*మహి(క)ళ*
ఆడుబుట్టువు లేక ఆదిఅంతములేదు
సుదతి లేని సృష్టి శూన్యమేగా.. !ఇక
మహిళ లేని మహిపై మనుగడేదీ
పడతి పుట్టుక లేక పరిపూర్ణతుండునా..
ఇభయాన లేని ఇహముండునటయా..
కలకంఠి లేక కళగట్టునానేల
అనంతజీవన ప్రస్థానంలో
ఆమే జగతికి ప్రధమస్ధానం
అరుదగు వాక్యం స్త్రీ మూర్తి
అక్షరాలకందని భావం
అత్యధ్భుత కావ్యం
అనంతసృష్టికి ప్రతిరూపం
అమృతమయమవు
ఉర్వీ రూపం
అమ్మాయి గా పుట్టి
అర్ధాంగిగా మెట్టి
అమ్మగా మరుజన్మమెత్తి
బామ్మగా పదవి చేపట్టి
అడుగడుగునా త్యాగం,
అంతులేని అనురాగం
రంగరించి అద్భుతమైన స్త్రీ జన్మను
సఫలం గావించిన స్త్రీ మూర్తిని
పొగిడేందుకు చాలునా
పృధివి పైన పదాలు.
రాసేందుకు చాలునా... రాతాక్షరాలు,
ఊహించగలమా !
మహిళ లేని మహిఆనవాలు
పసికందులను త్రుంచి,
తృణప్రాయముగనెంచి
ఆదిమూలమునందె చిదిమిపారేదురే...
జననిలేదన్నచో జగమున్నదటయా...
యోచించిచూడరే ఒక ఘడియయినా
పూజించుపడతిని..
పుడమితల్లిగనెంచి
గౌరవించుము తనని ఆదిశక్తిగతలచి...
(ప్రపంచ బాలికలదినోత్సవం
సందర్భంగా)
*సాలిపల్లిమంగామణి(srimaani)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి