పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

*అమ్మ* కన్నీటి *చెమ్మ*

*అమ్మ* కన్నీటి *చెమ్మ*

ఆమాతృమూర్తికేంతెలుసు..?
తనుతరిమివేయబడ్డానని
కన్నకడుపుకేం తెలుసు...?
కన్నబిడ్డలు కటికపాషాణాలని
కలనైనా అనుకొంటుందా..?
ఎన్నో కలలుగని కన్న తనయులే వీధికీడుస్తారని
నడిరాతిరి నడివీధికుప్పతొట్టికి
తనను కాననుకిస్తారని
అరక్షణంలో వస్తానని
నమ్మబలికి ఆమడదూరంలో
ఆరుబయటే వదిలేసి
వెనుదిరిగి చూడకున్నా...
నీరెండిన కళ్ళతో
నిరీక్షిస్తున్న
ఆ అమ్మనుచూస్తే
అమ్మతనం మూగబోయింది
ఆకాశం గుండె బ్రద్దలయింది
నేలతల్లి సైతం పాలుపోక చూస్తుంది..
కన్నబిడ్డల కసాయిచర్యను
కానుకోలేక
కన్నీరుమున్నీరుగా
విలపిస్తున్న
ఆకారుణ్యమూర్తిని గాంచి,
కదలలేని స్ధితిలో
కడుదీనస్ధితిలో
మురికిజీవాలు
ముసురుకొని
రక్తమాంసాలు పీల్చి
శరీరంపై స్వైరవిహారం
చేసి,దొరికినంతా దోచుకొంటున్నా...
వాటిని అదిలించడానికి
సైతం కదిలే సత్తువలేక
నిశ్చేతనయై
నిరీక్షిస్తూనే వుంది....
అరక్షణంలో ...వస్తానని
తరలెల్లిన తనయుడు
ఏక్షణాన వస్తాడో...నని
కమ్మని అమ్మతనం మాత్రం
కనురెప్పేయక కాచుకొనేవుంది
కన్నబిడ్డరాకకోసం...
చావుబ్రతుకుల పోరాటంలో
చివరి మజిలీ చేరుకున్నా..
ఆకలిదప్పులు మరచినా
కడుపుతీపిని మాత్రం
కడదాకా దాచేవుంచి
కన్నప్రేగు బంధాన్ని త్రెంచుకోలేక,
దారి మరచిపోయాడో,ఏమో ...
పిచ్చిసన్నాసి అనుకొంటూ...
ఏ దారిన మీరెల్లినా !
మావాడి జాడ కనిపిస్తే
ఈ అమ్మకప్పగించండి
అందాకా కనురేప్పేయక
కాచుకొనే ఉంటా ,
కదలలేని నేను
మృత్యు వొచ్చి కభళిస్తానన్నా...
నా బిడ్డను చూసేవరకు
నువు వేచే ఉండమని  మొరాయిస్తానంటూ ..
ఆ అమ్మ తన కన్నీటిచెమ్మలో కన్నబిడ్డ ప్రతిబింబం పదిలం గావిస్తూ...
వదిలేసింది,వదులై పోయిన
ఆ అమ్మ జన్మను,
అమ్మతనాన్ని ,అనురాగాన్ని
అమరం చేస్తూ ..
కమ్మనైన అమ్మఆత్మ కాలగర్భంలో కలిసిపోయింది సమరం చేయలేక
పైశాచికతనయుడిపై,
తనువే చాలించింది ,
అదే నడివీధి కుప్పతొట్టిదరి
ఎదురుచూపుల ఎండమావిపై..

( కదలలేని స్ధితిలో ఉన్న
  కన్నతల్లిని కల్లబొల్లి
మాటలుచెప్పి కారులో
తీసుకొచ్చి నడివీధిలో
  కూర్చోబెట్టి ఇప్పుడే
వస్తానని మాయమైపోయిన
ఒక నయవంచకుడైన
కొడుకునిర్వాకం..ఆకొడుకు వస్తాడనినడివీధిలోనే ఎదురుచూస్తూ
తనువుచాలించిన ఆకన్నతల్లి
ధౌర్భాగ్యం...ఒకనాటి దినపత్రికలో చూసిచలించి
రాల్చిన నా అక్షరాశ్రవులు)
             సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి