పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, జులై 2014, గురువారం

నేనే రాధనోయి

          

నీలిమేఘాల వరుసల్లోకూడా  నీ సరసనే నా ధ్యాస 
నీ  తేనె రాగాల మురళీ  పదనిసలో నిలువెల్ల  నా శ్వాస 
నీ నీడ జాడల్లోవడివడిగా  అడుగులు వేసా  
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా 
 కలువల రేడుని వేడుకొంటి నీ  చెలియ  గోడు ఆలకించమని 
ప్రతి రేయిలో   పున్నమి ఎన్నియలు  విరజిమ్మమని 
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని 
కిన్నెరసానిపై   కన్నెర్ర చేశా  వన్నెలసోయగంతో 
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని 
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై.    తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై 
నీ  అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
 నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని 
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని 
నా మది దోచిన మురళీ మోహనా ..   నీ  మనసును  నాకే కానుకనీవా 
నాఇరు  కనుపాపల్లో  చిరు దివ్వె వెలిగించి  నీకోసం  నిరీక్షిస్తున్నా .... 
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా... 
రారా కృష్ణా ! 
మన ప్రణయ రససామ్రాజ్యం లో  నా  హృదయ పీటమేసాను 
కినుక వహించక   నీ అలివేణి పై 
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను  

12, జులై 2014, శనివారం

గురు చరణం




కరువాయెను కవితకు ఆదరణ  అని ,
బరువెక్కిన హృదయంతో ,ఎరుపెక్కిన వదనంతో,
వెనుదిరిగిన తరుణంలో ,
గురువాయెను నండూరివారు ,దిశానిర్దేశం చేయ మార్గదర్శియై !
కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే   చాలు  
కలం పట్టిన కవి కావ్యం పండడానికి 
అల్లిబిల్లి అక్షరాలూ కవితా సుమాలై విరబూయాలన్నా  ,
హిమశిఖరపు అంచులంత నీవు ఎదిగిపోయినా  ,
ఒదిగిపో ... నీ గురు పాదాల చెంత 
నా కవితా రధానికి సారధి అయిన నండూరి వారికి ,
పండూరు చెరువు గట్టు వారి వినమ్రతా పూర్వక పాదాభివందనాలు తో 

                                                            సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 

8, జులై 2014, మంగళవారం




మా పెరటి సుమాలతో  
                                 
నా కవితా  కుసుమాలు ... 
                                                      
          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

4, జులై 2014, శుక్రవారం

అల్లూరి సీతా రామ రాజు


మరువగలమా మహోన్నతుడా . 
మాతృభూమి శ్రుంఖలాలు తెగదెంచ నెంచి 
ఉడుకు నెత్తురు ఉప్పెనవగా ...  రుద్ర  నారసింహుడవై 
తుచ్చమైన తెల్ల కుక్కల పాలిట సింహ స్వప్నo  నీవై 

బడుగు బ్రతుకుల వెలుగు నింపి ,గిరి పుత్రుల వెతలు కడిగిన  మన్యవీరుడా
 మానవ కుల మాన్య  ధీరుడా 
ఓ తెలుగు వీరుడా .. చైతన్య ధీరుడా .. స్వరాజ్య సమర యోధుడా .. 
ఉద్యమానికి ఊపిరులూది వందేమాతరమన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటిన విప్లవ స్పూర్తి 
కొన ఊపిరి వరకు స్వరాజ్య పోరాటాన్నే నీ శ్వాస గా  తలచి చరితార్దుడా 
 మర ఫిరంగులు వర్షంలో మృత్యువుకే దడ పుట్టిస్తూ 
గుండెను చీల్చి తుపాకీకి ఎదురొడ్డి  తెల్ల వారి గుండెల్లో గుభుళ్ళు పుట్టించిన 
తెలుగు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటి చాటి చెప్పిన చైతన్య స్ఫూర్తి
అమర జ్యోతివై నిలిచినావు  ఈ భరత జాతి ఉన్నంత వరకు 
ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఆత్మగౌరవానివై  చిరంజీవి గా వర్దిల్లుతున్నావు 
             
అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా 
                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

3, జులై 2014, గురువారం

"కల "వరం


అమ్మ గర్భం నుండి వస్తూనే అవాక్కయ్యా... 
 నాన్న చేతిలో  ఆసుపత్రి బిల్లు చూసి 
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
 అవసరాల ధర  ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటు బిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు  మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల ,
 అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... 
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి . 
అమ్మ చిన్నప్పుడు  ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది . 
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు.  బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
నిత్యావసరాలు నిచ్చె నలెక్కి కూచుంటే 
పాలధరలు  పాలుపోక చూస్తున్నాయి 
కాయగూరల ధరలు మనల్నే నమిలేసేట్టు చూస్తుంటే 
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవిత మాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
భార్య కళ్ళలోకి చూస్తే  ఏదో తెలియని అనుభూతి అంటారు . 
కానీ నేటి మద్యతరగతి భర్త కి భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరు అడ్డు వస్తుంది . తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు పిల్లల్ని ఎంతమందిని కందామనే ఆలోచనే అద్భుతంగా ఉంటే 
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కితీరతానని మారాం చేసాం 
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  లభో దిభో మంటుంటే నిద్దరేలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే ,తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే .చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప . 
మతి లేక తప్పు చేసిన వాడికంటే , గతి లేక అప్పు  చేసిన మాకే పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు" కలవరం" తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రుత్యమయిపోయే  , ఈ కలచి వేసే మధ్యతరగతి బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????

                                                        సాలిపల్లిమంగా మణి @శ్రీమణి 








2, జులై 2014, బుధవారం

'పైసా'చిక ప్రపంచం


ఎందుకు వృధా ప్రయాస , అన్నిటికీ  హేతువు పైసా !
పరుగులు తీసే బ్రతుకు రధానికి పైసయే కదా పరమపదం .
మానవాళి మస్తిష్కంలో నిత్యం మసులుతున్న పైసా భూతం .
ప్రతీ  మనిషీ జీవనగమనం పైసా చుట్టూ పరిభ్రమణం .
ప్రతి నిమిషం పైసా కోసం యోచన ,
ప్రతి క్షణం పైసా కోసం యాచన ,
ప్రతి ఘడియ పైసా కోసమే వంచన .
పైసాకి పైశాచిక ఆనందం పాశాలను తెంచాలని .
పైసా ప్రయత్నం ప్రతి మనిషి తనకి దాసోహం కావాలనే .
బిచ్చగాడి సత్తు గిన్నెలో చతికిలపడినా....
చలువరాతి గదుల్లో మూలుగుతున్నా...
పైసా పైసాయే, పైసాది ఎప్పుడూ పైచేయే .
యధార్దానికి బుద్ధికి స్వార్ధం నేర్పింది పైసా .
మానవత్వానికి మరకలంటించిందీ   పైసానే .
కడు బీద కనీళ్ళ సెలఏరులైపారి  ఉన్నోళ్ళ  పన్నీటిజల్లుగా కురిసి
తన ఉనికి పదిలపరుచుకుంటుంది పైసా
బ్రతుకు రసాబాస చేసినా బంగరు  రాచ బాట వేసినా ,
పట్టు పానుపు పరిచినా ,
ప్రాణం నిలువునా హరించినా ,
మాన్యతతో మన స్థాయిని  అత్యున్నత పరిచినా,
హీనతతో అధఃపాతాళానికి విసిరి పారేసినా ,
అన్నిటిని నడిపించే సూత్రధారి పైసా, పాత్రధారి పైసా.
వాస్తవానికి మనిషేప్పుడూ మహనీయుడే ,
తన సన్నిధిలో మనిషిని మరమనిషిని చేసి ,
మరో మనిషిలా మార్పు చేసిందీ పైసానే.

అందులకే ఓ మనిషీ... పైసాతో తస్మాత్ జాగ్రత్త 
పైసా ని  దైవంలా  బావించు ... బానిసవైతే కావద్దు 
నిండు నూరేళ్ళ జీవితంలో పచ్చనోటు కోసం పచ్చదనాన్ని కోల్పోవద్దు 
                                      
                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

1, జులై 2014, మంగళవారం

పల్లవించే ప్రణయ రాగం


ఏ మరులు దాచావు ఆ నవ్వులో 
ఏ విరులు కూర్చావు నీ పదములో 
ఏ సిరిచందనాల పరిమళాల మునిగి తేలినావు నీవు 
ఆ  మదనుని విల్లువి నీవో , ఆ సురులు సేవించిన సుధాజల్లువో 
కలవో , కల్పనవో , కమ్మని కావ్యానివో 
కటిక చీకటిపై కుమ్మరించిన వెన్నెల జడివో 
ఏం మాయ చేశావో , ఏ మత్తు జల్లావో 
ప్రకృతితో మమేకమై ప్రతి అణువును,ప్రణయరాగమాలికలో ఊయలలూగించావు 
నిజమే నిరంతరం నీ సాంగత్యం కోరుతోంది ఆ నీలి గగనం కూడా 
రా రమ్మని  రాచిలకే రమ్మంటోంది . ఆ కొమ్మల మాటున నక్కి 
ఏరికోరి కొండమల్లె  నీ మీదే మనసు పారేసుకుంది 
మండుటెండలో కూడా మైమరచే పాడుతోంది గండు కోయిల 
నిను చూసి . అది వాసంత సమీరమని తలచి . 
అంతెందుకు  నీ జతకై 
విహంగమై విహరిస్తూ పదే పదే పరితపించె నా మది 
పల్లవించే ప్రతీ క్షణం ప్రణయవాహినీ లా 
నీకై కలవరించే నా హృదయానికి నీ హృదయంతో  సేద తీర్చు 
ప్రకృతి సైతం పరవశించి మురిసేలా.... 
   
                   సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 









28, జూన్ 2014, శనివారం



గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలావో

మరమ్మత్తు చేయలేని మరబొమ్మై మిగులుతావు

సాలిపల్లి మంగామణి @శ్రీమణి

27, జూన్ 2014, శుక్రవారం

మేటి రతనాలవిరిబోణి నా విశాఖ

        


ఎటు  చూసిన  ఆహ్లాదం ,   ఎటు  చూసిన  ఆనందాల  హరివిల్లు
ఎటు చూసినా  మనోహర  సౌందర్యం , ఎటు చూసిన మైమరపుల విరి జల్లె 
ఎటు చూసిన గిరులు ఎటు చూసినపచ పచ్చని  తరులు, విరులు , మరులు గొలుపు ఝరులు
 ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబంధాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీర వీచికలే 
మనోహరి నా విశాఖకే తలమానికం . మనసు తాకే సుందర  సాగర  తీరం
నా  విశాఖ  సాగర తీరం  ప్రకృతి  మెడలో అలంకరించిన మణిమయ హారం
విశాఖ నేల పైన పాదం  మోపినంతే తుళ్ళింతలు  , కేరింతలు ,చక్కిలిగింతలు 
వింత వింత అనుభూతులతో మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించుట తధ్యం   వినీల గగనంపై . 
ప్రత్యూషంలో ఆ భానుని పసిడి వన్నె  కిరణం  ఉదయించిన తరుణం 
ఏ  జన్మల అదృష్టమో మరి వీక్షించిన కన్నులకా వైభోగం 
ఎటు చూసిన  ముగ్ధ మోహన సౌందర్యదేవత  సంతకాలే 
సర్వాంగ  సుందరంగా ముస్తాబైన  ప్రకృతి కాంత ప్రతిరూపం
అడుగడుగున అతిశయాన్ని దాచుకొన్న సువిశాల  సుందర  నగరం 
వైశాఖీశ్వరుడు  వెలసినట్టి  మా వైశాఖీ నగరం 
ఆ  సురులైనా అచ్చెరువొందే అత్యద్భుత సౌందర్య  సమాహారం 
నమ్మి వచ్చిన వారికి కొమ్ము కాసే పురము . 
ఏడుకొండల స్వామిని  ఆ కరుణాముయుని కన్నతల్లి  మరియమ్మని 
అల్లా ను అల్లారుముద్దుగా  మూడుకొండలపైనా  కొలువుంచిన నా విశాఖ  
సర్వమతా  సమాహారం.  సమతా, మమతల ప్రాకారం 
ఏచోట నిలుచున్నా కన్నులపండుగ చేసే ఆది దంపతుల శిల్పాలతోటి 
కళ్ళెదుటే  కైలాశం  మా కైలాశ గిరి శిఖరం 
అరకులోయ అందాలతో , అరవిరిసిన వలిసెల సొగసులతో 
అలరారే  మా నగరి  వైశాఖ నగరి 
శ్రీ  లక్ష్మీ నారసింహుని  దివ్య ఆశీశ్శులతో 
కనక మహా లక్ష్మీ దేవి కరుణాక్షలతో  
నిత్య నీరాజనాలతో , అర్చనాభిషేకాల్తో , పునీతమైన  నగరం 
మహాత్ములను,  మహా కవులను , మహానుభావులను కన్నతల్లి
 సంగీత సాహిత్య సమలంకృత నా విశాఖ పట్నం
అన్ని రంగాలను వెన్నుతట్టి ప్రోత్సహించే  విదుషీమణి   మా విశాఖ  
 ఆంధ్ర రాష్ట్రానికే మకుటాయమానం


                                                                                         సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 




26, జూన్ 2014, గురువారం

నిలువ జాల, నిమిషమైన

నే నిలువ జాల నిమిషమయిన.   నిన్ను చూడక . 
నిదుర రాని నా కనులను ఊరడించలేక,  కరిగిపోయింది కమ్మని కల . 
అదేంటో .. నీకై వగచె నా మదిలో నిప్పులే కురిపిస్తుంది.  ఆ పండు వెన్నెల 
నీ జత లేని  నిశిరాతిరి నిశ్శబ్దం .నను అమాంతం మార్చేసింది జీవమున్న శిలలా ... 
గుర్తుందా !మన జంట హృదయాలు మధురోహల సంతకాలు చేసిన వేళ 
తనువులు, మనసులు , వలపుల తలపులతో తడిసి ముద్దైన వేళ 
మన ప్రణయ కవితకు కొత్తరాగం జతకూర్చిన వేళ 
పాలు , తేనెలు చిలికి అమృతాన్ని ఆస్వాదించిన వేళ 
వేవేల కుసుమాల సౌగంధం మన మనసులను మైమరపించిన వేళ 
మన పరువాల ప్రణయబంధం  పరిణయ గ్రంధంగా లిఖించిన వేళ 
ముద్దు, మురిపాలలో మునిగి మంత్రం ముగ్ధులమై మురిసిన వేళ 
సప్తపదులూ నీతో  నడిచిన నిమిషం నుండీ 
నిను వీడి మనలేను  నిమిషమయినా  నేను 
ఏ మలయ సమీరమైనా నిన్ను మీరి తాకలేదు నన్ను 
నీ ఎడబాటులో నా హృది స్పందన తడబడి నా  ఊపిరాగిపోతుందేమో 
పరిపాటేనని, పరధ్యానపడక , పరుగున రావా 
నీలో సగమై నిన్నే తలచే నీ అర్ధాంగి కి ఊరట నిచ్చే 
నీ అనురాగాన్ని తలపించే అనుపానం లేదు మరి 
నీ ప్రణయామృతమ్ము తప్ప 

                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


25, జూన్ 2014, బుధవారం

ఒక్క క్షణం ... ఒకే ఒక్క క్షణం...


నువ్వు మహాత్ముడివా !మహర్షివా !మామూలు మానవుడివా !
అట్టడుగున కూరుకొన్న మానవతను వెలికితీయు మాన్యుడివా !
జంగు పట్టి పోతున్న  జనంలో నిజాయితీకి తుప్పు వదలించే దమ్మున్న అసామాన్యుడివా !
నలుగురితో నారాయణగా సామాన్యంగా  మసలుతున్న సామాన్యుడివా !
అవినీతి , స్వార్ధపు కోరలు   విరిచే  మేటి విలుకాడివా !
 నువ్వు మాన్యుడవైనా ... సామాన్యుడవైనా ... అసామాన్యుడవైనా 
నువ్వు   ఎవరైనా...  ఎవరైనా ఎవరైనా .. గాని  ఒక్క క్షణం  ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించే  మనసున్న మనిషివయితే  చాలు . 
నీలో జరిగే ప్రతి సంఘర్షణలో, సంఘానికి హితపడు హితవుంది . 
నువ్వేడ్చినప్పుడు , ఎదుటివారి  ధుఖ్ఖాన్ని 
నువ్వు  నవ్వినపుడు  నవ్వలేని బ్రతుకుల్లో నవ్వే లేని వారిని 
నువ్వాకలిగొన్నపుడు  ఆకలితో అలమటించే వారెందరని 
నీ ప్రతీ భావంలో , ఎదుటివారి భాదల్ని ప్రతిబింబిస్తే 
ఎవరో మన బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన అగత్యమేముంది 
ప్రతి నువ్వూ స్పందిస్తే ,  ప్రపంచమే మారదా !
పట్టువీడక ప్రయత్నిస్తే,  పసిడి పండదా...  బీడు భూమిలో 
ఎదుటి మనిషిలో దైవాన్నే ధర్శిస్తే , ధన్యమవదా ప్రతి మానవ జీవితం . 
పరోపకార గుణం ప్రతి మనిషికి వరమయితే ,
 పని తేలిక కదా ... పరమాత్ముడికీ 
కన్నేరెందుకు కార్చాలి మంచికీ , చెడుకీ , ... పైసా ఖర్చు లేదనా ...... 
కారుచిచ్చు  కాల్చేసినా కలసిరాని  కాలంలో నువ్వు అలసి సొలసి కూచున్నా 
నేనున్నా నీకోరకనే ఒక్క స్నేహ హస్తం.  అరక్షణంలో అంతమవదా  ఆవేదన 
మానవత్వపు ధన్వంతరి మహత్తరమయిన మందు మానవ  సంబంధాలకు 
అందులకే నేస్తం !
 ఆదుకొనే గుణముంటే ఆద్యంతం  ఆనందం  మన సొంతం 
మనం , మనం  ఒక్కటంటే   మాన్యమవును మన మానవ సంబంధం 
మరచిపోకు నేస్తం  మనమంతా  మానవులం . 
మనదంతా ఒకే కులం .  
అది విశ్వక్షేత్ర  శ్రామికులం  . 
                                                   సాలిపల్లిమంగామణి @శ్రీమణి 
                                                                                                        


24, జూన్ 2014, మంగళవారం

పరితప్త హృదయాలు




నిశీధియందున ,నిర్లిప్త వదనాల ,నిమీలిత నేత్రాల, నిర్వేదపు చూపులతో.. 
నిశ్చేతనులై ,నిషణ్ణులై ,నిహతికై ,నిరీక్షించు ఆ నిండు జీవితాలు 
ఆ .. వృద్ధ మాతాపితరులు . 
నీలకంఠుని వేడి తమ నెంజలి తీర్చగ వరమిమ్మనె . నిర్వృతి కొరకై 
ఆనక ఆత్మశాంతి నొందుటకై . 
కన్ను మూయులోపు తమకు రెక్కలీయమనె . 
ఆ రెక్కలతో తమ  తనయుల దరికేగి, 
 తనివి తీర చూసుకొని తనువులు చాలిస్తామనె  . 
 ఇది కడసారి చూపులకు నోచుకోని కన్నవారి హృదయవిదారక రోదన 
కనిపించని తనయులకై  కనిపెంచిన వేదన . 
కాసుల మోజుల్లో విదేశాల వ్యామోహపు బూజుల్లో 
కొందరు కన్నవారి ఋణం తృణప్రాయం చేసి , కన్నభూమికి ,
కన్నతల్లికి కడుపుకోత మిగిల్చేరు 
గోరుముద్దలిడిన తల్లి గోడు పట్టని మూఢులు ఆ  బిడ్డలు . 
బిడ్డలు కారు వారు తల్లి గుండెల పై గడ్డలు 
అన్నీ తానై పెంచిన తండ్రిని అనాధగా వదిలెళ్లిన అనామకులు వారు , అతి ధూర్తులు వారు . 
రక్తం పంచిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాల  పాల్జేసిన వారు కొందరు . 
నడివీధిలో విడిచివెళ్లిన నాసిరకం మానవులు మరికొందరు . 
మరచిపోకు  నేటి నీ తల్లితండ్రుల దుస్థితి . నీకొరకు   వేచియున్న పరిస్థితి . 
పచ్చనోట్ల కన్నా .. పచ్చడి మెతుకులు  తిన్నా 
తల్లి తండ్రీ నీడనున్న నీ జీవితమే మిన్న అని తెలుసుకో ... 
కన్నవారి  మనసునెరిగి మసలుకో 

                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

22, జూన్ 2014, ఆదివారం

జత చేరవా


మరచితివా నన్ను, నీ మరులొలికే ప్రియురాలను 
ప్రకృతి కే  పరవశమనిపించే  నీ చెలి జత  వీడి 
మనగలవా  నిమిషమాత్రమయినా.   నా మది దోచిన చెలికాడా !
నను రమ్మని,  ఝుం ఝుమ్మని,  తన కమ్మని కధ చెబుతానని 
   గోముగా పిలిచింది  ఆ తుమ్మెద. నా మోమును గని సుమమనుకొని . 
నను తాకినంతనే  నా తనువంత తానై  పులకించి 
వెన్నెలంతా నాపైనే ఒలకబోసింది ఆ పున్నమి రేయి
నా సిరి మువ్వల  అడుగులసడి విని తడబడి పోయింది  ఆమని కూడా ! 
నా  కొంగు పట్టి లాగింది  పైరగాలి పలకరించవా .. సఖీ అని
నాపై  అలిగి కూచుంది చిటారు కొమ్మన ,ఆ చిట్టి చిలుకమ్మ తన తేనె  పలుకులు నే దోచానని 
ఆ  మాధవీ లత   నన్ను కన్నార్పక చూస్తుంది  ఈ  పసిడి వన్నె  తీగ  ఎవరని
నా నీలి ముంగురులు సవరించ చూస్తుంది పిల్ల తెమ్మెర 
 నీ  ఎడబాటుకి వగచే  నా సిగలో ఆ సిరిమల్లె  చేరి మరుమల్లెల వాన కురిపించింది 
రాజహంసతో లేఖ రాసి పంపడానికని  మంతనాలు చేస్తున్నా ...  
మారు మాట్లాడక ఆఘ  మేఘాలపై  పయనించి ఇటు రా !
ప్రకృతిలో  ప్రతి అణువు నాపై  ప్రణయాస్త్రాలు సంధిస్తుంటే 
నీకై వెతికే  నా మది తల్లడిల్లి పోతుంది  నీ చెంత చేరడానికై 
చింత తీర్చగలేవా !నీ  చిన్నదాని మదిలో 
జత చేరగా రావా ! నీ కోసం నిరీక్షించే  నీ ప్రేయసి సన్నిధికి 
                              ( శ్రీను +మణి =శ్రీమణి )
                                                                          సాలిపల్లి మంగామణి @శ్రీమణి