పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, డిసెంబర్ 2017, శుక్రవారం

ప్రణయమా అభివందనం....

ప్రణయమా అభివందనం....

ప్రేమంటే  గెలుపు
ప్రేమంటే మలుపు
ప్రేమంటే తియ  తీయని తలపు
ప్రేమంటే వసివాడని వలపు
ప్రేమంటే ఓదార్పు
ప్రేమంటే మాయని మైమరపు
ప్రేమంటే ఒక హాయి నిట్టూర్పు
ప్రేమంటే జత హృదయాల పలకరింపు
ప్రేమంటే ఒక తొలకరి పులకరింపు
ప్రేమంటే అనురాగసుధల చిలకరింపు
ప్రేమంటే నమ్మకమనే తెగింపు
నిజమైన ప్రేమెప్పుడూ త్రిప్పదు మడమ
ఓడిపోతే అది కేవలం మోహపు భ్రమ
ఎప్పటికీ ప్రేమ మకరంధాన్నే చిందిస్తుంది
కన్నీటిని చిమ్మిదంటే ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసిందనే
స్వచ్చమైన ప్రేమ మనిషి మట్టి కలిసినా
మనస్సునంటే  పయనిస్తుంది ,
మరణమన్నది మనిషికేగా .. మనసుకెందుకు అంటుతుందది
అందుకే ప్రణయమా ... నీకు  అభివందనం

అందుకో .. .. ప్రతీ మది నీరాజనం .
                                                                      సాలిపల్లి మంగామణి @శ్రీమణి
                                           pandoorucheruvugattu.blogspot.in

గోదావరి ముద్దుబిడ్డ దర్శకులు దర్శకులు వంశీగారితో

తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను

ఉత్తుంగ గంగా తరంగ
గోదారి గంగ సోయగం చూడంగ
రాజసమ్మొలికేటి రాజ మాహేంద్రము
కీర్తి అతిశయించంగ
పుత్తడి అక్షరాల లిఖియించినా...
సంపూర్ణమగునా నను గన్న గోదారి సౌందర్యమభివర్ణించంగ

అలలే మెరియంగ,
గలగలలే గగనానికి వినిపించంగ
చెంగు చెంగున దూకె
నిండు గోదారి గంగ.
నిత్య కల్యాణి సిరులు
మనకు గుమ్మరించంగా
ఆ సంభ్రమము కాంచంగ
మది  వేయి అక్షువుల కోరంగ

నింగి, నేలను కూడి నాట్యమాడంగా
నెలవంక విభ్రమయై
వీక్షించె విమల గోదారిగంగ
తల్లి గోదారమ్మ పాదాలు తాకంగ
ప్రణమిల్లుతూ పారాణి దిద్దగా

సూరీడు సుతారంగా
అంభరమే మురిసేను సంబరంగా
ముద్దాడ జూసేను
ముదిత గోదారిని సుతారంగా
కోటి పుణ్యాల ఫలమెమో
గోదారి నట్టింట నడయాడ
నా జన్మ సుకృతంబే గాద

కల్పతరువు, కామధేనువు కలగలిసిన గోదారి గంగ కొలిచిన వారికి కొంగు బంగారు తల్లిగా,
పిలిచిన వారికి నిత్య సౌభాగ్యమొసఁగంగ
అమ్మ గోదారి కౌగిట ఒదిగి పోవాలని
కొంగు పట్టుకు గారాలు ఒలక బోయాలని

చిలుక పలుకుల తోటి కవితలల్లాలని
చిన్ని ఆశ నాకు
తూరుపు గోదారమ్మ
నుదుటున తిలకమద్దాలని
చిన్ని ఆశ నాకు
తూరుపు గోదారమ్మ బిడ్డన్నేనంటూ
ధిగ్దిగంతాలకూ చాటి చెప్పాలని
చిన్ని ఆశ నాకు
ఏనాటికైనా తల్లి గుండెల్లోనే
కన్ను మూయాలని
చిన్ని ఆశ నాకు
గోదారి గంగమ్మ
అందియగా అమరిపోవాలని
                                              

గోదావరి అంటే వంశీ,
వంశీ అంటే అందరికీ గుర్తొచ్చే గోదావరి.
గోదావరి కీ వంశీ గారికిఉన్న అనుబంధం  తెలియని తెలుగువారుంటారా...
నా అత్యంత అభిమాన దర్శకులు వంశీ గారిని కలిసిన శుభతరుణం. కల నిజమయిన కమనీయ క్షణం..
ఆ అవకాశం కల్పించిన శ్రీ తాడిశెట్టి వెంకట్రావు మాజీ శాసన సభ్యులు,గుంటూరు వారికి కృతజ్ఞలు తెలుపుకొంటూ...

సాలిపల్లిమంగామణి@శ్రీమణి

https://pandoorucheruvugattu.blogspot.com

11, డిసెంబర్ 2017, సోమవారం

😥పరితప్త హృదయాలు😥


నిశీధి యందున
నిర్లిప్త వదనాల
నిమీలిత నయనాల
నిర్వేదపు చూపులతో.. 
నిశ్చేతనులై నిషణ్ణులై
నిహతికై నిరీక్షించు
రెండు నిండు జీవితాలు ఆ ..
వృద్ధ మాతాపితరులు
నీలకంఠుని వేడి
తమ నెంజలి తీర్చగ
వరమిమ్మనియె, నిర్వృతి కొరకై 
ఆనక ఆత్మశాంతి నొందుటకై
కన్ను మూయు లోపు
తమకు రెక్కలీయమని వేడుకొనె
ఆ రెక్కల తో తమ
తనయుల దరికేగి
తనివి తీర చూసుకొని
తనువులు చాలిస్తామనె 
ఇది కడసారి చూపులకు
నోచుకోని కన్నవారి
హృదయ విదారక రోదన 
కనిపించని తనయులకై
కని పెంచిన వేదన . 
కాసుల మోజుల్లో విదేశాల
వ్యామోహపు బూజుల్లో 
కొందరు కన్నవారి ఋణం
తృణప్రాయం చేసి
కన్న భూమికి, కన్న తల్లికి
కడుపు కోత మిగిల్చేరు 
గోరుముద్దలిడిన తల్లి గోడు
పట్టని మూఢులెందరో
సర్వం తామై పెంచిన
తల్లిదండ్రులను కడదశలో
కర్మానికి వదిలేసి
రుధిరంపంచిన కన్నోళ్ళకు
కన్నీటిని కానుకిచ్చి
బ్రతుకు కటిక చీకటి చేసి
అతి కర్కశంగా
వృద్ధాశ్రమాల పాల్జేసిన
పరమకిరాతకులెందరో
నవమాసాల
కడుపుతీపిని
కాలరాసి,
కర్తవ్యంవిస్మరించి
నడి వీధిలో
విసిరేసిన నాసిరకం
మానవులింకెందరో
(అవసాన దశలో
కన్నవాళ్ళను కర్మానికి వదిలెళ్ళిన కన్నబిడ్డలకై తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల దయనీయరోదన..ఇది)
నేటి నీతల్లిదండ్రుల దుఃస్ధితి
రేపటి నీకొరకు వేచియున్న భవిష్యస్ధితి..అనితెలుసుకో
పచ్చనోట్ల కన్నా .. 
పచ్చడి మెతుకులు తిన్నా 
తల్లి తండ్రీ నీడనున్న నీ
జీవితమే మిన్న అని
కన్నవారి మనసునెరిగి మసలుకో.....
కన్న వారి ఋణం కాస్తయినా
తీర్చుకో....
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

8, డిసెంబర్ 2017, శుక్రవారం

ప్రణయప్రబంధం

ప్రణయ ప్రబంధం 

ఎద నందన వనమున 
సుమసుగంధ వీచిక ప్రేమ
హృదిస్పందన శృతి లయగా 
వినిపించిన మృదుగీతిక ప్రేమ
మది సాంతం నిండియున్న 
వింత విషయసూచిక ప్రేమ
పడుచు మనసున విరిసిన మల్లియ ప్రేమ
కురిసిన వెన్నెల ప్రేమ 
కలలమాటున.... కనురెప్ప చాటున.... 
కన్నుగీటుతూ పలుకరించిన
కలవరింత ప్రేమ 
తొలి పులకరింత ప్రేమ 
ఇదే ప్రణయ ప్రబంధం 
జతహ్రృదయాలు
రాసుకొనే రసమయ గ్రంధం.
              
  సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

స్వరమనోహరి...మన ఎల్.ఆర్.ఈశ్వరి

మధురోహలమైమరపుల
రసరమ్య స్వరమాధురి
ఉవ్వెత్తున ఉప్పొంగే
సుస్వరాలసంగీత ఝరి
తుళ్ళింతల కేరింతల
గిలిగింతలచక్కిలిగింతల
కవ్వింతల కచేరీ
అల్లరిఊహలు
వెదజల్లిన
ఎదగిల్లిన
వింతవింతలాహిరి
కుర్రకారును
ఉర్రూతలూగించే
మాయామంత్రనగరి
మధురమధురగాత్రంతో
   తన్మయమొనరించే
మనమోహన
స్వరమనోహరి..
మన ఎల్.ఆర్.ఈశ్వరి
ఆ సుమధురగాయనీమణి
గళాన జారిన స్వరాలు వీనులవిందై..
వింతవింత
అనుభూతుల
మదిసాంతం
ప్రశాంతమై..
పరవశానమమేకమై..
తన్మయాన విహంగమై
   విహరించుటతధ్యం ...
వినీలగగనంపై
అణువణువణువునా గాత్రంలో
అతిశయాన్ని దాచుకొన్న
ఆస్వరమనోహరి..
ఎల్.ఆర్.ఈశ్వరిగారికి
జన్మదిన శుభాకాంక్షలతో
💐చిరుకవనసుమమాలిక💐
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

6, డిసెంబర్ 2017, బుధవారం

🙏మరువగలమా.మహాభిజ్ఞా..🙏

మరువగలమా...
మహాభిజ్ఞా.మహోన్నతమౌ
నీ మానవతా గరిమా...,
అభివర్ణించగలమా...అభిజ్ఞా..
నీ అత్యద్భుత కర్తవ్యధీక్షా పటిమ.
అక్షరాలుచాలునా.. అంబేద్కరా..
అలుపెరుగని అకుంఠిత సేవాస్ఫూర్తికి,
కడజాతి వారికై కదనరంగ
సింగంలా...ఎడతెగనీ..నీ తెగింపు.

మరువగలమా..
సమసమాజ స్థాపనకై
అస్ప్రశ్యత శృంఖలాల 
తెగనరకుటకై,
వెలివాడల బ్రతుకుల్లో..
తొలిదివ్వెను రువ్వేందుకై
దళిత జనోద్దరణకై,
నువ్విచ్చిన పిలుపును,
మధన పడే బ్రతుకుల్లో...
నువ్విచ్చిన ఓదార్పును,

మరువగలమా...
నువ్వందించినమహోత్క్రుష్ట
రాజ్యాంగంతో, సమానత్వానికై
నువు సాగించిన సమరాన్ని,

మరువగలమా...
ధరిత్రి వున్నంతవరకూ..
చెరగని చరిత్ర కదా..నీ తలంపు.
ఓ.మనీషీ...
ఓ..మహర్షీ...
ఓ...మహాభిజ్ఞా...
ఓ....మార్గదర్శీ...
ఓ.....మానవతామూర్తీ...
ఆచంద్రతారార్కమూ..
భరతజాతి అభివందనాలు మీకు,
నిమ్నజాతికై నిన్నటి నీ కృషికి
నిత్య నీరాజనాలు మీకు,
అంతరాలు చెరిపేసి
సమాంతరాలు కల్పించిన
కరుణాంతరంగుడా..
వందల తరాలు మారినా..
వేలవేల అభివందనాలు మీకు...

అంబేద్కర్ వర్ధంతి సంధర్భంగా...
నివాళులర్పిస్తూ

సాలిపల్లి మంగామణి (శ్రీమణి)              

మహాభినేత్రి...మన సావిత్రి

ధరిత్రి వున్నంత వరకూ
ఆంధ్రజాతి చరిత్రలో
సువర్ణాక్షరాల లిఖియించగ
యావత్ వెండితెర ప్రపంచానికే
వెలుగులద్దిన మకుటంలేని
మహా సామ్రాజ్యాధినేత్రి
అద్భుతమైన హావభావాలతోనే
అలవోకగా నవరసాలొలికించి
తన అనన్య సామాన్యమైన నటనతో
మనల్ని మంత్రముగ్ధుల్ని గావించిన
ఆంధ్రుల హృదయాభి నేత్రి
మహా ధీరో ధాత్రి
క్షమయా ధరిత్రీ
మనోజ్ఞమూర్తీ
మానవతామూర్తి
మేటి మహిమాన్విత కీర్తి
మహానటి మన సావిత్రి

వారి జయంతి సందర్భంగా..
ఆమెకు ఈ కవన సుమ మాలిక

సాలిపల్లిమంగామణి (శ్రీమణి)

4, డిసెంబర్ 2017, సోమవారం

ఘంటశాల జయంతి సంధర్భంగా

ఓ సుమధుర గీతాల
సంగీత పాఠశాల
ఓ అమృత సుస్వరాల
కమ్మని వంటశాల
దివినుండి భువికి
ప్రభవించిన సరస్వతీ కళ
ప్రవహించె గాన గంధర్వుమయి
ఇల ఘంటశాల
ఆ మహా గాయకుని కని
పరవశించెనుకదా తెలుగునేల
ఆ అభిజ్ఞుని అభివర్ణించగ
నాకలాన కొచ్చిన భాగ్యమే కద
ఆ సంగీత సార్వభౌముని సన్నుతించగ
పదములున్నవా పృధివి పైనా
అయినా నాలుగు మాటలు
కవనంలా మీకు వినిపించే
ధైర్యం చేస్తున్నా ... 

సిరిమువ్వల సవ్వడిలో
చిరు జల్లుల సందడిలో
విరి తేనియ పుప్పొడిలో
మరు మల్లెల తాకిడిలో
పరువాల ఒరవడిలో
పల్లవించెను పాటై
మది మీటే మరువంపు తోటై
ఘన ఘంటశాల నోట

మధుర మధుర మకరందపు తేట
ఆణిముత్యాల మూట
మంచి గంధాల పూత
ఎల కోయిల పాట
అది చిగురాకు చిటపట
జిలిబిలి సొగసుల పోత
చిలికిన అమృత కలశమట
పల్లవించెను పాటై
మది మీటే మరువంపు తోటై
ఘన ఘంటశాల నోట

గాంధర్వమనిపించే
ఘనమైన గళమదియట
కమనీయ మదియట
ప్రభవించిన రవితేజమట 
పల్లవించిన పరమపదమట 
ప్రతిపదాన నడిచొచ్చిన
నవరాగమదియట 
నరనరాల ప్రవహించిన
తెలుగు రుధిర గరిమయట
పల్లవించెను పాటై
మదిమీటే మరువంపుతోటై
ఘన ఘంటశాలనోట

(శ్రీమాన్ ఘంటశాల గారి జయంతి సందర్భంగా....
చిరుకవన మందార సుమమాలికతో...
నివాళులర్పిస్తూ
ఆయన గగనసీమకు పయనమై దశాబ్దాలు దొర్లినా ఆయన మనకు ప్రసాదించిన సజీవ గానామృతాస్వాదనలో తరిస్తూ...

సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

3, డిసెంబర్ 2017, ఆదివారం

నీకోసం

నీకోసం

నీకోసమే నే వేచియున్నా... 
ప్రతి  కదలికలో నిన్నే చూస్తున్నా  
ఆ జాబిలి  నీవైతే ... 
కలువను  నేనవుతా 
ఆ మధుపం  నీవైతే ... 
మధూలికను  నేనవుతా 
నీలాకాశం నీవైతే ... 
హరివిల్లును  నేనవుతా 
ఆ మనసిజుడివి నీవైతే ...
నీ మనసెరిగిన
సతి నేనవుతా 
కన్నులు నీవైతే ...
భాష్పం నేనవుతా 
అధరం నీవైతే
ధరహాసం నేనవుతా
మెరిసే మేఘం నీవైతే ... 
మురిసిన మయూరి
నేనవుతా 
చిగురుమావి  నీవైతే ... 
చిరు కోయిల నేనవుతా 
ఆ  మాధవుడవు నీవైతే ... 
నీ రాధిక నేనవుతా .... 
         సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

2, డిసెంబర్ 2017, శనివారం

రక్తమోడ్చు రహదారులు

రక్తమోడ్చురహదారులు

నేడు రహదారులపై ప్రయాణాలు
సాక్షాత్ యమలోకపు
దారులు
ఆధునికవాహనాల
శరవేగాలు
మనను కబళించే
మ్రృత్యుపాగాలు
నేటి మరజీవనంలో
ఇదిషరా..మామూలు
ఎక్కడచూసినా
రక్తమోడ్చు రహదారులే
దుఃఖ సంద్రాన నిండిన
నిండు జీవితాలే
గడపదాటి బయలెల్లిన
బాటసారి
మరల తిరిగి వస్తాడని
బ్రతికి బట్ట కడతాడని
భరోస వుందా నేడు
నిదానమేప్రధానమని
వాహనాలపై అక్షరాలు
అలంకారమేగాని
నిజానికి నినాదాన్ని పాటించేదెందరు
మత్తుల్లోతూలుతూ
తోలుతారువాహనాలు
చరవాణిని చేబూని నిదరోతూనడుపుతారు
శిరస్త్రాణం త్యజియించి
వేగాన్ని హెచ్చించి దూసుకుపోతుంటారు
నియమాలకు నీళ్ళొగ్గి
నిర్లక్ష్యపునీడల్లో పయనంచేస్తుంటారు
ఉడుకునెత్తురుఉరుకులాటలో
పరుగులు తీస్తుంటారింకొందరు
ఒక్కక్షణం
ఒకేఒక్కక్షణం
ఆగి ఆలోచించండి
మీనిర్లక్ష్యపు పోకడకూ
భాద్యతారాహిత్యానికీ
నిర్ధయగాబలయ్యేదీ
అనాధలై మిగిలేదీ
అభాగ్యులుగ మారేదీ
గుండె పగిలి ఏడ్చేదీ
అన్యంపుణ్యం ఎరుగని
నిన్ను నమ్ముకొన్న కుటుంబమే
అని మరచిపోకునీవు
నియమాలను మీరిపోకునీవు
అది...ప్రమాదాలకు తావు
కొనితెచ్చుకోమాకు...చావు
(నేటిఉరుకులపరుగుల యాంత్రికజనజీవనంలో ..
అడగడుగునా
ఎన్నోప్రమాదాలతో
రక్తమోడుతున్న రోడ్లు..తెల్లవారితే తెల్లారిపోతున్నజీవితాల కధనాలతో నిండిపోతున్న వార్తాపత్రికలను చూసి చలించి వ్రాసిన కవిత......)
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

23, నవంబర్ 2017, గురువారం

మంగళంపల్లివారి వర్ధంతి సంధర్భంగా

గాన గాంధర్వులు
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి
ప్రధమ వర్ధంతి సందర్భంగా....
ఆ మహా గాయకుని స్మరణలో...
🌷చిన్న కవనంతో నివాళి🌷

ఉరికే సంగీత ఝరి,
స్వర రాజశిఖరి,
మధురిమల పలుకుసిరి, 
సరిగమల రసరమ్య లాహిరి,
కర్ణాటక సంగీత విరి సిరి
చందనాల విభావరి
ఆణిముత్యాల సరి 
మైమరపుల కచేరి 
మలయ మారుతాన్నే మీరి
అలరించిన మానసచోరుని
మహాభినిష్క్రమణం
యావత్ సంగీత సామ్రాజ్య మహాంతస్థాపము 
నిన్నటి ఆసమ్మోహన స్వరం
నేడు స్వప్నమయి ఎదురయితే
ఆ గానమినిపించక
మౌనమాయేను భాష సైతం
ఆ మురళి సవ్వడి లేక
మూగబోయేను పలుకు కూడ
సరిగమలతో స్వర్ణరాగాలు
పలికించి కొసరి, కొసరి 
సుస్వర  రాగాల వర్షించి
తత్వాన్ని, అమృతత్వాన్ని
పలుకు తేనెల తో చిలుకరించి
భక్తి కీర్తనల భజియించి
శ్రీవారి ఆస్థానమలంకరించి,
వారి నలరించగ
నేరుగా స్వామిపాదాల చేరి
వేణువై గాలిలో ఏకమైనా సామి
ఏమి సేతురా సామి మే మేమీ సేతు 
నువులేని లోటును తీర్చువారెవరూ
మన్మోహన సమ్మోహన
మాధుర్యగళం మరలి రాని
లోకాలకు తరలిపోయినా
ఘనాఘన గాన గాంధర్వ
మురళీ రవం గగనసీమలకెగసినా
రతన స్వరరస రాజమౌళి
సుర స్వర సేవకై దివికేగినా
ఏడేడు లోకాలఏడనున్నాగాని 
ఆబాల గోపాలమూ
బాలమురళీ రవమును
ఎడతెగని ఆర్తితో ఆలపిస్తూ 
మంగళం వారికి మంగళ
నీరాజనాలర్పించు కొంటూ 
మా గుండె గొంతుకలో
నిండిపోయిన సంగీత చక్రవర్తికి నివాళులర్పిస్తూ ...
ఆ గానగాంధర్వుని
ఆత్మకు శాంతి కలగాలని 
ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ...... 
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)
           

22, నవంబర్ 2017, బుధవారం

మహి"ళ"

ఆడుబుట్టువు లేక ఆదిఅంతములేదు 
సుదతి  లేని  సృష్టి శూన్యమేగా.. !ఇక
మహిళ లేని మహిపై మనుగడేదీ
పడతి పుట్టుక లేక పరిపూర్ణతుండునా..
ఇభయాన లేని ఇహముండునటయా..
కలకంఠి లేక కళగట్టునానేల
అనంతజీవన ప్రస్థానంలో 
ఆమే జగతికి ప్రధమస్ధానం
అరుదగు వాక్యం స్త్రీ మూర్తి 
అక్షరాలకందని భావం 
అత్యధ్భుత కావ్యం
అనంతసృష్టికి ప్రతిరూపం 
అమృతమయమవు
ఉర్వీ రూపం
అమ్మాయి గా పుట్టి 
అర్ధాంగిగా మెట్టి 
అమ్మగా మరుజన్మమెత్తి 
బామ్మగా పదవి  చేపట్టి 
అడుగడుగునా త్యాగం,
అంతులేని అనురాగం 
రంగరించి అద్భుతమైన స్త్రీ జన్మను 
సఫలం గావించిన స్త్రీ మూర్తిని 
పొగిడేందుకు చాలునా
పృధివి పైన పదాలు. 
రాసేందుకు చాలునా... రాతాక్షరాలు, 
ఊహించగలమా !
మహిళ లేని మహిఆనవాలు 
పసికందులను త్రుంచి,
త్రృణప్రాయముగనెంచి
ఆదిమూలమునందె చిదిమిపారేదురే...
జననిలేదన్నచో జగమున్నదటయా...
యోచించిచూడరే ఒక ఘడియయినా
పూజించుపడతిని..
పుడమితల్లిగనెంచి
గౌరవించుము తనని ఆదిశక్తిగతలచి...
(ఎంతోమంది గర్భస్ధశిశువు ఆడపిల్లలని తెలుసుకొనిఆదిలోనే అంతంగావిస్తున్న..పైశాచిక చర్యను నిరసిస్తూ...ఆడుబిడ్డలను కాపాడమని...అభ్యర్థిస్తూ...)
           సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

21, నవంబర్ 2017, మంగళవారం

కల"వరం"

"కల "వరం

అమ్మ గర్భం నుండి భూమ్మీద పడగానేమొదలైంది అడుగడుగునా వడ్డింపు ప్రక్రియ,పురుడుపోసినందుకు
చేన్తాడంత ఆసుపత్రి బిల్లు
అదిచూసి నాన్న గుండెజల్లు
అలామొదలయింది బిల్లుల పరంపర..
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
అవసరాల ధర ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటుబిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల
అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో
తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో      పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... నిద్దరెలా వస్తుంది.
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ
ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి
అమ్మ చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
"వెల"పెరిగిన వేగంతో నెలజీతం పెరగదేం?
నిత్యావసరాలు నిచ్చెనలెక్కేస్తున్నయ్  నల్లఖజానాలేమో
నింగినంటుకొన్నయ్.
మంచంలేచిన మొదలు లంఛం లాంఛనమాయె,
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవితంలోమాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
నేటి మద్యతరగతి భర్తకి
భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరే అడ్డు వస్తుంది
తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు ఎంతమంది పిల్లల్నికన్నా  అంత ఆనందంగా పెంచగల్గేవారు
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కాలని ఆశవుండేది..ఆశ మాటెలావున్నా
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  
లభో దిభో మంటుంటే
నిద్దరెలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే
చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప
మతి లేక తప్పు చేసిన వాడికంటే ,
గతి లేక చేసిన వడ్డీఅప్పే
పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు "కలవరం"తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రృత్యమయిపోయే
మద్యతరగతి మానవుడికి
ఈ కలచి వేసే మధ్యతరగతి      బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????
 సాలిపల్లిమంగామణి@శ్రీమణి
                                       

19, నవంబర్ 2017, ఆదివారం

పురుషులదినోత్సవ సందర్భంగా...

ప్రతీసారీ స్త్రీ ని ప్రస్తుతిస్తున్నాని
నేను స్త్రీ పక్షపాతినికాదు.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
అని వేమన గారే శలవిచ్చారు.
అందరూ పుణ్యపురుషులు కాకపోయినా పురుషులూ
మహనీయులే..త్యాగమూర్తులే
(అలాంటి పురుషోత్తములకోసం పురుషుల దినోత్సవసంధర్భంగా..)

స్రృష్టికి మూలం స్త్రీ అది వాస్తవమే...అయినప్పటికీ పురుషుని జతలేక స్రృష్టి ఊహించగలమా!
ఒకబిడ్డకు జన్మనిచ్చుటలో
ఒక తల్లి మరుజన్మెమెత్తితే
ఆబిడ్డజన్మించిన మరునిమిషంనుండే
తను కన్న బిడ్డను కంటిపాపగా
కంటికిరెప్పగా కాపాడుకోడానికి
ఒకతండ్రి తన జన్మంతా శ్రమిస్తూనే వుంటాడుకదా....
స్త్రీ ఎంత శక్తిస్వరూపిణి అయినా
పురుషుని సాహచర్యం తప్పనిసరి...కదా
కన్నబిడ్డల కళ్ళలోకళకళలు చూడాలని...తను కణకణమండినా
సంతోషంగా భరించడా...ఓసగటుతండ్రి
భార్యాబిడ్డల అవసరాలు
తీర్చేందుకు మండుటెండనుసైతంలెక్కచేయక రేయింబవళ్ళుగొడ్డులా కష్టపడేపురుషులులేరంటారా..
ఒకతండ్రిగా
ఒకసహోదరునిగా..ఒక భర్తగా
స్త్రీ జీవితంలో ప్రతీదశలో...విశిష్టమయిన
భాద్యత పురుషునిదే అనడంలో సందేహంలేదు
భాధ్యత వహించడంలో
భరోసా నివ్వడంలో తండ్రి,సహోదరుడు
తరువాత భర్త..
ఏదేమైనా స్త్రీ రక్షణలో ఏదేని దశలో పురుషుని భాద్యతాయుతమైన పాత్ర కనిపిస్తుందికదా...
కన్నబిడ్డలకు
అడగక ముందే అన్నీ ఇచ్చి
తన ప్రాణం కన్నా మిన్న గా
కాపాడుకోంటూ
అమ్మకడుపారా జన్మనిస్తే
తండ్రిమనసారా
మనచిటికిన వేలును పట్టి
చిట్టి ,పొట్టి తడబడుఅడుగుల దారుల నుండీ ముళ్ళుగుచ్చకుండాతన అరిచేతిని పానుపుగా పరచి 
బొజ్జ నింపిన  అమ్మకు సరిగా 
అనురాగపుఉగ్గుపాలు తాగించి
అమ్మనేతలపించడా
అమృతాన్నే చవిచూపించడా తనలాలనలో. . 
ఎన్నెన్ని సంఘర్షణల తలమునకలవుతున్నా 
చిరునవ్వులే తన బిడ్డలమోమున విరబూయిస్తూ
కష్టాలు కన్నీళ్ళకు
తనుకావలి కాస్తూ
ఆవల
ఆనందపుఅంచులలో
తనబిడ్డలకూర్చోబెట్టే ఆఅనురాగమూర్తులైన
తండ్రులూ త్యాగమూర్తులే
అందులకే అందుకోండి
పిత్రృమూర్తులూ...
అభివందనాలుమీకు.
ఆడపడచులపాలి ఆపన్నహస్తమై,
తోబుట్టు పాదాలపారాడే పచ్చనిపారాణియై
అడుగడుగునా...
అతివకొంగుబంగారమై
నేనున్నానంటూ...వెన్నంటి కాపాడే సురక్షాకవచాలు...
ఆడపిల్లల నయనాల ఆనందబాష్పాలు..
అనురాగాల రూపాలు
వేరెవరు కారుగా
అమ్మలోనిఅనురాగం
నాన్నలోని వాత్సల్యం
కలగలిపిన మమకారం
ఆఅన్నదమ్ములే....
అన్నదమ్ములూ....
అభివందనాలుమీకు
ఇక నమ్మివచ్చిన సహధర్మచారిణికి తోడుగానీడగా
నిండు నూరేళ్ళు జంటగా బాధ్యతా...భరోసా..భర్తేగా...
ధర్మేచ,అర్ధేచ,కామేచ,మోక్షేచ,నాతిచరామి అనే కళ్యాణ మంత్రంతో  చేసిన ప్రమాణాలకు విలువనిస్తూ..
సర్వకాలసర్వావస్ధల యందు తాళికట్టిన సహధర్మచారిణికి తోడుయై,నీడయై,పరిపూర్ణమై
బ్రతుకునూరేళ్ళపంటగా ఫలియింపజేసి
నూరేళ్ళూ గుండెల్లో గుడికట్టి ప్రేమించేభర్తలూ...
అభివందనంమీకు.
పురుషుల దినోత్సవం సందర్భంగా..
పురుషులూ...అభివందనాలుమీకు
శుభాభినందనాలు మీకు...
        మీ సహోదరి
               శ్రీమణి.