పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

7, జూన్ 2014, శనివారం

మదిమధనం




దిక్కుల  మాటున నక్కి  నా  ప్రతి  సడిని  పసిగడతావు 
చుక్కల ప్రక్కన  చేరి పక్కున నవ్వేస్తావు 
 నన్ను  వీడి  మనలేక  నా నీడపైనే  కత్తి  గడతావు . భావ్యమా! మరి 
 నా  నవ్వులొలిగి పోకుండా నీ  దోసిట  పడతావు .
  పువ్వులాంటి  నా మది  దోచగ  మధుపంగా  మురిపిస్తావు.. 
 మలయ  సమీరంలో  నీ ప్రణయ చందనాన్ని కలగలిపి  నా శ్వాసకందిస్తావు 
నన్ను మంత్రముగ్ధురాలిని చెయ్యాలని . 
నను నీ  మనో  సామ్రాజ్ఞి చేయాలని . 
నే  విహరించే  దారుల్లో సిరిమల్లెల  పానుపేసి, 
  నీలి మబ్బు పరదాల్లో దాక్కుంటావు .
నే  చిత్రించిన  చిత్తరువుకి  రంగు లద్ది 
 నీ   రూపంగా   చిత్రిస్తావు. చిత్రంగా !
వెన్నెలమ్మ  వాకిట్లో  నా  మేను  వాల్చి నిదరోతుంటే ;
చలి గాలై వచ్చి చక్కిలిగిలి  పెడతావు.  చెంప గిల్లి ముద్దాడతావు. 
కనురెప్ప  వాల్చిన మరు నిమిషం  కల లోకొచ్చి  కలవరపెడ్తావు .
తీరా ! కనులు  తెరిచి చూస్తే కనుమరుగవుతావు.. 
నీ ప్రేమో ఏమో గాని .... నా లో  అనుక్షణం మది మధనం. 
నీ  నిరీక్షణలో నివ్వేరబోయెను నా వదనం
 (ఇది నీకై  నిరీక్షించిన ఆ రోజుల్లో  నా మది మధనం )  
 నీ కై  వేచిన  క్షణాలు  నిప్పు కణిక లై  వేదిస్తుంటే 
నీతో  గడిపిన  మధురోహలు మాత్రం  మంచి గంధం పూస్తున్నాయి (మరపురాని   ఆ మధుర క్షణాలు  మంచిముత్యాలే  కదా !)                                                         సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి