ప్రియా ! నీవు నీ సతి వలపుల వెల్లువలో పరవశమై ఆ ప్రణయ రస సుధా ఝరిలో మునిగి
పంచ వన్నెల పసిడి స్వప్నాల సిరి చందనాల పరిమళాల ఆదమరచి నిదురోతుంటే
నీ పుట్టిన రోజని నీ చుట్టూ చేరి చెట్టూ చేమా , శుభాకాంక్షలన్నాయి
నింగిలోని నులు వెచ్చని చంద్రికలు వెన్నియలను వెంటబెట్టుకొచ్చాయి. నీకు శుభాకాంక్షలంటూ
అరవిరిసిన గులాభీ నిదురించిన నీ మోమునే గోముగా చూస్తుంది . నీ మోమును గని తన వలె సుమమనుకొని
నీలి మేఘాలు నీకోసమే లేఖ రాసి పంపాయి నీరజాక్షునికి .నీకు నిండు నూరేళ్ళు వర్ధిల్ల వరమిమ్మని
కలువ చెలియలు , కులుకు చిలుకలు , మకరందపు తుమ్మెదలు , మైమరపించే మరు మల్లియలు
తలో కానుకను వెంట బెట్టుకొచ్చాయి . నీ పుట్టిన రోజుకి . పట్టరాని ప్రేమ సంతకాలతో
ప్రకృతి అంతా పరవశించి పోతుంటే , నీ సతి మాత్రం రెప్ప వేయక చూస్తుంది . నీ తెరిచిన కనురెప్పల మాటున
చప్పుడు చేయక కూచున్నది తనే నా ! అని . తనువూ మనసూ ఏకం చేసి తపో కన్యకలా తపిస్తోంది . అను క్షణం నీ ప్రణయ కటాక్ష వీక్షణాలకై . ఈ పుట్టిన రోజయినా ఒట్టేసి చెప్పెయ్యవా ! నీవే నా ప్రియ సఖివని ,
పదివేల జన్మలకూ ఈ బంధమే పదిలమనీ , నా చేయినెన్నడు వీడిపోనని
నా శ్వాసలో నీ ధ్యాసనే కలగలిపి తన వలపుల, నీ తలపుల సుమ మాలతో వేచియుంది . నీకు శుభాకాంక్షలంటూ ...
.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి