పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, ఆగస్టు 2022, ఆదివారం

నేనిప్పుడు జీవనదిని

*నేనిప్పుడు జీవనదిని*

చుట్టూర ఎడతెరిపి లేని వాన
ఎడద మాత్రం ఎడారిచిత్రం
కౌముది పలకరించినా
కారుచీకటి కౌగలిలోనే
మాట మౌనంలో లీనమమయ్యింది
అక్కడ గుట్టలు గుట్టలుగా
పడివున్నాయిఆశలదొంతరలు
అయినా ఓర్పువాకిట్లో అలా నిలబడిపోయాను
వెలుతురు చినుకులతో తడవాలని
ఎడతెగనీ ఆరాటం
వికలమైన మనసు శకలాలు
నిట్టూర్పులగుండంలో మండుతున్నా
ఊపిరైతే ఆగిపోలేదు
ఎంతైనా ధరణినికదా
తలకు మించిన భారమైనా
తగ్గేదే లేదుమరీ
కాలం ఏరులై పారుతుంది
ఎదురీదే ప్రయత్నంలో
నా కలం రాతపని నేర్చుకుంది
వర్షించడానికే అలవాటు పడ్డ
నయనాలు అన్వేషించడం
అలవర్చుకొని సంధించే అస్త్రాలుగా
రూపాంతరం చెందాయి
కిల్బిషాలతో నిండిన సమాజ చిత్తురువు
ఆలోచన పర్వానికి తెరతీసింది
నిత్యం పరిభ్రమిస్తూనే పరిపక్వత
సాధించాను ,
ఆవేదన నిండిన ప్రతీసందర్భంలో
అనంతవిశ్వంకేసి దృష్టిని సారిస్తూ
ఆవరించుకొన్న శూన్యాన్ని
అంతరింపచేయాలని ఆర్తితో
అక్షరమై జీవిస్తున్నాను
అక్షయమైన జీవనకావ్యాన్ని
అక్కఱతో రచిస్తూ
అనంతమైన ఆనందాన్ని
ఆస్వాదిస్తున్నాను
గుండె భారం తగ్గింది
మూగబోయిన ఆ క్షణాలపై
చివరకు అక్షరమే నెగ్గింది
కాలాన్ని జయించాను
ఇప్పుడు చీకటినీ నేనే.. వెలుతురునూ నేనే...
ఖేదమైనా,మోదమైనా
ఆమోదమే
స్థితప్రజ్ఞత వరించింది
నేనొక జీవనదిని
ప్రవహిస్తూనే వుంటాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

26, ఆగస్టు 2022, శుక్రవారం

చినుకై రాలవే

*చినుకై రాలవే*

చినుకై రాలవే ఓ మేఘమా
చిగురాకు మేనుపై సొబగు సంతకమోలె
తళుకై జారవే కరి మబ్బుతునక
హరివిల్లు జతచేరి జలతారుమెలికవై
ముద్దమందార రేకుపై 
ముత్తెపు చినుకోలె
కడలి అంచులపైన కదలేటి అలవై
పైరుపావడా పైన పైడి మిసమిసవోలె
కొమ్మలపై,రెమ్మలపై  ఆణిముత్యానివై
జలజలా రాలవే జల్లుగా మేఘమా
నీలాల ఆనింగి ఆనందరాగమై
నేలమ్మ పులకించి
పురివిప్పి ఆడిపాడేలా...
చీటపటా రాలవే
చిరుగాలి పరదాల సవరించి
సరిక్రొత్తభావాలు పలికించవే 
కదిలించి  నామదిని స్పృశియించి
మధుర కవితగ మెరిసి మరిపించవే
మైమరపుల వీధులలో విహరించనీవే
నయనాలు మెరిసేటి నీ నీలిఛాయ
గగనాన మెరిసేటి సుతిమెత్తని సొబగు
మనసు కుంచెతో మలచి మురిసిపోనీవే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

25, ఆగస్టు 2022, గురువారం

అరుగును నేను

*అరుగును నేను*

వీధిఅరుగునునేను
పరుగులలోకంలో
కరిగికరిగి 
మరుగునపడిపోయాను
కనుమరుగైపోయాను
అంతస్ధుల మోజులో
అడుగునపడిపోయాను
అసలునేనూ..
ఊరుమ్మడిచుట్టాన్ని
ఊరుమంచి కోరేదాన్ని
ఊరడింపునిచ్చేదాన్ని
ఊసులాలకించేదాన్ని
ఊ..కొట్టేదాన్ని
ఊళ్ళోకొచ్చినదెవరైనా
కూర్చోమంటూనే
కుశలమడిగేదాన్ని
పొరుగింటిముచ్చట్లైనా...
ఇరుగింటఅగచాట్లైనా
ఇంటింటి రామాయణాన్ని
ఇట్టే కనిపెట్టేదాన్ని
నేర్పుగ,ఓర్పుగ
తగవులుతీర్చేదాన్ని
తగినతీర్పులూ..ఇచ్చేదాన్ని
ఎవరిబాధలెన్నైనా..
ఏవేదనలున్నా..
ఓర్పుగా ..ఆలకించి
ఓదార్పునందించేదాన్ని
నేనెరుగని కధలేదు
నన్నెరుగని గడపలేదు
నాతోగడపనిదెవరూ..
నాతోపనిపడనిదెవరికని?
అందరినీ..అక్కునచేర్చుకు
లాలించేదాన్ని
పాలించేదాన్ని
ఆత్మీయతపంచేదాన్ని
అందరినీ ఆదరించి
చేరదీసి,సేదదీర్చేదాన్ని
అసలునేనూ..
అచ్ఛం అమ్మలాంటిదాన్ని
అసలుసిసలు
మానవసంబంధాలకు
పట్టుగొమ్మలాంటిదాన్ని
ఎవరూ..పదిలంచేయని
పాతబంగారాన్ని
రాతినేగాని,ఆపాతమధురాన్ని
నావిలువను,గుర్తించలేనిమీకై..
నిన్నటి మీజ్ఞాపకంగా
మిగిలిపోతున్నా...
ఉరుకులపరుగులతో
ఉక్కిరిబిక్కిరవుతున్న
నా బిడ్డల జీవనగమనం చూసి
బీటలువారి పగిలిపోతున్నా...
  *సాలిపల్లి మంగామణి( శ్రీమణి)* http://pandoorucheruvugatt

24, ఆగస్టు 2022, బుధవారం

మౌనహంతకీ

*మౌనహంతకీ*

కలలు కూలిన శబ్ధం 
కలకలం రాల్చిన నిశ్శబ్దం
అవిసిపోతుంది ప్రాణం
అలసిపోతుంది జీవనం
బతుకు నాటకంలో
రాకాసి ఘట్టం
కనికరించదుగా 
ఈ కలికాలం చక్రం
ఊపిరి రెక్కలు విరిచేసిన
మౌనహంతకీ ...
మాననీయవే మనసు గాయాలను
బ్రతుకు సౌధం బ్రద్దలుచేసి
యుద్ధమెలా చేస్తావు
వాలిపోయిన మరణశయ్యతో
గరళసేవనమే 
పరిపాటై
మనసుగొంతుక మూగబోయింది
పగటినీ ఆక్రమించాయిగా
చీకటిరాత్రులు
ఎన్ని ఎండిన క్షణాలో
మనసునిలా మండిస్తున్నాయి
మనసు పొరలకు మరుపు పూసే
మంత్రముంటే  బాగుండునేమో
శరణు శరణు కాలమా ఇక
మరణమైనా ...మంచిదే మరి
మనిషిగా ఇక మహిని విడిచి
మధుర కథలా మిగిలిపోదును

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

23, ఆగస్టు 2022, మంగళవారం

తన్మయమే


మధురోహల తావులన్ని
తలచుకుంటె *తన్మయమే*
మధూలికలె మదియంతా
పరచుకుంటె *తన్మయమే*

ఎదలోపలి గురుతులన్ని
ఎడబాటుకు నెలవాయెను
మరుమల్లెల నీతలపులు
తరుముతుంటె *తన్మయమే*

నిరంతరం నీజతలో
విహరిస్తూ నాహృదయం
వెన్నెలింటి పానుపుపై
సోలుతుంటె *తన్మయమే*

కనురెప్పల వాకిలిలో
తనివితీర నీరూపం
ఆమదనుని కానుకగా
నిలుపుకుంటె *తన్మయమే*

తొలివలపుల మేఘమాల
కరుణించిన ఆతరుణం
*మణి* మయమై మనసుతోట
విచ్చుకుంటె *తన్మయమే*.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)* http://pandoorucheruvugattu.blogspot.com

21, ఆగస్టు 2022, ఆదివారం

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన ( వజ్రోత్సవ కవన భారతి ) సంకలనంలో....

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ హైదరాబాద్ వారి  ఆధ్వర్యంలో రూపొందించిన  (  వజ్రోత్సవ కవన భారతి ) సంకలనంలో....మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ... *శ్రీమణి*

19, ఆగస్టు 2022, శుక్రవారం

నీ తలపుల సందోహమే

*నీ తలపుల సందోహమే*

మందానిలము స్పృశించి
అరవిరిసిన మందారంలా
నీ మందస్మితమున మైమరచి
మనోజ్ఞమాయెను
నామానసతీరం
ఆ తూరుపు రాగం మీటిన
సింధూరంలా


నీ నిట్టూర్పు రాగం మాటున
మంత్రముగ్ధనైతి,
నా ఊహల తావులన్నీ
నీ నులివెచ్చని ఊపిరులై
మూసివున్న నా కనురెప్పలపై
మధురమాయె కదా
నీ అధరసంతకం
విరుల పరిమళాలు సైతం
వెదజల్లగ వెరచెనేమో..
ఎదఝల్లను నీ తలపుల
సుమగంధాలకు తాళలేక,
వివశనైతి ప్రభూ నీ ఎదవాకిట
విరహగీతి పాడుతూ
మదనమైతి ప్రియసఖుడా
మాటరాక మధువనిలో
నీ మధురోహల పరమౌతూ
సందేహం లేదు ప్రియా
ఇది నీతలపుల సందోహం
ఈ సఖి మోహం సాంతం
సమ్మోహన మురళీ...
సదా నీ పాదాక్రాంతం.
(కృష్ణాష్టమి శుభాకాంక్షలతో)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

18, ఆగస్టు 2022, గురువారం

నిన్ను కోరి

*నిన్నుకోరి*

హృదయమిలా పున్నమిలా విరిసినదీ నిన్నుకోరి
ఎదసవ్వడి  వేణువులో
నిలిచినదీ నిన్నుకోరి

మరపురాని నీగురుతులు మైమరపుల పరిమళాలు
మధుమాసపు కోయిలలా పిలిచినదీ నిన్నుకోరి

నులిసిగ్గుల సంతకాలు నులివెచ్చని నీతలపులు
నిద్దురచెడి నిట్టూరుపు విడిచినదీ నిన్నుకోరి

నిలువదుమది నీజతలో  పురివిప్పిన మయూరమే
అలవోకగ వలపుధార
చిలికినదీ  నిన్నుకోరి

మణిమనసే మధువనిగా మాధవుడా నీకోసం
 నినువలచిన రాధికగా మిగిలినదీ నిన్నుకోరి

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

16, ఆగస్టు 2022, మంగళవారం

పసిడి పచ్చ సోయగం

*పసిడిపచ్చసోయగం*

అచ్చతెలుగు
సోయగమంతా
పసిడిపచ్చచీరలో
అవతరించినేమో!
అవనిపై 
సౌందర్యమంతా
ఆమెపైనే 
గుమ్మరించినేమో!
ప్రకృతి లో
ప్రతి అణువూ 
పరవశమయి
పడతి వశమయి 
పల్లవించనేమో..
తరుణినుదుటన
అరుణారుణకిరణం
సింధూరమయి 
మెరిసెనేమో...
ఏటి కొలనుల్లోకమలాలు   
విరబూసెనేమో 
కమలాక్షి నయనాల,
ఎలతీగబోణి 
కురులపరిమళాన
  మరువం,మల్లియ
వెలవెలబోయెనేమో..
రాయంచ సొగసునంత  
ఈ అంచయాన సొగసుల్లో 
ఒలక బొసేనేమో!
భామిని సొగసును 
ఏమనివర్ణించాలని 
కవికవనంనివ్వెరపోగా...
ముదిత మోమును ముద్దాడిన
ముంగురుల దేభాగ్యమో
రమణి కరముల 
తాకి తన్మయమైన
 సుమములదేమి
 వైభోగమో..!
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)* http://pandoorucheruvugattu.blogspot.com

15, ఆగస్టు 2022, సోమవారం

నేనొక విజయగీతం రాసుకోవాలి

*నేనొక విజయ గీతం రాసుకోవాలి*

కాలమా... 
నేను ఏడవడం లేదు
కాసింత కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంతే
ఇదిగో ఇప్పుడే చీకటిని తుడిచేసి
వెలుతురు ముగ్గేస్తున్నా
శూన్యాన్ని కాల్చేసి
వెలుగులు పూయిస్తున్నా
కలికాలం పాత్రలో కలుషితమైన
కన్నీటిని ఒంపేసి
కాసిన్ని నవ్వులు నింపేస్తున్నా
పుస్తకంలో నాకొక పేజీ కావాలి
నేనొక విజయగీతం రాసుకోవాలి
మసలుతున్న రోజులన్నీ
మనోహరకావ్యంలా 
మలచుకోవాలని వుంది
పోగేసుకున్న నాలుగు అక్షరాలను
కలబోసి నాలుగుతరాలకు 
అందించాలి
విధి లాగేసుకున్న నాదైన క్షణాలకు
లక్షణంగా అక్షరరూపం ఇవ్వాలి
నా హృదయం చవిచూసిన
అనుభూతుల తాయిలాలను
అంతే భద్రంగా పదిలపరచుకోవాలి
పోగొట్టుకున్నదేమిటో...
పోగేసుకొన్నదేమిటో చక్కగా
లెక్క రాసుకోవాలి
నే చూసిన ఈ సమాజాన్ని
రేపటికై చిత్రించాలి
నే సంచరించిన
కాలగమనంలో నే సేకరించిన
అనుభవసారాన్ని ఆమూలాగ్రమూ
ఆ పేజీలో పొందుపరచుకోవాలి
ఆ చరిత్రకు పయనమయ్యేలోపు
ఈ ధరిత్రికి దూరమయ్యే లోపు,
అందుకే ఆపుస్తకంలో
నాకొక పేజీ కావాలి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

🇳🇪 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...🇳🇪

🇳🇪 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...🇳🇪

13, ఆగస్టు 2022, శనివారం

9, ఆగస్టు 2022, మంగళవారం

యుద్ధం

*యుద్ధం*

కత్తులుండవు కటారులుండవు
కుత్తుకలేవీ తెగిపడవు
యుద్ధభేరి మ్రోగదు
వింటినారి సాగదు
శత్రువు కంటికి కనబడడు
జరుగుతున్నది మాత్రం
భీకర సమరమే
అలనాటి మహాసంగ్రామంలా
గుర్రాలు ఏనుగులూ
రథాలూ సైనికసేనలు 
వుంటాయనుకొనేవు
అక్కడ ఆవరించింది
నరాలు చిట్లే ఉద్విగ్నత మాత్రమే
రక్తపుటేరులు ప్రవహించవు
అన్నీ కన్నీటి కాసారాలే
యుద్ధమంటే ఇరు వర్గాల
తలలూ తెగిపడితేనే గాదు
ఎదలోపల ఎడతెగని సంవేదనా యుద్ధమే
శ్రుతిమించిన మానసిక సంఘర్షణే అంతర్యుద్ధమై
పోరు శంఖాన్ని పూరిస్తుంటుంది
అప్పుడే అంతరంగం
కదనరంగమై కలవరపెడుతుంది
నిశితంగా పరికిస్తే ప్రతిఘటించే
ఆయుధాలన్నీ నిగూఢమైనవి నీలోనే
ఒక్కోసారి మనోదౌర్భల్యమే మనుగడకు
అంతిమవాక్యం రాస్తుంటుంది
వేధించే అంతర్మధనం
ఛేదించలేని వ్యూహమే
సాధించాలంటే స్థితప్రజ్ఞతయే సరియైన సాధనం.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

5, ఆగస్టు 2022, శుక్రవారం

వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో

*సిరిమహాలక్ష్మి*

సిరిమహాలక్ష్మికి 
సిరిచందనాలు
శ్రీమహలక్ష్మికీ
మరుమల్లెపూలు
వరలక్ష్మి పదములకు
సిరిమువ్వ అందియలు
ఆదిలక్ష్మీ నీకు
అమృతాభిషేకాలు
  ధాన్యలక్ష్మీ నీకు
పరమాన్న,పాయసాలు
  ధైర్య లక్ష్మీ నీకు
మణులు,మాణిక్యాలు
  గజలక్ష్మీ నీకు
రతనాలగాజులు
సంతానలక్ష్మీ నీకు 
సాష్టాంగ ప్రణామాలు
  విజయలక్ష్మీ నీకు
నిత్యనీరాజనాలు
  విద్యాలక్ష్మీ నీకు
విరుల వింజామరలు
  ధనలక్ష్మీ నీకు
షోడశోపచారాలు

అష్టలక్ష్మీ దేవులకు
అష్టదళపద్మాల
అర్చింతు...అత్యంతభక్తితో
అభయమ్మునీయవే
అమ్మలందరికమ్మ
  శ్రీ మహాలక్ష్మీ
  కటాక్షించగరావే
కరుణాక్షతలతోడ
శ్రీ కనకమహాలక్ష్మి.

ఈ  శ్రావణ శుక్రవార శుభదినం
అందరికీ శుభం జరగాలని
   ఆకాంక్షిస్తూ ..........
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
             విశాఖపట్నం
         

  

4, ఆగస్టు 2022, గురువారం

ఇదేమి సిత్రమో !

*ఇదేమి సిత్రమో !*

ఇదేమి సిత్రమో !
ఆ మదనుని 
మహిమాస్త్రమో!
నీ ప్రణయరసామృత 
సేవనవైచిత్రమో!
ముడి వేసినమనసుల 
మైమరపుల సరాగమో 
నీ జతలో నాకు  
గురుతు రాదు సమయం 
నీకోసం ఆఉదయం
నీకోసమే ఆసాయంసమయం
నీ సరసన నాహృదయం ,
నిత్య విహంగ వీక్షణము 
నిను చూడక క్షణమయినా...
  తరగదు ఆ తరుణం 
             
   *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
8522899458.
http://pandoorucheruvugattu.blogspot.com

3, ఆగస్టు 2022, బుధవారం

రేపు మాత్రం నాదే

*రేపుమాత్రం నాదే*

కాలమా....కణకణమండే
నిప్పుల్లో నను కాల్చేసినా...
నే నిరాశలో కూరుకుపోను
నిగనిగలాడే అగ్నిబీజమై అవతరిస్తా..
నేనడిచే దారుల్లో రాళ్ళు,ముళ్ళూ 
పేర్చి నువు పరీక్షించాలనుకున్నా...
ఉస్సూరంటూ.. 
నిస్పృహలో కూరుకుపోను
నిరాశతో....
నిట్టూరుస్తూనిలబడిపోను
లక్ష్యం చేరే తీరతాను
లక్షల ఆటంకాలున్నా....
నిన్నటి నా కలలన్నిటినీ 
నిర్ధాక్షిణ్యంగా..నువు చిదిమేసినా....
రేపటివాస్తవమై,ఉదయిస్తూనేవుంటా, విజయానికి శంఖారావం 
పూరిస్తూనే వుంటా...
నిన్న నాది కాకున్నా...
ఉన్నమాట చెబుతున్నా...
రేపు మాత్రం నాదే
ఓటమి గోడపై రాసుకున్న
గెలుపుసూత్రం మాత్రం నాదే....
లేదు,రాదు, కానేకాదనే
వదులైపోయిన పదాలకికచెల్లు
కనుచూపు మేరలో
రెపరెపలాడే విజయకేతనాన్నే
ఇక వీక్షిస్తుంటాయి నాకళ్ళు
మళ్ళీ,మళ్ళీ....
పడిలేచే కెరటం నా ఆదర్శం 
పరుగులు తీసేకాలంలో 
ఎదురీదే ప్రతి ప్రయత్నంలో...
చిగురించే మోడే నాకు మార్గదర్శకం
పునరుజ్జీవన మంత్రంలో...
కారుమబ్బులు కమ్ముకొస్తున్నా...
కటికచీకటి ముసురుకొస్తున్నా... 
కాంతి రేఖకై అన్వేషిస్తూనే వుంటా....
నాకల కరవాలంచేబూని,కవినై
ఉదయించే రవినై....కలకాలం
జీవిస్తూనే వుంటా...
నేచిరంజీవినై.      
   *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

1, ఆగస్టు 2022, సోమవారం

*మనసు మార్చుకో కాలమా*


ఎప్పుడు పెనవేసుకుంటాయో
మునుపటి సంతోషపు లతలు
ఎప్పుడు శెలవు తీసుకుంటాయో
ఈ కాటేసే వెతలు
కనికరించకుంటాయా...
ఆ కారుణ్యపుమేఘాలు
అంతరించకుంటాయా
ఈ అంతులేనిఉపద్రవాలు
మనసన్నదే లేని మాయదారి కాలం
మౌనముద్రలోనేనా ఇక కలలుగన్న వాసంతం
ఊపిరికే ఉచ్చుబిగిస్తే
మా మనుగడ మరణం అంచుల్లోనే
మనసు మార్చుకో కాలమా...
మానవాళి ఆశలు త్రుంచి
మహదానందపడడం భావ్యమా..
మనుజుడన్నదే లేని
మరుభూమిని ఏలాలని
నీ సంకల్పమా..
గుండె సముద్రం ఘోషిస్తుంది
ఊపిరి అలలను కూడగట్టుకొని,
నా కలానికి ముచ్చెమటలు పోస్తున్నాయి
ఈ కాలం చేసే కర్కశ గాయాలను
రాయాలని ప్రయత్నించినపుడల్లా,
ప్రాణాలన్నీ ఉన్నపళంగా
అస్తమించిపోతుంటే
ఎన్ని కన్నీళ్ళనని అక్షరీకరికరించను
లక్షల కల్లోలాలకు సాక్షీభూతంగా..
మిగిలేవన్నీ అశ్రుధారలే
పగిలేవన్నీ మా ఆశల దుర్గాలే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)* http://pandoorucheruvugattu.blogspot.com