పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

8, మార్చి 2015, ఆదివారం

అమరమైన అమ్మ మనసు




ఆ అమ్మను చూస్తే ఆ మాతృత్వానికే  కన్నీరు ద్రవీభవించింది . ఆకాశం  గుండె బ్రద్దలయ్యింది  . పుడమి తల్లిసైతం తల్లడిల్లి పోయింది .కరుడు గట్టిన తన కన్నబిడ్డల కోసం  ఆ పిచ్చి తల్లి పడే ఆరాటం చూస్తే.  .
ఆమె వైపు చూస్తుంటే  , ఆసాంతం ఏ హృదయం అయినా కలచి కలచి కళ్ళ వెంట  కళ్ళనీళ్ళ జలపాతమే ప్రవహిస్తుంది . .
 ఆ నిర్వికారపు చూపులు . చిద్ర మయిన  దుస్తులు , నిశ్చేతనయై , చుట్టూరా ముసురుతున్న మురికి జీవాలు ఆ శరీరాన్ని స్వాధీనపరచుకొని ,దొరికినంతా దోచుకొంటూ రక్త మాంసాలు పంచుకొంటూ ,స్వైర విహారం చేస్తున్నా !మునిపంట బాధనణచుకొనే పాటి సమయానికి కూడా తావులేదు . అలసిఉన్న ఆ అమాయకపు అమ్మ హృదయంలో , తొమ్మిది మాసాలు మోసి రక్త మాంసాలు పంచి ,పురిటి నొప్పులను తృణప్రాయముగా నెంచి శతకోటి నోముల పంటయని , మునిపంట బాధనణచి  కన్నబిడ్డలు.  కన్న తల్లిని  కాటికి  కూడా సాగనంప తీరిక లేని కాఠిన్యమూర్తులు.  కారుచీకటిలో , మోసుకొచ్చి నడివీధి కుప్పతొట్టి దరి  కూర్చుండబెట్టి రెండు చక్రాల కుర్చీ సాక్షిగా .. అరక్షణం లో వస్తానంటూ , కారునెక్కిన కన్నబిడ్డలు ఆరు నెలలకూ కానకుంటే కమ్మనైన అమ్మతనం మాత్రం ఆదమరచక చూస్తేనే ఉంది .  ఆ కన్నబిడ్డల రాక కోసం ,ఏ మానవత్వమున్న హృదయం అయినా చేరదీసి సేద తీర్చుదామన్నా !అమ్మను కానక తనబిడ్డలు తలమునకలవుతారని ఆ పిచ్చి తల్లి ఆరాటం . చావు బ్రతుకుల పోరాటంలో చివరి మజిలీ చేరుకొన్నా .. ఆ  తల్లి ని  చూసిన ప్రతీ బిడ్డా చలించి పోతున్నా !కన్న బిడ్డలే కాలయములై  కారు చీకటికి బలి ఇస్తే , ఆకలి దప్పులు మరచినా కడుపు తీపిని మాత్రం కడ దాకా దాచే ఉంచింది . పేగు బంధపు బంధనాలను త్రెంచుకోలేక . దారి మరచి పోయారో , లేక ఈ అమ్మ పైన దిగులుతో రాలేనంతగా సుస్తీ బారిన పడ్డారో !పాపం నా బిడ్డలు .ఏ దారిన మీరెల్లినా ! నా వాళ్ళు జాడ కనిపిస్తే ఈ అమ్మకప్పగించండి . అందాకా కనురేప్పేయక కాచుకొనే ఉంటా !కదలలేని నేను . మృత్యు వొచ్చి కభళిద్దామనుకొన్నా !నా బిడ్డల చూసే వరకు నువు వేచే ఉండాలంటూ మొరాయిస్తానంటూ ..ఆ అభాగ్యపు అమ్మ  నీరెండిన కన్నుల్లో ,  కన్నబిడ్డల ప్రతిబింబం పదిల పరచుకొని వదిలేసింది . వదులై పోయిన ఈ అమ్మ జన్మను, సహజమైన అమ్మతనాన్ని , అనురాగాన్ని అమరం చేస్తూ .. సమరం చేయలేక నేటి పైశాచిక తనయుల పై , తనువే చాలించింది . అదే నడిరోడ్డుపై అదే ఎదురుచూపుల ఎండమావిపై ( దండం పెడతామన్నా దయచేసి .... కన్నవారిని మాత్రం కడదాకా అక్కున చేర్చుకోండి )                             అభ్యర్ధిస్తూ 

                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

26, ఫిబ్రవరి 2015, గురువారం

కళావేదిక కల్చరల్ & చారిటబుల్ ట్రస్ట్


కళావేదిక కల్చరల్ & చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో విశాఖలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన విశిష్ట మహిళల జీవిత విశేషాలను పొందుపరుస్తూ ఒక ప్రత్యేక సంచికను ప్రచురించి ఆవిష్కరింప తలపెట్టినాము. సందర్భంగా నగరంలో గల విశిష్ట మహిళలు వారి పూర్తి వివరాలతో పాటు వారు చేసిన సేవాకార్యక్రమాలు (రాజకీయ/సామాజిక/సాహిత్య/కళా రంగ పరంగా) మాకు 2 పాస్ పోర్టు సైజు కలర్ ఫోటో జతపరచి 8 మార్చి,2015(ప్రపంచ మహిళా దినోత్సవం) తేదీ లోపు దిగువ అడ్రెస్ కు పంపించ ప్రార్థన

                                                                                                                                                                                                                                                               ఇట్లు
                                                                                         శ్రీమణి (కళావేదిక కార్యదర్శి)                                                                                             Contact no : 8522899458    
              ADDRESS :
Salipalli mangamani (sreemani)            
w/o s.srinivasarao
plotno -9,
dr no 54-4-29,
sai sravanthi residency,(opp -shivaalayam)
isukathota,
vishakapatnam-530022.
    


21, ఫిబ్రవరి 2015, శనివారం

తెలుగు ని వెలిగించండి



అమ్మ తన ప్రేమామృతాన్ని  అనురాగంతో రంగరించి ఉగ్గు పడితే , 
అది మన నరనరాల పొర్లి పొర్లి తేట తెలుగులా మారి మన  నాలుక పై మధురామృతమై జాలు వారె కాబోలు . అందులకేనేమో  మన తెలుగు పలుకు   తీయ తీయనితేనెలు   చిలుకు . పంచదార గుళికంటి  చెరకు . 
అమ్మా !అనే కమ్మని భావన .మాతృత్వపు మాధుర్యం చవి చూపిస్తే , మన మాతృభాష గొప్పదనం మన ఉనికికే మణిమయహారం .
 బ్రహ్మ మనకిచ్చిన  నజరానా అమ్మైతే ,
 అమ్మ మనకందించిన తరగని నిధి ,కమ్మని తెలుగు భాష సన్నిధి . 
మాతృమూర్తిని పొగడడానికి ఎన్ని పదములు కూర్చగలవు .
 మన హృదయ స్పందనే అమ్మైనప్పుడు , 
మన తెలుగు భాషను ప్రస్థుతించగ  తెలుగు బిడ్డకు పదములున్నవా . తెలుగు భాషకు వెలుగులద్దగ ప్రతీ తెలుగు బిడ్డ కదలి రాగా !
కన్నతల్లి తెలుగు భాషను  కళ్ళ నీరే పెట్టనీకు . మాతృ భాషను మరుగునెట్టి పరుగులెత్తకు పరాయి పంచకు, వంచించకు వరాలతల్లిని ,అరువు  తేకు ఎరువు భాషని , అన్ని భాషలు అవసరానికి ,
 అమ్మ బాష మన ఆత్మ బలానికి , 
తెలుగన్న దమ్ములారా తెలుగు ని వెలిగించండి 
దయ చేసి తెలుగును కాపాడండి .
 తెలుగు బిడ్డలైనందుకు తెలుగు ను బ్రతికించండి . 
                                               సాలిపల్లి మంగామణి  @శ్రీమణి

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

మమ్మేలిన వాడు



గంగమ్మ నడిగేను జంగమయ్య జాడను , గౌరమ్మ నడిగేను మా తండ్రి ఏడని ,ముల్లోకములలోన వెతికినా లేడు   ఇంకెక్కడుంటాడు . ఈశ్వరా అన్నట్టి ప్రతి ఇంట నుంటాడు .
చిరు బిల్వ పత్రమే బహు ప్రీతి గా తలచిఎనలేని సిరులనే మా పాలి వరమొసగి  ,దోసిట గంగా జలమాత్రమున  ఎ ఆనందపు జాలునిచ్చి , హరహరా అని  పిలిచిన వెనువెంటనే మా వెతలు తీర్చి ,ఎవరో కాదతడు మమ్మేలిన వాడు మన భోళా శంకరుడే ,మహా దేవుడతడు .
ముక్కంటి అని మ్రొక్క మోక్షాన్ని మోసుకొచ్చి ,  దర్శన మాత్రమే సకలైశ్వర్యములొసగి ,ఎవరో కాదతడు. మమ్మేలినవాడు , ,మహిమాన్వితుడువాడు  శ్రీ మహేశ్వరుడతడు .
ఎందుకయ్యా మాపై కొండంత వాత్సల్యం . మా పాప కర్మాల పటాపంచలు చేసి పరమ పావన పదసోపానం పదిలంగా కైవల్యమొసగేవు  కైలాశ  గిరి వాసా !సాక్షాత్తు  పరమేశా !సాగిలపడి ప్రణమిల్లిన మరు క్షణమే నీ కరుణామృత ధారల్లో తలమునకలు చేసేసి ,తల్లడిల్లి పోతున్న మాకు కన్నతల్లి , తండ్రి గా మారి కష్టాలను తుడిచేసి , కమ్మని సౌఖ్యాన్ని  మాకొసగి    ,ఎవరో కాడతడు . ముజ్జగాలకు రేడు . అర్ధ నారీశ్వరుడు వాడు . అమృతాన్ని అఖిల జగానికి పంచి , హాలాహలాన్నికంఠాన దాచుంచిన  నీలకంఠుడు . నిన్ను నమ్మిన మదికి మాలిన్యమంటునా !నిన్ను చూసిన కనులు అంధకారమునెరుగునా !నిను మ్రొక్కిన కరములకు  కొరవడునా అదృష్టం . నిత్యం నిను స్మరించిన అధరాలకు ఆ పరమ పదమే ప్రాప్తించుట తధ్యం కాదా !



13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ప్రతీ రోజు ప్రేమికుల రోజేగా !



అందంగా అమిరిన నా హృదయపు పొదరింట్లో , నీ రూపం నవ మన్మధ బాణంలా
నులివెచ్చని వెన్నెట్లో నిదురించిన నా కనుపాపల పై నీ అధారాల చిరు సంతకం తేనియ జలపాతంలా 
ఉలిక్కిపడి చూస్తే నీ రాకను చెప్పకనే చెప్పిన నీ అడుగుల చప్పుడు. సరికొత్త సరాగంలా ...  ,
నిను తాకిన చిరు గాలి చందనం నేనున్నతావులను  నందనవనముగా మార్చి సౌగంధపు వీచికలా
నా మేనంతా వింత హాయిలో విహరిస్తుంటే , నిశీదిలోను నీ తలపు నిండు చంద్రుని  కాంతి  రేఖలా .. 
స్వప్నములోను నీ ధ్యాశే  తనువంతా  అమృత ధారలా   ,
 నేనెలాగ నిలువ గలను నిశ్చేతన నేను నీ వలపులజడిలో ,
నా లో ప్రేమకు ప్రతిరూపం నీవై 
అనురాగానికి ఆలంభన వై ,
 నా హృది వీణ పలికిన సరిగమవై 
నా తనువును తన్మయ పరచిన తంత్రం నీవై 
నాలో అణువణువున  నిండి ఉన్న నిన్ను 
తలచి మురిసిపోడానికి , ఒక రోజంటూ ఎందుకు ప్రతీ రోజు ప్రేమికులరోజేగా ... 
ప్రేమించే మనసులకు ప్రతీ క్షణం ఆనంద వీక్షణమేగా ..... 
                                                  సాలిపల్లి మంగా మణి @శ్రీమణి        

12, ఫిబ్రవరి 2015, గురువారం

మత్తు చేసే గమ్మత్తు



ఊది ఊది ఊపిరి ఆగిపోయే వరకు ,పీల్చేసై ,
 టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై జల్సా చెయ్ , . 
నీ   ఇల్లాలి తాళి చేల్లిపోతేనేం . నీ బిడ్డల తలరాతలు తలక్రిందులు అయితేనేం ,
తల్లి తండ్రి గుండె బ్రద్దలయితేనేం . 
 , గుప్పుగుప్పు మంటూ ఆ గబ్బును గభ గభా లాగించెయ్ . 
 మత్తులోని గమ్మత్తు ను అమాంతం ఆస్వాధించెయ్ , 
నువ్వు కాల్చేసిగెరెట్టు .  ప్రతీ క్షణం ,నీలో ప్రతి కణాన్ని  కణకణ మని  దహించేస్తే 
నీకే ,తెలియకుండానే నీ  ఉసురు తీసేందుకు , ముసురు కాచుకొన్నట్టే ,
కాటికి దగ్గర దారిని వెతుక్కొంటూ నిండు బ్రతుకు కుకొరివి పెట్టుకొంటూ  ,ఆయువు ఆవిరి కావిస్తూ 
నిన్నటి  నీ వ్యసనానికి  నీ వొళ్ళు , నిన్ను నమ్ముకొన్న వాళ్ళ  ఆశలు , చిధ్రమై ,
బ్రతుకు భారమై , నిత్యం మృత్యు కేళీ విలాసంలో ఊగిస లాడుతూ 
నీకు నీవే భారమై , నీ వారికీ ,  పెనుభారమై ,గమ్మత్తులకెగబడి మత్తుల్లో తూలితే  మరమత్తు చెయ్యలేని మరబొమ్మగా మిగిలి తగలబెట్టు నీ వాళ్ళ నిండు భవితను నిర్దాక్షిణ్యంగా ... 


10, ఫిబ్రవరి 2015, మంగళవారం

కడలి క్రోధ సంతకం






కడలి కన్నీరు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసి,
 తన ప్రకోపాన్ని ఈ మానవాళికి చవి చూపిస్తూనే ఉంది . 
చవి చూపిస్తేనే ఉక్కు కట్టడాలే ఊగిసలాడిపోతే , మరి తన సహనాన్ని శోధించాలని చూస్తే , 
 కన్నెర్ర చేసిన ఆ   సంద్రపు క్రోధాన్ని చూడాలన్నా ,నిలిచి ఉంటుందా ఈ జీవ రాశి ఆసాంతం . మిగిలి ఉంటుందా మచ్చుకయినా మన సామ్రాజ్యం . 
నేటి చిందర వందర ఉరుకుల పరుగుల జీవన గమనంలో ,మనిషి చేసే కాలుష్య కాండను , మన్నించలేక , మనపైనే విరుచుకుపడుతుందిలా .. కన్నెర్ర చేసిన కడలి క్రోద సంతకాన్ని  , కినుక వహిస్తే తుడిచి పెట్టుకు పోదా !భూమి పైన పరమాణు జీవి సైతం . మితిమీరిన సాంకేతికత్వం ప్రకృతి సహజత్వాన్నే కాల రాసేస్తుంటే , విషవాయువు కసితీరా పచ్చదనాన్ని కాటేస్తుంటే ,కళకళలాడాలంటే  సంద్రానికైనా,భూమాత కైనా  ఆస్కారమెక్కడ? మానవ జాతికి అంతిమ సంస్కారం తప్ప . 
                                                                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

9, ఫిబ్రవరి 2015, సోమవారం

నేను అమ్మని ,


నేను  అమ్మని , 
ఒకప్పుడుఆ  బ్రహ్మ చేసిన బొమ్మని ;
తదుపరి అమ్మ గర్భంలో ఒక కమ్మని కదిలికను , 
ఆనక నాన్న కన్నుల్లో  ఆనందపు చెమ్మని ,
మొన్న నా వలపుల రేడుకి ముద్దు గుమ్మని , 
నిన్న బిడ్డకి  జన్మనిచ్చిన అమ్మను ,
అక్షరాలు దిద్దించి మంచి చెడులు నేర్పించిన , మొదటి పంతులమ్మను ,
కొత్త పదవి తో  , అయ్యాను అత్తమ్మను , 
ఆనక పిట్ట కధలు చెప్పే బామ్మను . 
చివరి మజిలీ చేరే నాటికి  అమ్మను కాను, ఎవరికీ ఏమీ కాని వ్యర్ధమైన జన్మను 
బిడ్డలకడ్డొచ్చిన  అవిటి బొమ్మను , 
అంగట్లో విసిరేసిన  దూళి , దుమ్మును 
(కన్న తల్లిని నడి రోడ్ల మీద వదిలెళ్లిన నయ వంచకులను కన్న తల్లి కన్నీటి రోదన )

                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


30, జనవరి 2015, శుక్రవారం

ఎవరో ఎందుకు రావాలి ?




మసకబారిపోతున్న  మానవత్వ దీపం  మహోజ్వలంగా ప్రజ్వలించాలంటే 
ప్రతి మనిషిలోని అమానుషత్వం పటాపంచలవ్వాలంటే,
నిత్యాగ్నిహోత్రంలా  నిరంతరం వినిపించే అబలల కన్నీటి ఆర్తనాదాలకు చరమగీతం పాడాలంటే
అబల బ్రతుకుల అడుగుఅడుగున చితిని పేర్చే నయవంచకులను ,మట్టికలపాలంటే 
పెచ్చురేగిన  విచ్చలవిడి  మదోన్మాదుల మదం అణచాలంటే 
మురిగిపోయిన రాజకీయ రోచ్చును ప్రక్షాళన చేబట్టాలంటే , 
అమ్మా ,నాన్నల  నడివీదుల పాల్జేసిన నాసిరకపు పుత్రుల పుర్రెల పుచ్చకాయల్లా తెగ నరకాలంటే 
ఆలిమెళ్ళో తాళి తెంచి , కన్నబిడ్డల కన్నీట ముంచి , మందుపోసుకు చిందులేసే మందమతుల వీపు విమానం మోత పెట్టించాలంటే ,మితిమీరిన మత్తుల్లో వెర్రి పుంతలు తొక్కుతోన్న యువతకు మార్గం నిర్దేశించాలంటే  ,
కుల మతాల వివక్షలను , అల్లంత దూరం తరిమేందుకు , సమ సమాజ స్తాపనకు , జన్మనిచ్చిన భరత భూమికి బంగారు చరితను అద్దడానికి , 
కమ్ముకొచ్చిన కారుమబ్బును కాంతిరేఖ చీల్చినట్టు . ప్రతీ నీవు  ప్రబల శక్తి గా 
కదం తొక్కిన సింగమల్లె సమాజానికి చెదలు పట్టించిన స్వార్ధపరుల శిరస్సు తెంచి , అవినీతి ఆనవాళ్ళను ఆద్యంతం 
పెకలించి ,అన్యాయపరుల ఆగడాలను అమాంతం కాలరాసి  , కలలు గన్న సమాజాన్ని కనుల ముందు సాక్షాత్కరించేందుకు , ఎవరో  ఎందుకు రావాలి . నువ్వే కారాదా !నవ సమాజ బీజానివి . నువ్వే కారాదా !రేపటి ఉదయించే నవకిరణానివి . స్పందించే మనసుంటే ప్రతీ నీవు మార్గ దర్శి వే ,ఎవరో ఎందుకు రావాలి . నవ సమాజ నిర్మాణంలో ప్రతీ నీవు పునాదిగా మారితే ,         
                                                                                                                శ్రీమణి @సాలిపల్లి మంగామణి 

23, జనవరి 2015, శుక్రవారం

అక్కినేని నాగేశ్వరరావు  వర్ధంతి  సంధర్భంగా 

అక్కినేనికి  లెక్కలేని హృదయాలకన్నీటి వీడ్కోలు  

మహాశిఖరం నేలకొరిగిపోయింది 
మహావృక్షం మట్టికలసిపోయింది  
మహోజ్వల తేజం మసకబారిపోయింది
మహానటసామ్రట్ట ధీరం 
మరలరానిలోకాలకు తరలిపోయింది 
చలన చిత్ర సీమలొ మహాధ్యాయం  
మధురపుటలతో ముగిసిపోయింది 
బహుదూరపు బాటసారి 
అందరాని తీరాలకు సాగిపోయె
ప్రేమనగరి రారాజు  
జనసీమనొదిలి అమరసీమకేగెనే 
వెండితెర  నిందుచంద్రుడు 
వన్నెతరగని వెన్నెలిచ్చి 
స్వర్ణచరిత్రకు పయనమాయెను  
శతాబ్దానికొకటయి  పూచినపూవు 
పరమాత్ముని సన్నిదికై దివికెగసిపోయెనే   
పసిడి స్మృతులు పదిలపరచి 
శాశ్వత నిదురలోకి జారిపోయెనా! 
ఓ మహర్షీ.... ఓ మహాత్మా.... ఓ మనోజ్ఞమూర్తీ.... 
ఓ స్పూర్తిప్రధాతా.... ఓమార్గదర్శీ..... ఓ మానవతామూర్తీ  
అనంతలోకాలకు నీవు సాగిపోయినా 
నీఅడుగుజాడలే మాకు శ్రీరామరక్ష 

అక్కినేని అధీశునికి 

                                    అశ్రుతప్త నయనాలతో 
                                                                
                                                                                   శ్రీమణి
                                                                                        

1, నవంబర్ 2014, శనివారం

అధినాయకుడు


కావయ్యా ... నీవు . మామూలు మానవుడవు . 
మా పాలి ఆ దైవం నియమించిన  బంటువి . 
కావయ్యా .. .. నీవూ  మామూలు  నాయకుడువి . 
మొక్కవోని  ధీక్షలో  మొట్టమొదటి  సైనికుడవు . 
పొగడాలని  కాదు నిన్ను . ఎడతెగనీ  నీ  తెగింపు . 
కుదేలయిన  వైశాఖికి తిరుగులేని ఓదార్పు . 
హుదూద్  బెబ్బులి పంజా దెబ్బకి కమిలిన మా గుండెల్లో 
కొండంతటి  ధైర్యం పూసి , కర్తవ్యం తక్షణమే స్ఫురింపచేసి 
కార్యోన్ముఖులను చేసి ,కాంతి రేఖ నీవై నిలిచి 
విశాఖ విషణ్ణ  వదనాలలో  కొత్త దివ్వె  వెలిగించి 
చిందర వందరయిన  విశాఖను బహు సుందర నందన వనముగ మార్చాలని 
ఒక ఋషిలా  శ్రమించి "అధినాయకుడను " పదాన్ని ఆత్మీయతతో అధిరోహించి
అలసిన  మాకు బాసట  నిలిచిన ఆత్మబంధువు నీవు . 
 తిన్నావో .. లెదో .. ..  కన్నతల్లి గుండె నీది . మాకు  తిండి మెతుకులివ్వాలని ఆరాటంలో .... 
కునుకయినా .. తీశావో ... లెదో ... చెదిరిన  మా గూళ్ళే ... నీ కలలోకొచ్చి . 
నిన్నటి కటిక చేదు విష విలయాన్ని నీల కంఠుని వోలె నీలోనే దాచి 
నీ కరుణామృత ధారలతో  మాకూరటనిచ్చి 
పెను తుఫాను సైతం తలవంచేలా ........... 
చేజారిన బ్రతుకుల్లో , బేజారయిపోయిన మా గుండెల్లో 
మనోధైర్య బీజాలను , మానవతా తేజాన్ని మాలో నింపి, మోడువారిన నేలపైన కొత్త చివురులు తొడిగించి 
మార్గదర్శి వై నిలిచి , మా ఇలవేలుపువయినావు . 
ఆ రాకాసి సుడిగాలి రక్కసి కర్ఖశ క్రీడలో చేతలుడిగి నా విశాఖ నడివీధిలో 
నిల్చుంటే ,శిలలా వెలవెలబోతే ,కన్నేర్రజేసిన కడలి ప్రకోపానికి కకావికలమై , కళా విహీనమయి 
మరుభూమిని తలపిస్తే ,
 కారు చీకటైన మా బ్రతుకుల్లో వెన్నెల కురిపిస్తానని వాగ్ధానం చేసిన విశాఖ చందురుడవు నీవు 
పడి లేచే కెరటానికి ఉందా .. అలసట అంటూ .... 
మరలా   మనం వెలగాలని మార్గం నిర్దేశించి 
మొద్దు నిద్దరోతున్న నాయకులను ఉలిక్కిపాటు చేసి 
అధికార యంత్రాంగాన్ని  ఆసాంతం కుదిపేసి 
నవ విశాఖ నిర్మాణం సంకల్పించి ,కధన రంగ సింగంలా రంగంలో దూకి 
 కర్తవ్య ధీరుడవై ముందుకు నడచేవు . మాలో  ఒకడిగ  నిలిచావు .
మా  ఆశా జ్యోతిగా  నిలిచేవు . 

(నిన్నటి హుదూద్ విలయంలో విలవిలలాడిన  నాటి  నుండి    నేను ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎన్నో విదాల ప్రయత్నించి 
విఫలమయి నా మనస్సులోని  కృతజ్ఞతను , వేవేల గుండెల్లో భావనను 
ఆయనకు చేరాలనే  చిరు ఆకాంక్షతో  మీ  అందరితో పంచుకొంటున్నాను .. .. ఒక సాదారణ  గృహిణి )

                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 




















21, సెప్టెంబర్ 2014, ఆదివారం

ఒట్టేసి చెప్పెయ్యవా !


 ప్రియా !  నీవు నీ  సతి వలపుల  వెల్లువలో పరవశమై  ఆ   ప్రణయ రస సుధా ఝరిలో మునిగి 
పంచ వన్నెల   పసిడి  స్వప్నాల సిరి చందనాల  పరిమళాల  ఆదమరచి నిదురోతుంటే 
నీ పుట్టిన రోజని నీ చుట్టూ చేరి  చెట్టూ చేమా , శుభాకాంక్షలన్నాయి 
నింగిలోని  నులు వెచ్చని చంద్రికలు వెన్నియలను  వెంటబెట్టుకొచ్చాయి.  నీకు శుభాకాంక్షలంటూ
అరవిరిసిన  గులాభీ  నిదురించిన నీ మోమునే  గోముగా  చూస్తుంది . నీ మోమును గని తన వలె సుమమనుకొని
నీలి మేఘాలు నీకోసమే లేఖ రాసి పంపాయి నీరజాక్షునికి  .నీకు  నిండు నూరేళ్ళు  వర్ధిల్ల వరమిమ్మని
కలువ చెలియలు , కులుకు చిలుకలు , మకరందపు  తుమ్మెదలు , మైమరపించే మరు మల్లియలు
తలో కానుకను వెంట బెట్టుకొచ్చాయి . నీ పుట్టిన రోజుకి . పట్టరాని ప్రేమ సంతకాలతో 
ప్రకృతి అంతా పరవశించి పోతుంటే , నీ సతి మాత్రం రెప్ప వేయక చూస్తుంది . నీ తెరిచిన కనురెప్పల మాటున 
చప్పుడు చేయక కూచున్నది తనే నా ! అని  . తనువూ మనసూ ఏకం చేసి తపో కన్యకలా తపిస్తోంది . అను క్షణం నీ ప్రణయ కటాక్ష వీక్షణాలకై . ఈ  పుట్టిన రోజయినా  ఒట్టేసి చెప్పెయ్యవా ! నీవే నా ప్రియ సఖివని , 
పదివేల జన్మలకూ  ఈ బంధమే  పదిలమనీ  , నా చేయినెన్నడు వీడిపోనని 
నా శ్వాసలో నీ ధ్యాసనే కలగలిపి తన వలపుల,   నీ తలపుల సుమ  మాలతో వేచియుంది  . నీకు శుభాకాంక్షలంటూ  ... 
                                 .....                                                
                                                                                                   

                                                                                                           నీ  సతి         శ్రీ మణి