పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, జులై 2022, మంగళవారం

నేనొక నిశ్శబ్దాన్ని

*నేనొక నిశ్శబ్దాన్ని*

నేనొక నిశ్శబ్దాన్ని
అనంతమైన ఆకాశాన్ని 
అనుక్షణం అన్వేషిస్తూ
అవని మూలాన్ని అవలోకిస్తూ
అలా శూన్యం కేసి చూస్తుంటాను
నిన్న రాతిరి రాల్చిన కలలకు
రేపటి ఆశల తీరానికి దూరమెంతని
ఆరా తీస్తుంటాను
సుఖదుఃఖాలకు ఆవల
నిలబడి కావలి కాస్తూ
అలౌకిక ఆనందంలో
ఆదమరచిపోతుంటాను
మాటలకు మౌనానికి మధ్య
అంతరాన్ని అంచనా వేస్తూ
ఆ అంతరాన్ని అమాంతం
భర్తీ చేస్తూ నిదానంగా
నిశ్శబ్దంగా మారిపోతాను
నాలో పురుడు పోసుకున్న
భావాలు పూర్ణత్వాన్ని
ఆపాదించుకుంటాయి..
  జీవనగమనంలో
లక్ష్యం నిర్ధేశించేది నాలోని
నిగూఢత్వమే
గమ్యం గోచరించేది కూడా
నా సమక్షంలోనే
మనోనిశ్చలతను చేకూర్చి
మనసుకు సాంత్వన నిస్తూనే
పరమపథానికి దారులను
 అతిచేరువ చేసే సాధనం నేను
నాలో తెలియని మృధుత్వం
మానవజీవితంలో
ఎన్నో జటిలమైన
 సంఘర్షణలకు సైతం 
సరైన సమాధానం 
మనిషికి,మనసుకూ కూడా
మహత్తరమైన వైద్యం అందించే
ధన్వంతరిని..
నిశిలా అగుపిస్తా గానీ
అసలైన మిసిమి నేను
అంతర్దృష్టితో అన్వేషిస్తే
దేదీప్యమానంగా
సాక్షాత్కరిస్తా..
నిదానంగా పరికించి చూస్తే
ప్రతి మనసుకు
పరిచయమే అక్కరలేని
నిర్వచనాన్ని
నేనొక....నిశ్శబ్దాన్ని.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

4, జులై 2022, సోమవారం

ఎదురీత

*ఎదురీత* 

బ్రహ్మ రాసిన 
రాతలకన్నా...
బ్రహ్మాండంగా
గీతలు గీసుకుంటున్నా....
దేవుడిచ్చిన వెలితితో
బ్రతుకు బాటలో...
వెనుక పడుతున్నా.....
వెలుతురు కోసం 
వెతుకుతునే వున్నా...
లేని కాళ్ళను అనునిత్యం
అతుకుతునే వున్నా...
అవహేళన పాలు చేస్తున్న
అవయవలోపాలను సైతం
అవలీలగా అధిగమిస్తున్నా
నాచేతులతోనే...
విధి విషమంటూ 
దూషిస్తూకూచోలేక
తలరాతకు ఎదురీతను
నేర్చుకుంటున్నా....
నడవలేని నాకాళ్ళకు
నమూనాచిత్రం 
గీసుకుంటున్నా
తీరని నా ఆశను
నెరవేర్చు కోవాలని
 ఆరాటపడుతున్నా....
కాళ్ళు లేవుగానీ....
నేను కళాకారుణ్ణి మరి
కలసి రాని కాలమని
అలసి సొలసిపోతే ఎలా
కన్నీళ్ళే మైనా...
కాళ్ళను తిరిగిస్తాయా...
తలరాతను తిరగేస్తాయా..
అందుకే తీరికగా కూచుని
తీరని ఆశను సైతం 
తనివితీరా చిత్రిస్తున్నా....
విధి ఆడిన చిత్రమైన
నాటకంలో చక్కగా నడుస్తూ
నటిస్తున్నా...
నా వంతు పాత్రకు 
నేనైతే న్యాయమే చేస్తున్నా...
జాలి చూపులు మాత్రం వద్దు
జేజేలు పలకండి చాలు
నాలోని కళాకారునికి
కాళ్ళు తోడులేని నాచేతుల
నైపుణ్యానికి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*.

3, జులై 2022, ఆదివారం

నిరీక్షణ

*నిరీక్షణ*

నినుచేరేదారిని
సరళంచేస్తే...
గరళాన్నయినా
చిరునవ్వుతో
సేవించేస్తా...
నిను వీక్షించగ
కనులకు భాగ్యంవస్తే
ఆపై
అంధత్వాన్నయినా
ఆనందంగా ఆహ్వానిస్తా...
ఒకపరి నీమది గెలుచుటకై
నిరంతరం నేను ఓడిపోతా...
నా ప్రణయం తెలుపగ 
నా అధరాలకు భాగ్యమునిస్తే
ఆపై మూగబోయినా
నే మురిసిపోతా...
నా కన్నుల పొదరింటికి నువ్వొస్తానంటే
నూరేళ్ళైనా కనురేప్పేయక  
నిరీక్షిస్తూనే  ఉంటా !
నమ్మరాదా కృష్ణా.. 
ఈ రాధ ఆరాధనని..
నీకై  తెల్లవారుతోంది ఉదయం 
నీ కోసమే ఆ సాయం సమయం
కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని
లేకుంటే  కరిగిపొమ్మని 
నా జీవితాన్నే నే శాశిస్తా !
నీ జత లేదంటే  శూన్యం కమ్మని,
నువ్వొస్తావనే  
నే జీవిస్తున్నా !
నీకోసమే నిరీక్షిస్తున్నా..
నిద్దురలోనూ  మేలుకొని....

 *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

1, జులై 2022, శుక్రవారం

ప్రత్యక్ష నారాయణుడు

*ప్రత్యక్ష నారాయణుడు*

వైద్యుడా అభివందనం
ప్రాణాదాతా నీకు ప్రణామం
విరామమెరుగని
విరాట్స్వరూపా
వినమ్రపూర్వక నమస్సులివిగో
వైద్యో నారాయణో హరిః
వైద్యుడే మనపాలిట ప్రత్యక్ష 
నారాయణుడు
ఊపిరి పోసింది ఆ దేవుడైతే
ఉసురును నిలిపింది వైద్యుడే
ఆ అపరబ్రహ్మ ఆపన్నహస్తమే
మనను ఆదుకునే అపర సంజీవని మంత్రం
అనారోగ్యమగు జీవితాల్లో
ఉదయించే అంశుమాలి వైద్యుడే
నిరంతర శ్రమజీవులు
నిజమైన దేవుళ్ళు 
ఓర్పు సహనంలో ధరణిమాత
ఆత్మజులు వారు
స్వాస్థ్యము చేకూర్చుటలో 
ధన్వంతరి వారసులు
అవిరళకృషీవలురు 
అలుపెరుగని ఋషీశ్వరులు
కరోనా కదనరంగంలో దూకిన
మొట్టమొదటి సైనికులు వీరే
ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నంలో
తమ ప్రాణాలను సైతం 
పణంగాపెట్టిన నిస్వార్ధసేవకులు
ఏమిచ్చి తీర్చుకోగలం
ఆ ప్రాణదాతల ఋణం 
వైద్యో నారాయణో హరిః అని
శిరస్సువంచి
ప్రణమిల్లడం తప్ప .
(వైద్యుల దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

29, జూన్ 2022, బుధవారం

28, జూన్ 2022, మంగళవారం

మేలైన తరుణమనీ

*మేలైన తరుణమనీ...,*

మేలుకొంటి వేకువనే
మేలిమి బంగరుసామిని
మేలుకొలుప
మేలైన తరుణమనీ...,
మరులు గొలిపె మాధవునికి
మరుమల్లెల మాలనల్లి
మనసారా ... మోకరిల్లి
మదిలో మెదిలే మధుర
భావాలను...
మదన గోపాలుని
పాదాలపై పదిలంగా పరిచానంతే..,
మువ్వగోపాలకృష్ణా...యని
ముదమారా...పిలిచానంతే...,
ప్రణయ సుధా మాధవా...అని
ప్రియమారా...తలచానంతే...
తనువు,మనసూ తదేకమై
తన్మయమై
తన తలపులు లోగిలిలో
తలవాల్చుకునిదురించిననాకు,
మరుమల్లియ మాల...విరిసిన
నా కవితల పూమాలై
కనుల ముందు సాక్షాత్కరించింది...
కమలాక్షుడిలా కటాక్షించె 
కాబోలు..... కడుచిత్రంగా....

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
విశాఖపట్నం.
8522899458.

27, జూన్ 2022, సోమవారం

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 
ఎంతో వైభవంగా నిర్వహించబడిన 
కవి సమ్మేళనంలో పాల్గొని శ్రీయుతులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు,
ప్రముఖ సినీగీతరచయిత 
శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, 
సాహితీ ప్రముఖులు శ్రీ బిక్కికృష్ణగారు మరియు సంస్ధ గౌరవాధ్యక్షులు డి.వి.రాజగోపాల్ గారు,
ఇతర ప్రముఖుల ఆశీస్సులతో సత్కరించబడిన శుభతరుణం 
మీ అందరి అమూల్యమైన 
ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

శ్రీమణి గజల్

త్రిస్రగతి        6/6/6/6

నీలిమబ్బు పులకరించి
కురిసినదీ  వానచినుకు
విరితావుల పలకరించి
మురిసినదీ వానచినుకు

ఆకాశం చేస్తున్న
అభిషేకం బాగున్నది
ఆకుపచ్చ సంతకమై
మెరిసినదీ వానచినుకు

తొలకరిలో తడవాలని
మనసుకెంత ఉబలాటం
మైమరపుల పరవశాలు
చిలికినదీ వానచినుకు

చిటపటమను సవ్వడితో
మధురమైన సంగీతం
చిరుగాలిని పెనవేసుకు
ఉరికినదీ వానచినుకు

ధరణీమణి చరణాలకు
చిరుజల్లుల సత్కారం
అణువణువున అమృతమై
ఒలికినదీ వానచినుకు.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

26, జూన్ 2022, ఆదివారం

*మత్తు-గమ్మత్తు*

*మత్తు-గమ్మత్తు*

ఊది ఊది....ఊపిరి
ఆగిపోయేవరకు పీల్చేసై
గుట్టలకొద్దీ పొగాకుకట్టలు
లొట్టలు వేస్తూ కాల్చేసై
జల్సా చెయ్,బలి చేసేయ్, బంగరుబ్రతుకును,బండలుచేసై
వెలిగించు రింగురింగులుగా.....
పొగ గుప్పించు
ఎలాగూ... రేపటి నీ బ్రతుకు
ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువేలే
పొగచూరిన,ఊపిరితిత్తులెలా
మసిబారి పోతేనేం?
మాడి మసైపోతేనేం..?
నీ ఆయువు ఆవిరయితేనేం..?
నిండు జీవితం నీవల్లే
నిప్పులకొలిమయితేనేం..?
నీ ఇల్లాలి తాళిచెల్లిపోతేనేం ?
నీ బిడ్డల తలరాతలు
తలక్రిందులయితేనేం?
నిన్ను కన్నవాళ్ళ
గుండె బ్రద్దలయితేనేం?
గుప్పుగుప్పు మంటూ
ఆ గబ్బును గబగబా..
ఆబగా లాగించెయ్
మత్తులోని గమ్మత్తును అమాంతం ఆస్వాదించెయ్
నువ్వు కాల్చేప్రతీ సిగెరెట్టు,
ప్రతీక్షణం,నీలో కణకణాన్ని
కణకణమని భస్మంగావిస్తున్నా
నీ ఉసురుతీసేందుకు
ముసురు గాసుకొస్తేనేం..?
కాటికి దగ్గర దారి... 
కాలయముడితో
కాలక్షేపమే సరాసరి,
నీ వ్యసనానికి ప్రతిఫలంగా
నీవొళ్ళు,నిన్నునమ్ముకొన్నవాళ్ళ 
ఆశలకు నీళ్ళొదిలేసేయ్,
నీ తనువు ఛిద్రమై
బ్రతుకునిరర్ధకమై,నిత్యం,
మృత్యుకేళీవిలాసంలో
ఊగిసలాడుతూ...
నీకు నీవే భారమై
నీవారికీ..పెనుభారమై 
గమ్మత్తులకెగబడి మత్తుల్లో 
తూలుతూ మరమత్తు 
చెయ్యలేని మరబొమ్మగా
మారి,మిగిలి తగలబెట్టు
నీ వాళ్ళ  నిండు భవితను
నిర్దాక్షిణ్యంగా ...
(గమ్మత్తులు చూడాలని
మత్తుల్లో తూలుతూ
మరమ్మత్తు చేయలేని
మరబొమ్మై మిగులుతున్న
నేటి జనావళిపై వ్యంగ్యంగా
రాసిన కవిత)
(మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
దయచేసి మత్తుమందులకు
బానిసలవ్వద్దని అభ్యర్థిస్తూ...)       
*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*

25, జూన్ 2022, శనివారం

నీమీదొట్టు

*నీమీదొట్టు*

ఝుమ్మని ఎద పలికినట్టు
లెమ్మని కల కదిలించినట్టు
రారమ్మని పిలిచినట్టు
కమ్మని కబురొచ్చినట్టు
నే ఉన్నా లేనట్టు
లేకున్నా ఉన్నట్టు
ఊపిరాగుతున్నట్టు
ఊసులేవొవిన్నట్టు
నీ మీదొట్టు.నే వున్నా లేనట్టు
నిను చూడక నే లేనన్నట్టు
వెన్నెల దిగబోసినట్టు
వన్నెలొలకబోసినట్టు
కన్నులెదుట పూదోటే
కావలి ఉన్న ట్టు,ఏవేవో కానుకలు కావాలన్నట్టు....,
అధరాలపై నీ పేరే
మధుర మాయినట్టు
మది లోపల
మధురోహల మదనమాయినట్టు
తడవ,తడవకూ తడబడి,అణువుఅణువులో నీవని పొరబడి‌,
నిద్దుర మొదలే కొరవడి,తత్తరపడి,బిత్తరపడి
చిత్తరువయి నిలుచున్నా.....
నీ మీదొట్టు...నే వున్నా లేనట్టు,
నిను చూడక నే లేనన్నట్టు.....!

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

24, జూన్ 2022, శుక్రవారం

ఉదయం దినపత్రికలో

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత
మీ అమూల్యమైన స్పందన కోరుకుంటూ...*శ్రీమణి*
🙏🌹🌹🌹🌹🙏

22, జూన్ 2022, బుధవారం

మధురముగాదా

*మధురము గాదా*

ప్రియవదనా...!
నిను వలచిన నా హృదయం 
సుతిమెత్తని ఒక ఉదయమై
నీ చరణాలను స్పృశించినపుడు,
నిరతం నీ స్మరణలో తరించే
నాఅధరాలు మకరందపుఝరులై
ఆ ప్రణయ సుధా వాహినిలో 
పరవశించి ప్రవహించినపుడు,
నా అందెల రవళి,నీమోహనమురళి
శ్రుతిలయలై,
 సమ్మోహనరాగమాలపించినపుడు,
నా నీలి నీలి కురులను చేరి 
నీకరములు అలవోకగ
అరవిరిసిన వలపుల విరులల్లినప్పుడు,
వెన్నెలంటి నీ ఎద పానుపుపై
సేదదీరి నామనసంతా మైమరపుల
మదనమాయినపుడు,
కలవరమైన నా మదిలో 
నీరాక   "కల"వరమై కవ్వించినపుడు
నా మానసతీరాన్ని నీ తలపులు
మలయసమీరాలై పలకరించినపుడు
నా చెంపల్లో విరబూసిన కెంపుల్లో
నీ రూపం సాక్షాత్కరించినపుడు
ఈ కలువకన్నియ కన్నుల నిండిన 
వెన్నెల చంద్రుడు నీవై
మేనక మెరుపుకి తడబడిపోయిన 
ఆ ఋషీంద్రుడు  నీవై
నా వలపుల సడిలో తొలకరి జడివై 
సరసమాడినపుడు,
ఆహా...మధురము గాదా ఆతరుణం!
ఎదురై రాదా యమునా తీరం!
వేణు మాధవా... వలచిన నీ నెచ్చెలి 
మనసంతా మధురోహలు విరిసిన పూదోటే అదిగో మన ఆశల బృందావని
అదియే మన మది దోచిన ఆ మధువని. 

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*