సిరిలక్ష్మి అందియలు ఘల్లు,ఘల్లనుచుండ , గృహలక్ష్మి గాజుల్ల కెంపుల్లు మెరియ,
తెలుగు ముంగిలిలో వెలుగుల్లహేల . అరవిరిసిన రంగవల్లికల తోడ ..
పారాడే పాపాయిల బోసి నవ్వుల్ల కళకళా .. ఘుమ ,ఘుమలు గుప్పుమని పిండి వంటల తోటి
ముద్ద బంతి తోరణాల గడప మురియంగా ... సరి కొత్త రాగాల చిరు కోకిలమ్మ మైమరచి పోగా
లేత చిగురులు పల్లవించిన చిగురు మావికొమ్మ .. పచ్చకల్యాణిగా .. పయనమయి రాగా ...
పదహారణాలా పట్టు పావడా పలకరించేను పడచు సొగసులను ,ముగ్ధమనోహర సౌందర్యమతిశయించంగా .....
తేట తెలుగులమ్మ గలగలా .. పరవళ్ళు తీసింది నవ వత్సరంలోకి , నిండైన తెలుగుదనం నింగికెగిసేలా ...
అరవిరిసిన సిరి మల్లికల సరాలు పడతి కురుల చేరి సందడి చేసేస్తుంటే . సందె వేళ నుంచే మైమరపుల మత్తు జల్లి
మంచి ముత్యాల జల్లులా విరబూసి వేప పూవు రుచికి చేదు నైనా నేను ... ధన్వంతరి కానా యని ?
పులకరించి చెబుతుంది పుల్లని మామిడి . ఉగాది విందులలోకి పసందు నేనే నంటూ ...
తెగ వగలు పోతుంది వగరుకూడా . తనవల్లే మాధుర్యపు రుచి . చవులూరిస్తుందని ..
చెరుకులమ్మ ఉరుకులూ తీస్తూ వచ్చేసింది . తన మాధుర్యం మనపై కురిపించాలని .
ఉప్పూ ,కారం కూడా ఉప్పొంగి దూకేసి కష్ట ,సుఖాలను కావడి కుండలు అంటూ చెప్పకనే చెప్పేస్తూ..
షడ్రుచులూ మేళవించి ,మేటి రుచులను మనపై కుమ్మరించి ,
ఉగాది పచ్చడిలా ... అమృత నైవేద్యాన్ని అధరాలకు అందించి ,
పసిడి కాంతులను మన బ్రతుకుల్లో వెలిగించి ,
రానే వచ్చింది.. రసమయ ఉగాది . ఇది ప్రేమైక జీవనానికి వారధి . మన్మధ సంవత్సరాది .
రానే వచ్చింది రమ్యమయిన ఉగాది .
నవ వాసంతాన్ని తనతోనే మోసుకొచ్చింది .,క్రొంగొత్త అనుభూతులద్దుకొచ్చింది . ఏ సిరి చందనాల పరిమళాలు రాసుకొచ్చిందో ... మధు కలశం మనకోసం త్రెచ్చినట్లే ఉంది . ఈ మన్మధ సంవత్సరాది .
ఉత్తుంగ తరంగంలా ..
వచ్చి తట్టి లేపింది .మిన్నంటే వేడుకను వెంట తెచ్చింది .
వేయి పున్నముల వెలుగు రేఖలు ప్రతీ మోములో విరబూయిస్తుందేమో ...
సుఖ సంతోషాలను , ఆయురారోగ్యాలను ,సర్వ మానవాళికి శాంతి ,సౌఖ్యాలనూ తనలో నింపుకొస్తున్నట్లుంది . ..
ఆశావహ దృక్పధంతో
ఆహ్వానిద్దాం ఈ ఉగాదిని ..... ఆడి , పాడి అంబరాన్ని తాకేటి ఆనంద సంభరాల నడుమ .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి