పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, మార్చి 2015, మంగళవారం

"పండూరు" మధుర రసం


అదేంటో ! 
ఆ నులివెచ్చని గాలి సుతారంగా ... నను తాకితే,
 నేను సాక్షాత్తూ మలయమారుతాన్నవుతా ... 
 ఆ నేల స్పృశించిన మరుక్షణం,
 నిలువెల్లా సంజీవనీ ప్రవాహమవుతా ...  సమ్మోహనమయి పోతా
 అమ్మ లాంటి కమ్మని రమ్మనే  
నా ఊరి పిలుపు ఝుమ్మని నా చెవిలో మారుమ్రోగుతుంటే ,ఏ చోట నేనున్నా 
మురిసి ,మైమరచి .... ముగ్ధ లాగ మారిపోతా .. 
పిల్లనగ్రోవిని విన్న రాధికలా ... 
నా పండూరు చెరువుగట్టు పై 
చల్లని పైరు గాలి పాడే తీయని పల్లియ పాటకు పల్లవి నేనే అవుతా ...... 
"పండూరు" పేరులోనే మధుర రసం నింపుకొని,
మాకొరకే వేచిచూస్తుంది మధు కలశంతో .. 
నాకు అమ్మంటే ప్రాణం  ,
నాన్నంటే  ప్రాణానికి ప్రాణం . 
మరి నన్నుకన్న నా  ఊరంటే నా ఆరో ప్రాణం . 
ఎన్ని మధురోహల పరిమళాలను పదిలంగా దాచిందో .. 
ఎన్ని గమ్మత్తైన జ్ఞాపకాల తాయిలాలు తనలో ఇముడ్చుకొందో ... 
అందుకొనే కాబోలు అంత అద్భుతంగా అనిపిస్తుంది . అమృతాన్ని తలపిస్తుంది . 
ఎదురైన మరుక్షణమే .. కన్నవారి కంటే ముందే కమ్మని తన కౌగిలిలో కరిగిస్తుంది . 
అమ్మతనం తన సొంతమేమో ... అనురాగం అనుపానమేమో .. 
వాత్సల్యం తో  హత్తుకొని తన వొళ్ళో తలవాల్చమని ఆహ్వానిస్తూ ..
తెగ సంభరపడిపోతుంది .
అణువణువులో అమృతాన్నే చవి చూపిస్తూ .. 
పుట్టినూరికి సాటి లేదని చాటి చెప్తుంది . మేటి ప్రణయ సీమలా ... 
అందరికీ అంతేనా ......... నన్ను గన్న నా పుట్టినూరు మట్టి మహత్తంటారా ... 

                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                     pandoorucheruvugattu.blogspot.in


28, మార్చి 2015, శనివారం

శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో




రెండు కన్నులు చాలకున్నవి నిండు పండుగ వేడుకైన  మీ కళ్యాణ వైభోగ శుభ ఘడియ వీక్షించ . ,వేడుకొందును ప్రభూ !వేయి కన్నులు ఒకసారి మాకొసగవయ్యా . రాజసమునొలికించు నీ దివ్య రూపం కాంచినంతనే మాకు కలతలేవి ?కలికి చిలకల కొలికి సిరి మహా లక్ష్మి మాయమ్మ సీతమ్మ పెళ్లి కూతురుగా తల వాల్చి నీ పాద మంజీరనాదాలనే గాంచి తన్మయమున తలమునకలయిపోయి ముగ్ధమొహన సౌందర్యాన్ని నీ కనుసన్నల కానుకిచ్చి ,అహో ఏమి భాగ్యమ్ము  మాది . భద్రచలేషుని పరిణయమ్మును గాంచ . నీలి మేఘాల కూర్చి నీ మేని వర్ణంగా మార్చేనేమో  ఆజానుబాహుడా  అరవింద నేత్రుడా అరక్షణము మాత్రమైనా కను రెప్పవాల్చమే . నీ సమ్మోహన రూపాన్ని కాన్చకుండా ....
ఆ ధరియిత్రి  పుత్రికకు ,పుణ్య చారిత్రికకు ,మేలిమి బంగారు ఛాయ మేనంతా చామంతి  పూమాల సొగసులేపాటి . నా యమ్మ వాల్జడ నాగినికి సాటి  , మా యమ్మ నేత్రాలు ఆల్చిప్పల పాటి . వెన్నెలను తురుముకొచ్చి నాయమ్మ కన్నుల్లో కుమ్మరించినట్టు . ఆ సల్లని చూపులో కొట్టొచ్చినట్టు   , ఆ ముగ్ధ మోహనాంగి మోమును గాంచి మా మేను పులకించ . నీవెట్లు మురిసితివో నీ నెచ్చెలిని చేరి . ఆ గగనమే  ఆకుపచ్చని పందిళ్ళు వేయగా .. ముల్లోకములు  భువి చేరి నీ పెళ్లి ఘడియకై పసిడి అక్షతలు చేతబూని , భూదేవి తల్లి పెళ్లి పీటముగా మారి  ప్రకృతంతాపరవశించీపోయి  చిలక పచ్చతోరణమ్ములు గా చేరి ,ఆనందరాగాల సన్నాయి మేళాల కోయిలలు కూయ. ఏమి సంభరమయ్య శ్రీ రామచంద్రయ్య . సృష్టి ముంగిట సుమ బాణాలు మెరియ . వడ పప్పు ,పానకాల
నాలుకలు నవనీత చవుల తో నాట్యమాడ , కల్యాణ రామయ్య ,అన్నుల మిన్న మా జానకమ్మ దోసిళ్ళ ముత్యాల తలబ్రాలు బోయ , చందనపు కాంతులే వెల్లివిరియ , ఆ శ్వేత వస్త్రాల శోభిల్లు నవ జంట . కన్నులకు పంటగా కానుకే కాదా !నిత్య నీరాజనాలతో అలరారు సీతా మనోభి రామా !మా కొరకు మీరుండ ... మాకేల వెతలు . మీ రాజ్యమున మేము చల్లగుండ .
                                                                                                           సాలిపల్లి మంగా మణి @శ్రీమణి


20, మార్చి 2015, శుక్రవారం

ఊరించే ఉగాది..... (మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలతో )



సిరిలక్ష్మి అందియలు ఘల్లు,ఘల్లనుచుండ , గృహలక్ష్మి గాజుల్ల కెంపుల్లు మెరియ,
తెలుగు ముంగిలిలో వెలుగుల్లహేల .  అరవిరిసిన రంగవల్లికల తోడ .. 
పారాడే పాపాయిల బోసి  నవ్వుల్ల  కళకళా ..  ఘుమ ,ఘుమలు గుప్పుమని పిండి వంటల తోటి 
ముద్ద బంతి తోరణాల గడప మురియంగా ... సరి కొత్త రాగాల చిరు కోకిలమ్మ మైమరచి పోగా  
లేత చిగురులు పల్లవించిన చిగురు  మావికొమ్మ  ..  పచ్చకల్యాణిగా .. పయనమయి రాగా ... 
పదహారణాలా పట్టు పావడా పలకరించేను పడచు సొగసులను ,ముగ్ధమనోహర  సౌందర్యమతిశయించంగా ..... 
 తేట తెలుగులమ్మ గలగలా  .. పరవళ్ళు తీసింది  నవ వత్సరంలోకి  , నిండైన  తెలుగుదనం నింగికెగిసేలా ... 
అరవిరిసిన సిరి మల్లికల సరాలు  పడతి కురుల చేరి  సందడి చేసేస్తుంటే  . సందె వేళ నుంచే మైమరపుల మత్తు జల్లి
మంచి ముత్యాల జల్లులా విరబూసి వేప పూవు రుచికి చేదు నైనా నేను ...  ధన్వంతరి కానా  యని ?
పులకరించి చెబుతుంది పుల్లని మామిడి . ఉగాది విందులలోకి  పసందు నేనే నంటూ ... 
తెగ వగలు పోతుంది వగరుకూడా . తనవల్లే మాధుర్యపు రుచి . చవులూరిస్తుందని .. 
చెరుకులమ్మ ఉరుకులూ తీస్తూ వచ్చేసింది . తన మాధుర్యం  మనపై కురిపించాలని . 
ఉప్పూ ,కారం కూడా ఉప్పొంగి దూకేసి  కష్ట ,సుఖాలను కావడి కుండలు అంటూ చెప్పకనే చెప్పేస్తూ.. 
షడ్రుచులూ మేళవించి ,మేటి  రుచులను మనపై కుమ్మరించి , 
 ఉగాది పచ్చడిలా ... అమృత నైవేద్యాన్ని అధరాలకు అందించి ,
పసిడి కాంతులను మన బ్రతుకుల్లో  వెలిగించి ,
 రానే వచ్చింది.. రసమయ ఉగాది  . ఇది ప్రేమైక జీవనానికి వారధి .  మన్మధ సంవత్సరాది .
 రానే వచ్చింది రమ్యమయిన ఉగాది . 
నవ వాసంతాన్ని తనతోనే మోసుకొచ్చింది  .,క్రొంగొత్త అనుభూతులద్దుకొచ్చింది . ఏ సిరి చందనాల పరిమళాలు రాసుకొచ్చిందో ...  మధు కలశం మనకోసం త్రెచ్చినట్లే ఉంది . ఈ మన్మధ సంవత్సరాది . 
 ఉత్తుంగ తరంగంలా .. 
వచ్చి తట్టి లేపింది .మిన్నంటే  వేడుకను  వెంట తెచ్చింది .  
వేయి పున్నముల వెలుగు రేఖలు ప్రతీ మోములో విరబూయిస్తుందేమో  ... 
సుఖ సంతోషాలను , ఆయురారోగ్యాలను ,సర్వ మానవాళికి శాంతి ,సౌఖ్యాలనూ తనలో నింపుకొస్తున్నట్లుంది .  .. 
ఆశావహ దృక్పధంతో 
ఆహ్వానిద్దాం ఈ  ఉగాదిని    ..... ఆడి ,  పాడి అంబరాన్ని తాకేటి ఆనంద సంభరాల  నడుమ . 

                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


                               
                                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 









19, మార్చి 2015, గురువారం

అమ్మను అయితే అయ్యాను,గానీ .... ????????


అమ్మను అయితే  అయ్యాను,గానీ ... 
ఏదో సంధిగ్ధంతో సతమతమవుతూనే ఉన్నా ...
 నా బిడ్డడు ,రాముని తలపించే  ఆదర్శమూర్తిగా అవతరిస్తాడో .. 
 రక్కసుడల్లె  కర్కశుడే  జనియిస్తాడో ?
కన్నతల్లికి, జన్మభూమికి   ఖ్యాతి పెంచే  రత్నమల్లె మెరిసిపోతాడో ..    పుడమి  తల్లికే కే పెను భారమయ్యే కరుడు గట్టిన  పాషాణమల్లే  పరిణమిస్తాడో , 
కన్నవారినీ ,కాలరాసే  కాల యముడికి ఊపిరోస్తానో .. 
కలియుగానికి ఆలవాలమవు   అపర రావణున్నే ఇలకు తెస్తానో ,
కీచకుడే పుడతాడో ,సమాజానికి పట్టిన  చీడపురుగుల్లో ఒకడికి నేనే తల్లవుతానో ,
ఒక మానవత్వమూర్తినే కని  తెగ మురిసిపోతానో .. 
మహాత్ముడు కాకున్నాగాని,మంచికి ఊపిరిపోసే మాన్యుడైతే చాలు .  
నలుగురితో  నారాయణ కాదు  . పలువురికోసం  ప్రాణాలిచ్చే ,
జన్మభూమికి వన్నె తెచ్చే , 
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి . 
ఆ యమ్మ కన్నబిడ్డ కనకమనిపించాలి .
కనకనే . కునుకే కరువయి  ఓ  అమ్మ పడే    ఆరాటం . 
పాపో ,బాబో తెలిపే పరికరాలు పుట్టెడు ఉన్నా , పట్టెడు మెతుకులు పెడతాడని ,
మంచికిమారుగా పుడతాడని ,చెప్పే యంత్రం ఉంటే బావుండుకదా !
 చీడ పురుగునుకడుపులోనే కాలరాసి ,
మానవత్వం పరిమళించే మాన్య బిడ్డకు జన్మనిచ్చి ధన్యమవదా ..ప్రతి కన్నతల్లి .   (సమాజంలో జరుగుతున్న అరాచకాలకు భయభ్రాంతురాలైన నిండు గర్భిణి ఆవేదన )
.నిజానికి పుట్టినప్పుడు ప్రతీ బిడ్డా పరమ పావనుడే ,ఏ బిడ్డా జన్మతః దుర్మార్గుడు కానేకాదు . 
 బుద్ధి నెరిగిన నాటి నుండే , వక్రమార్గపు వెతుకులాటలు .,వెర్రితలలు వేస్తున్న అక్కర లేని  ఆధునికతల ముసుగుల్లో , వింత వింత పోకడలు , మత్తుల్లోమునిగిపోయి  మతిభ్రమించి పరిభ్రమించేరు అభినవ కౌరవుల్లా .. 
అందులకే చెబుతున్నా .. 
తల్లులార మీ బిడ్డల భవితకు బంగారు తాపడాన్ని మీరే అద్దాలి . 
తల్లి తలచిన కాని కార్యము లేదు జగాన తనయుల తీర్చి దిద్దుటలో ..... రేపటి పౌరునిగా మలచుటలో .. 
ఉగ్గుపాలు , ముద్దు మురిపాలతో ,పాటు 
మానవత్వపు పాలు  రంగరించి పెంచి చూస్తే  ప్రతీ తల్లి . 
పెడత్రోవకెక్కడ తావుంది ?ప్రేగు పంచుకొన్న బంధానికి ?
మన సుసంపన్న సంస్కృతినీ ,సాంప్రదాయ రీతులనీ ,నైతిక విలువల్నీ, అక్షరాభ్యాసంతో పాటూ అవపోసన పట్టిస్తే ,
ఆణిముత్యమల్లే మారడా ... అమ్మా ,నాన్నల కనుల వాకిలిలో 
 కోరుకొన్న భవితవ్యం రంగవల్లిగా తారసపడదా  .  ఏ ఆధునికత ప్రభావమైనా ,పెచ్చు మీరిన సాంకేతిక విజ్ఞానమైనా ,తల్లి నేర్పిన మొదటి పాఠపు పరిజ్ఞానం ముందు పటాపంచలయిపోదా . దుష్టలోచన దూరమవదా ..  
 ఎన్ని యుగాలు మారినా ,ఒక కన్న తల్లి   సంకల్పిస్తే ,ప్రతీ బిడ్డ  పసిడి తుల్యం . 
సమాజ ప్రక్షాళనలో ప్రముఖ పాత్రధారిణి  మాతృమూర్తి .  నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలి ఒక తల్లే . 
అందుకే , తల్లి చూపిన సన్మార్గమే రేపటి కల్మష రహిత సమాజానికి వారధి . ప్రతీ తల్లీ సారధే ..  రేపటి భావి భారత పసిడి రధానికి .  మొక్కై  వంగనిది . మానై వంగునా .. అంటూ ఊరక కూచోక 
 నారులోనే మానవత్వపు నీరుపోసి ,మంచి మార్గం నిర్దేశిస్తే , నిక్కంగా కొంగు బంగారమే ,అమూల్యమైన బహుమానమే,అమృత ఫల నైవేద్యమే 
ప్రతీ బిడ్డా ..  పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )

                                                                                                                                                                        సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

12, మార్చి 2015, గురువారం

రసమయి






నీ నీలి ముంగురులు చిరు గాలికి నీ మోముపై నటనమాడినట్టు ,
నీ చెంపలపై విరబూసిన  కెంపుల మిలమిలలు మధుపాన్నే మురిపిస్తుంటే 
నీ పారాణి పాదాల సిరిమువ్వల సవ్వడికే గుండె జల్లు మంటుంటే 
తళుకులీనుతున్న నీ నవ్వులోని మిసమిసలు , 
చూసి వెలవెల బోతున్నాయి ఆ వెండి వెలుగురేఖలు 
ఏ నీలి మబ్బుల స్నానమాడినావో ,నవ పరిమళాలు గుభాళించె  నీవున్న  తావులెల్ల . 
పొద్దు పురుడు పోసుకొని కొలను కిచ్చిన కలువభామవా 
కిలకిలలూ ,చిన్నబోయే నీ పలకరింపులో 
నీ కులుకుల సొగసుకి పలుకు లేక నిలబడిపోయే ప్రకృతిలో ప్రతీ సౌందర్యం . 
,వింధ్యామర కూడా ,నీ చెంతనున్న చల్లని హాయికి మైమరచిపోయే 
కలలో కూడా కాంచని అందం ,ఇలలో చూసి నివ్వెరపోయా...  ఒక నిమిషం . 
నిజం చెప్పునీవెవరో .. ఆ నింగి నుండి భువికి దిగిన అప్సర నువ్వు కావా .. 
కవి తన భావుకతకు , తన సిరాలో సౌందర్యాన్ని కలగలిపి , రాసిన ప్రణయ ప్రబంధానివి కావా .. 
రవివర్మ  తనలో రంగులన్నీ ఒలకబోసి చిత్రించిన రసమయిసుందరి  కావా .. 

                                                                       సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

11, మార్చి 2015, బుధవారం

అన్నా .. తమ్ములకై .. అన్వేషణ




ఏదో తీరని వెలితి, అదో చవి చూడని అనుభూతి ,ఆ తీయని అనుబంధం అంటే నాకంతటి ప్రీతి .
 అన్నా ... అనే పిలుపంటే నాకు తెలీని ఆర్తి , నేనున్నాననే తమ్ముడంటే .. నను నేనే మరచేంత సంతృప్తి . 
చల్లని తూరుపు  గోదారమ్మ ఒళ్లో పుట్టి , మధురఫలం పండూరుకి గారాల పట్టినై 
ఆది దంపతుల లాంటి తల్లిదండ్రులకు  ముద్దుల పెద్దమ్మాయినై
 ఇద్దరు చెల్లెళ్ళ ముద్దుల సహోదరిగా .. అక్కా .. అను పదాన్ని అందంగా పూరించి . 
మెట్టినింటికి వన్నె తేగా అత్త మెచ్చిన కోడలిగా ,కర్తవ్యపాలనలో కృతక్రుత్యురాలినై ,
ఆడ పడచులకు  చిన్నదాన్నైనా    వదిన(అమ్మ)గా ,మారి 
అనురాగానికి మారు మా వారికి సహధర్మచారిణి గా  ,
నా ముద్దులపాపకి ,మురిపాలబాబుకి ,  జన్మనిచ్చిన అమ్మ  గా ,
పుట్టినింటి  నుండి పుత్తడి బొమ్మలా వచ్చి మెట్టినింటిలో పుడమి తల్లిగా మారి
 సమాజహితాన్ని  కాంక్షించే    వర్ధమాన  కవయిత్రి గా ,
 ఒక  పితృ సమానులవు మహోన్నత గురువు మెచ్చిన  శిష్యురాలిగా,
ప్రియ సఖినై , నా చిన్న నాటి నేస్తాలకు చిరు స్మృతిగా నిలిచి ,
అన్ని బంధాలలో  ,అనుబంధానికి ,అనురాగం రంగరించి
ఒక పరిపూర్ణ మహిళగా .. నను నేను మలచుకొన్నా .. 
ఒకే ఒక పిలుపు పిలవాలని తపించాను . సృష్టి లోని అనురాగాన్నంతా నా దోసిట నింపి 
అన్నా .. ఆ తీయని పిలుపు కై  నా జన్మంతా తపిస్తాను .
 నేనున్నాననే ప్రతీ స్నేహంలో అన్నాతమ్ముళ్ళనే ఆకాంక్షిస్తాను . 
నా మనసుకి ,నా ఆలోచనలకు ,జత కుదిరే ,
 ఏ మనిషైనా ,ఆదర్శమైన ఆ అనుబంధాన్ని అన్వయిస్తా ... 
ఈ అన్నా తమ్ములకై నే పడే ఆరాటం తప్పంటారా ?
ఎవరైనా .. సహోదర హస్తం అందిస్తారా ... అమూల్యమైన ఆ అనుబంధాన్ని  ,ఆ జన్మాంతం ఆరాధిస్తా 
ఎవరైనా .. ఉన్నారా అన్నయ్యలా ... కమ్మని చిన్ని తమ్ముళ్ళా ... మనసారా ఆహ్వానిస్తూ ... 

                                                                                               సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

10, మార్చి 2015, మంగళవారం

విజేత నీవే



ఓటమి అంటూ ఉస్సూరంటే  విజేత కాగలవా కలలోనైనా ...
అమావాస్య అంధకారాన్ని అధిగమించక   .. పున్నమి వెన్నెల వెల్లి విరి సేనా ..
చేదునూ  చవి  చూస్తేనే కదా .. మధురపు రుచి పదింతలై తోచేది
దూరం అంటూ ఆగి కూచుంటే , తీరం  చేరే దారేది.
కష్టనష్టాలు దాటిన నాడే కదా   , అంతు లేని సౌఖ్యపు హాయి
 కణకణ మండే నిప్పుల్లోనే    పచ్చని పసిడి నిగ్గు తేలేది .
విధి విషమంటూ .. దూషిస్తూ కూచుంటే  అదృష్టానికి దరి చేరేదేనాడు
అలుపెరుగక శ్రమియిస్తే .. సాధించలేనిదేముంది .  ఈ లోకాన
ప్రతీ క్షణాన్ని పదిలంగా వినియోగిస్తూ .. ఇంకేముంది చేయాల్సిందని
కాలాన్నే  .. నిలదీశావో ! నిను మించిన   ధీమంతుడు   ఉంటాడా ఉర్వీ తలంపై .
చేసిన పనిలో దైవాన్ని కాంచావంటే , నీ  కనుసన్నల్లో విజయపు సోపానం  .
                                                                      (నా మాటలతో ఏకీభవిస్తారా .. )                                                    
                                                                            సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
  

8, మార్చి 2015, ఆదివారం

అమరమైన అమ్మ మనసు




ఆ అమ్మను చూస్తే ఆ మాతృత్వానికే  కన్నీరు ద్రవీభవించింది . ఆకాశం  గుండె బ్రద్దలయ్యింది  . పుడమి తల్లిసైతం తల్లడిల్లి పోయింది .కరుడు గట్టిన తన కన్నబిడ్డల కోసం  ఆ పిచ్చి తల్లి పడే ఆరాటం చూస్తే.  .
ఆమె వైపు చూస్తుంటే  , ఆసాంతం ఏ హృదయం అయినా కలచి కలచి కళ్ళ వెంట  కళ్ళనీళ్ళ జలపాతమే ప్రవహిస్తుంది . .
 ఆ నిర్వికారపు చూపులు . చిద్ర మయిన  దుస్తులు , నిశ్చేతనయై , చుట్టూరా ముసురుతున్న మురికి జీవాలు ఆ శరీరాన్ని స్వాధీనపరచుకొని ,దొరికినంతా దోచుకొంటూ రక్త మాంసాలు పంచుకొంటూ ,స్వైర విహారం చేస్తున్నా !మునిపంట బాధనణచుకొనే పాటి సమయానికి కూడా తావులేదు . అలసిఉన్న ఆ అమాయకపు అమ్మ హృదయంలో , తొమ్మిది మాసాలు మోసి రక్త మాంసాలు పంచి ,పురిటి నొప్పులను తృణప్రాయముగా నెంచి శతకోటి నోముల పంటయని , మునిపంట బాధనణచి  కన్నబిడ్డలు.  కన్న తల్లిని  కాటికి  కూడా సాగనంప తీరిక లేని కాఠిన్యమూర్తులు.  కారుచీకటిలో , మోసుకొచ్చి నడివీధి కుప్పతొట్టి దరి  కూర్చుండబెట్టి రెండు చక్రాల కుర్చీ సాక్షిగా .. అరక్షణం లో వస్తానంటూ , కారునెక్కిన కన్నబిడ్డలు ఆరు నెలలకూ కానకుంటే కమ్మనైన అమ్మతనం మాత్రం ఆదమరచక చూస్తేనే ఉంది .  ఆ కన్నబిడ్డల రాక కోసం ,ఏ మానవత్వమున్న హృదయం అయినా చేరదీసి సేద తీర్చుదామన్నా !అమ్మను కానక తనబిడ్డలు తలమునకలవుతారని ఆ పిచ్చి తల్లి ఆరాటం . చావు బ్రతుకుల పోరాటంలో చివరి మజిలీ చేరుకొన్నా .. ఆ  తల్లి ని  చూసిన ప్రతీ బిడ్డా చలించి పోతున్నా !కన్న బిడ్డలే కాలయములై  కారు చీకటికి బలి ఇస్తే , ఆకలి దప్పులు మరచినా కడుపు తీపిని మాత్రం కడ దాకా దాచే ఉంచింది . పేగు బంధపు బంధనాలను త్రెంచుకోలేక . దారి మరచి పోయారో , లేక ఈ అమ్మ పైన దిగులుతో రాలేనంతగా సుస్తీ బారిన పడ్డారో !పాపం నా బిడ్డలు .ఏ దారిన మీరెల్లినా ! నా వాళ్ళు జాడ కనిపిస్తే ఈ అమ్మకప్పగించండి . అందాకా కనురేప్పేయక కాచుకొనే ఉంటా !కదలలేని నేను . మృత్యు వొచ్చి కభళిద్దామనుకొన్నా !నా బిడ్డల చూసే వరకు నువు వేచే ఉండాలంటూ మొరాయిస్తానంటూ ..ఆ అభాగ్యపు అమ్మ  నీరెండిన కన్నుల్లో ,  కన్నబిడ్డల ప్రతిబింబం పదిల పరచుకొని వదిలేసింది . వదులై పోయిన ఈ అమ్మ జన్మను, సహజమైన అమ్మతనాన్ని , అనురాగాన్ని అమరం చేస్తూ .. సమరం చేయలేక నేటి పైశాచిక తనయుల పై , తనువే చాలించింది . అదే నడిరోడ్డుపై అదే ఎదురుచూపుల ఎండమావిపై ( దండం పెడతామన్నా దయచేసి .... కన్నవారిని మాత్రం కడదాకా అక్కున చేర్చుకోండి )                             అభ్యర్ధిస్తూ 

                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి