పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జనవరి 2022, ఆదివారం

*నిశి వేదన*

*నిశి వేదన*

చీకటి మ్రింగిన వెలుతురు దీపం
ఉప్పెనలోనే ఊపిరికెరటం
బడబానలమే బ్రతుకు సముద్రం
గరళం చిమ్మిన కాలసర్పం
మరణచట్రంలో మనిషిప్రాణం
విషణ్ణవదనాలు ,విషాదసంకేతాలు
విచిత్రమైన  అనిశ్ఛితి,విపత్కర పరిస్థితి
మునుపెన్నడూ మనిషెరుగని
నిశ్శబ్ద ప్రఘాతం
ప్రభాతమెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం
ముసురుకొస్తుంది మృత్యుకౌగిలి
విస్తుపోయిచూస్తుంది విశ్వమనేలోగిలి
తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో
ఆవలతీరమనే ఆనందపు తెరచాపను అన్వేషిస్తూనే అలసిపోతుంది  కంటిపాప
నేనేం రాయాలి పగిలిపోతున్న
హృదయాలనా, రసిగారుతున్న గాయాలనా,రాలిపోతున్న జీవితాలనా,
రగిలిపోతున్న వైపరీత్యాలనా,
కలం ఎలా కదలించను
మనుగడ పునాదులే మరణశయ్యలై
తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో
ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో ...
పరితపిస్తున్న ప్రపంచానికి 
ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను 
నిశి వేదన కరిగించాలని
మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప
మనస్థైర్యమనే మంత్రోచ్చారణలో
మా మనుషుల గుండెలను
బలోపేతం చేయుమని భగవంతుని
బ్రతిమాలుకోవడం తప్ప.
http://pandoorucheruvugattu.blogspot.com

*సాలిపల్లి మంగామణి ( srimaani)*

28, జనవరి 2022, శుక్రవారం

అనుభవాలకాగితం

*అనుభవాలకాగితం*

గతం నుండే జనిస్తుంది
ఘనమైన జీవితం
తెరచిచూడమంటుంది
అనుభవాల కాగితం
మనసునాక్రమిస్తుంది
మరచిపోని జ్ఞాపకం
జలజలా రాలుతునే వుంటాయి
కాలం వెంబడి క్షణాలు
జీవిత రహదారికిరువైపులా
పరచుకొంటాయి రేయింబవళ్లు
ఉదయసమీరాలు,సంధ్యా
రాగాలు స్పృశిస్తూనే వుంటాయి
మనుగడ దారులనిండా
మారుతున్న మజిలీలు
చేజారుతున్న నిమిషాలు
మనసొకమారు మండుటెడారి
ఒకపరి మరుమల్లెల విహారి
ముందునున్న పూలరథం
అధిరోహించాలంటే
నిన్నటి గాయాలకు
నిఖార్సైన మందుపూయాల్సిందే.
http://pandoorucheruvugattu.blogspot.com
*సాలిపల్లి మంగామణి(srimaani)*

26, జనవరి 2022, బుధవారం

నా దేశం ధర్మక్షేత్రం

*నా దేశం ధర్మక్షేత్రం*

పుత్రికనై పులకించితి
పుడమి భారతియందు
పునీతమాయెను జన్మము
భారతీయతనొంది భాగ్యశాలినినేను
మట్టిలో కలవాల్సిందే ఈదేహం
ఈ దేశపు మట్టిలో నడయాడడమే ధన్యం
మనిషిగా పుట్టినందుకు కాదు
మాన్యమైన సంస్కృతిని ధరించినందుకు
మహత్వమాయెను నా జీవితం

నాదేశం ధర్మక్షేత్రం
నాదేశం పరమపవిత్రం
నాదేశం గణుతికెక్కిన
ఘనసంస్కృతీ సుమసౌరభం
సమస్తవిశ్వానికే ఆదర్శప్రాయం

రత్నగర్భ భారతదేశం
మహోన్నతం మహోన్నతం
మాన్యచరిత నా భారతదేశం
హిమశైల మలయమారుతం
పలనాటి పౌరుషం
కలబోసిన నాదేశం
సకల జగానికే స్ఫూర్తిదాయకం

వేదాలకు పుట్టినిల్లై విలసిల్లిన నాదేశం
విభేదాలు వాటిల్లని విశ్వశాంతి సందేశం
అనుపమానం, అద్వితీయం
మహామహుల త్యాగఫలం
పరిమళించిన మానవతావాదం
మహీతలానికే మార్గదర్శకం
విశ్వవినువీధులలో విజయకేతనం
భారతీయ సమైఖ్య గీతం

నాలుగక్షరాలు పోగేసి
పొగడలేను నా దేశాన్ని...
నిలబెట్టి తీరతాను
నాదేశపుగౌరవాన్ని...
నలుదిశలా చాటుతాను
భరతావని వైభవాన్ని.....
*సాలిపల్లి మంగామణి ( srimaani)*
http://pandoorucheruvugattu.blogspot.com

25, జనవరి 2022, మంగళవారం

మనిషితనం

*మనిషితనం*

మధనం..మధనం
మానవ జీవన గమనం
ఆగమనం నిష్క్రమణం
తప్పనిదే మనజీవన ప్రస్థానం
అది ఆద్యంతం అంతర్మధనం
ఆ...మధనం అమృతాన్నే 
అనుగ్రహిస్తుందో!
దావానలమై దహిస్తుందో
 దైవానుగ్రహమే....
భారమెంతగా వున్న
భరించడం పరిపాటే
వెతలు వెంబడిస్తూ వున్నా
ఎదురునడక కాలం వెంటే
ఏమిటో ఈ జీవితం
నిప్పుతో చెలగాటం
తప్పదని తెలిసినా
తప్పించుకోలేని తప్పనిసరి
పోరాటం..
తప్పు మనది కాకున్నా
తప్పనిదీ ఆరాటం
మనం మరణించినా 
మనుషుల
మనసుల్లో మనుగడ సాగించేది
మాత్రం మనలోని మనిషి తనమే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

24, జనవరి 2022, సోమవారం

మహి(క)ళ

*మహి(క)ళ*

ఆడుబుట్టువు లేక ఆదిఅంతములేదు 
సుదతి  లేని  సృష్టి శూన్యమేగా.. !ఇక
మహిళ లేని మహిపై మనుగడేదీ
పడతి పుట్టుక లేక పరిపూర్ణతుండునా..
ఇభయాన లేని ఇహముండునటయా..
కలకంఠి లేక కళగట్టునానేల
అనంతజీవన ప్రస్థానంలో 
ఆమే జగతికి ప్రధమస్ధానం
అరుదగు వాక్యం స్త్రీ మూర్తి 
అక్షరాలకందని భావం 
అత్యధ్భుత కావ్యం
అనంతసృష్టికి ప్రతిరూపం 
అమృతమయమవు 
ఉర్వీ రూపం
అమ్మాయి గా పుట్టి 
అర్ధాంగిగా మెట్టి 
అమ్మగా మరుజన్మమెత్తి 
బామ్మగా పదవి  చేపట్టి 
అడుగడుగునా త్యాగం,
అంతులేని అనురాగం 
రంగరించి అద్భుతమైన స్త్రీ జన్మను 
సఫలం గావించిన స్త్రీ మూర్తిని 
పొగిడేందుకు చాలునా 
పృధివి పైన పదాలు. 
రాసేందుకు చాలునా... రాతాక్షరాలు, 
ఊహించగలమా !
మహిళ లేని మహిఆనవాలు 
పసికందులను త్రుంచి,
తృణప్రాయముగనెంచి
ఆదిమూలమునందె చిదిమిపారేదురే...
జననిలేదన్నచో జగమున్నదటయా...
యోచించిచూడరే ఒక ఘడియయినా
పూజించుపడతిని..
పుడమితల్లిగనెంచి
గౌరవించుము తనని ఆదిశక్తిగతలచి...
(ప్రపంచ బాలికలదినోత్సవం
సందర్భంగా)
*సాలిపల్లిమంగామణి(srimaani)*

23, జనవరి 2022, ఆదివారం

ఏడ దాగున్నావో

సంధ్య వాలిపోయే 
సూరీడింటికి ఎల్లిపోయే 
గువ్వలు గూటికి చేరిపోయే 
నీ సవ్వడి మాత్రంలేదాయె
నినుకనుగొనలేక
నిశిరాతిరికూడా..
నిశ్శబ్ధంగా నిదరోయె
నినువెచ్చగ
తాకగలేకవెన్నెల
జాబిలి సైతం
అలిగిచిన్నబోయె
నీజతలేనివెతలో
మరుమల్లియలతకూడా
మిన్నకుండిపోయె...
నీవెదురుగలేక
నిద్దురరాక
నాతనువంతా
నిప్పులపరమాయె
ప్రియవదనా....
నీకైవెదకీవెదకీ
వెలవెలబోయెను
నావదనం
ఓ మదనా
నీ అడుగులసడి
వినబడక
కలవరపడి
పలుకులు
కరువై...
మూగబోయెనే
నాఅధరాలు
కలవరపడి
నాకాటుకకన్నులు
నీకై ఎదురుతెన్నులు
చూస్తుంటే...
నీతలపుల
తడబడి
నిలువునానామది
కలవరపడుతుంటే
కనుమరుగేల..ప్రభూ..
కనికరమేలేదా...
నీవలపులకలకంటిపై..

(మాధవునికై....
రాధఎదురుతెన్నులు)
 *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

22, జనవరి 2022, శనివారం

*అక్షరమై*

*అక్షరమై*

చుట్టూర ఎడతెరిపి లేని వాన
ఎడద మాత్రం ఎడారిచిత్రం
కౌముది పలకరించినా 
కారుచీకటి కౌగలిలోనే
మాట మౌనంలో లీనమమయ్యింది
అక్కడ గుట్టలు గుట్టలుగా
పడివున్నాయిఆశలదొంతరలు
అయినా ఓర్పువాకిట్లో అలా నిలబడిపోయాను
వెలుతురు చినుకులతో తడవాలని
ఎడతెగనీ ఆరాటం
వికలమైన మనసు శకలాలు
నిట్టూర్పులగుండంలో మండుతున్నా
ఊపిరైతే ఆగిపోలేదు
ఎంతైనా ధరణినికదా
తలకు మించిన భారమైనా
తగ్గేదే లేదుమరీ
కాలం ఏరులై పారుతుంది
ఎదురీదే ప్రయత్నంలో 
నా కలం రాతపని నేర్చుకుంది
ఆవేదన నిండిన ప్రతీసందర్భంలో
ఆకాశంకేసి దృష్టిని సారిస్తూ
ఆవరించుకొన్న శూన్యాన్ని
ఆకాశంలో వీక్షిస్తూ
అక్షరమై జీవిస్తున్నాను
అక్షయమైన జీవనకావ్యాన్ని
అక్కఱతో రచిస్తూ 
అనంతమైన ఆనందాన్ని
ఆస్వాదిస్తున్నాను
గుండె భారం తగ్గింది
మూగబోయిన ఆ క్షణాలపై
చివరకు అక్షరమే నెగ్గింది
కాలాన్ని జయించాను 
ఇప్పుడు చీకటినీ నేనే.. వెలుతురునూ నేనే...
ఖేదమైనా,మోదమైనా
ఆమోదమే
స్థితప్రజ్ఞత వరించింది
నేనొక జీవనదిని
ప్రవహిస్తూనే వుంటాను.
http://pandoorucheruvugattu.blogspot.com
*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*