పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

19, నవంబర్ 2022, శనివారం

*అలసిపోతున్నాడు మనిషి*


ఎన్ని కలలను మోసినా 
అలసిపోలేదు యామిని
ఎన్ని అలలను ప్రసవించినా 
సడలిపోలేదు కడలి
వెన్నెలంతా ధారపోసి 
వెలిసిపోలేదు పున్నమి
చీకటి కొమ్మకు పూసినఉదయం 
ప్రశ్నించదు కాలాన్ని
అదే ఆకాశం,అదే ధరణీతలం
అవే పంచభూతాలు
యధావిధిగా దృశ్యాదృశ్య ప్రపంచం
అవిశ్రాంత విశ్వ గమనం
యుగాలుగా పరిభ్రమిస్తున్న 
భూగోళం
ప్రకృతి ప్రతీధర్మంలోనూ
శ్రమైక జీవన సౌందర్యం
నిగూఢమైన సత్యం 
కొన్ని పువ్వులను దోసిట్లోకి తీసుకొని 
చూడు నవ్వుతునే పలకరిస్తాయి
జీవించేది స్వల్పమని వగచి
స్వభావాన్ని మార్చుకోవు
వికసించే నైజం విషాదానికి తావివ్వదన్న
సత్యం విప్పారిన రేకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది
ఈమౌనసాక్ష్యాలు మార్గనిర్దేశకాలు కాదా
మానవ జీవనగమనానికి,
ఆలోచనవరమొందిన
అత్యున్నత ప్రాణి 
అవలోకనం విస్మరించాడు
ప్రతిఫలాన్వేషణతో బ్రతుకు
సాగిస్తున్నాడు,స్వార్ధచింతనయే జీవనమనుకొని 
అర్ధరహిత ప్రయాసతోనే 
అడుగులు వేస్తూ
అలసిపోతున్నాడు మనిషి
అరచేతిలో లోకాన్ని మోస్తున్నాడు కదూ.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి