పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, ఆగస్టు 2022, ఆదివారం

నేనిప్పుడు జీవనదిని

*నేనిప్పుడు జీవనదిని*

చుట్టూర ఎడతెరిపి లేని వాన
ఎడద మాత్రం ఎడారిచిత్రం
కౌముది పలకరించినా
కారుచీకటి కౌగలిలోనే
మాట మౌనంలో లీనమమయ్యింది
అక్కడ గుట్టలు గుట్టలుగా
పడివున్నాయిఆశలదొంతరలు
అయినా ఓర్పువాకిట్లో అలా నిలబడిపోయాను
వెలుతురు చినుకులతో తడవాలని
ఎడతెగనీ ఆరాటం
వికలమైన మనసు శకలాలు
నిట్టూర్పులగుండంలో మండుతున్నా
ఊపిరైతే ఆగిపోలేదు
ఎంతైనా ధరణినికదా
తలకు మించిన భారమైనా
తగ్గేదే లేదుమరీ
కాలం ఏరులై పారుతుంది
ఎదురీదే ప్రయత్నంలో
నా కలం రాతపని నేర్చుకుంది
వర్షించడానికే అలవాటు పడ్డ
నయనాలు అన్వేషించడం
అలవర్చుకొని సంధించే అస్త్రాలుగా
రూపాంతరం చెందాయి
కిల్బిషాలతో నిండిన సమాజ చిత్తురువు
ఆలోచన పర్వానికి తెరతీసింది
నిత్యం పరిభ్రమిస్తూనే పరిపక్వత
సాధించాను ,
ఆవేదన నిండిన ప్రతీసందర్భంలో
అనంతవిశ్వంకేసి దృష్టిని సారిస్తూ
ఆవరించుకొన్న శూన్యాన్ని
అంతరింపచేయాలని ఆర్తితో
అక్షరమై జీవిస్తున్నాను
అక్షయమైన జీవనకావ్యాన్ని
అక్కఱతో రచిస్తూ
అనంతమైన ఆనందాన్ని
ఆస్వాదిస్తున్నాను
గుండె భారం తగ్గింది
మూగబోయిన ఆ క్షణాలపై
చివరకు అక్షరమే నెగ్గింది
కాలాన్ని జయించాను
ఇప్పుడు చీకటినీ నేనే.. వెలుతురునూ నేనే...
ఖేదమైనా,మోదమైనా
ఆమోదమే
స్థితప్రజ్ఞత వరించింది
నేనొక జీవనదిని
ప్రవహిస్తూనే వుంటాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి