కడు బీదను కాను నేను, కాసులు లేనంత మాత్రాన
నిరుపేదను అసలే కాను,ఎడతెగని సంపదలో మునిగి తేలుతుంటాను ,అనాథను అంటే అస్సలొప్పుకోను
ఆకాశం,నేల బాగా ఆత్మీయులు నాకు
జగమంతా కుటుంబం నాది,ప్రకృతిలో ప్రతీ అడుగూ నాదే
ఆదిదంపతులే అమ్మా నాన్నా నాకయినప్పుడు
పంచభూతాలు
నా తోబుట్టువులే,మూడులోకాలూ మా చుట్టాలూళ్లే
అన్నీనావే,అంతా నాదే,కాపాడుకోవాలేగాని,తరగని నిక్కమయిన సంపద నాదే
ఊసులాడాలే గాని ఊరూ,వాడా నా వాళ్లే
ఆయువు నిలిపే వాయువు నాకుంది,తరతరాలకూ సరిపడా... ఆస్తి అది
సూరీడు నావాడు,కొసరి,కొసరి కాంతిని వడ్డిస్తాడు.కోరినంతా .. కొదవలేకుండా
నెలరేడు నా చెలికాడు,జలతారు వెన్నియల చందనాలు నాపై ప్రేమగా గుమ్మరిస్తాడు
సెలయేరు,తల నిమిరి నీరిచ్చి ఊరడిస్తే, తరువమ్మ నీడిచ్చి ,ఫలమిచ్చి, పొట్ట నిమిరింది
పరవశించి ఆడమని నెమలి పిలిచింది
పాటలాలకించడానికి ఆమని రాగం ఉండనే ఉంది
సయ్యాటలాడమని సంద్రం కబురెట్టింది
పూ బంతులు,చామంతులు,సన్నజాజులు,సంపెంగలు,కధలు చెపుతుంటే
అరవిరిసిన గులాబీలు,మరువము,మల్లియలపరిమళాలు వెదజల్లి జోల పాడుతుంటే
పసిడి స్వప్నాలు నన్ను వాటేసుకొని నిద్రపుచ్చుతుంటాయి
మళ్లీ మా సూరీడు నులివెచ్చగా తాకి మేలుకొలుపుతాడు
నిజమే.. కదా... మనకున్న ప్రకృతే మన నిజమయిన సంపద,కదా
!ఆలోచించండి
మనకు కన్నతల్లి తన రక్త మాంసాలు పంచి,జవసత్వాలిచ్చింది
సృష్టిలో ఏ జీవరాశులకు లేని "ఆలోచన" అనే.అమూల్యమయిన ఆస్తినిచ్చింది తెలివితేటలిచ్చింది. అంతటి మూలధనం మనకుంటే
అనంత సౌభాగ్యం మన సొంతమే
సృష్టే అన్నీ అమర్చి నీకిచ్చినప్పుడు,ఎవరైనా బీదలుంటారా
ప్రకృతిలో పంచభూతాలే వాత్సల్యం కురిపించినప్పుడు ,అనాధలుంటారా
సాలిపల్లిమంగామణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి