మహాత్మా!మళ్ళీ పుట్టొద్దు,
పుట్టినా ... మా మధ్య పుట్టొద్దు.
నువ్వు కలలు గన్న స్వాతంత్య్రం,కుతంత్రాల కుళ్ళులో కూరుకు పోతుంది.
నువ్వొదిలెళ్ళిన జ్ఞాపకాలకు తుప్పు పట్టింది,
నీ ఆశయాలకు నీళ్ళొదిలేసాం,నీ ఆశకు అణువంతైనా అవకాశం లేదు,
నువ్వొస్తే అహింస అంటావు,అంటే అర్ధమే మా దరి ప్రశ్నార్థకం,మరి ,
శాంతి మంత్రానికి తావే లేదయ్యా బాపు ,,రాకాసులై పోయాం,
ఎక్కడ చూసినా నెత్తుటి చారికలే,
మన సంస్కృతీ సాంప్రదాయమని వెతికావంటే
ఇక్కడ వెర్రివాడవంటారు ,వెంటబడి తరుముతారు
వెర్రితలలేస్తున్న ప్రాశ్చాత్త్య పోకడల వెంటపడ్డారందరూ ...
మంచం లేచిన మొదలు ఇక్కడ లంచం లాంఛనమయ్యా ...
అధర్మానికి ఆలవాలమయి అలరారుతుంది నువ్వు కలలు గన్న నీ కర్మభూమి.
నువ్వాశించింది,ఒకటి మాత్రం జరుగుతుంది,నీ ఉద్దేశ్యం వేరంతే
అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడుస్తోంది,అన్నింటా ముందుంటుంది,
కానీ పట్టపగలే పడతికి రక్షణ లేదంతే,
అనునిత్యం అరాచకం రాజ్యమేలుతోంది,అనైతికత్వం అగ్రగామియై ముందుండి నడిపిస్తుంది.
తెల్లోడిని తరిమేశావు,కానీ వాడి పైత్యం మా అందరిలో పాతుకుపోయింది,
ఇప్పుడేం చేస్తావ్,నీ వాళ్ళనెక్కడికి తరిమికొడతావు. నీ వీపు,కడుపు మేమయినప్పుడు
తప్పులు చెయ్యొద్దన్నావు,తప్పనిసరిగా తప్పులే చేస్తున్నాం,,,
అంటరానితనం లేదులే,అంటురోగాలు తప్ప
వెట్టి చాకిరీ వెతికినా లేదు,వట్టి పోయిన నీతి నియమాలు తప్ప,
సమానత్వం ఎలాఉన్నా ... దోచుకున్నోడికి దోచుకొన్నంతా
దాచుకొన్నోడికి దాచుకొన్నంత ,మండేవాడి కడుపు మండుతునే ఉంటుంది,
నిండే వాడి జేబు నిందుతునే ఉంది,
అడుగడుగునా అవినీతి రక్కసి వికటాట్టహాసం చేతుంది విశ్వ విజేత తానంటూ ...
నీ పుణ్యభూమిలో సెకనుకొక పుచ్చెలా తెగి పడుతున్నాయి,తగవులతో తగలబడుతున్నాయి
హింసా మార్గంలో దూసుకుపోతున్నాయి,అహర్నిశలూ శ్రమించి నీ ఆశయాలను అగ్నికి ఆహుతి చేస్తున్నాం,
చూసి నిలబడే నిబ్బరముందా ...
కొన ఊపిరితో కొట్టుకొంటున్న నీ కోరుకొన్న ఆశయాన్ని
తట్టుకొనే దమ్ముందా ... మట్టికొట్టుకుపోతున్న మానవత్వ విలువలను చూసి,
కళ్లారా చూడగలవా,,,వెలిసిపోతున్న స్వాతంత్ర్య కాంతిని,మంట గలిసిపోతున్న మానవత్వ స్ఫూర్తిని
మత్తులో తూలుతూ మరమ్మత్తు చేయలేని మరబొమ్మల్లా మసలుతున్న నీ బిడ్డల గడ్డు పరిస్థితిని,
అందుకే చెప్తున్నా... బాపు
చల్లని నీ చూపులో ఎర్రని సూరీని ఉదయించనీకు,
తెల్లని నీ శాంతి వస్త్రానికి రుధిరంలో తడవనీకు
నువ్వు కలలు గన్న స్వాతంత్య్రం కల్లయిందని తెలిస్తే
చల్లని నీ గుండెకు చిల్లులు పడి చితికి చితికి పోయేకంటే
నువ్వసలు మళ్ళీ పుట్టొద్దు,నువ్వు నీ కల నిజమయ్యే రోజొస్తే
మేమే కబురెడతాం ,అప్పటివరకు మనదేశం మరమ్మత్తు చేయమని ఆ భగవంతుని ప్రార్ధించు
ఆ తపో ఫలాన్ని నేరుగా మాకు ఆపాదించు,తప్పుగా మాట్లాడితే నీ తనయను క్షమించు,
లోకా సమస్థా సుఖినో భవంతు అని మము ఆశీర్వదించు,
ఈ గోలలో పడి మరిచా,నీ పుట్టినరోజుకు బుట్టెడు రోజాపూలతో శుభాకాంక్షలు అర్పిస్తూ...
సాలిపల్లి మంగామణి@శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in