*నిశి వేదన*
చీకటి మ్రింగిన వెలుతురు దీపం
ఉప్పెనలోనే ఊపిరికెరటం
బడబానలమే బ్రతుకు సముద్రం
గరళం చిమ్మిన కాలసర్పం
మరణచట్రంలో మనిషిప్రాణం
విషణ్ణవదనాలు ,విషాదసంకేతాలు
విచిత్రమైన అనిశ్ఛితి,విపత్కర పరిస్థితి
మునుపెన్నడూ మనిషెరుగని
నిశ్శబ్ద ప్రఘాతం
ప్రభాతమెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం
ముసురుకొస్తుంది మృత్యుకౌగిలి
విస్తుపోయిచూస్తుంది విశ్వమనేలోగిలి
తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో
ఆవలతీరమనే ఆనందపు తెరచాపను అన్వేషిస్తూనే అలసిపోతుంది కంటిపాప
నేనేం రాయాలి పగిలిపోతున్న
హృదయాలనా, రసిగారుతున్న గాయాలనా,రాలిపోతున్న జీవితాలనా,
రగిలిపోతున్న వైపరీత్యాలనా,
కలం ఎలా కదలించను
మనుగడ పునాదులే మరణశయ్యలై
తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో
ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో ...
పరితపిస్తున్న ప్రపంచానికి
ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను
నిశి వేదన కరిగించాలని
మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప
మనస్థైర్యమనే మంత్రోచ్చారణలో
మా మనుషుల గుండెలను
బలోపేతం చేయుమని భగవంతుని
బ్రతిమాలుకోవడం తప్ప.
http://pandoorucheruvugattu.blogspot.com
*సాలిపల్లి మంగామణి ( srimaani)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి