ఏదో తీరని వెలితి, అదో చవి చూడని అనుభూతి ,ఆ తీయని అనుబంధం అంటే నాకంతటి ప్రీతి .
అన్నా ... అనే పిలుపంటే నాకు తెలీని ఆర్తి , నేనున్నాననే తమ్ముడంటే .. నను నేనే మరచేంత సంతృప్తి .
చల్లని తూరుపు గోదారమ్మ ఒళ్లో పుట్టి , మధురఫలం పండూరుకి గారాల పట్టినై
ఆది దంపతుల లాంటి తల్లిదండ్రులకు ముద్దుల పెద్దమ్మాయినై
ఇద్దరు చెల్లెళ్ళ ముద్దుల సహోదరిగా .. అక్కా .. అను పదాన్ని అందంగా పూరించి .
మెట్టినింటికి వన్నె తేగా అత్త మెచ్చిన కోడలిగా ,కర్తవ్యపాలనలో కృతక్రుత్యురాలినై ,
ఆడ పడచులకు చిన్నదాన్నైనా వదిన(అమ్మ)గా ,మారి
అనురాగానికి మారు మా వారికి సహధర్మచారిణి గా ,
నా ముద్దులపాపకి ,మురిపాలబాబుకి , జన్మనిచ్చిన అమ్మ గా ,
పుట్టినింటి నుండి పుత్తడి బొమ్మలా వచ్చి మెట్టినింటిలో పుడమి తల్లిగా మారి
సమాజహితాన్ని కాంక్షించే వర్ధమాన కవయిత్రి గా ,
ఒక పితృ సమానులవు మహోన్నత గురువు మెచ్చిన శిష్యురాలిగా,
ప్రియ సఖినై , నా చిన్న నాటి నేస్తాలకు చిరు స్మృతిగా నిలిచి ,
అన్ని బంధాలలో ,అనుబంధానికి ,అనురాగం రంగరించి
ఒక పరిపూర్ణ మహిళగా .. నను నేను మలచుకొన్నా ..
ఒకే ఒక పిలుపు పిలవాలని తపించాను . సృష్టి లోని అనురాగాన్నంతా నా దోసిట నింపి
అన్నా .. ఆ తీయని పిలుపు కై నా జన్మంతా తపిస్తాను .
నేనున్నాననే ప్రతీ స్నేహంలో అన్నాతమ్ముళ్ళనే ఆకాంక్షిస్తాను .
నా మనసుకి ,నా ఆలోచనలకు ,జత కుదిరే ,
ఏ మనిషైనా ,ఆదర్శమైన ఆ అనుబంధాన్ని అన్వయిస్తా ...
ఈ అన్నా తమ్ములకై నే పడే ఆరాటం తప్పంటారా ?
ఎవరైనా .. సహోదర హస్తం అందిస్తారా ... అమూల్యమైన ఆ అనుబంధాన్ని ,ఆ జన్మాంతం ఆరాధిస్తా
ఎవరైనా .. ఉన్నారా అన్నయ్యలా ... కమ్మని చిన్ని తమ్ముళ్ళా ... మనసారా ఆహ్వానిస్తూ ...
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి