ధరణి రెండుగా
చీలదెందుకని
దడ పుట్టించే
దారుణాలు గని
ఆకాశం ఆ అమాయకుల
ఆక్రోశం విని విచ్ఛిన్న మైపోదేం
విరిగిపడిపోదేం
సిరియాపై సిరికన్ను వేసిందా
ఆ దైవం సైతం
నరమేధం
నరమేధం
దారుణ మారణహోమం
మరుభూమిని
తలపిస్తూ..మ్రోగుతున్న
మరణమృదంగం
మృత్యుకౌగిట
నిత్యాగ్నిహోత్రం
పెల్లుబికిన
పెనువిధ్వంసం
అట్టుడికిపోతున్న
అమాయక జనం
అన్యంపున్యం ఎరుగని
వసివాడని పసి బిడ్డల
రుధిరదారల ధరణి
తడిచి ముద్దవుతున్నా
ఆ దారుణ మారణకాండను
ఎదురొడ్డలేక ఎన్ని గుండెలవిసిపోతున్నా
అడ్డుకొనే వారులేక
ఆదుకునే నాధుడు లేక
పొరుగుదేశం పోరుఒడిలో
బోరున విలపిస్తుంటే
చేతలుడిగి చూస్తుందా
తోటి ప్రపంచం
తగువు తమది కాదనా!
తనదాకా రాదనా!
ఏమవుతుందీ లోకం
ఎటుపోతుందీ ప్రజానీకం
పెచ్చుమీరిన అరాచకత్వం
మచ్చుకైనా
మిగలనిమానవత్వం
అడవిమృగాల తలదన్నే
అమానుషత్వం
మానవమస్తిష్కంలో
తిష్ఠ వేసుకున్న పైశాచికత్వం
ఇక
మిగలుతుందా...అణువంతైనా
మానవ అస్తిత్వం
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి