పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, జులై 2022, ఆదివారం

సాహో పత్రిక

*సాహో* మాసపత్రిక జూలై సంచికలో ప్రచురితమైన నాకవిత  మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*
 🙏🌷🌷🌷🌷🙏

15, జులై 2022, శుక్రవారం

వలపులవాన


నీ శిరమున అమరిన
 ఆనెమలిపింఛం....
నామోమున వాలి
 అలరించిన ఆమధురక్షణం
మైమరచిన నా హృదయం
అలలై ఎగసిన 
అనుభూతుల మయమై
సుతిమెత్తగ తాకే
 మలయమారుతమై,
ఏదో తెలియని
హాయి రాగమాలపించింది
నీ అధరాలను తాకిన 
మధుమోహన మురళిని
తాకిన నా అధరం‌....
తడబడుతుంటే....
ఎదలోపల ఏదో కమ్మని
తుమ్మెద రొద మొదలాయింది
ప్రణయామృత ధారల్లో 
తనువూ,మనసూ నిలువునా
తడిచి ముద్దయ్యింది.....
మొన్నటి నుండీ
ఎడతెరిపి లేకుండా
కురిసిన వాన 
ఇప్పుడిప్పుడే
వెలిసింది.
కానీ...
నాహృదయంలో
 నిరంతరాయంగా
కురుస్తున్న 
నీ వలపుల వాన
మాత్రం నన్ను
నిలువునా...
తడిపేస్తూనే వుంది
తడవ,తడవకూ
తడవక
తప్పదేమో...కృష్ణా...
నీ తలపుల వెల్లువలో..
(రాధామాధవీయం)   
 సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

14, జులై 2022, గురువారం

నేటి నిజం దినపత్రికలో

*నేటి నిజం* దినపత్రికలో ప్రచురితమైన నాకవిత మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*

శుభోదయం

మెల్లమెల్లగ
చల్లచల్లగ
తెల్లతెల్లవారగనే
కల్లోకొచ్చిన 
పిల్లనగ్రోవి
అల్లన పిల్లగాలయ్యంది
అల్లరిచేసిన మల్లియలన్నీ
మళ్ళొస్తానని వెళ్ళినవి
చల్లగ కురిసిన వెన్నియలన్నీ
వెలవెలబోయె వేకువతాకి
కిలకిలలాడిన కువకువలన్నీ
చెంతనచేరీ మెలకువచేసే
మిలమిలలాడే వెలుతురురేఖల
తాకిడికీ తుళ్ళునలేచిన
నాకన్నుల ముంగిట
పలకరించింది
శుభోదయమంటూ..
సుతిమెత్తని సూర్యోదయం
                
           *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

12, జులై 2022, మంగళవారం

మనసంతా నువ్వే

*మనసంతా...నువ్వే!*

మౌనంగా...ఉన్నా...
నా మనసంతా నువ్వే...
మాటలాడ లేకున్నా...
నా ధ్యాసంతా... నువ్వే
నా కనుపాపలో నిన్ను
కాపాడుకొంటున్నా...
కవి(కవయిత్రి)ని కదా...కవనంతో
కాలం గడిపేస్తున్నా....
అక్షరాలతో..నిన్ను అభిషేకిస్తున్నా...
నా పద భావాలపల్లకిలో
ఊరేగిస్తున్నా....
నీ ఊహలకు
ఊయలేసి
ఊరడిస్తూనే ఉన్నా...
నీతలపులలో
తలవాల్చుకు
నిదురిస్తున్నా....
మరచిపోలేను..ప్రభూ...
నువు నా మది గీసిన చిత్తరువు
విడిచిపోలేను...ప్రభూ
నా ప్రతి శ్వాస లోనూ...నీవు.
(రాధామాధవీయం)
                     *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

11, జులై 2022, సోమవారం

అధినేత్రి


అమృతాన్ని
ఔపోసన పట్టినట్టు
ఆకాశాన్ని
అదిమి పట్టినట్టు 
మబ్బులతో 
దోబూచులాడి
ఇంద్రధనుస్సు
వంపులో
ఇమిడిపోయినట్టు
పున్నమి జాబిలి
వెన్నెల హాయికి
పులకించిన 
నెచ్చెలి కలువను
నేనన్నట్లు
అచ్చరకన్యలతలదన్నే
అప్సర నేనన్నట్లు
అందాల రాజ్యానికి
అధినేత్రి  నైనట్టు
రంగూ రంగుల
సీతాకోక చిలుకల్లె
విరబూసిన 
పూదోటల్లో విహరించినట్టు
స్వాతి చినుకు ముద్దాడిన
ముత్యం నేనే అన్నట్టు
అరుణోదయ ఉషస్సులో
ఆ సంద్రంపై మెరిసే
అలనైనట్టు ,
అలా ... అలా ...
అలా ... అలలా
మెదిలిన
నా మధురమయిన
కలల సడికి
నులువెచ్చని
నా నిదుర చెడి
నివ్వెరబోయా !
ఆ రవి కిరణపు తాకిడికి,
కలలో మనకు  మనమే
కధానాయిక కదా.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

8, జులై 2022, శుక్రవారం

*మనిషిని మరి*


తీరని ఆశల రెక్కలు
మొలిచినినపుడల్లా...
నాలో నేనే అంతర్ధానమై
స్వప్న సౌధాలలో అవతరిస్తా...
ఆశల ఆనవాళ్ళు కరిగేవరకూ
ఆ కలల అలలపై 
విహరిస్తూనే వుంటా
గొంతెమ్మ కోరికలు గొంతెత్తి
పిలిచినప్పుడల్లా...
 గోరంత ఆలోచన  నన్నావహించి
ఊరడిస్తుంటుంది....
మాట మీద నిలబడాలన్నది
నా వ్యక్తిత్వం....
తప్పనిసరియై
మాట తప్పాల్సిన అగత్యమేవస్తే,...
తక్షణమే,
మౌనాన్నిఆశ్రయిస్తా
మనసు మధనపడుతున్నా,
మనిషిని మరి...
వ్యాధులు,బాధలు మామూలే
బదులుగా...
కన్నీరూ పరిపాటే 
కాలం మరమ్మత్తు చేస్తుంటుంది
మానని గాయాలపై
 మరుపుమందుపూసి,
కటికచీకటి కమ్ముకొస్తున్నా...
వెలుతురు కోసం వెతుకుతునేవుంటా..
కొమ్ముకాసే ఆ పైవాడి
చల్లని చూపులకై ఎదురుతెన్నులు 
చూస్తూనే వుంటా
ఆగమనం,నిష్క్రమణం
 ఎపుడో తెలియని 
ఈ జీవనయానంలో
మనసున్న మనిషల్లే
 నిష్కల్మషంగా
జీవించాలనుకుంటా
మరణానంతరమూ 
మనుషుల మనసుల్లో
 మనుగడ సాగించాలనుకుంటా.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

5, జులై 2022, మంగళవారం

నేనొక నిశ్శబ్దాన్ని

*నేనొక నిశ్శబ్దాన్ని*

నేనొక నిశ్శబ్దాన్ని
అనంతమైన ఆకాశాన్ని 
అనుక్షణం అన్వేషిస్తూ
అవని మూలాన్ని అవలోకిస్తూ
అలా శూన్యం కేసి చూస్తుంటాను
నిన్న రాతిరి రాల్చిన కలలకు
రేపటి ఆశల తీరానికి దూరమెంతని
ఆరా తీస్తుంటాను
సుఖదుఃఖాలకు ఆవల
నిలబడి కావలి కాస్తూ
అలౌకిక ఆనందంలో
ఆదమరచిపోతుంటాను
మాటలకు మౌనానికి మధ్య
అంతరాన్ని అంచనా వేస్తూ
ఆ అంతరాన్ని అమాంతం
భర్తీ చేస్తూ నిదానంగా
నిశ్శబ్దంగా మారిపోతాను
నాలో పురుడు పోసుకున్న
భావాలు పూర్ణత్వాన్ని
ఆపాదించుకుంటాయి..
  జీవనగమనంలో
లక్ష్యం నిర్ధేశించేది నాలోని
నిగూఢత్వమే
గమ్యం గోచరించేది కూడా
నా సమక్షంలోనే
మనోనిశ్చలతను చేకూర్చి
మనసుకు సాంత్వన నిస్తూనే
పరమపథానికి దారులను
 అతిచేరువ చేసే సాధనం నేను
నాలో తెలియని మృధుత్వం
మానవజీవితంలో
ఎన్నో జటిలమైన
 సంఘర్షణలకు సైతం 
సరైన సమాధానం 
మనిషికి,మనసుకూ కూడా
మహత్తరమైన వైద్యం అందించే
ధన్వంతరిని..
నిశిలా అగుపిస్తా గానీ
అసలైన మిసిమి నేను
అంతర్దృష్టితో అన్వేషిస్తే
దేదీప్యమానంగా
సాక్షాత్కరిస్తా..
నిదానంగా పరికించి చూస్తే
ప్రతి మనసుకు
పరిచయమే అక్కరలేని
నిర్వచనాన్ని
నేనొక....నిశ్శబ్దాన్ని.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

4, జులై 2022, సోమవారం

ఎదురీత

*ఎదురీత* 

బ్రహ్మ రాసిన 
రాతలకన్నా...
బ్రహ్మాండంగా
గీతలు గీసుకుంటున్నా....
దేవుడిచ్చిన వెలితితో
బ్రతుకు బాటలో...
వెనుక పడుతున్నా.....
వెలుతురు కోసం 
వెతుకుతునే వున్నా...
లేని కాళ్ళను అనునిత్యం
అతుకుతునే వున్నా...
అవహేళన పాలు చేస్తున్న
అవయవలోపాలను సైతం
అవలీలగా అధిగమిస్తున్నా
నాచేతులతోనే...
విధి విషమంటూ 
దూషిస్తూకూచోలేక
తలరాతకు ఎదురీతను
నేర్చుకుంటున్నా....
నడవలేని నాకాళ్ళకు
నమూనాచిత్రం 
గీసుకుంటున్నా
తీరని నా ఆశను
నెరవేర్చు కోవాలని
 ఆరాటపడుతున్నా....
కాళ్ళు లేవుగానీ....
నేను కళాకారుణ్ణి మరి
కలసి రాని కాలమని
అలసి సొలసిపోతే ఎలా
కన్నీళ్ళే మైనా...
కాళ్ళను తిరిగిస్తాయా...
తలరాతను తిరగేస్తాయా..
అందుకే తీరికగా కూచుని
తీరని ఆశను సైతం 
తనివితీరా చిత్రిస్తున్నా....
విధి ఆడిన చిత్రమైన
నాటకంలో చక్కగా నడుస్తూ
నటిస్తున్నా...
నా వంతు పాత్రకు 
నేనైతే న్యాయమే చేస్తున్నా...
జాలి చూపులు మాత్రం వద్దు
జేజేలు పలకండి చాలు
నాలోని కళాకారునికి
కాళ్ళు తోడులేని నాచేతుల
నైపుణ్యానికి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*.

3, జులై 2022, ఆదివారం

నిరీక్షణ

*నిరీక్షణ*

నినుచేరేదారిని
సరళంచేస్తే...
గరళాన్నయినా
చిరునవ్వుతో
సేవించేస్తా...
నిను వీక్షించగ
కనులకు భాగ్యంవస్తే
ఆపై
అంధత్వాన్నయినా
ఆనందంగా ఆహ్వానిస్తా...
ఒకపరి నీమది గెలుచుటకై
నిరంతరం నేను ఓడిపోతా...
నా ప్రణయం తెలుపగ 
నా అధరాలకు భాగ్యమునిస్తే
ఆపై మూగబోయినా
నే మురిసిపోతా...
నా కన్నుల పొదరింటికి నువ్వొస్తానంటే
నూరేళ్ళైనా కనురేప్పేయక  
నిరీక్షిస్తూనే  ఉంటా !
నమ్మరాదా కృష్ణా.. 
ఈ రాధ ఆరాధనని..
నీకై  తెల్లవారుతోంది ఉదయం 
నీ కోసమే ఆ సాయం సమయం
కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని
లేకుంటే  కరిగిపొమ్మని 
నా జీవితాన్నే నే శాశిస్తా !
నీ జత లేదంటే  శూన్యం కమ్మని,
నువ్వొస్తావనే  
నే జీవిస్తున్నా !
నీకోసమే నిరీక్షిస్తున్నా..
నిద్దురలోనూ  మేలుకొని....

 *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

1, జులై 2022, శుక్రవారం

ప్రత్యక్ష నారాయణుడు

*ప్రత్యక్ష నారాయణుడు*

వైద్యుడా అభివందనం
ప్రాణాదాతా నీకు ప్రణామం
విరామమెరుగని
విరాట్స్వరూపా
వినమ్రపూర్వక నమస్సులివిగో
వైద్యో నారాయణో హరిః
వైద్యుడే మనపాలిట ప్రత్యక్ష 
నారాయణుడు
ఊపిరి పోసింది ఆ దేవుడైతే
ఉసురును నిలిపింది వైద్యుడే
ఆ అపరబ్రహ్మ ఆపన్నహస్తమే
మనను ఆదుకునే అపర సంజీవని మంత్రం
అనారోగ్యమగు జీవితాల్లో
ఉదయించే అంశుమాలి వైద్యుడే
నిరంతర శ్రమజీవులు
నిజమైన దేవుళ్ళు 
ఓర్పు సహనంలో ధరణిమాత
ఆత్మజులు వారు
స్వాస్థ్యము చేకూర్చుటలో 
ధన్వంతరి వారసులు
అవిరళకృషీవలురు 
అలుపెరుగని ఋషీశ్వరులు
కరోనా కదనరంగంలో దూకిన
మొట్టమొదటి సైనికులు వీరే
ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నంలో
తమ ప్రాణాలను సైతం 
పణంగాపెట్టిన నిస్వార్ధసేవకులు
ఏమిచ్చి తీర్చుకోగలం
ఆ ప్రాణదాతల ఋణం 
వైద్యో నారాయణో హరిః అని
శిరస్సువంచి
ప్రణమిల్లడం తప్ప .
(వైద్యుల దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

29, జూన్ 2022, బుధవారం

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*