పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, ఆగస్టు 2014, శుక్రవారం

28, ఆగస్టు 2014, గురువారం

తెలుగు భాషా దినోత్సవo గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా




తెలుగు నేలపై కురిసిన   సుధా  మధుర మాధుర్యం విరి తేనియ మకరందం మన గిడుగు
పర్వతాలపేటయందుదయించిన  తెలుగు పర్వత శిఖరం  మన పంతులు
గిడుగు వారిఇంట జనించిన పిడుగు లాంటి తెలుగు కలికితురాయి
గ్రాంధికపు కౌగిలి  నుండి  సాహిత్యాన్ని  వ్యవహారిక భాషకూ వరమిచ్చిన వ్యావహారిక భాషోద్దరుడు
మామూలు మనిషికీ మధురమయిన సాహిత్యం చవి చూపిన సరళ  కవితా నిర్దేశకుడు  
సమాజానికి చేరువగా సాహిత్యాన్ని అలవోకగా అందరికీ అందించిన నవ కవితా వైతాళికుడు
 ఆ మహోన్నతుని అడుగు జాడఏవత్  తెలుగు భాషసరి  కొత్త  వెలుగు జాడ
కన్నతల్లి  తేట తెలుగులమ్మకు సహజ మెరుగులు  అద్దిన మేటి చిత్రకారుడు
తన అక్షరాల అల్లికతో కలానికి కొత్త కళను నేర్పిన కళా ప్రపూర్ణుడు
             
                        సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

18, ఆగస్టు 2014, సోమవారం

ఎట్టా చేరను కిట్టయ్యా


ఎట్టా చేరను కిట్టయ్యా  నిన్నెట్టా  చేరను కిట్టయ్యా 
చెట్టా పట్టాలేస్తావు   మళ్ళీ పత్తా లేనే లేవు 
చుట్టూ నువ్వే  ఉంటావు   తీరా కనికట్టేదో చేస్తావు  
చెట్టూ చేమల మాటున నక్కి  నన్ను అష్టాకష్టాలెడతావు 
హద్దు లేని ప్రేమంటావు . నీ  ముద్దు చెలియ నేనంటావు 
ముద్దుగుమ్మల చెంత చేరి  మైమరచి  రాసలీలలాడుతావు  
వెన్నముద్ద  నన్నడిగి  మిన్నకుండిపోతావు 
నీ సన్న చెక్కిలి నవ్వుతో చెలియల   మనసును దోచేస్తావు 
నా హృదయపు తలుపులు నీకై తెరిచా కన్నయ్యా 
నీ  వలపుల తలపులు మాత్రం పలువురిపైనా పరిచేవా 
నా  గుండె సప్పుడు విన్నావో ఎప్పుడూ కిట్టయ్యంటాది 
మల్లె చెండూ నీ మనసుమాత్రం   మగువల  మద్యనే  మారుతుంటది 
ఎన్ని జన్మాలెత్తాలయ్యా  నల్లనయ్యా 
నీ ఎద సన్నిధి చేరుటకై   ఓ చల్లనయ్యా 
నువ్వెన్నెన్ని  చిన్నెలు  చేసినా వెన్నదొంగా .. నిన్ను వీడను 
నీ తలపుల మకరందపు సుధను కలనైనా  మరువను  నేను 
నిను చేరే దారిని సరళం చేస్తే గరళాన్నైనా  సేవించేస్తా 
నిను చూసే భాగ్యం నా కనులకు ఇస్తే అంధకారంలోనూ  ఆనందిస్తా 

                                                                           సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

17, ఆగస్టు 2014, ఆదివారం

నన్నెరుగవా.....

నన్నెరుగవా !కృష్ణా .. నన్నెరుగవా !




నన్నెరుగవా .. కృష్ణా .. నన్నెరుగవా ...
మన్ను తిన్న చిన్ని కృష్ణా .. నన్నెరుగవా
కన్నె మానసచోరా .. కృష్ణా .. నన్నెరుగవా
వెన్నముద్దలు ,జున్నుముక్కలు దోచుకొన్న
చిలిపి  కృష్ణా  నన్నెరుగవా ..
దోబూచులాడుకొన్నాం  నన్నెరుగవా
తాయిలాలు  పంచుకొన్నాం నన్నెరుగవా
నీ  వేణువునకు మైమరచిన నన్నెరుగవా
బృందావన మురళీ లోల  నన్నెరుగవా
అందచందాల మోహనకృష్ణ  నన్నెరుగవా
నంద భూపాల గోపాల కృష్ణా నన్నెరుగవా
యశోదమ్మ  ముద్దుల కృష్ణా  నన్నెరుగవా
రేపల్లెనేలేటి  మురిపాల కృష్ణా .. నన్నెరుగవా
నీ మది దోచిన ప్రియసఖి నే  నన్నెరుగవా
నీలమేఘశ్యామా కృష్ణా  ..   నన్నెరుగవా
నీ చెలిమికై  నిరీక్షించె నేచ్చేలినే .. నన్నెరుగవా
నీ  తలపులలో  వేచియున్న  నీ  రాధను నేనే .. నన్నెరుగవా
పారిజాతపూలు  నా దోసిట నింపి
నీ రాకకై  వేచి యుంటి .. నన్నెరుగవా
వేగిరముగా  రమ్మంటూ  జాగరాలు   చేస్తున్నా
నా  కన్నె మనసు దోచుకొన్న  కన్నయ్యా
కలవరపెట్టకచెప్పు  నన్నెరుగవా ...

                                 సాలిపల్లి మంగామణి @శ్రీమణి

15, ఆగస్టు 2014, శుక్రవారం

జయహో నా భారత ధరిత్రి




 జయహో నా భారత ధరిత్రి ,జయజయహో మమ్ముగన్న జనయిత్రీ 
మహామహుల మాతృశ్రీ రత్నగర్భ నా  తల్లి  భారతి 
వీరులకు , ధీరులకు  జన్మనిచ్చిన ధన్యశ్రీ  
కవిత్రయం  కన్నతల్లి పుణ్యశ్రీ  నా తల్లి  భారతి   
సస్య శ్యామల దివ్య ధాత్రి  నా ధరిత్రి 
సృష్టి  సిగలో మెరిసిన   వాడని  కుసుమం  నా ధరిత్రీ

ఉగ్గుపాలతోనే ఇకమత్యం కలిపిచ్చిన సమైక్య  భారతి
గోరుముద్దలతోనే  మానవతను నేర్పించిన  కారుణ్య మూర్తి
తన  సంస్కృతీ సౌరభాలు  నలుదిశలా  వెదజల్లిన నా తల్లి భారతి
పరాయి పంచన బందీ అయి తల్లడిల్లి జనకరాజ పుత్రి లా
ఓరిమితో తన బిడ్డలత్యాగంతో   దాస్య శృంఖలాలు  తెంచుకొన్న  నా స్వతంత్ర భారతి
వేవేల  వేదాల ఘోషించిన  పరమ పావన  చరిత   నా తల్లి భారతి
వెలకట్టలేని  విలువల గని ,సాంప్రదాయ , సంస్కారాలలో  ఎడతెగని  కీర్తి
కుల మతాలకతీతమయి , శాంతి , అహింసలకు  ఆలవాలమయినట్టి  అమృతమూర్తి
అలరారే  పసిడి మనసున్న  కొంగు బంగారు తల్లి  మము గన్న భారతి
ఒక బుద్ధుని  ,ఒక అశోకుని  మనకొసగిన తల్లి
 ఒక బాపూ కి  జన్మనిచ్చిన ధన్య చరిత నా తల్లి భారతి
హిమశిఖరపు మారుతాన్ని  , పలనాటి పౌరుషాన్ని
పుణికిపుచ్చుకొన్న పునీత  నా తల్లి  భారతి
అల్లూరిని అల్లారుముద్దుగా పెంచి
అమరవీరులను కన్న నా మాతృమూర్తి  ధీరో ధాత్రి
గంగా ,యమునా ,కృష్ణా ,పెన్నా
జీవన నదులతో అక్షయమై ,సుభిక్షమై  సాక్షాత్తు   అన్నపూర్ణ  నా తల్లి
అందులకే  మనమందరమూ  భారతి బిడ్డలమైనందుకు
గర్విద్దాం . కన్నతల్లి  ఋణం తీర్చగ
మన  భరత  ఖ్యాతిని ఇనుమడింపచేద్దాం
ఎల్లలు దాటి మన కన్నతల్లి  ఔన్నత్యం చరిత్రలో పసిడి అక్షరాల లిఖిద్దాం
అవనిపై  అదృష్టవశాత్తూ  భారత బిడ్డలమైనందుకు బ్రతికి ఉన్నంతవరకు
తల్లి భారతికి  జయహో అందాం,భారతమాతకి  అభివందనాలు తెలుపుదాం
                                                                                           
                                                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి 






8, ఆగస్టు 2014, శుక్రవారం

                          



అందరికీ శ్రావణ శుక్రవార వర మహాలక్ష్మి ఆశీశ్శులు అందించాలని ఆకాంక్షిస్తూ 
                                 
                                                                               సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

7, ఆగస్టు 2014, గురువారం

మరవకురా ....

        


నా అందెల రవళి అలికిడిలోనూ  చెలికాడా నీ  పలుకుల సవ్వడి వింటున్నా 
సాయం సందియ  వెలుతురులో ప్రతి కదలికలో నీ నగుమోమే  కనుగొన్నా 
నిద్దురలోనూ ,మెలకువలోనూ ,నా కనుపాపలలో కదలాడి కలవరపరచి 
వదలక నన్ను  నిమిషము మాత్రమూ నీ తలపులు తరచి తరచి వెంటాడి 
చల్లని పిల్లగాలి తాకినా మేను  వేసవినే  తలపిస్తుంటే తాళలేక 
నీ అల్లరి ఊహల ఒరవడిలో అల్లంత దూరంలో ఉండిపోయా నాకు నేను  
మనమల్లుకున్న  ఆశల  పొదరింట్లో  నీ కోసమే నే నిరీక్షిస్తున్నా  నువ్వొస్తావని 
గొల్లున గోల చేస్తున్నాయి మరుమల్లికలు నా సరసన నువ్వు లేవని . వారిస్తున్నా వినకుండా 
మన ఇరువురి ప్రణయం ఎరిగిన సెలయేరు గుచ్చి గుచ్చి అడుగుతుంది నీవెక్కడని 
వేవేల పూబాలలు ఏకమయి  ,ఏడనున్నాడంటూ నీ జాడనే అడిగాయి 
వలపుల చెలికాడా ! నీ చెలినే మరచావా 
అలిగిన వేళలో నా సొగసు చూడనెంచి 
జాబిలి వంపున ఒదిగి దోబూచులాడేవా 
నీవు ఆదమరచగలవా ప్రభూ  నీ పాద మంజీర నాదాల సేద తీరే నీ రాధనేను 
                      
                                                             సాలిపల్లిమంగామణి @శ్రీమణి                                  

31, జులై 2014, గురువారం

నేనే రాధనోయి

          

నీలిమేఘాల వరుసల్లోకూడా  నీ సరసనే నా ధ్యాస 
నీ  తేనె రాగాల మురళీ  పదనిసలో నిలువెల్ల  నా శ్వాస 
నీ నీడ జాడల్లోవడివడిగా  అడుగులు వేసా  
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా 
 కలువల రేడుని వేడుకొంటి నీ  చెలియ  గోడు ఆలకించమని 
ప్రతి రేయిలో   పున్నమి ఎన్నియలు  విరజిమ్మమని 
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని 
కిన్నెరసానిపై   కన్నెర్ర చేశా  వన్నెలసోయగంతో 
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని 
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై.    తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై 
నీ  అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
 నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని 
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని 
నా మది దోచిన మురళీ మోహనా ..   నీ  మనసును  నాకే కానుకనీవా 
నాఇరు  కనుపాపల్లో  చిరు దివ్వె వెలిగించి  నీకోసం  నిరీక్షిస్తున్నా .... 
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా... 
రారా కృష్ణా ! 
మన ప్రణయ రససామ్రాజ్యం లో  నా  హృదయ పీటమేసాను 
కినుక వహించక   నీ అలివేణి పై 
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను  

12, జులై 2014, శనివారం

గురు చరణం




కరువాయెను కవితకు ఆదరణ  అని ,
బరువెక్కిన హృదయంతో ,ఎరుపెక్కిన వదనంతో,
వెనుదిరిగిన తరుణంలో ,
గురువాయెను నండూరివారు ,దిశానిర్దేశం చేయ మార్గదర్శియై !
కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే   చాలు  
కలం పట్టిన కవి కావ్యం పండడానికి 
అల్లిబిల్లి అక్షరాలూ కవితా సుమాలై విరబూయాలన్నా  ,
హిమశిఖరపు అంచులంత నీవు ఎదిగిపోయినా  ,
ఒదిగిపో ... నీ గురు పాదాల చెంత 
నా కవితా రధానికి సారధి అయిన నండూరి వారికి ,
పండూరు చెరువు గట్టు వారి వినమ్రతా పూర్వక పాదాభివందనాలు తో 

                                                            సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 

8, జులై 2014, మంగళవారం




మా పెరటి సుమాలతో  
                                 
నా కవితా  కుసుమాలు ... 
                                                      
          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

4, జులై 2014, శుక్రవారం

అల్లూరి సీతా రామ రాజు


మరువగలమా మహోన్నతుడా . 
మాతృభూమి శ్రుంఖలాలు తెగదెంచ నెంచి 
ఉడుకు నెత్తురు ఉప్పెనవగా ...  రుద్ర  నారసింహుడవై 
తుచ్చమైన తెల్ల కుక్కల పాలిట సింహ స్వప్నo  నీవై 

బడుగు బ్రతుకుల వెలుగు నింపి ,గిరి పుత్రుల వెతలు కడిగిన  మన్యవీరుడా
 మానవ కుల మాన్య  ధీరుడా 
ఓ తెలుగు వీరుడా .. చైతన్య ధీరుడా .. స్వరాజ్య సమర యోధుడా .. 
ఉద్యమానికి ఊపిరులూది వందేమాతరమన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటిన విప్లవ స్పూర్తి 
కొన ఊపిరి వరకు స్వరాజ్య పోరాటాన్నే నీ శ్వాస గా  తలచి చరితార్దుడా 
 మర ఫిరంగులు వర్షంలో మృత్యువుకే దడ పుట్టిస్తూ 
గుండెను చీల్చి తుపాకీకి ఎదురొడ్డి  తెల్ల వారి గుండెల్లో గుభుళ్ళు పుట్టించిన 
తెలుగు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటి చాటి చెప్పిన చైతన్య స్ఫూర్తి
అమర జ్యోతివై నిలిచినావు  ఈ భరత జాతి ఉన్నంత వరకు 
ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఆత్మగౌరవానివై  చిరంజీవి గా వర్దిల్లుతున్నావు 
             
అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా 
                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

3, జులై 2014, గురువారం

"కల "వరం


అమ్మ గర్భం నుండి వస్తూనే అవాక్కయ్యా... 
 నాన్న చేతిలో  ఆసుపత్రి బిల్లు చూసి 
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
 అవసరాల ధర  ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటు బిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు  మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల ,
 అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... 
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి . 
అమ్మ చిన్నప్పుడు  ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది . 
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు.  బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
నిత్యావసరాలు నిచ్చె నలెక్కి కూచుంటే 
పాలధరలు  పాలుపోక చూస్తున్నాయి 
కాయగూరల ధరలు మనల్నే నమిలేసేట్టు చూస్తుంటే 
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవిత మాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
భార్య కళ్ళలోకి చూస్తే  ఏదో తెలియని అనుభూతి అంటారు . 
కానీ నేటి మద్యతరగతి భర్త కి భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరు అడ్డు వస్తుంది . తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు పిల్లల్ని ఎంతమందిని కందామనే ఆలోచనే అద్భుతంగా ఉంటే 
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కితీరతానని మారాం చేసాం 
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  లభో దిభో మంటుంటే నిద్దరేలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే ,తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే .చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప . 
మతి లేక తప్పు చేసిన వాడికంటే , గతి లేక అప్పు  చేసిన మాకే పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు" కలవరం" తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రుత్యమయిపోయే  , ఈ కలచి వేసే మధ్యతరగతి బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????

                                                        సాలిపల్లిమంగా మణి @శ్రీమణి