పరవళ్ళు తొక్కేటి ఉప్పొంగిన గంగా తరంగంలా, పాలసంద్రపు నురగలా ,జున్ను మీగడతరగలా, గలగల సాగే సెలయేటి పన్నీటి వరదలా ,ఎల కోయిలల చైత్ర మాస వేవేల మకరంద గీతాలా, పలుకు తేనెల కొలికి అలివేణి అధరాల పారాడు ఝుంటి తేనియ తుంపరలా , పసిడి పచ్చని తోటలో విరబూసిన కుసుమ సరాగంలా ,గగన ఫలకంపైన అద్దిన సువర్ణాక్షరాల తేజో విరాజంలా ... అల నీలిమేఘాల వీధుల్లో విహరించు రాయంచ సోయగంలా ...
అణువణువు పరవశాన మైమరచే మధురోహల మాలికలా ..
వేయి ప్రభాకరుల ప్రభలనే తలపించు మహోజ్వల తేజో ప్రకాశం లా. శతకోటి చందురుల వెన్నియల తలదన్ను చల్లదనమంతా నా తెలుధనమందుండ , ఏ వెలుగులునింపగలవు నిశీధి హృదయంలో నిజమగు దివ్వెలను . నన్నుగన్న నా తెలుగు నేలను మరిపించు మధురముందా మహీతలంపై . నే పీల్చే గాలి సైతం తెలుగు ఊపిరులూదినట్టుండగా .. నేనెలామనగలను ... తెలుగు లేని తావుల్ల లోన . తెలుగు లేని తెలుగు బిడ్డకు పరిపూర్ణమైన మనుగడేది . తేట తెలుగును నోట పలకని జన్మమేమని చెప్పగలము. తెలుగులమ్మ కడుపునపుట్టి .
చేతులెత్తి మ్రొక్కుతాను . తెలుగన్నదమ్ములార .. తేట తెలుగు మాటనే మీ నోట పలకండి . తెలుగు తేనెల మూటని చాటి చెప్పండి . అవసరానికి ఇతరభాషను ఆశ్రయించినాగాని ... అమ్మలాంటి కమ్మని మాతృభాషను మాత్రం మరచిపోకండి . పరభాషా మోజుల్లో తెలుగుకి బూజులు పట్టించొద్దు . తెలుగుతల్లి గుండెల్లో గుభుళ్ళు . పచ్చని తెలుగు పైరులో తెగుళ్ళు మాత్రం పుట్టించొద్దు . తెలుగులమ్మ ఋణం తీర్చగా తెలుగును దిగ్ధిగంధాలా చాటి చెప్పేద్దాం . తెలుగువెలుగుల కీర్తి బావుటా ఎల్లలు దాటి ఎగురవేద్దాం .... ఈక్షణం నుండే తెలుగు భాషా మహాయజ్ఞం కొనసాగిద్దాం .
మాతృ భాషా దినోత్సవ సందర్భముగా బ్లాగరులు అందరికీ
"మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు"
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి