సిన్నీ అన్నం తిందువు రావే అంటూఅమ్మ పిలిచిన కేకకు ,బంతి పూలు కోస్తున్న చిన్నీ ఒక్కటే పరుగు తీసింది లోనికి ,అప్పటికే ఆకలి దంచేస్తుంటే , ఏం చేశావే ఈవేళ అంటూ రాములమ్మను చుట్టేసింది . ఏముంది గట్ల మీద వేసిన బెండకాయలు కోసి పులుసు కాసాను . మీ నాన్నకి భలే సంభరం ఆ పులుసంటే , వస్తూ ఉంటాడు సూడు వాకిట్లోకెల్లి అందరం కలిసే తిందాం . సోములు రానే వచ్చాడు . మండువాలో కాళ్ళు కడుక్కుని ,మీరు తినేయచ్చు కదే ,నాకోసం సూత్తే చిన్నీ కి ఆకలేసేత్తాది .ఏవయ్యా నువ్వు లేకుండా మేము ఎప్పుడన్నా తిన్నామా ..
సరే సరే పెట్టేయవే అంటూ పీట మీద కూర్చుని లొట్టలేసుకుంటూ లాగించేసాడు . రెండు ముద్దలు ఎక్కువే . తింటున్నంత సేపు వాగుతూనే ఉంది చిన్ని . అన్నం తినే కాడ మాట్లాడ మాకే పొలమారతాది అంటూ రాములమ్మ వారించినా ఆ వాగుడుకాయ మాత్రం ఆపనే లేదు . పెరట్లో కూచుని రాములమ్మ సోములు పొలం విషయాలు , ఊరిలో కబుర్లు మాట్లాడుకొంటూ ఉంటే చిన్నీ మాత్రం చందమామ వంక చూస్తూ అమ్మా.. చందమామ పట్నం ఎప్పుడూ ఎల్లడా రోజూ మనూరిలోనే ఉంటాడేంటి . అంటే రాములమ్మ లేదు లేదు ఒకసారి పట్టణానికి మీ నాయన నేను ఎల్లిన రేత్రి మాతో పాటు వచ్చాడే ,అంటూ అమాయకంగా సెప్పింది కూతురికి , చిన్నీ కి మాత్రం ఎప్పుడూ మనసంతా చందమామ మీదే ఎన్నో ఊసులు చెప్తూ , ఏదో ఒకరోజు నన్నూ నీ కూడా పట్నం తీసుకెల్లవా అంటూ బ్రతిమాలుతూ మళ్ళీ తనే ఊకొడుతూ , పాడుకొంటూ నిద్రలోకి జారుకోవడం అలవాటు . చిన్నీ నిద్ర పోయిందంటే వానొచ్చి ఎలిసినట్టే ,అనుకొంటూ ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకొని పడుకొండిపోయారు ఆ పండువెన్నెల్లో , లేచీ లేవగానే లేగదూడ దగ్గరికి పరుగుతీసి పద ఆడుకొని వద్దాం అంటూ ,లాక్కొని వెళ్లి ,తోటి పిల్లలందరినీ లేపి తోటలోకొచ్చి తనకిష్టమైన ముద్దబంతి మొక్కతో మాట్లాడటం మొదలెట్టింది .
ఈరోజు అమ్మ నా జడ గుప్పుతానంది . ఏమి అనుకోకు నీ పూలన్నీ కోసేస్తా ,కొన్నేమో గుళ్ళో ఇస్తా ,మిగతావి మాత్రం నాజళ్ళోకి ,సరేనా అంటూ చకా చకా పూలన్నీ ఒళ్లో నింపేసుకొని ,గుళ్ళో పంతులుకి కొన్ని పూలిచ్చి దేవుడిని ఏం అనుకోవద్దని చెప్పండి . ఈరోజు నాకు అమ్మ జడ గుప్పుతానంది . అందుకే తక్కువిచ్చానని సర్ది చెప్పండి . అంటూ ఇంటివైపు దూసుకెళ్లింది ,రాములమ్మ చుట్టూ తిరిగి జడ కుట్టిన తర్వాతే నువ్వు నాయన కాడికి పొలానికెల్లు అంటూ మారాం చేసింది . యెంత అల్లరి చేసినా ఒక్కతే లేక లేక పుట్టిన పిల్ల కావడంతో సాలా ముద్దు వాళ్లకి , సిన్నీకి జడ గుప్పి ముస్తాబు చేసి ఎడమ కాలు మన్ను తీసి చెంప మీద దిష్టి చుక్క పెట్టి సద్దన్నం తినేసి ఆడుకో నేను పొలానికి పోతున్నా .. అని వడివడిగా వెళ్ళిపోయింది రాములమ్మ . ఉన్నోళ్ళు కాకపోయినా ఒక ఎకరం భూమి దాన్ని పండించుకొని మూడుపూటలా లోటులేకుండా జరిగిపోయేది . సోములింటికే కాదు ఆఊరు మొత్తానికి కంటి దీపం సిన్నీ , సిన్నీ ఒక రోజు జ్వరం పడ్డాదంటే ఊరంతా మూగబోయినట్టే ,గుళ్ళో దేవుడితో సహా ,
సహజంగా కుందనాలబోమ్మలాంటి సిన్నీకి ఆరోజు అమ్మవారి జాతర కావడంతో చిలుకపచ్చ పరికినీ గులాభీ రంగు జాకిట్టు వేసి జడ కుచ్చులు పెట్టి అందంగా ముస్తాబు చేసింది రాములమ్మ . దీని పెళ్ళికి ఇప్పటినుండే ఎనకేయ్యాలి
ఒక అయ్య సేతిలో పెట్టాలి అనుకొంటూ తనలో తానే అనుకొంటూ లోనికి వెళ్ళింది . ఇంతలో సోములు దిగాలుగా వచ్చి నులక మంచం మీద కూలబడిపోయాడు మాటా మంతీ లేకుండా . ఏవయ్యా ఊరంతా జాతర అవుతుంటే నువ్వేటి ఇలాగాయిపోయినావు . లే లే జాతరకెల్లాలి . సిన్నీ ఇంతకుముందే పిల్లలతో పోయినాది . అంటున్న రాములమ్మని ఒకసారి ఇలా రావే కూచో అంటూ పిలిచాడు . ఏవయ్యా ఏమి జరిగినాది అట్టాగున్నవే . ఆ సేమట్లేటయ్యా ఇంత సల్లగా ఉంటే ,ఏమయింది అంటూ నిలదీసింది . అంతా అయిపోయినాదే నిరుడు వచ్చిన కరువుకి నాయుడు గారి దగ్గర చేసిన అప్పు రెండింతలయి కూచుంది . ఈ ఏడాది పంటతో కొంతైనా తీర్చేద్దమనుకొంటే ఈ ఏడూ వర్షం లేక తిండి గింజ కూడా వచ్చేలా లేదు . నాయుడు గారు అప్పు తీర్చమని పంచాయితీ పెట్టారు . లేదంటే ఉన్న ఎకరం వడ్డీ కి ,
అసలుకీ జమ చేసు కొంటారంట . నెల రోజుల్లో బాకీ మొత్తం తీర్చెయ్యాలని ,తీర్మానించారు . మనకాడ చూస్తే కానీ డబ్బుల్లేవు . నాకు ఏంచెయ్యాలో పాలుపోక పిచ్చెక్కి పోతుంది , ఇప్పటికిప్పుడు సొమ్ములు ఎలా తేగలం పట్నానికి పోయి నాలుగు డబ్బులు తెద్దామంటే ఆ పండిన కాస్తా ఎవరు చూస్తారు . గంజి కైనా వస్తాయి కదా . ఎలా అప్పు తీర్చి మళ్ళీ మనం నిలదొక్కుకోవాలో అంటూ బావురుమన్నాడు . ఇంతలో అటుగా వచ్చిన సీతాలు , ఇదిగో సోములు నేను అంతా విన్నాను . నా దగ్గర నిన్ను గట్టెక్కించే మార్గం ఉంది . చెప్తాను విను. మొన్ననే ప్రెసిడెంటు గారి అమ్మాయికి ప్రసవం అయింది . ఆ అమ్మాయి అత్తారింట్లో సాయానికి ఒక అమ్మాయి కావాలంట . కూడా తీసికెల్లిపోతుందట . తిండి, గుడ్డ, మందు ,మాకు అన్నీ బాగోగులు వాళ్ళే సూసి నీకు తిరిగి సొమ్ములిత్తారంట . మీ సిన్నీ ని పంపావంటే నీ అప్పు తీరుతాది ,నీ భూమి మిగులుతాది . ఆలోచించు . ఎప్పుడంటే అప్పుడు నువ్వెళ్ళి సూసి రావచ్చు .మీరు ఊ అంటే వాళ్లకి చెప్తాను . అని చెప్పి వెళ్లి పోయింది .
సిన్నీ జాతరలో తుళ్ళి తుళ్ళి ఆడుతుంది . తన ఇంట్లో కార్చిచ్చు తనకు తెలీదుకదా . కానీ రాములమ్మకి , సోములుకి గుండె బ్రద్దలయినట్టుంది . సిన్నీ ని పంపించాలనే ఆలోచనే , కాని వాళ్లకి ఉన్న ఒకే ఒక దారి సిన్నీని పంపించడం . ఆ రాత్రి కాళరాత్రే అయింది . ఏడ్చి ఏడ్చి ఇద్దరి కళ్ళలో కన్నీరు ఇంకిపోయింది . సమయం లేదు
పొలం చేజారకుండా ఉండాలంటే సిన్నీ ని పంపించాలి . అవును తమ ప్రాణానికి ప్రాణమైన సిన్నతల్లిని ఆ పెద్దింటికి పనిపిల్లగా పంపించాలి . ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని కొన్ని సంవత్సరాలు తమ గారాలపట్టిని ,పట్టణానికి పంపాలని నిర్ణయించుకొన్నారు . ఇంతలోనే చేతి నిండా జీళ్ళు ,బొమ్మలు పట్టుకొని పట్టలేని ఆనందంతో పరుగులు తీస్తూ వచ్చేసింది ,సిన్ని అమ్మా ,నాయనా మీరెందుకు రాలేదు ,ఎంత సంబరంగా ఉందో తెల్సా జాతర ,అమ్మోరికి మొక్కుకున్నా చందమామ వెళ్ళినప్పుడు నన్నూ పట్టణం పంపించమని , ఇందా మీకోసం జీళ్ళు తినండి ఎంత బాగున్నాయో , నాయనోయ్ నన్ను బేగా లేపు బంతిమొక్కలకు నీల్లెయ్యాలి . లేగాదూడకి డాటారు కాడికి తీసుకెళ్ళాలి . బుజ్జిముండ ఏమి తినడం లేదుకదా .. నేను చందమామతో ఒక మాట సెప్పి పడుకొంటా అంటూ పెరట్లో నులక మంచం మీద వాలి ఊసులు మొదలెట్టింది తన జతగాడు చందమామతో ,కానీ వెన్నెల్లో నిద్రపోతున్న సిన్నీ కి తెలీదు రేపటి ఉదయం తన బాల్యాన్ని కఠోరంగా కాటేస్తుందని ,కమ్మని కల ఈనాడే చివరిదని ,
తెల్లారింది . ఎలా ఎలా తన సిన్నీ కి ఆ విషయం సేప్పాలో అని ఒకరినొకరు బేలగా చూసుకొంటూ ,ఏమే సిన్నీ
అదికాదే , మనూరు పెసింటు గారి అమ్మాయి సుగుణమ్మ తెల్సా .. అవునవును ఆ అమ్మాయి గారికి ఒక సంటి పాప కూడా ఉంది . ఎంత ముద్దొత్తదొ .ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది . అవునే తల్లీ ఆయమ్మ కూడా నువ్వు పట్నం పోవాలె . పాపని ఆడించడానికి ,ఎత్తుకొనీకి ,మా మాట విని ఎల్లు సిన్నీ ,మద్దెలో మేం నిన్ను సూడ్డానికి వత్తాం . అమ్మో నేనెల్ల . నిన్ను నాయనను సూడకుండా ఒక్క రోజైనా ఉండలేను . ఏడుపొత్తాది . అంటూ నాన్న ఒళ్లో తల వాల్చింది . అదికాదే బంగారు తల్లి మీ నాయననేను కూడా కొన్ని రోజులు తర్వాత నీ దగ్గరికే వచ్చేత్తాం . నా తల్లి కదూ . నువ్వు పోక తప్పదే సిన్నీ , నీ బట్టలన్నీ సర్ది పెట్టుకో , అక్కడ వాళ్ళు చెప్పింది విని సిన్నీ మంచి పిల్ల అనిపించుకొని మీ నాయనకు ,నాకు మంచి పేరు తేవాలె . అంతే కాదు ఎప్పుడైనా మా మీద దిగులేస్తే నీ జతగాడు అక్కడే ఉంటాడు . ఆ చందమామకి సెప్తే వచ్చి మాకు నీ ఊసులు సేప్తాడు . వెంటనే మేము వచ్చేత్తాం .
సరే నువు సెప్పినట్టే సేత్తాలే అంటూ మూతి ముప్పై వంకరలు తిప్పింది . హమ్మయ్య అది ఒప్పుకొంది . అనుకొన్నారే గాని ఇద్దరికీ కన్నీరైతే ఆగలేదు . ఉదయాన్నే సుగుణమ్మతో పాటు రైలెక్కిన సిన్నీ కి , ఒక పక్క పట్నం పోతున్నాననే సంభరం . వేరే పక్క అమ్మా ,నాయనను వదిలెల్లాలనే దిగులు కల్సి బిక్కమొకమేసుకొని
సూత్తుండిపోయింది . రైలు పట్నానికి పరుగులు తీసింది .స్టేషన్ రానే వచ్చింది . సుగుణమ్మ కోసం కారు వచ్చింది .
అంతా కొత్తగా ఉంది . కిటికీ నుండి చూస్తే ఆకాశాన్నంటే భవనాలు ,అన్నీ వింతలే కళ్ళు విప్పార్చి సూత్తూనే
ఉంది . ఇంటికి రాగానే సుగుణమ్మ అత్తగారు ఎదురయ్యారు . దిష్టి తీయించి లోనికి తీసుకెళ్తూ ,ఆ పిల్లెవరే నీకూడా
పాపని ఎత్తుకోడానికి , ఆడించడానికి బాగుంటుందని మా ఊరినించి తెచ్చానత్తయ్యా అంది . సర్సరే దాన్ని బయటే ఉండమని మీరు ముందు రండి . అంటూ లోనికి తీసుకెళ్ళింది తల్లిని ,పిల్లను , సిన్నీ వాకిట్లో నిలబడి చూస్తుండి పోయింది . అంతా అయోమయం . ఇంట్లో చంటిపాప వచ్చిన సందట్లో చుట్టాలు తో సిన్నీ విషయమే మరచిపోయారు . సిన్నీ కి ఆకలి , నిద్ర ముంచుకొచేస్తుంది . ఆరుబయటే మోకాళ్ళ పై తల వాల్చి నిద్రపోయింది . కొన్ని గంటల తర్వాత సిన్నీ గుర్తొచ్చి బయటకు వచ్చింది సుగుణమ్మ . సిన్నీ ని తట్టి లేపి ఏమే పిల్లా అప్పుడే నిద్దరొచ్చేసిందా .. పదపద అంటూ లోనికి తీసుకెళ్లింది . అత్తగారు ఏవే పిల్లా పని సేయడానికి వచ్చావా పడుకోవడానికి వచ్చావా అంటూ వంటగది చూపించి అంట్లున్నాయి ముందు తోమేసెయ్ . ఆ తర్వాత అన్నం పెడతానంటూ హాల్లోకి వెళ్ళిపోయింది . సిన్నీకి ఏమి అర్ధం కాలేదు . పాపతో ఆడుకోవాలి అని కదా అమ్మ అంది .
మరి వీల్లేంటి అంట్లు తోమ్మంటున్నారు . అనుకొంటుండగానే మళ్లీ సుగుణమ్మ వచ్చి ఇంకా తోమలేదా అంటూ కేక వేసింది . అంతే తుళ్ళిపడ్డ సిన్నీ తనకు అలవాటు లేకపోయినా తోమడం మొదలు పెట్టింది . కడుపులో పేగులు మెలేస్తున్నాయి ఆకలితో ,పక్కనే ఉన్న కుళాయిలో నీళ్ళు దోసిళ్ళతో త్రాగుతూ ,ఈ పాటికి అమ్మైతే నేను వద్దంటున్నా ముద్దలు సేసి పెట్టేది . అనుకొని కళ్ళనీళ్ళు కార్చేసింది . ఒక సత్తు పళ్ళెంలో కొంచెం అన్నం పెట్టి తెచ్చి
ఆ ప్రక్కన కూచుని తిను అంటూ పడేసి విసవిసా లోనికి వెళ్ళిపోయింది . సిన్నీకి ప్రాణం లేచొచ్చింది . అన్నం సూడగానే ,గభగభా ముద్ద నోట్లో పెట్టీ పెట్టగానే తన పళ్ళెం లో కలబడిపోయింది ఆ ఇంటి బొచ్చుకుక్క . ఒక్క మెతుకు లేకుండా మొత్తం తినేసింది . భయంతో చూస్తుండిపోయింది సిన్నీ దాన్ని అదిలించలేక . అమ్మ నాయనలు అప్పటికే వందసార్లు గుర్తొస్తున్నారు . ఆపై ఆకలి . ఇంతలో పాపని తెచ్చి దీనికి పాలు పట్టించు అని చేతికిచ్చి పోయింది సుగుణమ్మ . సేతిలో సిన్నిపాపను సూత్తే ముద్దేసింది . సిన్నీకి పాలు పట్టించి ఎత్తుకొని ఆడిస్తూనే ఉంది .
కొంతసేపటికి పాపను అమ్మకిచ్చేసి అమ్మగారు నాకు నిద్దరోస్తుంది . పడుకొంటానంటూ కళ్ళు నులుపుకొని అడిగింది . సరే పడుకో అంటూ ఆ టామీ కి పక్క వైపు పడుకో అని గొనె పట్టా చేతికిచ్చింది . తప్పదని అర్ధమైన సిన్నీ టామీ కి కొంచెం దూరంగా భయంభయంగా పడుకొని ,ఒక్కసారి చందమామ పట్నంలో కూడా ఉంటాడని అమ్మ సెప్పింది . కనబడితే అమ్మకు కబురెట్టాలి . ఇక్కడ భయమేస్తుందని ,ఆకాశమే కనిపించదేంటి ఈ ఇంట్లో ,అనుకొంటూ మేడ మెట్లు ఎక్కింది . యెంత ఎక్కినాఆయాసం వస్తోంది గాని ఆకాశం మాత్రం కనబడలేదు . అవును మరి అది పది అంతస్తుల భవనం . మళ్ళీ ఉస్సూరని కిందకి వచ్చి రొప్పుతూ నిద్రలోకి జారుకొంది . ఆరోజు నుండి ఒక్కరోజు కడుపు నిండా తిన్నదీ లేదు . ఒక్క క్షణమైనా తీరిక దొరికిందీ లేదు . చిట్టి చేతులు పొట్లుపోయి మంటలొస్తున్నా .. కన్నీరు కార్చికార్చి చెంపలన్నీ చారికలవుతున్నా ... అమ్మా , నాయన పై దిగులుతో గుండెలవిసిపోతున్నా ,ఎప్పుడూ ఊసులు సెప్పే సందమామా కంటికి కూడా కనపడకున్నా .. ఆ పది ఏళ్ళ పసిమొగ్గ మొక్కవోని ధైర్యంతో ఎదురు చూస్తూనే ఉంది . తనవారి రాక కోసం ,చందమామ ఓదార్పు కోసం , ఎంతగా సిదిమేసారంటే ఆ మొగ్గని ముద్ద బంతిలాంటి ఆ మోము అంద విహీనంగా మారి అస్థిపంజరంలా మారిపోయింది . కానీ సిన్నీకి మాత్రం తెలిసింది . పట్నమంటే పంజరమని , హాయిగా హాయిగా చెట్లు ,పుట్టలు ,చిలుకలు ,లేగదూళ్ళతో ఆడి పాడి అమ్మానాన్నల ముద్దులపట్టీ , చందమామకు నచ్చిన జతగత్తె అయిన సిన్నీకి పట్నమంటే పరమ అసహ్యమేసింది . ఉన్నపళంగా ఊరికి పారిపోవాలని గట్టిగా నిర్ణయించుకొని , చీకటి పడే వరకూ వరకూ ఓపిక పట్టింది .
సిన్నీ దగ్గరకు రెపొద్దునే ఎల్దాం . ఉంటే తిందాం . లేదంటే పస్తులుందాం . ఆ నాయుడు గారికి మన ఎకరం అప్పుకింద ఒదిలేద్దాం . మన సిన్నీ లేని బతుకులు మనకొద్దు . బిడ్డ కనపడక పోయేసరికి రాములమ్మ మంచం పట్టింది . సోములైతే మనిషిలాగా తిరుగుతున్నాడే గాని తన సిన్నీ లేక బాగా లొంగిపోయాడు . ఆరు నెలలకే వారి బతుకుల్లో ఆనందం ఆవిరైపోయింది . తిన్నా లేకున్నా కన్న బిడ్డలేని ఆ ఇల్లు నరకంలా మారిపోయింది . లేగదూడ దిగులుతో
చచ్చిపోయింది . ముద్దబంతి తోట మోడు వారి పోయింది . ఊరే మూగబోయింది . సిన్నీ అందెల సప్పుడు లేక ,
గుళ్ళో దేవుడు కూడా ఆత్రంగానే చూస్తున్నట్టున్నాడు . తన మెళ్ళోఆ చిట్టి చేతులతో కట్టిన మాల లేక ,
అదేమో గాని ఊరే దిగాలు పడింది . తమ సిన్నతల్లి చెంతలేక ,సోములు రచ్చబండ దగ్గర అందరికీ ఆనందంగా సేప్పేసాడు .సిన్నీ కోసం పోతున్నానని , రేపు రేతిరికల్లా సిన్నీ తో ఊరికొచేత్తానని , తెల్లవారితే పయాణం కన్న కూతురిని సూత్తామన్న సంతోసంలో కనురెప్ప మూతపడట్లేదు వాళ్ళిద్దరికీ ,
అందరూ ఆదమరచి నిదరోతున్నారు . సిన్నీ మాత్రం ఎప్పుడెప్పుడు బయట పడాలా అని కాచుకొని కూచుంది . నెమ్మదిగా సంచీ పట్టుకొని తలుపు ఘడియ తీస్తుండగా వెనుకనుండి సుగుణమ్మ భర్త సిన్నీ చెయ్యి పట్టుకొని నోరు నొక్కేసి ,ఒక్క ఉదుటున రెండు సేతులతో సిన్నీని ఎత్తుకొని లిఫ్ట్ లోనికి వెళ్లి మీట నొక్కాడు . ఆ చేతుల్లో ఊపిరాడక గిలా గిలా కొట్టుకొంతుంది సిన్న తల్లి . పై అంతస్థు మేడపైన నిర్మానుష్యంగా ఉంది . ఎప్పటి నుండో సిన్నీ పైన కన్నేసిన ఆ కామాంధుడికి ఆ రాత్రే అవకాశం వచ్చింది ,ఆ పసిమొగ్గను పరమ కిరాతకంగా మారిన ఆ కామాంధుని రక్కస కేళిలో ఆ పసిమొగ్గ నిర్దాక్షిణ్యంగా నలిగిపోతూ ,చేతలుడిగి , కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఆ అభాగ్యురాలి కన్నులకు ఆకాశం ఆరోజే కనిపించింది . సిన్నీ కన్నులు శాశ్వతంగా మూతలు పడబోతున్న సమయంలో ,సందమామ కనిపించింది . అంతే ఎక్కడ లేని సత్తువ తెచ్చుకోని సందమామా... నువ్వు కూడా పట్నమొచ్చావా .. మీ అమ్మా నా యానా నిన్నూ పంపించేశారా .. తొందరగా మనూరెల్లిపో .. లేదంటే అమ్మ నాయనను సూడకుండానే నువ్వు కూడా సచ్చిపోతావ్ .నాకోసం ఒక్కసారి కిందకొచ్చి నన్నూ నీతో తీసుకుపోవా .. ఊరికి పోవాలనిఉందిఊపిరి ఆగేలోపు ,
అమ్మా ,నాయనా .. సిన్నీ లేదని తింటన్నారో ,లేదో . ముద్దబంతి తోటకి నీరు పోత్తున్నారో ,లేదో , గుళ్ళోముగ్గులేత్తున్నారో , లేదో ,దేవుడికి పూలున్నాయో , లేదో నా లేగ దూడ పెద్దయిందో లేదో , అమ్మ ఏ బాధేసినా నీకే సెప్పమంది . వచ్చిన కాడినుండీ రోజూ భాదేసింది . కానీ నాకు ఎంతకీ నువ్వు కనబడలేదు . ఏడకెల్లిపోయావ్ పోనీలే ఇప్పుడైనా నన్ను తీసికెల్లి మన పల్లెలో వదిలిపెట్టు . నువ్వూ , నేను జత కదా ,పోదాం పద మన ఊరికి ఎంచక్కా !అంటూనే ఊపిరి ఒదిలేసింది . సందమామతో ఊసులాడుతూ ....ఊగిసలాడుతున్న సిన్నీ సిన్ని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది . కానీ సిన్నీ మాత్రం సందమామలో ప్రతీ రేయి కనపడుతోంది . అది
సిన్నీని కన్నవాళ్ళ కే కాదు . అభం శుభం ఎరుగని చిరుమొగ్గల భవితను బుగ్గిపాలు చేసి , సోమ్ములకోసం పనిలో చేర్చి తమ పబ్బం గడుపుకోవాలనుకొనే ప్రతి తల్లితండ్రులకూ సందమామ లోనే కనపడుతుంది సిన్నీ ప్రతిబింభం .ప్రతీ సిన్నతల్లి ప్రతిరూపం .
(దయ చేసి పిల్లలను డబ్బు కోసం పనిలో పెట్టొద్దు. వారి నిండు జీవితాన్ని నిప్పుల్లోకి నెట్టొద్దు. )
బాల కార్మికులందరికీ నా ఈ చిన్ని కధ అంకితం .)
సాలిపల్లిమంగామణి @శ్రీమణి