మనలేను మనిషిలా !మరువక ఎన్నడు నన్ను
నువు చెంతలేని నేను ,సిరా లేని కలాన్ని ,
వెన్నెల కురియని పున్నమిని, విరియక వాడిన కుసుమాన్ని ,
నువు దూరమయిన మరు క్షణం. మొదలవుతోంది నా నిరీక్షణం
కంటి నిండుగ నీ రూపం. నిలువనీదు నిమిషమయిన నిశ్చింతగా నన్ను ,
ఝుంటి తేనియ మధుర రసం సేవించి నా మది
నీ సరసపు తలపుల్లో తూలుతోంది మైమరచిపోయి ,నన్నే మరచిపోయి
నీ అనురాగం చవి చూసిన నాకు ,ఏ రాగమైన మౌనంగా తోస్తుంది
రోజూ ఊసులాడే సంపంగీ మూగ నోము పట్టింది
పిల్ల గాలి కూడా మూతి ముడిచి కూచుంది
నా వలపుల వాకిలిలో నీకై మేల్కొని ఉన్న నాకు , రంగవల్లి జోల పాడింది
పరధ్యానంలో ఉన్న నన్ను, ప్రక్క నున్న సెలయేరు పలకరింపు కొచ్చింది
నీ పలుకు వినక చిలకలమ్మ కులుకు మరచి కూచుంది.
నీ ఎడబాటు మండు వేసవి లా నిప్పులు చెరిగేస్తుంటే
సీత కన్ను వేయమాకు నాపై .. నీ సతి నేనని మరచి
అరక్షణములో నా ఎదుట నిలువలేవా !నీ చెలి నిరీక్షణకు నీరాకను కానుక నీవా
ప్రణయరాగం పల్లవించగ , పయనమయిరా !నీ ప్రియ సఖి సన్నిధికి
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి