*రేపుమాత్రం నాదే*
కాలమా....కణకణమండే
నిప్పుల్లో నను కాల్చేసినా...
నే నిరాశలో కూరుకుపోను
నిగనిగలాడే అగ్నిబీజమై అవతరిస్తా..
నేనడిచే దారుల్లో రాళ్ళు,ముళ్ళూ
పేర్చి నువు పరీక్షించాలనుకున్నా...
ఉస్సూరంటూ..
నిస్పృహలో కూరుకుపోను
నిరాశతో....
నిట్టూరుస్తూనిలబడిపోను
లక్ష్యం చేరే తీరతాను
లక్షల ఆటంకాలున్నా....
నిన్నటి నా కలలన్నిటినీ
నిర్ధాక్షిణ్యంగా..నువు చిదిమేసినా....
రేపటివాస్తవమై,ఉదయిస్తూనేవుంటా, విజయానికి శంఖారావం
పూరిస్తూనే వుంటా...
నిన్న నాది కాకున్నా...
ఉన్నమాట చెబుతున్నా...
రేపు మాత్రం నాదే
ఓటమి గోడపై రాసుకున్న
గెలుపుసూత్రం మాత్రం నాదే....
లేదు,రాదు, కానేకాదనే
వదులైపోయిన పదాలకికచెల్లు
కనుచూపు మేరలో
రెపరెపలాడే విజయకేతనాన్నే
ఇక వీక్షిస్తుంటాయి నాకళ్ళు
మళ్ళీ,మళ్ళీ....
పడిలేచే కెరటం నా ఆదర్శం
పరుగులు తీసేకాలంలో
ఎదురీదే ప్రతి ప్రయత్నంలో...
చిగురించే మోడే నాకు మార్గదర్శకం
పునరుజ్జీవన మంత్రంలో...
కారుమబ్బులు కమ్ముకొస్తున్నా...
కటికచీకటి ముసురుకొస్తున్నా...
కాంతి రేఖకై అన్వేషిస్తూనే వుంటా....
నాకల కరవాలంచేబూని,కవినై
ఉదయించే రవినై....కలకాలం
జీవిస్తూనే వుంటా...
నేచిరంజీవినై.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి