పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, నవంబర్ 2022, సోమవారం

*అంతానువ్వే చేసావు*బ్రతుకు గోడలపై నైరాశ్యపుచిత్రాలనలా
వ్రేళ్ళాడదీస్తావెందుకు
నిమిషాలను నిప్పుకణికల్లా మండిస్తున్నావెందుకు
గుండెగొంతుక ఘోషించినప్పుడల్లా
నిశ్శబ్దాన్నే ఆశ్రయించుమని శాసించావు 
మనస్సాక్షి నిరసిస్తుంటే 
మౌనంతో చేతులు కలిపావు
గుప్పెడు ఆశల ఊపిరిరెక్కలు
ఉస్సూరంటూ నేలరాలుతున్న
ప్రతిసారీ నేరం నాది కాదనే వాదించావు
అంతా నువ్వే చేసి
అంతులేని నిర్వేదాన్ని ఆహ్వానిస్తే ఎలా
అంతర్యుద్ధంలో గెలిచిచూడు
అదృష్టం దురదృష్టం లాంటి అదృశ్యభావనలకు తలవంచాల్సిన
అగత్యమైతే లేదు
నిన్న రాలిన ఆశలు,ఆశయాలు
రేపటి చైతన్యపు బీజాలై
ఈ విశ్వక్షేత్రంలో ఏదో మూల
అంకురిస్తూనే వుంటాయి,
ఎగిసిన నక్షత్రాలన్నీ ఏకమై
సరికొత్త పాలపుంతను పలపరిచే వుంటాయి
అన్వేషించాలే గానీ ఆశలకాంతిపుంజాలు
అంతరంగాన్ని వెలుతురుతో నింపేయవూ
ఆత్మనిబ్బరం,ఆశాభావం అలంకరించుకు 
విజయం మెట్లెక్కిన మానవునికి
విధిసైతం మోకరిల్లుతుంది
యథార్ధం కైవసం చేసుకొన్న విజయం
శాశ్వతమై విరాజిల్లుతుంది
అప్పుడు మౌనం మాట్లాడుతుంది
మనిషిని మహనీయత అనే
మరో అధ్యాయాన్ని పరిచయంచేస్తూ..
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి