పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

9, జూన్ 2014, సోమవారం

తరాంతరం


అలనాటి  జీవనం అజరామరమయితే 
నేటి జన జీవనం మర జీవనం 
నాడు కోడి కూతతో  ప్రశాంత ఉదయం మేలుకొలుపు
అల్లరాల మోతతో  అలజడితో తెల్లారుతోంది  కదా  నేడు
నాడు చద్ది బువ్వతో  ఊరగాయ విందు
అది  సర్వ రోగాలకు తిరుగులేని మందు
నేటి బ్రేకుఫాస్టు  బ్రెడ్డుముక్క నమలలేక
దవళ్ళు  బ్రేకవుతున్నాయి
బెడ్డు కాఫీ తాగితాగి పళ్ళు  గార పడ్తున్నాయి
ఆనాటి  స్త్రీ  ఔన్నత్యానికి , సంస్కృతీ ,సంప్రదాయాలకూ
మేలి ముసుగు ప్రతీకగా  నిలిస్తే
కన్న వారి కనులు కప్పగ  దాచి  వదనం  ముసుగు చాటున
కళ్ళు  మూసుకు పాలు త్రాగిన పిల్లి వైనం
కొందరి వెకిలి చేష్టల . దిగజారుతున్న విలువలకు
నిదర్శనం నేటి  గేలిముసుగు .
నాటి ఉమ్మడి కుటుంబాలు అనురాగం , ఆప్యాయతలకు
బంధాలకు ,అనుబంధాలకు ఆలవాలమయితే
నేటి మనమిద్దరం ,మనకొక్కరు సాంప్రదాయంలో
మచ్చుకైనా మిగులుతోందా  మానవ సంబంధం
నాడు  ఆలనా పాలనలో తనబిడ్డకి  తల్లిపాలలో
మురిపాలను కలిపిచ్చి పరవశించె . నాటి పరిపూర్ణమైన స్త్రీ
ఈనాటి తల్లి బిడ్డను కన్నంతనే పొత్తిళ్ళ లాగి
సౌందర్య రక్షణ లో పాలసీసా  చేతికిచ్చి బిడ్డ సంరక్షణ విస్మరించి
క్రష్  ల  పాల్చేస్తున్నారిప్పటి  కొందరు అత్యాధునిక  తల్లులు
నాడు  విద్య నర్దించుటకై ఫర్లాంగులు  నడచివెళ్ళి
గురు శుశ్రూషలు  చేసి గురువు మనసు మెప్పించి
రేయనక , పగలనక ,ఎండనక ,వాననక విద్యనభ్యసిస్తే
నేటితరం  విద్యార్ధులు  కొందరు కన్నవారి కలలు కూల్చగ
కళాశాలకు బయలుదేరి కులాసాలతో ,విలాసాలతో
మత్తుల్లో   తూలుతూ విర్రవీగిన కుర్రాజనం వికృత చేష్టలు ,
విపరీత వస్త్రధారణలతో అధోగతిని  చేరడానికి ఆధునిక దారుల్లో
అభ్యసించేను అక్కరలేని విజ్ఞానాలు
విద్యాలయాలెలాగూ విక్రయాశాలలయి  విరాజిల్లుతున్నాయి
ఆనాటి మనిషి కండలు కరిగింఛి
బండ చాకిరి చేసి కొండని  ఢీ కొట్టే శక్తిమంతులయితే
నేడు  ఉద్యోగాల పేరుతొ పంకా కింద కూచుని
నాలుగడుగులు కూడా తిరక్క , తిన్న  నానా గడ్డీ అరక్క
అరకొర ఆరోగ్యంతో అల్లాడుతున్నారిప్పుడు
తరాలు మారినా గాని కల్ప తరువు  లాంటి
మన సంస్కృతిని  మరుగున పెట్టొద్దు
మారుతోన్న  కాలంలో మంచి  మాత్రం  ఎంచుకో
తరతరాల  మన  జీవన శైలిని  మహత్తరంగా  మలచుకో


                                          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి