*మదిమధనం*
దిక్కుల మాటున నక్కి
నా ప్రతి సడిని పసిగడతావు
చుక్కల ప్రక్కన చేరి
పక్కున నవ్వేస్తావు
నన్ను వీడి మనలేక
నా నీడపైనే కత్తి గడతావు .
భావ్యమా! మరి
నా నవ్వులొలిగి పోకుండా
నీ దోసిట పడతావు
పువ్వులాంటి నా మది
దోచగ మధుపంగా మురిపిస్తావు
మలయ సమీరంలో
నీ ప్రణయ చందనాన్ని
కలగలిపి నా శ్వాసకందిస్తావు
నన్ను మంత్రముగ్ధురాలిని చెయ్యాలని
నీ మనో సామ్రాజ్ఞిని చేయాలని .
నే విహరించే దారుల్లో
సిరిమల్లెల పానుపేసి,
నీలి మబ్బు పరదాల్లో దాక్కుంటావు
నా తలపుల చిత్తరువుకి రంగు లద్ది
నీ రూపంగా చిత్రిస్తావు చిత్రంగా !
వెన్నెలమ్మ వాకిట్లో
మేను వాల్చి నిదరోతుంటే
వేణువై వచ్చి ఎద మీటి పోతావు
కనురెప్ప వాల్చిన మరునిమిషం
కల లోకొచ్చి కలవరపెడ్తావు
తీరా ! కనులు తెరిచి చూస్తే కనుమరుగవుతావు..
నీ ప్రేమో ఏమో గాని ....
నా లో అనుక్షణం మది మధనం.
నీ నిరీక్షణలో నివ్వెరబోయెను నావదనం
నీ కై వేచిన క్షణాలు
నిప్పు కణిక లై వేధిస్తుంటే
నీతో గడిపిన మధురోహలు మాత్రం
మంచి గంధాన్నే పూస్తున్నాయి
మరపురాని ఆమధుర క్షణాలు మంచిముత్యాలేకదా...
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*