*ఈశ్వరా...*
నిన్ను నమ్మిన మదికి
మాలిన్యమంటునా...
నిను కాంచిన కనులు
అంధకారమెరుగునా...
నిను మ్రొక్కిన కరములకు
కొరవడునా అదృష్టం
నీనామస్మరణమే
అమృతాస్వాదనం శివా...
ఈశ్వరా యన్నట్టి ఏ ఇంటనైనా
ఇడుములకు ఇసుమంత
తావుండునా ...
మారేడు పత్రాన్ని మనసార అర్పించ
మారాతనే మార్చేటి మా రేడు వయ్యా
భోళా శంకరుడా బోలెడంత దయ నీది
నీ చల్లని చూపులే మా పాలిట
వేయి కాంతిదీపాలు
నీ కనుసైగ చేతనే కరుగును మాపాపాలు
దోసెడు నీటిని నీపై
మనసార జారవిడిచిన చాలు
అసలుండునా...ఆపై
కన్నీటి ఆనవాలు
దొడ్డ మనసయ్యా నీది జంగమయ్యా...
సర్వమూ నీకెరుకె సాంబమూర్తీ
ఆపద్బాంధవుడవయ్యా హరా
ఆదిదేవుడా...
మమ్మాదుకోవయ్యా ముక్కంటి
నీ దివ్య పాదాల మ్రొక్కితి
నీవే మా దిక్కంటూ మోకరిల్లి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి