పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

పొగడజాల! సొగసరీ....


కొండమల్లి, బొండుమల్లి, చిలిపి చెండుమల్లి, ,
బొడ్డుమల్లి, ,కాడ మల్లి,జిలిబిలి జాజిమల్లి 
దొంతరమల్లి ,పందిరి మల్లి, నాజూకు మల్లి 
నిత్యమల్లి ,కంచె మల్లి,ఓ నాగ మల్లి 
   శంకుమల్లి,ఝుంకామల్లి, చిరునవ్వుల   సిరిమల్లీ.. 
 ఓ సిరిమల్లీ,మా మరుమల్లీ 
 మైమరపులతుళ్ళే, తొలి వలపుల వల్లీ, 
  ఇంచక్కా మళ్ళీ వచ్చేసావు
ఎంచక్కా.. మనసును గిల్లీ గిచ్చేసావు.   
 వింత వింత మాయేదో చేసావు 
 మనసంతా మత్తులతో  దోచేసావు . 
  నవ వధువుకు  వలపుల కానుక తెచ్చేసావు 
నులు సిగ్గుల మొలకల్లె  కులికావు 
జత కౌగిట నాయిక నీవు 
అందచందాల సిరిగంధ సుమమే నీవు
ఆనాటికీ ,ఈనాటికీ ఏ నాటికైనా 
సుతిమెత్తని పరిమళాల సొగసరి నీవేనట  
 సీతమ్మవాకిట్లో మెరిసినావట  
 రామయ్య చరణమ్ముల మురిసావట 
మనసున మల్లెల మాలలూగెనని 
తేనెల జారిన పాటల్లే,పల్లవించినావట  
గుడిలో ,వాలుజడలో 
ముడిలో, సొగసరి ఒడిలో 
సిగ్గు దొంతరలో,ముత్యాల ముగ్గులఝరిలో 
మధురోహల మాలికలో మరుమల్లికా 
కన్నెగుండెలో కవ్వింతల కదలికా 
అందచందాల సిరిమల్లికా 
నీ జాడలేక,
చిన్నబోదా ఆ జాబిలి. ఆతారక 
దోసిలిలో చిరు మల్లీ 
తనువంతా వెదజల్లి 
తన్మయాన తనువంతా 
 పులకింతల గిలిగిలి,
ప్రకృతిలో సొగసంతా  అగుపించద 
 మా  కన్నుల ముంగిలి . 
అందులకే!ఓ మల్లికా           
నువ్వు వలపుల  తొలకరివి 
యేమని కొనియాడగలను,నీ సౌందర్య సోయగాన్ని 
ఎంతని వర్ణించగలను నీ వలపును, వలపుల  బోణీ          
 పొగడజాల !సొగసరీ 
మూగబోతి నిన్నుజూసి, నీ సుమ సుగంధ పరిమళాల 
పరవశమొంది 

      
                                      సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

27, ఏప్రిల్ 2016, బుధవారం

నేను అమ్మను!


నేను  అమ్మను , 
ఒకప్పుడు ఆబ్రహ్మ చేసిన బొమ్మను , 
తదుపరి అమ్మ గర్భంలో ఒక కమ్మని కదిలికను , 
ఆనక  నాన్నకన్నుల్లో  ఆనందపు చెమ్మని ,
మొన్న..  నా వలపుల రేడుకి ముద్దు గుమ్మని , 
నిన్న, బిడ్డకి  జన్మనిచ్చిన అమ్మను ,
ఆ తరువాత,అక్షరాలు దిద్దించి మంచి చెడులు నేర్పించిన , మొదటి పంతులమ్మను ,
కొత్త పదవి తో... అయ్యాను అత్తమ్మను , 
ఆనక ,పిట్ట కధలు చెప్పే బామ్మను . 
చివరి మజిలీ చేరే నాటికి  నేను అమ్మను కాను, ఎవరికీ ఏమీ కాని వ్యర్ధమైన జన్మను 
బిడ్డలకడ్డొచ్చిన  అవిటి బొమ్మను , 
అంగట్లో విసిరేసిన  దూళి , దుమ్మును.  
(మొన్నటి ఈనాడు దినపత్రికలో అంధురాలైన కన్న తల్లిని నిర్ధాక్షిణ్యంగా నడి రోడ్డు మీద  వదిలెళ్లిన నయ వంచకుల్లాంటి బిడ్డలను కన్నప్రతీ తల్లి కన్నీటి రోదన ఎలా ఉంటుందో.. అర్ధం చేసుకొని వార్ధక్యంలో తల్లిదండ్రులనెప్పుడూ  అక్కున చేర్చుకోవాలే గాని అంగడి పాలు చెయ్యొద్దని చేతులెత్తి వేడుకొంటూ ...   )

                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఆ.... నెలరాజెవరో ?



నిన్నటి సన్నటి కల నీ కలయికతో కమ్మని వాస్తవమై కళ్ళ ముందు నిలిచింది. 
సన్నజాజి తీవెలా నీ ఊహల తావుల్లో సన్నాయిరాగమాలపించింది. 
అది విన్న నా హృదయం  నీసందిట నిలిచింది. 
నులివెచ్చని నీతలపుల జడి నా వలపై  కురిసింది. 
మరు క్షణమే మరుమల్లికయై మది పరిమళాలు రువ్వింది .
తక్షణమే నాలో  నిరీక్షణం నీ రాకకై నా ప్రతీక్షణం 
క్షణం క్షణం బరువై,  అది నిద్దుర కరువై, మది నీకు చేరువై, 
కన్నార్ప లేకున్నా !కనుపాపలో  నీ రూపు నిట్టూర్పు అవుతుందని,
జాబిలీ అలిగింది జామురాతిరైనా గాని నీ ధ్యాసే ఏమని ?
సంగతేమిటంటూ సంపంగి సరసమాడింది.  
తరచి తరచి వీచింది మలయ సమీరం .ఇది ప్రణయ సరాగమని సందడి చేస్తూ 
 ఉన్నదేమిటంటూ..  గున్నమామి రుసరుసలు.  
 వన్నెలాడి కధ యేమని వెన్నెలమ్మ మిసమిసలు 
 చిన్న మాట చెప్పమంటూ ఝుంటి తుమ్మెదమ్మ బుసలు 
 చెంత చేరి కోయిలమ్మ కుహుకుహూ ఊసులు. 
 గుట్టు విప్పమంటూచుట్టూ చెలియల  గుసగుసలు. 
 నిన్నా... మొన్నా ఎరుగని వింత ఏమిటంటూ 
 బుగ్గల్లో సిరి చందనాల నిగ్గు దేనికంటూ 
 కన్నుల్లో మిన్నంటిన సందడేమిటంటూ 
 ఈ నెచ్చెలి  మెచ్చిన  చక్కని చెలికాడెవరంటూ...  
 మేటి విలుకాడు ఎవరంటూ ?
 అన్నులమిన్నకు సరిజోడి  వెన్నెల రాజెవరంటూ ?
 ఆ.... నెలరాజెవరంటూ ?
 పలకలేక మూగబోతి  ముద్దబంతినయితి . 
ముగ్ధనయితి, ఆతని ముగ్ధ మోహన రూపాన్ని తలచి, 
నులు సిగ్గుల మొగ్గనయితి వలపుల రేడును వలచి       
కలువభామనయితి,చలువల రేడును తలచి. 
 ఇంతకీ అతడెవరో తెలుసా !
ఆ జతగాడెవరో తెలుసా !
(పరువంలో ప్రతీ హృదయం ప్రణయంలో పడినప్పటి ప్రేమికుడే అతడు )
                                                         
                                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

24, ఏప్రిల్ 2016, ఆదివారం

అమ్మ పెట్టిన అరచేత గోరింట.

మరువగలమా! ఆనాటి గురుతులు 
వెలగట్టలేని మరులు,మాణిక్యాలు .
చేరిపేయగలమా! చెంగల్వ పూవులవి 
అమ్మణ్ణి ఆటల్లో గుమ్మాడిపూలు. 
ఎంత భాగ్యము నాది ,
కన్నుల పంట నైతి తల్లి గోదారి ఇంట.
 నిన్నటి తేనెల ఊటల తేటలు ఇంకా 
నా అధరపుటంచుల చవులూరిస్తుంటే 
ఆనాటి ఆపాత మధురాలు ఆపాదమస్తకం 
పులకరింతలతోటి తడిపేస్తూ ఉన్నాయి. 
ఎంత మధురమాపాతమధురాలు,
చింత తెలియని చిరుప్రాయ కధనాలు. 
అమ్మ పెట్టిన అరచేత గోరింట అది ఎంత మధురం
కమ్మకమ్మని అమ్మమ్మ నేతివంట ఎంత మధురం
తాతయ్య కాళ్ళపై గుమ్మాడి ఆట మధురం
కొమ్మ కొమ్మల దాగి కోతికొమ్మచ్చి ఆట మధురం
చిమ్మ చీకటివేళ అమ్మ లాలియను పాట మధురం 
గోధూళి వేళల్లోనర్తించు  గొబ్బిళ్ళ గౌరమ్మ మధురం
తల వాకిట్లో మెరిసేటి  ముత్యాల ముగ్గెంత మధురం
చెరువు గట్టున జుర్రిన తాటిముంజెల తేటెంత  మధురం
 మర్రి ఊడలతోటి ఉయ్యాల సయ్యాటలెంత మధురం 
ఏటి గట్టున విన్న ఎలకోయిలమ్మల  పాట ఇంకెంత మధురం
మచ్చుతునకలు మరి ,మరువగలమా... 
ఆణిముత్యాలసరులవి విడువగలమా... 
గుర్రు పెట్టిన తాత మీసాల ఆట. 
కర్రిఆవుల పొదుగుల్లో పొంగి పొర్లిన పాల తేనియల ఊట. 
 గిర్రుగిర్రున రంగులరాట్నాల మోత. 
తుర్రుమంటూ తూనీగల వెంట తుంటరి వేట. 
చద్దిబువ్వలోనంజు  ఘాటు ఆవకాయ మంట. 
అవ్వ పక్కలోరువ్విన  పిట్టకధల చిటపటా. 
మరువగలమా !మరి చిరునవ్వుల చిట్టా 
చేరిపేయగలమా !అది పసిడి వెన్నెల మూట 
( మొన్ననా పుట్టినూరు పండూరు  వెళ్ళిన తరుణంలో 
 చవిచూసిన అమూల్యమయిన అనుభూతి 
అది అమ్మ చేత పెట్టించుకొన్న నా అరిచేత గోరింటాకు 
అది మీ అందరితో పంచుకోవాలనే ఆరాటంతో..... )

                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 






గోరింటాకు

19, ఏప్రిల్ 2016, మంగళవారం

నీకై !



ఎటు చూసినా గిరులే,పచపచ్చని తరులే 
ఎటు చూసినా విరులు, మరులుగొలుపు ఝరులు 
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబందాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీరాలే 
ఎటు చూసినా తుళ్ళింతలు, కేరింతలు, గిలిగింతలే , చక్కిలిగింతలే 
వింత వింత అనుభూతుల నా మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించా వినీల గగనం వైపు 
అలా అలా అలలా 
ఉరకలు వేసే నాహృదయంలో  ఒక ఊపిరి ఊగిసలాడింది 
తన్మయమొందిన తరుణంలో తారసపడినది ఒక ప్రణయం  
అది నా మువ్వల  సవ్వడిలో వినిపించిన మానసరాగంలా 
తీయ తీయని వలపుల  మైమరపును జల్లిన మధుపంలా 
తెలియని హాయిని పరిచయ పరచిన అభినవ మదనుని బాణంలా
 వన్నెల సూరీడు చిందిన నవ ఉషస్సువెలుగుల జడిలా  
పున్నమి రేరేడు జల్లిన వెండి వెన్నెల జిలుగుల వానలా 
పడచు వాకిట పరచుకొన్న విరజాజి పరిమళంలా 
కలల మాటునా !కనురెప్పచాటునా కన్నుగీటుతూ పలకరించిన
అరవిరిసిన నా పరువానికి కొత్త అనుభూతిని పంచిన ప్రాయంలా 
ఎదురయ్యింది . 
 అలా నా కన్నె మనస్సులోకి
 కమ్మని కావ్యంలా అరుదెంచిన మరు క్షణం ,
నాలో మొదలయింది నిరీక్షణం 
వేవేల వర్ణాల హరివిల్లు లో నీవు 
చలువల రేడు ప్రతిబింబంలో నీవు 
కలువల సరసన సరసుల్లో నీవు 
చిటపట  చినుకుల చిరుజడిలోనీవు 
నా కన్నె మనసు అలజడిలో నీవు 
ఏ వలపుల వలపన్నావో !!
నా తలపుల తలమునకలు చేసావు. 
సవరించిన నా కురులు సాక్షిగా 
నీ జాడ గానక నిమిషమయినా గాని 
నిలువజాల !
నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే 
సప్త సంద్రాల ఆవల నీవున్నా .. 
నే సప్తపదులు నడిచిన నీకై నిరీక్షిస్తూనే ఉంటా ... 

                                                             సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 




18, ఏప్రిల్ 2016, సోమవారం

నీటిచుక్కా... నీకు అభివందనం



తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను 
వన్నె తరిగిన కన్నతల్లిని గాంచి
కన్నీరు మున్నీరయ్యాను 
తల్లడిల్లీ నేను  తెల్లబోయాను
నిత్య కళ్యాణి నిట్టూర్పు వింటూ 
ఓదార్పు లేని ఒంటరయ్యాను  
పసిడి పంటలతల్లి బీటలేస్తుంటేను 
ఖసి తీర నాగుండె పిసికేసినట్టుంది 
పచ్చపచ్చని పైరులెండిపోతుంటేను 
చూస్తున్న నా గుండెగొంతెండిపోయింది 
కువకువల రాగాలు కల్లలవుతుంటే 
గలగల సవ్వడులు  కలలై కదిలిపోతుంటే
 కళ్ళెదుట మరుభూమి సాక్షాత్కరించింది 
చెమ్మగిల్లిన అమ్మ గోదారి కన్నుల్లో 
చిమ్మ చీకటి నాకు కానవచ్చింది 
వెల్లువల గోదారి వెలవెల బోతేను 
వెన్నెల్లో చందురునీ జాడ లేనట్టుంది. 
అమ్మ ఒడిలో సేద దీరలేమింకంటే 
జన్మమెందుకు ఫలములేదనిపించింది 
 ప్రచండభానుని కీలల్లో జలరాశులు జ్వలితమయిపోతుంటే 
గ్రుక్కెడు నీళ్ళు లేక బిక్కుబిక్కున   తనువులొదిలి పాడిపశువుల 
కళేబరాల కనులార గాంచి 
నిలువెల్లా ,,, కూలబడి చూస్తున్న నిస్త్రాణ గోదారి 
నిర్జీవ కళ గాంచి కనుల ముందే కటిక చీకటి గోచరించింది 
కోరలిప్పిన కరువు రక్కసి 
ఉక్కు చెరలో చేతలుడిగిన గోదారమ్మను చూస్తే 
బ్రతుకు వ్యర్ధమనిపించింది.కానీ... ఆలోచిస్తే 
మానవ తప్పిదానికి మారణ హోమం సమాధానమో 
కలియుగాన పెల్లుబికిన కల్మషాల ప్రతీకార శాపమో 
ఆ"కలి" ఆకలి ఘీంకారమో 
ప్రకృతిపై మానవ వికృత చర్యకు పర్యవసానమో 
మహోగ్ర రూపం, మహా ప్రతాపం
ప్రజ్వలించిన ప్రచండ భానుని ప్రళయ ప్రకోపం 
కనుచూపు మేరల్లో కానరాని పచ్చదనం 
అడుగంటిపోతున్నది. అమ్మఅమృత స్థన్యం 
ఇప్పటికయినా మేలుకొందాం .
తప్పిదాలను మన్నించమందాం . 
పచ్చదనాన్ని పెంపొందిద్దాం . 
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం . 
నేటి నుండే నడుం బిగిద్దాం . 
నీటి చుక్కను ఒడిసి పట్టుదాం. 
కరువు రక్కసి డొక్క చీల్చుదాం. 
మనిషొక్క మొక్కనయినా నాటి పెంచుదాం 
గోదారమ్మకు కల నేరవేరుద్దాం 
కళకళ,గలగల మళ్ళీ తెద్దాం 
కన్న బిడ్డగా తల్లి కమ్మని కల నెరవేరుద్దాం ... 
                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

17, ఏప్రిల్ 2016, ఆదివారం

మళ్ళీ రావా ...


నిశిరాతిరి మిసమిసలో నిశ్శబ్ధపు తెరలు  చిదిమి
నామది మదియించి  నులువెచ్చనిపదనిసల తడిమి  
తలవాకిట నిలుచున్నావు. తలపులలో వలపుల వల పన్నావు . 
నిదురించిన  నా కనుదోయికి మృదు మధురపు 
 అధరామృతాన్ని అదిమి, నా పరువానికి తొలి పరవశాన్ని 
 పరిచయ పరిచావు . 
ఆదమరచిన నామదికి ఏదో  
మధురోహల పరిమళాన్ని చిలుకరించి పలుకరించినావు
కమ్మని నిట్టూర్పుల విందును చవి చూపించి 
కవికందని అందాలను కనువిందును  చేసి 
రవికందని మిసిమిని  నా దోసిటబోసి .
తనువంతా విద్యుల్లతగావించి,
అణువణువున అద్భుతాలనాపాదించి, నను అబ్బురపరచి 
అంతలోనే వస్తానని అటుగావెళ్లావు . తుళ్ళి పడిన నా మనసుకు 
మళ్ళీ తారసపడనే లేదు. జాబిలి మాటున దాగావో 
నీలి మేఘాల సరసన చేరి సరసమాడుతున్నావో 
తొలి ప్రణయ సరాగమే నీవో  ?విరి తేనియ జలపాతపు ప్రవాహమే నీవో 
మలి సంధ్యలా మారి మళ్ళీ వస్తావని 
తనువంతా కనులను చేసి  నీ కై ఎడతెగక ఎదురు చూస్తున్నా 
"కల"వేమోనని,నువ్వూ  కలవే మోనని .. కలవైనా గాని 
నీకై కలవరిస్తూనే ఉన్నా .. కలగా నైనా ... కలయికగా నయినా 
నా కనులకు కలిసొచ్చిన కానుకవై మళ్ళీ రావా ... 
తుళ్ళే నా మనసును మళ్ళీ మైమరపించగ .
నన్నే మురిపించగ,మరిపించగ 
మరువంపు తెంపరవై,మకరంధపు తుంపరవై 
మళ్ళీ రావా ... తుళ్ళే నా మనసుకు మళ్ళీ వసంత పున్నమివై !
(పరువపు ప్రాయంలో ప్రతి హృదయపు నిట్టూర్పు)
                                                  సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

దుర్ముఖీ నామ శుభాకాంక్షలతో .......


  

దుష్ట సంహారణార్ధమో , ఆధునికదుస్సంస్కృతీ
  నిర్మూలనార్ధమో , దుర్మార్గరాజకీయా లకు భరతవాక్యం పలుకుతుందో
 లోకకళ్యాణార్ధమే కార్యోన్ముఖి  యై ఏతెంచిందో ?
ఏ విజయ శంఖం పూరించనుందో
 బడుగులకే అడుగులకు మడుగులెత్తే కొత్త ఒరవడి మోసుకొస్తుందో
 పల్లె గువ్వల నవ్వుల సవ్వడి పట్టణాలకూ గుభాళిస్తుందో,
 రైతన్నల గుండెల్లో రతనాల వాన కురిపిస్తుందో,
  వరుణుడనే శరణు గోరి అమృతధారను అవనికి తెస్తుందో
 చదువులమ్మని వెంట రమ్మని  కమ్మని భవితవ్యం యువతకు తెస్తుందో ,
 ఆహ్వానిద్దాం ఈ దుర్మిఖిని
ఊరేగిద్దాం  ఆశల హరివిల్లుపై
మారాం చేద్దాం మంచినే మనకిమ్మని
దూరం చేయమని అభ్యర్దిద్దాం ,
నిన్నటి ఘోరాలు,మొన్నటి నేరాలు ,ఆధునికత పేర  పెచ్చుమీరిపోతున్న
మన వికృత చేష్ట లపై ప్రకృతి ప్రకోపా లనూ,
మానవ తప్పిదాలను మన్నించమంటూ ...
ఏదేమైనా మనవంతు మనంగా మానవత్వంతో,మంచిమార్గంలో,
మనీషిగా కాకపోయినా మనసున్న మామూలు మనిషిగా మారతామని
సమాజానికి సన్నిహితమై,కల్మష రహిత సమాజానికి
ఉడతసాయమందించుటకై సుముఖంగా
ఉన్నాననంటూ దుర్మిఖితో విన్నవించుకొందాం .
మన భవితకు మనమే పసిడి పానుపు పరచుకొందాం
దుర్ముఖీ నామ శుభాకాంక్షలతో .......                                      సాలిపల్లిమంగామణి @శ్రీమణి






















5, ఏప్రిల్ 2016, మంగళవారం

మరులు దొరలుతున్నట్లు !( మదిలో)

         
మరులు దొరలుతున్నట్లు
విరులు వింధ్యామరలై వీస్తున్నట్లు
కురులు మరుమల్లెలతో ఊసులాడుతున్నట్లు
ఒకపరి పరువం పరుగులు తీస్తున్నట్లు
మకరంధపు  ఝరిలో  తడిచి ముద్దయినట్లు
సిరి గంధం మేనంతా చిలుకరించినట్లు
సరిగమలే సరాసరి నా మానసరాగాలై న్నట్టు
అల్లిబిల్లి ఊహల హృదయం  ఉక్కిరిబిక్కిరి అవుతూ
పురి విప్పిన మయూరమై నా హృదయం పరవశిస్తుంటే
చిగురాకుల చిరుగాలి సరసమాడ సరసకు వస్తుంటే
ఊహలకందని తేనెల ఊటలు నా ప్రాయానికి చవులూరిస్తుంటే
తళుకుల తారల నడుమన అచ్చర నేనన్నట్లు
దివి రాల్చిన సౌందర్యపు తునకను నేనన్నట్లు
రవి ప్రభాత కిరణంలో జిలుగు వెలుగు నేనన్నట్లు
కవి రాసిన కావ్యంలో నాయిక నేనన్నట్టు
ప్రకృతిలో అణువణువున అందానికి అధిదేవతనయినట్టు
ఉన్నది ఏమీ లేదన్నట్లు,లేనిది ఏదో ఉందన్నట్లు
ఇది మాయో,ఏం వింత హాయో
తెలియదుగాని,  ఆ హాయి ప్రతీ హృదయం
పరువపు ప్రాయంలో  అనుభవించే ఉంటారనుకొంటా  ....

                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి




గోదారి


నన్ను గన్నతల్లి గోదారి
వెన్నలాంటి తల్లి గోదారి
వెండి వెన్నెలవోలె  గోదారి
మల్లెచెండు హొయల  గోదారి
,
 అమృతాల కుండ  గోదారి
 తల్లి గుండె లాంటి  గోదారి
 కోటి జన్మల పంట  గోదారి
ముక్కోటి దేవుళ్ళ నెలవంట  గోదారి
ముత్యాలు దొర్లేటి ముత్తైదు గోదారి
 నిత్య కల్యాణి  మా  కలకంఠి గోదారి
అన్నపూ ర్ణా తల్లి   గోదారి
వన్నె తరగని తల్లి  గోదారి
మరులు పొర్లే తల్లి గోదారి
పసిడి పైరుల  తల్లి గోదారి










2, ఏప్రిల్ 2016, శనివారం

ఏమివ్వగలను చిట్టితల్లీ ?

                       ఏమివ్వగలను చిట్టితల్లీ ?
             
         ఏమివ్వగలను చిట్టితల్లీ ?
           నీ  చిరునవ్వుల సరితూగే బహుమానమే
           ఈ మహిపై అగుపడలేదే నాకు .
          ఆకాశం నుండి ఆ తారకనే కోసుకువచ్చి నీకు
          కానుక నిద్దామంటే
                  తారసపడగానే!
 నీ తళుకుకు అలిగి ముడుచుకోదా ఆ తారక .
  పుత్తడి అంతా బోసి,పుట్టెడు నగలనుజేసి,
      నీకలంకరిద్దామంటే !
 నా పుత్తడిబొమ్మవి నీవు,ఆ పుత్తడి వెలవెల బోదా ?
 రతనాలు,మణులు,మరకత  మాణిక్యాలు.
నీ ముంగిట మురెపంగా రాశిగ పోద్దామంటే...
నా సుగుణాల రాశి ముందు మసకబారిపోవా!మరి .
అందుకే .......
ఏమివ్వగలను చిట్టితల్లీ?
ఆనందాశ్రువుల చెమ్మగిల్లిన ఈ అమ్మ
కనురెప్ప చాటున దాచుకొన్న ఆశను,
కలలుగన్న కమ్మని ఆశయాన్ని,అనురాగం రంగరించి
ఆశీస్సులివ్వగలను. శతాయుష్మాన్ భవ,అనే
పసిడి పచ్చని అక్షతలు రాల్చి,నీ శిరస్సున .
పుట్టినింటికి పుట్టెడు ఖ్యాతినీ ,
జన్మభూమికి గంపెడు ఘనఖ్యాతినీ,
ఇనుమడింప జేసి,మము పులకరింప జేసి నీ ప్రతిభతో
ఆకాశమే ... హద్దుగా వెలుగొందు నా కోటి ముద్దుల తల్లి
ననుగన్న నా చిట్టితల్లీ !
( నా  చిన్నారికి....... ప్రేమతో, పరీక్షల కానుకగా ... )
                                    సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
                http://pandoorucheruvugattu.blogspot.in/