పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

9, ఆగస్టు 2022, మంగళవారం

యుద్ధం

*యుద్ధం*

కత్తులుండవు కటారులుండవు
కుత్తుకలేవీ తెగిపడవు
యుద్ధభేరి మ్రోగదు
వింటినారి సాగదు
శత్రువు కంటికి కనబడడు
జరుగుతున్నది మాత్రం
భీకర సమరమే
అలనాటి మహాసంగ్రామంలా
గుర్రాలు ఏనుగులూ
రథాలూ సైనికసేనలు 
వుంటాయనుకొనేవు
అక్కడ ఆవరించింది
నరాలు చిట్లే ఉద్విగ్నత మాత్రమే
రక్తపుటేరులు ప్రవహించవు
అన్నీ కన్నీటి కాసారాలే
యుద్ధమంటే ఇరు వర్గాల
తలలూ తెగిపడితేనే గాదు
ఎదలోపల ఎడతెగని సంవేదనా యుద్ధమే
శ్రుతిమించిన మానసిక సంఘర్షణే అంతర్యుద్ధమై
పోరు శంఖాన్ని పూరిస్తుంటుంది
అప్పుడే అంతరంగం
కదనరంగమై కలవరపెడుతుంది
నిశితంగా పరికిస్తే ప్రతిఘటించే
ఆయుధాలన్నీ నిగూఢమైనవి నీలోనే
ఒక్కోసారి మనోదౌర్భల్యమే మనుగడకు
అంతిమవాక్యం రాస్తుంటుంది
వేధించే అంతర్మధనం
ఛేదించలేని వ్యూహమే
సాధించాలంటే స్థితప్రజ్ఞతయే సరియైన సాధనం.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి