నీ నీలి ముంగురులు చిరు గాలికి నీ మోముపై నటనమాడినట్టు ,
నీ చెంపలపై విరబూసిన కెంపుల మిలమిలలు మధుపాన్నే మురిపిస్తుంటే
నీ పారాణి పాదాల సిరిమువ్వల సవ్వడికే గుండె జల్లు మంటుంటే
తళుకులీనుతున్న నీ నవ్వులోని మిసమిసలు ,
చూసి వెలవెల బోతున్నాయి ఆ వెండి వెలుగురేఖలు
ఏ నీలి మబ్బుల స్నానమాడినావో ,నవ పరిమళాలు గుభాళించె నీవున్న తావులెల్ల .
పొద్దు పురుడు పోసుకొని కొలను కిచ్చిన కలువభామవా
కిలకిలలూ ,చిన్నబోయే నీ పలకరింపులో
నీ కులుకుల సొగసుకి పలుకు లేక నిలబడిపోయే ప్రకృతిలో ప్రతీ సౌందర్యం .
,వింధ్యామర కూడా ,నీ చెంతనున్న చల్లని హాయికి మైమరచిపోయే
కలలో కూడా కాంచని అందం ,ఇలలో చూసి నివ్వెరపోయా... ఒక నిమిషం .
నిజం చెప్పునీవెవరో .. ఆ నింగి నుండి భువికి దిగిన అప్సర నువ్వు కావా ..
కవి తన భావుకతకు , తన సిరాలో సౌందర్యాన్ని కలగలిపి , రాసిన ప్రణయ ప్రబంధానివి కావా ..
రవివర్మ తనలో రంగులన్నీ ఒలకబోసి చిత్రించిన రసమయిసుందరి కావా ..
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి