అలివేణి ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి తుమ్మెద ఝుమ్మని గ్రోలబోయెనే
ఇoదువదన సౌదర్యం మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా
ఉవిద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా
ఎలతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే మెలకువ తేగా
ఎలతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే మెలకువ తేగా
కలికి కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా
చెలియ సిగ సోయగానికి మల్లియ అందం వెలవెల బోగా
జవ్వని జడపాయలు మెలికలు జలపాతపు ఒంపులతో తలబడిపోయే
తరుణీమణి నుదుట తిలకం అరుణారుణ కిరణంలా మెరుపులీనుతుంటే
ధారణి ధరహాసపు ధగధగ జలతారును మరిపిస్తుంటే
నెచ్చెలి నడకల వయ్యారము మయూరికే మతి,భ్రమిస్తే
పడతి కులుకులు పంచదార గుళికల చవులూర చిలుకలూ కినుక వహిస్తే
భామిని సౌందర్యాన్ని ఏమని వర్ణించాలని కవి కవనం కవ్విస్తుంటే
ముదిత మోమును ముద్దాడిన ముంగురుల భాగ్యమే భాగ్యమో
యవ్వని కరమున జాలువారిన రంగవల్లికి యోగమేమని చెప్పగలము .
రమణి తలపులు తడిమిచూసిన కలల రాతిరి ధన్యమే కద
లలన తనువున నాట్యమాడిన చీరదే జన్మవరమో
విరిబోణి పాదాల పారాడె అందియల ఆనందమేలాగు వర్ణించగలము
శోభనాంగిని అలంకరించిన సిరి చందనాలదేమి పుణ్యము
సురదన సుందర వదనం తాకిన మలయమారుతమ్ముదెంత సుకృతము
హoసయాన మిసమిసలు గాంచిన అసలు సిసలైన జతగాని అదృష్టఫలమెంత లెక్కించ గలమా ...........
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి