పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, ఆగస్టు 2015, గురువారం

నేమాని

అభినందన పత్రిక


సుప్రసిద్ధ రసాయనిక శాస్త్రవేత్త ,ఉత్తమ అధ్యాపకులు అత్యుత్తమ పరిశోధకులు ,చిత్ర కళా కోవిదులు, శిల్పివరేణ్యులు అయిన ఆచార్య నేమాని కృష్ణ మూర్తి గారికి సహస్ర చంద్ర దర్శన మహోత్సవ సందర్భంగా కళావేదిక (నండూరి రామకృష్ణ ),విశాఖ రసజ్ఞ వేదిక (రఘు రామారావు ) మరియు వారి శిష్య బృందం వినమ్రతతో సమర్పించే అభినందన చందనం . 
1933 డిసెంబరు 12 వ తేదీన తనకు తన కుటుంబానికి సర్వం సిద్దింప చేసిన సర్వ సిద్ది రామవరం గ్రామంలో శ్రీమతి లక్ష్మీ నరసమ్మ ,  శ్రీ లక్ష్మీ నారాయణ దంపతుల 3 వ సంతానం గా జన్మించారు . శ్రీ నేమాని కృ శ్రీ నేమాని ష్ణమూర్తి గారు

ఖండాంతర యశో విశాలా !

రసాయనిక శాస్త్రంలోనాలుగు దశాబ్దాలుగా మీరు చేసిన అవిరాళ కృషికి నిదర్శనం మీ రచనలు. శిష్యగణమూను, లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా, న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫెలోగా, ఆస్త్రియన్లో లైసన్ బోర్డు మెంబరుగా ఉండడంతో పాటు ఆస్ట్రియా, ఇటలీ, ఇరాన్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్స్ ,అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, వివిధ వైజ్ఞానిక సదస్సులలో పరిశోధక పత్రాలు సమర్పించి దశదిశలా విశ్రాంత యశులై మీ శిష్య కోటికి మార్గదర్శకులయ్యారు . . 


పరిశోధక పరమేష్ఠీ !

ఆంధ్ర విశ్వకళా పరిషత్ రసాయనిక శాస్త్ర విభాగంలో పరిశోధనకు పట్టంగట్టి 40 మంది విద్యార్ధులకు పర్యవేక్షణ వహించిన పరిశోధక పరమేష్ఠి మీరు . పరిశోధనారంగంలో మీరు చూపిన సర్వతోముఖ ప్రతిభావ్యుత్పత్తులను సర్వ సంభావనీయాలుగా గుర్తించి మీ సిద్ధాంత వ్యాసానికి ఉత్తమ సిద్ధాంత వ్యాస పురస్కారాన్ని ,మీకు ఉత్తమ పరిశోధక పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది ..ఆంధ్ర విశ్వకళా పరిషత్తు. జాతీయ , అంతర్జాతీయ వైజ్ఞానిక సంచికల్లో మీ పరిశోధనా వ్యాస పరంపరలు తమ కీర్తిని వెదజల్లుతూ ఉన్నాయి . 1979 లో మీ రచన మెథడ్స్ ఇన్ ఎంజైమాలజీని న్యూయార్క్ లోని కార్నిల్ విశ్వవిద్యాలయం ప్రచురించడం ఆ పుస్తక ప్రామాణికతను చెప్పక చెప్తోంది. ఆకాశవాణి ద్వారా మీరు వినిపించిన వైజ్ఞానిక తరంగాలు ఆంధ్రుల అంతరంగాలను అలరించాయి . 







చిత్ర కళా కోవిదా !

వర్ణ మిశ్రమాలు రసాయినాల్లోనే  కాకుండా మీ ఎదలో కూడా చోటు చేసుకొని మీ చేతి కుంచె ద్వారా అపురూపచిత్రాలుగా ప్రాణం పోసుకున్నాయి ధన్వంతరి, చరుకుడు వంటి బిషగ్వరులు , వాల్మీకి, వ్యాసుడు , కాళిదాసాది కవికుల గురువులు . ఐన్ స్టీన్మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి శాస్త్రజ్ఞులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, కర్ణాటక సంగీత త్రిమూర్తులు, నన్నయాది తెలుగు కవులు జీవకళ ఉట్టిపడుతూ మీ చేతిలో రూపుదిద్దుకొన్నారు . నెహ్రూ  వంటి దేశనాయకులూ, శ్రీ కందుకూరి శివా నందమూర్తిగారి వంటి గురుమూర్తులు చిత్రాలు మీకు ఆయా వ్యక్తులఫై గల గౌరవానికి నిదర్శనాలు . ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తిక్కవరపు లక్ష్మీనారాయణ గారి సభలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉపాధ్యక్షుల నిలువెత్తు చిత్రాలు . విశాఖపట్టణం కళా భారతిలో లో తెలుగు కవులు  నన్నయ్య, తిక్కన ఎఱ్ఱన, శ్రీనాధ పోతనలు, త్యాగయ్య ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల చిత్రాలు మన సాంస్కృతిక వారసత్వాలుగా నిలిచి ఉండటం ఒక ఎత్తు అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అతిధిగృహంలో  ఎనిమిది అడుగుల గురజాడ అప్పారావుగారి చిత్రపటం హైదరాబాద్ అసెంబ్లీహాలులో ఎనిమిది అడుగుల తెన్నేటి  విశ్వనాధం గారి చిత్రం, జపాన్ లో గాంధీ చిత్రపటం, అమెరికా లో త్యాగయ్య చిత్రపటం ఉండటం మరో ఎత్తు. గీతోపదేశం కురుసభలో పాంచాలి వంటి పౌరాణిక ప్రతిపత్తి గల మీ చిత్రాలు భావితరాలకు చిత్రకళలో మార్గదర్శకాలుగా నిలిచేవి.

శిల్పివరేణ్యా !

ప్రముఖ శిల్పి ఆదిరాజు సుబ్రహ్మణ్యం గారి శిష్యరికంలో మీరు నేర్చిన విద్య ఎంతగానో రాణింపు పొందింది. మీరు శిల్పీకరించిన గౌతమబుద్దుని శిల్పం ఆంధ్ర విశ్వకళాపరిషత్ గ్రంధాలయ ప్రవేశ ద్వార సమీపంలో దర్శనమిస్తూ 'ధర్మం శరణం గచ్చామి' అనే సూక్తిని విద్యార్థులకు జ్ఞప్తికి తెస్తూ ఉండడం ముదావహం.

వివిధ పురస్కార విజేతా!

కళా వైజ్ఞానిక రంగ ప్రతిభులైన మిమ్మల్ని ఎన్నో పురస్కారాలు వరించాయి. ఇంటా బయటా కూడా పెక్కు పురస్కారాలను గెలుచుకున్న ప్రజ్ఞామూర్తులు మీరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమెరికా వారి మిలీనియా అవార్డును చేపట్టారు. ఉత్తమ పరిశోధక, ఉత్తమ అధ్యాపక, సియస్ఐఆర్ వారి ఎమరెటస్ సైంటిస్ట్ పురస్కారాలతో పాటు              శ్రీ సోమేశ్వర సాహితి, అడవిబాపిరాజు ట్రస్టువారి చిత్ర కళాపురస్కారాలు, న్యాయవాది శ్రీ శివరామదాసు గారి స్వర్ణ పతకం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ద్వారా స్వర్ణ పతకం, మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, మా టీవీ విశాఖ స్వభాను ఉగాది పురస్కారం, అఖిల భారత హస్త కళావేదిక ఢిల్లీవారి స్వర్ణ పతకం, ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్ ఢిల్లీ వారి భారతదేశపు ఉత్తమ పౌర సన్మానపతకం మీ కీర్తికిరీటపు ధగధగలలో కొన్ని మాత్రమే.




బహు దేశ నాయక సమ్మానిత శాస్త్రకళాభిజ్ఞా!

మీ అదృష్టం సాటిలేనిది. దేశనాయకులెందరో మిమ్మల్ని సన్మానించి ఆనందించారు. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఉపప్రధాని బాబుజగజ్జీవన్ రామ్., రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్, ఉపరాష్ట్రపతి శ్రీకృష్ణ కాంత్ , గవర్నర్ కుముద్బెన్ జోషి, శ్రీ  పీ.వీ.రంగయ్యనాయుడు, శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి, శ్రీ భీమసేన్ సచార్, జనరల్                    శ్రీ కె.వి. కృష్ణారావు, ప్రధాన న్యాయమూర్తులు శ్రీ ఆవుల సాంబశివరావు, శ్రీ పున్నయ్య, లోక్ సభ స్పీకర్ శ్రీ గంటి మోహనచంద్ర బాలయోగి ,ఇటీవల కాలంలో మాజీ ప్రధాని శ్రీ పి .వి .నరసింహరావు గారు మిమ్మల్ని సన్మానించిన మాన్యులు .

సువర్ణ కంకణ విభూషితా !

కళా వైజ్ఞానిక రంగాలలో అందె వేసిన మీ చేతికి సువర్ణ కంకణాలు ,సింహ తలాటాలు అలంకరించడంలో ఆశ్చర్య మేముంది . సువర్ణ రజత పతకాల సంఖ్యకు లెక్కేముంది .

అనురాగ అర్ధాంగ లక్ష్మీ సంపన్నా !

మీ శాస్త్ర రంగంలోనూ ,అంతరంగం లోనూ మిమ్మల్ని అనుసరించే ఇల్లాలు మీకు లభించడం అదృష్టాల్లోకెల్లా అదృష్టం . మీరు కృష్ణులయితే ఆమె రుక్మిణి కావడం దైవ నిర్ణయం. మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా గుర్తించి కళావేదిక సన్మానించడం అభినందనీయం. ఆచార్యులైన మీ ఇద్దరూ కలిసి "మానవ మనుగడలో రసాయన శాస్త్రం" అనే రచనను కూర్చడం అపూర్వం.

ఆచార్య సార్వభౌమా !

తన ఎద ఎల్లమెత్తన, శిష్యులన్న ఎడదం గల ప్రేముడి చెప్పలేని మెత్తన అన్నట్లు మీ శిష్య వాత్సల్యం ఎనలేనిది.         మీ పర్యవేక్షణలో శాస్త్రజ్ఞులుగా రూపొందిన మేం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం . మా ఎదలో మీ యెడల గల భక్తిని ఈ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకను జరిపించి ఛాత్ర గణ సంపూజితులు ,అంతే వాస్యుపాసితులు అయిన మీరు మాకీ అపూర్వ, అపురూప అవకాశం  ఇచ్చినందుకు కృతజ్ఞతా పూర్వక వందనాలు. శిష్య గణ భక్తి భూషణ భూషితులైన దంపతులు ఇరువురికీ  ఈనాడు సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకలను నిర్వహించే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తూ .. .. ..
                                           
                 మీ శిష్యకోటి,మరియు కళావేదిక (నండూరి రామకృష్ణ ),విశాఖ రసజ్ఞ వేదిక (రఘురామారావు )



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి