మెరిసేమేఘం
సందేశం విని
కురిసేచిటపట
చినుకులకనుగొని
రమ్మని,రారమ్మని
పిల్లతెమ్మెర
కమ్మని కబురంపింది
కొమ్మల్లో కోయిలమ్మకు,
కొత్తరాగమాలపించమని,
ఆజడివానల
జతులాడగ
హొయలారబెట్టుకుంది
పురివిప్పి
ఆమయూరం
వయ్యారంగా...
ముసిరిన మేఘమాల
సోయగాలు చూసి
మూగబోయింది
ముద్దబంతి పూలరెమ్మ
సంతసానసంతకాలు
చేసింది...సాగరతీరంపై
ఆమలయసమీరం
ఆ మధుర ఘడియలు
తడిమి చూసి
తన్మయమై
తరుణీమణి
మది మకరందం
చవిచూసింది
మధురోహల
పరిమళాల
మైమరపులలో...
శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
24, ఏప్రిల్ 2018, మంగళవారం
మేఘసందేశం
22, ఏప్రిల్ 2018, ఆదివారం
జాతీయయువ సేవాపురస్కారం అందుకొన్న శుభసందర్భం
ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ & కల్చరల్ కమీషన్,
ఆంధ్ర సారస్వత పరిషత్తు మరియు
తెలుగు రక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో
"జాతీయ యవసేవా పురస్కారం" 2018 అందుకున్న శుభతరుణం
వేదిక: జిల్లా పరిషత్ సమావేశ మందిరం, విశాఖపట్నం.
17, ఏప్రిల్ 2018, మంగళవారం
కకావి"కలం"
కరం కదలకుంటుంది
కలం కదలనంటుంది
కల అయితే బావుణ్ణని
గుండె కలవరిస్తోంది
కకావికలమవుతోంది
కనులు మూసినా
కనులుతెరచినా
చిన్నారి ఆసిఫా
కన్నీటిప్రతిరూపం
కడుదీనంగా
కదలాడుతుంది
నిన్నటి
కటికచేదువిషమింకా
మ్రింగుడుపడకుంది
ఎంతటి అమానుషత్వం
ఎంతటి ఆటవికత్వం
ఎంతటిఅనైతికత్వం
మానవత్వం మంటగలసినక్షణం
మనిషి మన్యజంతువుగ
మారిపోయిన వైనం
రక్కసిమూకల కర్కశక్రీడలో
ముక్కలుచెక్కలైన
ముక్కుపచ్చలారని బాల్యం
కనులారా కాంచి కూడా
కదలిరాని ఆదైవం
సభ్య సమాజం తలలు
పాతాళానికి దించుకొనే
అతిభయానక క్షణం తలచుకొంటేనే తల్లడిల్లిపోతోంది
ప్రతీ కన్నతల్లి హృదయం
ఆడబిడ్డకు రక్షణలేని
రాకాసి సమాజంలో
జన్మనివ్వాలంటే
అమ్మ జడుసుకుంటుంది
కంటికిరెప్పలా
కాచుకొంటున్నా
వెంటాడివేటాడి
కాలనాగులై కాచి
కాటేస్తుంటే
కన్నులెదుటే
కన్నబిడ్డల
ఖననం గావిస్తుంటే
భగభగమండే
కడుపుకోతకు
బదులేంచెప్పాలి
మూణ్ణాళ్ళ ముచ్చటై
ముగిసిపోతున్న
వసివాడినపసిపాపల
కన్నీటికధనాలకు
ఏంచేసి
ప్రాయశ్చిత్తంచేయాలి
ఆ కామాంధుల
నట్టనడివీధిలో
నిలబెట్టి ఉరితీయాలా
బ్రతికుండగానే
భగభగమండే నిప్పుల్లో
తగలెట్టాలా...
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
13, ఏప్రిల్ 2018, శుక్రవారం
*అమ్మ* కన్నీటి *చెమ్మ*
*అమ్మ* కన్నీటి *చెమ్మ*
ఆమాతృమూర్తికేంతెలుసు..?
తనుతరిమివేయబడ్డానని
కన్నకడుపుకేం తెలుసు...?
కన్నబిడ్డలు కటికపాషాణాలని
కలనైనా అనుకొంటుందా..?
ఎన్నో కలలుగని కన్న తనయులే వీధికీడుస్తారని
నడిరాతిరి నడివీధికుప్పతొట్టికి
తనను కాననుకిస్తారని
అరక్షణంలో వస్తానని
నమ్మబలికి ఆమడదూరంలో
ఆరుబయటే వదిలేసి
వెనుదిరిగి చూడకున్నా...
నీరెండిన కళ్ళతో
నిరీక్షిస్తున్న
ఆ అమ్మనుచూస్తే
అమ్మతనం మూగబోయింది
ఆకాశం గుండె బ్రద్దలయింది
నేలతల్లి సైతం పాలుపోక చూస్తుంది..
కన్నబిడ్డల కసాయిచర్యను
కానుకోలేక
కన్నీరుమున్నీరుగా
విలపిస్తున్న
ఆకారుణ్యమూర్తిని గాంచి,
కదలలేని స్ధితిలో
కడుదీనస్ధితిలో
మురికిజీవాలు
ముసురుకొని
రక్తమాంసాలు పీల్చి
శరీరంపై స్వైరవిహారం
చేసి,దొరికినంతా దోచుకొంటున్నా...
వాటిని అదిలించడానికి
సైతం కదిలే సత్తువలేక
నిశ్చేతనయై
నిరీక్షిస్తూనే వుంది....
అరక్షణంలో ...వస్తానని
తరలెల్లిన తనయుడు
ఏక్షణాన వస్తాడో...నని
కమ్మని అమ్మతనం మాత్రం
కనురెప్పేయక కాచుకొనేవుంది
కన్నబిడ్డరాకకోసం...
చావుబ్రతుకుల పోరాటంలో
చివరి మజిలీ చేరుకున్నా..
ఆకలిదప్పులు మరచినా
కడుపుతీపిని మాత్రం
కడదాకా దాచేవుంచి
కన్నప్రేగు బంధాన్ని త్రెంచుకోలేక,
దారి మరచిపోయాడో,ఏమో ...
పిచ్చిసన్నాసి అనుకొంటూ...
ఏ దారిన మీరెల్లినా !
మావాడి జాడ కనిపిస్తే
ఈ అమ్మకప్పగించండి
అందాకా కనురేప్పేయక
కాచుకొనే ఉంటా ,
కదలలేని నేను
మృత్యు వొచ్చి కభళిస్తానన్నా...
నా బిడ్డను చూసేవరకు
నువు వేచే ఉండమని మొరాయిస్తానంటూ ..
ఆ అమ్మ తన కన్నీటిచెమ్మలో కన్నబిడ్డ ప్రతిబింబం పదిలం గావిస్తూ...
వదిలేసింది,వదులై పోయిన
ఆ అమ్మ జన్మను,
అమ్మతనాన్ని ,అనురాగాన్ని
అమరం చేస్తూ ..
కమ్మనైన అమ్మఆత్మ కాలగర్భంలో కలిసిపోయింది సమరం చేయలేక
పైశాచికతనయుడిపై,
తనువే చాలించింది ,
అదే నడివీధి కుప్పతొట్టిదరి
ఎదురుచూపుల ఎండమావిపై..
( కదలలేని స్ధితిలో ఉన్న
కన్నతల్లిని కల్లబొల్లి
మాటలుచెప్పి కారులో
తీసుకొచ్చి నడివీధిలో
కూర్చోబెట్టి ఇప్పుడే
వస్తానని మాయమైపోయిన
ఒక నయవంచకుడైన
కొడుకునిర్వాకం..ఆకొడుకు వస్తాడనినడివీధిలోనే ఎదురుచూస్తూ
తనువుచాలించిన ఆకన్నతల్లి
ధౌర్భాగ్యం...ఒకనాటి దినపత్రికలో చూసిచలించి
రాల్చిన నా అక్షరాశ్రవులు)
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
3, ఏప్రిల్ 2018, మంగళవారం
మానవత్వం పరిమళించే
మాటలెందుకు?కోతలెందుకు?
తోటివాడికి సాయపడితే
కోటి ఫలముల మూటగాదా !
జపములెందుకు?తపములెందుకు? పేదవారికి చేయూతనిస్తే చెంతరాదా! కోరి మోక్షము.
భజనలెందుకు?కీర్తనలెందుకు?
భక్తి గుండెల నిండినప్పుడు ..
దేవుడెరుగడా...మన గుండెచప్పుడు.
మనిషిమనిషిలోమానవత్వం పరిమళిస్తే...మాన్యమవదా...మన వ్యవస్ధ తధ్యం.
ప్రతీ ఒక్కరు స్పందిస్తే ప్రపంచమే మారదా...పట్టువీడక ప్రయత్నిస్తే పసిడి పండదా....బీడుభూమిలో....
శ్రీమణి
25, మార్చి 2018, ఆదివారం
అద్భుతమదివో
అద్భుతమదివో
అమోఘమదివో,
అపూర్వమదివో ..
అమృతాస్వాదనమదివో
అయోధ్య రాముని కళ్యాణవైభోగమదివో
రమణీయమదివో
రఘుకులాన్వయున
కళ్యాణమదివో
కమనీయమదివో
కమలాలయని
కళ్యాణమదివో
కాంచిన కన్నులభాగ్యమేభాగ్యము
కొలచిన చాలట నిత్యసౌభాగ్యము
జానకి రాములనిత్య కళ్యాణం
జగమంతటికీ పచ్చతోరణం
ఆకాశమే ఆణిముత్యాల పందిరి
ఆ ధారణి ధగధగ పెళ్లిపీట
పట్టంచు పావడాలు,పట్టుపీతాంబరాలు
చిగురు మావిళ్ల తోరణాలు,
చిరు కోయిలమ్మ రాగాలే సన్నాయి రాగాలు
పంచభూతాలే మంగళవాయిద్యాలు
పచ్చని చిలుకలే పేరంటాళ్లు
పచ్చికలే పచ్చని పారాణులు
మంచిముత్యాలు తలంబ్రాలు
మంచి గంధాల,మల్లికలపరిమళాలు
విసనకర్ర వింజామరలు
పానకాల మధురిమలు
వడపప్పు,భోజ్యాల ఘుమఘుమలు
జానకిరాముల పెళ్ళికి మనమేచుట్టాలు
చుట్టూరా చప్పట్లు
సుమధుర ఘట్టాలు,
జానకి రాములనిత్య కళ్యాణం
జగమంతటికీ పచ్చతోరణం
(శ్రీరామనవమి శుభాకాంక్షలతో )
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
22, మార్చి 2018, గురువారం
రాష్ట్రీయ పురస్కారం
మార్చి21అంతర్జాతీయ
కవితాదినోత్సవ సందర్భంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాషాసాంస్కృతికశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత&సంస్కృతి
సమితి వారిచే విజయవాడలో
సత్కారం అందుకొన్న శుభతరుణం
18, మార్చి 2018, ఆదివారం
ఉగాది పురస్కారం
ఈరోజు విశాఖ పోర్టు ట్రస్ట్ ""సాగరి"సాంస్కృతికసంస్ధ వారి ఆధ్వర్యంలో ఉగాదిపురస్కారం అందుకొన్న శుభతరుణంలో మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ
శ్రీమణి
విళంబి....విజయదుందుభి
ఏంతీసుకొచ్చావో
మాకేం మోసుకొచ్చోవో
ఏ సంతసాల సంతకాలు
చేసుకు వచ్చావో
ఏమధుర మధుర పరిమళాలు
తీసుకువచ్చావో
ఏవింతవింత అనభూతుల
అలరించవచ్చావో
అందాలు మోసుకొచ్చావా
ఆనందాలజల్లు తెచ్చావా
అచ్చ తెలుగుసౌరభాల
పుణికి పుచ్చుకొచ్చావా
మరుమల్లియపరదాలా
విరి చందనాలా
మరువంపు సరులా
మధురోహల మాలికలా
పట్టరాని సంబరాల
పట్టు పీతాంబరాలా
మధనపడే బ్రతుకులకై
మధుకలశం తెచ్చావా
కడగండ్ల బ్రతుకులకై
కళకళలు మోసుకొచ్చావా
వగరులు తెచ్చావా
కొత్త చిగురులు తెచ్చావా
విళంబి నామవత్సరమా
వినూత్నంగావచ్చావా
వింతలేవైనా తెచ్చావా
విశ్వకళ్యాణార్ధమై
విజయదుందుబివై
వేంచేసినావా
కోటి ఆశలుతీరేలా
కోరిక నెరవేరేలా
కొంగుబంగారమై
తెలుగు శింగారమై
మా ముంగిట నిలిచావా
తెలుగులోగిలికి
వెలుగుల్లు చిలికి
నిత్యకళ్యాణివై
పచ్చని పారాణి వై
అచ్చతెలుగుఅలివేణివై
అరుదెంచినావా
అమృతానందాలహరివై
(తెలుగు వారందరికీ విళంబీ నామ సంవత్సర శుభాకాంక్షలతో ....)
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
8522899458
3, మార్చి 2018, శనివారం
సిరియా..ఆక్రందన
ధరణి రెండుగా
చీలదెందుకని
దడ పుట్టించే
దారుణాలు గని
ఆకాశం ఆ అమాయకుల
ఆక్రోశం విని విచ్ఛిన్న మైపోదేం
విరిగిపడిపోదేం
సిరియాపై సిరికన్ను వేసిందా
ఆ దైవం సైతం
నరమేధం
నరమేధం
దారుణ మారణహోమం
మరుభూమిని
తలపిస్తూ..మ్రోగుతున్న
మరణమృదంగం
మృత్యుకౌగిట
నిత్యాగ్నిహోత్రం
పెల్లుబికిన
పెనువిధ్వంసం
అట్టుడికిపోతున్న
అమాయక జనం
అన్యంపున్యం ఎరుగని
వసివాడని పసి బిడ్డల
రుధిరదారల ధరణి
తడిచి ముద్దవుతున్నా
ఆ దారుణ మారణకాండను
ఎదురొడ్డలేక ఎన్ని గుండెలవిసిపోతున్నా
అడ్డుకొనే వారులేక
ఆదుకునే నాధుడు లేక
పొరుగుదేశం పోరుఒడిలో
బోరున విలపిస్తుంటే
చేతలుడిగి చూస్తుందా
తోటి ప్రపంచం
తగువు తమది కాదనా!
తనదాకా రాదనా!
ఏమవుతుందీ లోకం
ఎటుపోతుందీ ప్రజానీకం
పెచ్చుమీరిన అరాచకత్వం
మచ్చుకైనా
మిగలనిమానవత్వం
అడవిమృగాల తలదన్నే
అమానుషత్వం
మానవమస్తిష్కంలో
తిష్ఠ వేసుకున్న పైశాచికత్వం
ఇక
మిగలుతుందా...అణువంతైనా
మానవ అస్తిత్వం
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
2, మార్చి 2018, శుక్రవారం
హోళీ
తుళ్ళింతల
కేరింతల
గిలిిగింత
చక్కిలిగింతల
వింతవింత
పులకింతల
మనసంతా వసంతాల కేళీ
ఎగిసే
సంతసాలసంతకాల రంగేళీ
ఇంధ్రధనస్సై
వెల్లివిరిసింది హోలీ
సప్తవర్ణాల
మురిసింది ప్రతి లోగిలి
సాలిపల్లిమంగామణి (శ్రీమణి)
18, ఫిబ్రవరి 2018, ఆదివారం
7, ఫిబ్రవరి 2018, బుధవారం
ఆటలేవి పాటలేవి
ఆటలేవి
పాటలేవి
అమ్మలాలిపాటలేవి
కబుర్లేవి
కధలేవి
మధురంగ
మెదిలేటి
బామ్మ పిట్టకధలేవి
మంచి ఏది
చెడ్డ ఏది
మంచిచెడులునేర్పించగ
తీరుబాటు....మనకేదీ
ఉరుకులపరుగుల మరజీవనంలో
ఏవీ ఉమ్మడికుటుంబాలు
ఏవీ ఆత్మీయతానురాగాలు
ముఖస్తుతికి
హాయ్..బాయ్...మోజులో
ఆత్మీయ
హాయిపలకరింపుల ఆనవాళ్ళేవి
శరవేగంగా దూసుకుపోతున్న
అత్యాధునిక యుగంలో చరవాణి చెరలో
బంధీలయిపోయాం
పిజ్జాలుబర్గర్లంటూ
పిండిముద్దలపిచ్చిలో
పిండివంటలు పడ్డాయికదా...మూలన
నాడు చద్దిబువ్వతో రోజు మొదలూ
ఇక రాతిరపూర్తయ్యేది అమ్మచెప్పే చందమామకధలూ
నేటి ఉదయం కప్పుకాఫీ,బ్రెడ్డుముక్కతో
మొదలై ఫేస్బుక్కు పారాయణానంతరమే
గా నిద్ర
ఆధునిక మానవజీవజాలమంతా
అంతర్జాలమాయాజాలంలో
చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటే
నేరమవరిదో
దోషమెక్కడుందో
అవశ్యమే ఆవశ్యకం
ఆత్మావలోకనం
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)