షణమే స్పందించే లక్షణాన్ని
ఈ క్షణమే అలవర్చుకొంటే
మానవాళిని చైతన్యగీతికలగా
మలచే మహత్తర కార్యానికి సమాయత్తమై
ఉదయించే సూర్యునిలా 
సమాజ హృదయాన్ని వెలుగులతోఅలంకరించి అక్షరమై మార్గాన్ని నిర్దేశించవచ్చు.
*సాలిపల్లి మంగామణి శ్రీమణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి