పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

11, డిసెంబర్ 2017, సోమవారం

😥పరితప్త హృదయాలు😥


నిశీధి యందున
నిర్లిప్త వదనాల
నిమీలిత నయనాల
నిర్వేదపు చూపులతో.. 
నిశ్చేతనులై నిషణ్ణులై
నిహతికై నిరీక్షించు
రెండు నిండు జీవితాలు ఆ ..
వృద్ధ మాతాపితరులు
నీలకంఠుని వేడి
తమ నెంజలి తీర్చగ
వరమిమ్మనియె, నిర్వృతి కొరకై 
ఆనక ఆత్మశాంతి నొందుటకై
కన్ను మూయు లోపు
తమకు రెక్కలీయమని వేడుకొనె
ఆ రెక్కల తో తమ
తనయుల దరికేగి
తనివి తీర చూసుకొని
తనువులు చాలిస్తామనె 
ఇది కడసారి చూపులకు
నోచుకోని కన్నవారి
హృదయ విదారక రోదన 
కనిపించని తనయులకై
కని పెంచిన వేదన . 
కాసుల మోజుల్లో విదేశాల
వ్యామోహపు బూజుల్లో 
కొందరు కన్నవారి ఋణం
తృణప్రాయం చేసి
కన్న భూమికి, కన్న తల్లికి
కడుపు కోత మిగిల్చేరు 
గోరుముద్దలిడిన తల్లి గోడు
పట్టని మూఢులెందరో
సర్వం తామై పెంచిన
తల్లిదండ్రులను కడదశలో
కర్మానికి వదిలేసి
రుధిరంపంచిన కన్నోళ్ళకు
కన్నీటిని కానుకిచ్చి
బ్రతుకు కటిక చీకటి చేసి
అతి కర్కశంగా
వృద్ధాశ్రమాల పాల్జేసిన
పరమకిరాతకులెందరో
నవమాసాల
కడుపుతీపిని
కాలరాసి,
కర్తవ్యంవిస్మరించి
నడి వీధిలో
విసిరేసిన నాసిరకం
మానవులింకెందరో
(అవసాన దశలో
కన్నవాళ్ళను కర్మానికి వదిలెళ్ళిన కన్నబిడ్డలకై తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల దయనీయరోదన..ఇది)
నేటి నీతల్లిదండ్రుల దుఃస్ధితి
రేపటి నీకొరకు వేచియున్న భవిష్యస్ధితి..అనితెలుసుకో
పచ్చనోట్ల కన్నా .. 
పచ్చడి మెతుకులు తిన్నా 
తల్లి తండ్రీ నీడనున్న నీ
జీవితమే మిన్న అని
కన్నవారి మనసునెరిగి మసలుకో.....
కన్న వారి ఋణం కాస్తయినా
తీర్చుకో....
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి