పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఎంత మధురమీ నిరీక్షణ

*ఎంత మధురమీ నిరీక్షణ*

నేనెక్కడ., నేనెక్కడ
నా మది ఎక్కడ,
నా తనువెక్కడ
నేనున్నది నా చెలికాని నిరీక్షణలో....
ఆతని తలపుల ఊహల ఊయలలో ...
ఎమైంది నాకీవేళ
ఎందుకింత ఆనందహేల
పక్షుల కిలకిలారావాలు
 కోయిలమ్మ కువ కువలు
అరవిరిసిన కలువలు
పైరగాలి పిల్లతెమ్మెరలు 
అవధుల్లేని ఆనందంతో 
నాదరి చేరి నాసఖుడరుదెంచు
 కబురేదో చెబుతుంటే
నాఎదలో ఏదో చిరుసవ్వడి
వింత వింత ఊహలతో 
ఏదో వెచ్చని అలజడి
అదిగో..నీలాకాశం నిర్మలంగా
 నవ్వుతుంది నన్ను చూసి
నీ నిరీక్షణ ఫలించినదని
నీ సఖుని చేరబోవు ఘడియ అరుదెంచినదని,
నా తనువంతా పులకరించే
 తన్మయంతో అలవోకగ 
నాఅధరాలు ఆలపించే
 కొత్తరాగాలేవో 
నా చెలికాని నిరీక్షణలో ...
నిరీక్షణ కూడా మధురమే కదా....*శ్రీమణి*
(11 సంవత్సరాలక్రితమే రాసిన కవిత)

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

నారంశెట్టి బాలసాహిత్యపీఠం

నారంశెట్టి బాలసాహిత్యపీఠం
మరియు ఉత్తరాంధ్ర రచయితలవేదిక
ఆధ్వర్యంలో విజయనగరంలో
ఎంతో వైభవంగా నిర్వహించిన
ఐదవవార్షికోత్సవంలో భాగంగా
బాలసాహిత్య పురస్కార ప్రధానసభలో
నేను రాసిన అంతర్ముఖికవిత
ప్రశంసాపత్రానికి ఎంపికైన
సందర్భంగా అధ్యక్షుడు
నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారు,
గుడ్ల అమ్మాజిగారు,సినీగేయరచయిత
వడ్డేపల్లి కృష్ణ గారు,ఇతర
సాహితీప్రముఖుల చేతులమీదుగా
సత్కరింపబడిన శుభతరుణం
మీఅందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....
                               *శ్రీమణి*
🙏🌸🍃🌸🍃🌸🍃🌸🙏

తెలుగు వెలుగులు

అంతర్జాతీయ
మాతృభాషాదినోత్సవం
సందర్భంగా విజయనగరంలో
తెలుగుభాషా పరిరక్షణ సమితి
కుసుమంచి ఫౌండేషన్
సంయుక్తంగా నిర్వహించిన
తెలుగు వెలుగులు సాహితీ సభలో
అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ గారు, ,కుసుమంచి సుబ్బారావుగారు
ప్రముఖ సాహితీవేత్తల చేతులమీ

దుగా
సత్కారం అందుకొన్న
శుభ తరుణం మీఅందరి
ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..... *శ్రీమణి*
🙏🌸🌸🌸🌸🌸🌸🌸🙏

21, ఫిబ్రవరి 2022, సోమవారం

అమృతభాష

*అమృత భాష*

భాషెక్కడ గతిస్తుంది
భావమున్న ప్రతిగుండెలో
అమృతమై భాసిస్తుంది
మాతృ స్థన్యం సేవించిన
ప్రతి అధరంపై అక్షరమై 
నర్తిస్తుంది
మరుగునపడబోదెన్నడు
మాతృభాష మహోజ్వల ప్రకాశమై
విరాజిల్లుతుంది
ఎవరితరం ఎడదనిండిన
అమ్మ భాషను ఎడబాయడమెవరితరం
మమత నిండిన మాతృమూర్తిని
విడదీయడమెవరితరం
బడాయికోసమే ఆబాడుగ ఇల్లు
అవసరార్ధమే పరాయిభాషకు పట్టాలు
ఊపిరి నిండా తెలుగు అక్షరం
ఉగ్గబట్టుకునే ఆంగ్ల శిక్షణం
మరోభాషణం తప్పనిసరి
మనుగడదారుల్లో, మనసా వాచా
మమేకమైనది మాతృభాషన్నది నిజం
మనరుధిరంలో కలగలిసిన జీవమది
హృదయాల్లో ప్రవహించే జీవనది
మనగలమా మనం అమ్మను మరిచాక
జీవించగలమా మనం జన్మను విడిచాకా.
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో)

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అభిజ్ఞను కాను

అరక్షణమూ ...
ఆదమరచక
అక్షర యాగం చేస్తున్నా...
అనుక్షణమూ...అన్వేషిస్తూ..
అచ్చమైన తెలుగును
ఔపోసన పడ్తున్నా...
అభిజ్ఞను కానునేను
అతిసాధారణ అతివను
హృదయం చవిచూసిన
అనుభూతులను
అక్షరీకరిస్తున్నా...
ప్రకృతితో ప్రతీ
సౌందర్యాన్నీ
పదాలతో పదిలం
గావిస్తున్నా...
ఉదయించే
ప్రతి కిరణం
కవితనై
ప్రతిబింబిస్తున్నా...
సమాజానికి
నవఉషస్సునివ్వాలని
ఆకాంక్షిస్తూ...
నాలో మెదిలిన ప్రతిభావాన్నీ
ప్రతిగా...ప్రతిబింబిస్తున్నా..
పట్టాలు పట్టలేదుగానీ
మాతృబాషపై పట్టరాని
మమకారంతో....
కాలంతో పాటు నా కలాన్ని
కదిలిస్తూ...కవనసేద్యం
సాగిస్తున్నా...
                 *సాలిపల్లి మంగామణి (srimaani)*

17, ఫిబ్రవరి 2022, గురువారం

పూలతోట

*శ్రీమణి గజల్*

విరులతరుల సొబగులతో మురిసినదీ "పూలతోట"
ఏటిఝరుల గలగలతో తడిసినదీ "పూలతోట"
వానచినుకు ఒడిసిపట్టి మురిపెముగా ముద్దాడె
ధరణిపైన హరివిల్లుగ విరిసినదీ  "పూలతోట"
మధువనిగా మరులుగొలిపె పూలతావి మనోహరం
మధుపముతో సయ్యాటకు  పిలిచినదీ "పూలతోట"
రాచిలకల కిలకిలలకు రారమ్మని ఆహ్వానం
చిగురాకుల పందిరిగా వెలిసినదీ "పూలతోట"
ఆకుపచ్చ సోయగాన ఉదయరాగ సరాగమై
అంబరమణి శోభలతో మెరిసినదీ "పూలతోట".

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

16, ఫిబ్రవరి 2022, బుధవారం

గురుతుందా

వలపుపూల జడివానల
తడిసినదీ గురుతుందా
నిదురరాక నిట్టూర్పులు
విడిచినదీ గురుతుందా
తేనెలూరు ఘడియలన్ని
కరిగిపోక తరిమినవీ
తడియారని తలపులతో
మురిసినదీ గురుతుందా
నులివెచ్చని కలలన్నీ
నడిరేతిరి పరమాయెను
కవ్వింతల కలవరమై
నిలిచినదీ గురుతుందా
ప్రణయవీణ  మీటినపుడు
పరువమంత పరవశమే
తపనలన్ని తనివితీర
విరిసినదీ గురుతుందా
మనమనసులు మమేకమై
మధువనిలా మారువేళ
మణి ఖచితపు ప్రేమనగరి
మెరిసినదీ గురుతుందా.

సాలిపల్లి మంగామణి(శ్రీమణి)

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

*రేపటిఉదయం*


జీవన రాగాలన్నీ నిశీధి పాలే...
నిన్నలలో నిదురిస్తూ
నిర్లిప్తంగా జీవితాన్ని సాగిస్తుంటే..
రేపటి ఉదయాలన్నీ 
ప్రశ్నార్థకాలే???
నిర్వేదపు ఛాయలలో
నైరాశ్యపు తావుల్లో
నిత్యం కూరుకుపోతే,
ఆశకు ఊపిరిపోస్తే
అతి చేరువలోనే
ఆశించిన వాసంతం 
చిమ్మచీకటి పొరలను 
చీల్చుకు నెమనెమ్మదిగా
చిగురించే రేపటి ఉదయం
ఎన్నెన్నో నిశీధి రాగాలకు 
భరతవాక్యమేనేమో?
ఇక రాబోయేకాలం 
నిశి మసి అద్దుకున్నా
తెల్లారక తప్పదుగా....!
పెల్లుబికినా అగ్నికీల
చల్లారక తప్పదుగా...!
పరితపిస్తున్న మనసుకు
సరికొత్త పరిమళాన్ని అందిస్తూ
పరిగెత్తుకు వస్తుందిక...
వసివాడిన హృదయంలోకి
మిసిమివోలె కలిసొచ్చేకాలం.
మించి పోలేదు సమయం
చాలినంత సంతోషం
చెంత చేర్చగ వేచి వుందేమో...
చింతదీర్చే ఒక మంచితరుణం
వేసారక వేచియుంటే
తప్పక వినిపిస్తుంది 
వేకువ పట్టున
వెలుతురు రాగం
అలుపెరుగక‌ పయనిస్తే
అదిగో ...ఆవల ఆశలతీరం‌.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)* http://pandoorucheruvugattu.blogspot.com

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

*మనసు మార్చుకో కాలమా*

*మనసు మార్చుకో కాలమా*

ఎప్పుడు పెనవేసుకుంటాయో
మునుపటి సంతోషపు లతలు
ఎప్పుడు శెలవు తీసుకుంటాయో
ఈ కాటేసే వెతలు
కనికరించకుంటాయా...
ఆ కారుణ్యపుమేఘాలు
అంతరించకుంటాయా
ఈ అంతులేనిఉపద్రవాలు
మనసన్నదే లేని మాయదారి కాలం
మౌనముద్రలోనేనా ఇక కలలుగన్న వాసంతం
ఊపిరికే ఉచ్చుబిగిస్తే
మా మనుగడ మరణం అంచుల్లోనే
మనసు మార్చుకో కాలమా...
మానవాళి ఆశలు త్రుంచి
మహదానందపడడం భావ్యమా..
మనుజుడన్నదే లేని
మరుభూమిని ఏలాలని
నీ సంకల్పమా..
గుండె సముద్రం ఘోషిస్తుంది
ఊపిరి అలలను కూడగట్టుకొని,
నా కలానికి ముచ్చెమటలు పోస్తున్నాయి
ఈ కాలం చేసే కర్కశ గాయాలను
రాయాలని ప్రయత్నించినపుడల్లా,
ప్రాణాలన్నీ ఉన్నపళంగా
అస్తమించిపోతుంటే
ఎన్ని కన్నీళ్ళనని అక్షరీకరికరించను
లక్షల కల్లోలాలకు సాక్షీభూతంగా..
మిగిలేవన్నీ అశ్రుధారలే
పగిలేవన్నీ మా ఆశల దుర్గాలే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి