పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, ఆగస్టు 2022, గురువారం

అరుగును నేను

*అరుగును నేను*

వీధిఅరుగునునేను
పరుగులలోకంలో
కరిగికరిగి 
మరుగునపడిపోయాను
కనుమరుగైపోయాను
అంతస్ధుల మోజులో
అడుగునపడిపోయాను
అసలునేనూ..
ఊరుమ్మడిచుట్టాన్ని
ఊరుమంచి కోరేదాన్ని
ఊరడింపునిచ్చేదాన్ని
ఊసులాలకించేదాన్ని
ఊ..కొట్టేదాన్ని
ఊళ్ళోకొచ్చినదెవరైనా
కూర్చోమంటూనే
కుశలమడిగేదాన్ని
పొరుగింటిముచ్చట్లైనా...
ఇరుగింటఅగచాట్లైనా
ఇంటింటి రామాయణాన్ని
ఇట్టే కనిపెట్టేదాన్ని
నేర్పుగ,ఓర్పుగ
తగవులుతీర్చేదాన్ని
తగినతీర్పులూ..ఇచ్చేదాన్ని
ఎవరిబాధలెన్నైనా..
ఏవేదనలున్నా..
ఓర్పుగా ..ఆలకించి
ఓదార్పునందించేదాన్ని
నేనెరుగని కధలేదు
నన్నెరుగని గడపలేదు
నాతోగడపనిదెవరూ..
నాతోపనిపడనిదెవరికని?
అందరినీ..అక్కునచేర్చుకు
లాలించేదాన్ని
పాలించేదాన్ని
ఆత్మీయతపంచేదాన్ని
అందరినీ ఆదరించి
చేరదీసి,సేదదీర్చేదాన్ని
అసలునేనూ..
అచ్ఛం అమ్మలాంటిదాన్ని
అసలుసిసలు
మానవసంబంధాలకు
పట్టుగొమ్మలాంటిదాన్ని
ఎవరూ..పదిలంచేయని
పాతబంగారాన్ని
రాతినేగాని,ఆపాతమధురాన్ని
నావిలువను,గుర్తించలేనిమీకై..
నిన్నటి మీజ్ఞాపకంగా
మిగిలిపోతున్నా...
ఉరుకులపరుగులతో
ఉక్కిరిబిక్కిరవుతున్న
నా బిడ్డల జీవనగమనం చూసి
బీటలువారి పగిలిపోతున్నా...
  *సాలిపల్లి మంగామణి( శ్రీమణి)* http://pandoorucheruvugatt

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి