మధురం గాదా ఆ తరుణం,ఎదురయి రాదా పున్నమి కిరణం.
అలవోకగా నా హృదయం నీ చరణాల తాకినప్పుడు,
మకరందపు నా అధరాలు నీ ప్రణయ సుధా ఝరిలో జలకమ్ములాడినపుడు
నా అందెల రవళి, నీ మోహన మురళితో సయ్యాటలాడినప్పుడు
నా నీలి నీలి కురులలో నీ చరములు విరులల్లినప్పుడు
నులు వెచ్చని నీ ఒడిలో పారాడే పాపాయిగ నే ఒదిగిపోయినప్పుడు
నా కులుకు,నీ తళుకు తన్మయమై నటనమాడినప్పుడు
కలవరమాయిన నా మదిలో నీ "కల"వరమై కనువిందు చేసినప్పుడు
నా మానస రాగంలో నీ సమ్మోహన సరాగాలు వినిపించినప్పుడు
నా చెంపల్లో విరబూసిన కెంపులు నీవైనప్పుడు,
తారక ముందర తారసపడ్డ వెన్నెలచంద్రుడు నీవైనప్పుడు
మేనక మెరుపుకి తడబడిపోయిన ఋషీన్ద్రుడు నీవైనప్పుడు,
నా వలపుల జడిలో తొలకరి తునకవు నీవై ఎదురొచ్చినప్పుడు,
అద్భుతమయిన ఆ అమృత తరుణం, మరణాన్నైనా మరిపించదా మరు క్షణం
వేణు మాధవా... వలచిన నీ సఖి మనసు, మల్లెలు విరిసిన పూదోటై
మదన గోపాలా ... పరిచా నా మదినే పరువపు పానుపుగా ...
కినుక సేయక చక చకరావా ,,,,చిలుకల కొలికికి కానుకకాగా
సాలిపల్లి మంగా మణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి