పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

11, జులై 2016, సోమవారం

నవ్వంటే తెలుసా ...?


ప్రేమే కొరవడితే,
ఆనందం ఆవిరయితే ,
ఆదరణ అందని వరమయితే ,
మనసు చితికి,చితికి,చితికి చేరువయితే,
పగిలిన గుండెకు అతుకులు వేస్తూ ..
పెను భారంగా బ్రతుకీడిస్తే ...
నమ్ముకొన్న బంధాలకై బందీ అవుతూ...
బ్రతుకు భారమై,నిర్వికారమై,
కాలయముడికి కబురు పంపినా ...
కాలయాపన చేస్తున్నాడంటూ ,ఎంతకాలం ఈ గుండెకు ఎండాకాలం
 వాసంతం వాసన గూడా తెలియక వాపోతూ .. 
కన్నుల జారిన కన్నీటికి సెలయేరు పోటీ పడుతుంటే 
ఎంతకాలం ఎండమావికై పరుగులిడిన ఎటకారపు పయనంలో 
 జీవన్మరణ ప్రళయంలో చిక్కుకొని తల్లడిల్లుతున్న
 ఒక దయనీయ హృదయం
బలవంతంగా నవ్వితేఎలా ఉంటుందో తెలుసా !
విగతజీవికి వింత చొక్కా ... తొడిగినట్టు,
నిప్పుకణికకు ,కొత్తచివుళ్లు తొడిగినట్టు ..
అమావాస్య కంటికి కాటుక  పూసినట్టు ,
ఎన్నో హృదయాల పరిస్థితి ఇది.
నిజం మాత్రమే చెప్పండి,ఈ మరజీవన గమనంలో 
ఎంత మంది మనస్పూర్తిగా నవ్వుతున్నారు. 
ఎంతమంది నిజమైన ఆనందం అనుభవిస్త్తున్నారు. 
నా ఉద్దేశ్య ప్రకారం  ,అచ్చమయిన నవ్వు,సంతోషం,ఏ  కొద్ది మందికో
ఆ భగవంతుని వరం. కదా ... 
నవ్వంటే తెలుసా ...? బలవంతపు కల్పన కాదు ,
 వెల్లి విరిసిన మనస్సంద్రపు అల.
నవ్వు అంటే పకపకలు  కాదు.
పరవశించి హృదయం పాడిన పదనిసలు,
ఆ స్వచ్ఛమయిన నవ్వుకోసం... వెతుక్కొందాం
స్వేచ్ఛగా నవ్వుకొందాం  ...
అలాంటి  నవ్వు, నాలుగు విధాలా చేటు కాదు,
కోటి వెన్నియలు వెల్లి విరిసిన చోటు.
(నేటి ఉరుకుల,పరుగుల యాంత్రిక జీవనంలో,అమూల్యమయిన అనుభూతులెన్నో కోల్పోతున్నాం.కొంతకాలానికి నవ్వడం కూడా మరచిపోతామేమో?ఆలోచించండి.)

                                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి