పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, జూన్ 2014, శనివారం



గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలావో

మరమ్మత్తు చేయలేని మరబొమ్మై మిగులుతావు

సాలిపల్లి మంగామణి @శ్రీమణి

27, జూన్ 2014, శుక్రవారం

మేటి రతనాలవిరిబోణి నా విశాఖ

        


ఎటు  చూసిన  ఆహ్లాదం ,   ఎటు  చూసిన  ఆనందాల  హరివిల్లు
ఎటు చూసినా  మనోహర  సౌందర్యం , ఎటు చూసిన మైమరపుల విరి జల్లె 
ఎటు చూసిన గిరులు ఎటు చూసినపచ పచ్చని  తరులు, విరులు , మరులు గొలుపు ఝరులు
 ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబంధాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీర వీచికలే 
మనోహరి నా విశాఖకే తలమానికం . మనసు తాకే సుందర  సాగర  తీరం
నా  విశాఖ  సాగర తీరం  ప్రకృతి  మెడలో అలంకరించిన మణిమయ హారం
విశాఖ నేల పైన పాదం  మోపినంతే తుళ్ళింతలు  , కేరింతలు ,చక్కిలిగింతలు 
వింత వింత అనుభూతులతో మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించుట తధ్యం   వినీల గగనంపై . 
ప్రత్యూషంలో ఆ భానుని పసిడి వన్నె  కిరణం  ఉదయించిన తరుణం 
ఏ  జన్మల అదృష్టమో మరి వీక్షించిన కన్నులకా వైభోగం 
ఎటు చూసిన  ముగ్ధ మోహన సౌందర్యదేవత  సంతకాలే 
సర్వాంగ  సుందరంగా ముస్తాబైన  ప్రకృతి కాంత ప్రతిరూపం
అడుగడుగున అతిశయాన్ని దాచుకొన్న సువిశాల  సుందర  నగరం 
వైశాఖీశ్వరుడు  వెలసినట్టి  మా వైశాఖీ నగరం 
ఆ  సురులైనా అచ్చెరువొందే అత్యద్భుత సౌందర్య  సమాహారం 
నమ్మి వచ్చిన వారికి కొమ్ము కాసే పురము . 
ఏడుకొండల స్వామిని  ఆ కరుణాముయుని కన్నతల్లి  మరియమ్మని 
అల్లా ను అల్లారుముద్దుగా  మూడుకొండలపైనా  కొలువుంచిన నా విశాఖ  
సర్వమతా  సమాహారం.  సమతా, మమతల ప్రాకారం 
ఏచోట నిలుచున్నా కన్నులపండుగ చేసే ఆది దంపతుల శిల్పాలతోటి 
కళ్ళెదుటే  కైలాశం  మా కైలాశ గిరి శిఖరం 
అరకులోయ అందాలతో , అరవిరిసిన వలిసెల సొగసులతో 
అలరారే  మా నగరి  వైశాఖ నగరి 
శ్రీ  లక్ష్మీ నారసింహుని  దివ్య ఆశీశ్శులతో 
కనక మహా లక్ష్మీ దేవి కరుణాక్షలతో  
నిత్య నీరాజనాలతో , అర్చనాభిషేకాల్తో , పునీతమైన  నగరం 
మహాత్ములను,  మహా కవులను , మహానుభావులను కన్నతల్లి
 సంగీత సాహిత్య సమలంకృత నా విశాఖ పట్నం
అన్ని రంగాలను వెన్నుతట్టి ప్రోత్సహించే  విదుషీమణి   మా విశాఖ  
 ఆంధ్ర రాష్ట్రానికే మకుటాయమానం


                                                                                         సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 




26, జూన్ 2014, గురువారం

నిలువ జాల, నిమిషమైన

నే నిలువ జాల నిమిషమయిన.   నిన్ను చూడక . 
నిదుర రాని నా కనులను ఊరడించలేక,  కరిగిపోయింది కమ్మని కల . 
అదేంటో .. నీకై వగచె నా మదిలో నిప్పులే కురిపిస్తుంది.  ఆ పండు వెన్నెల 
నీ జత లేని  నిశిరాతిరి నిశ్శబ్దం .నను అమాంతం మార్చేసింది జీవమున్న శిలలా ... 
గుర్తుందా !మన జంట హృదయాలు మధురోహల సంతకాలు చేసిన వేళ 
తనువులు, మనసులు , వలపుల తలపులతో తడిసి ముద్దైన వేళ 
మన ప్రణయ కవితకు కొత్తరాగం జతకూర్చిన వేళ 
పాలు , తేనెలు చిలికి అమృతాన్ని ఆస్వాదించిన వేళ 
వేవేల కుసుమాల సౌగంధం మన మనసులను మైమరపించిన వేళ 
మన పరువాల ప్రణయబంధం  పరిణయ గ్రంధంగా లిఖించిన వేళ 
ముద్దు, మురిపాలలో మునిగి మంత్రం ముగ్ధులమై మురిసిన వేళ 
సప్తపదులూ నీతో  నడిచిన నిమిషం నుండీ 
నిను వీడి మనలేను  నిమిషమయినా  నేను 
ఏ మలయ సమీరమైనా నిన్ను మీరి తాకలేదు నన్ను 
నీ ఎడబాటులో నా హృది స్పందన తడబడి నా  ఊపిరాగిపోతుందేమో 
పరిపాటేనని, పరధ్యానపడక , పరుగున రావా 
నీలో సగమై నిన్నే తలచే నీ అర్ధాంగి కి ఊరట నిచ్చే 
నీ అనురాగాన్ని తలపించే అనుపానం లేదు మరి 
నీ ప్రణయామృతమ్ము తప్ప 

                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


25, జూన్ 2014, బుధవారం

ఒక్క క్షణం ... ఒకే ఒక్క క్షణం...


నువ్వు మహాత్ముడివా !మహర్షివా !మామూలు మానవుడివా !
అట్టడుగున కూరుకొన్న మానవతను వెలికితీయు మాన్యుడివా !
జంగు పట్టి పోతున్న  జనంలో నిజాయితీకి తుప్పు వదలించే దమ్మున్న అసామాన్యుడివా !
నలుగురితో నారాయణగా సామాన్యంగా  మసలుతున్న సామాన్యుడివా !
అవినీతి , స్వార్ధపు కోరలు   విరిచే  మేటి విలుకాడివా !
 నువ్వు మాన్యుడవైనా ... సామాన్యుడవైనా ... అసామాన్యుడవైనా 
నువ్వు   ఎవరైనా...  ఎవరైనా ఎవరైనా .. గాని  ఒక్క క్షణం  ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించే  మనసున్న మనిషివయితే  చాలు . 
నీలో జరిగే ప్రతి సంఘర్షణలో, సంఘానికి హితపడు హితవుంది . 
నువ్వేడ్చినప్పుడు , ఎదుటివారి  ధుఖ్ఖాన్ని 
నువ్వు  నవ్వినపుడు  నవ్వలేని బ్రతుకుల్లో నవ్వే లేని వారిని 
నువ్వాకలిగొన్నపుడు  ఆకలితో అలమటించే వారెందరని 
నీ ప్రతీ భావంలో , ఎదుటివారి భాదల్ని ప్రతిబింబిస్తే 
ఎవరో మన బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన అగత్యమేముంది 
ప్రతి నువ్వూ స్పందిస్తే ,  ప్రపంచమే మారదా !
పట్టువీడక ప్రయత్నిస్తే,  పసిడి పండదా...  బీడు భూమిలో 
ఎదుటి మనిషిలో దైవాన్నే ధర్శిస్తే , ధన్యమవదా ప్రతి మానవ జీవితం . 
పరోపకార గుణం ప్రతి మనిషికి వరమయితే ,
 పని తేలిక కదా ... పరమాత్ముడికీ 
కన్నేరెందుకు కార్చాలి మంచికీ , చెడుకీ , ... పైసా ఖర్చు లేదనా ...... 
కారుచిచ్చు  కాల్చేసినా కలసిరాని  కాలంలో నువ్వు అలసి సొలసి కూచున్నా 
నేనున్నా నీకోరకనే ఒక్క స్నేహ హస్తం.  అరక్షణంలో అంతమవదా  ఆవేదన 
మానవత్వపు ధన్వంతరి మహత్తరమయిన మందు మానవ  సంబంధాలకు 
అందులకే నేస్తం !
 ఆదుకొనే గుణముంటే ఆద్యంతం  ఆనందం  మన సొంతం 
మనం , మనం  ఒక్కటంటే   మాన్యమవును మన మానవ సంబంధం 
మరచిపోకు నేస్తం  మనమంతా  మానవులం . 
మనదంతా ఒకే కులం .  
అది విశ్వక్షేత్ర  శ్రామికులం  . 
                                                   సాలిపల్లిమంగామణి @శ్రీమణి 
                                                                                                        


24, జూన్ 2014, మంగళవారం

పరితప్త హృదయాలు




నిశీధియందున ,నిర్లిప్త వదనాల ,నిమీలిత నేత్రాల, నిర్వేదపు చూపులతో.. 
నిశ్చేతనులై ,నిషణ్ణులై ,నిహతికై ,నిరీక్షించు ఆ నిండు జీవితాలు 
ఆ .. వృద్ధ మాతాపితరులు . 
నీలకంఠుని వేడి తమ నెంజలి తీర్చగ వరమిమ్మనె . నిర్వృతి కొరకై 
ఆనక ఆత్మశాంతి నొందుటకై . 
కన్ను మూయులోపు తమకు రెక్కలీయమనె . 
ఆ రెక్కలతో తమ  తనయుల దరికేగి, 
 తనివి తీర చూసుకొని తనువులు చాలిస్తామనె  . 
 ఇది కడసారి చూపులకు నోచుకోని కన్నవారి హృదయవిదారక రోదన 
కనిపించని తనయులకై  కనిపెంచిన వేదన . 
కాసుల మోజుల్లో విదేశాల వ్యామోహపు బూజుల్లో 
కొందరు కన్నవారి ఋణం తృణప్రాయం చేసి , కన్నభూమికి ,
కన్నతల్లికి కడుపుకోత మిగిల్చేరు 
గోరుముద్దలిడిన తల్లి గోడు పట్టని మూఢులు ఆ  బిడ్డలు . 
బిడ్డలు కారు వారు తల్లి గుండెల పై గడ్డలు 
అన్నీ తానై పెంచిన తండ్రిని అనాధగా వదిలెళ్లిన అనామకులు వారు , అతి ధూర్తులు వారు . 
రక్తం పంచిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాల  పాల్జేసిన వారు కొందరు . 
నడివీధిలో విడిచివెళ్లిన నాసిరకం మానవులు మరికొందరు . 
మరచిపోకు  నేటి నీ తల్లితండ్రుల దుస్థితి . నీకొరకు   వేచియున్న పరిస్థితి . 
పచ్చనోట్ల కన్నా .. పచ్చడి మెతుకులు  తిన్నా 
తల్లి తండ్రీ నీడనున్న నీ జీవితమే మిన్న అని తెలుసుకో ... 
కన్నవారి  మనసునెరిగి మసలుకో 

                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

22, జూన్ 2014, ఆదివారం

జత చేరవా


మరచితివా నన్ను, నీ మరులొలికే ప్రియురాలను 
ప్రకృతి కే  పరవశమనిపించే  నీ చెలి జత  వీడి 
మనగలవా  నిమిషమాత్రమయినా.   నా మది దోచిన చెలికాడా !
నను రమ్మని,  ఝుం ఝుమ్మని,  తన కమ్మని కధ చెబుతానని 
   గోముగా పిలిచింది  ఆ తుమ్మెద. నా మోమును గని సుమమనుకొని . 
నను తాకినంతనే  నా తనువంత తానై  పులకించి 
వెన్నెలంతా నాపైనే ఒలకబోసింది ఆ పున్నమి రేయి
నా సిరి మువ్వల  అడుగులసడి విని తడబడి పోయింది  ఆమని కూడా ! 
నా  కొంగు పట్టి లాగింది  పైరగాలి పలకరించవా .. సఖీ అని
నాపై  అలిగి కూచుంది చిటారు కొమ్మన ,ఆ చిట్టి చిలుకమ్మ తన తేనె  పలుకులు నే దోచానని 
ఆ  మాధవీ లత   నన్ను కన్నార్పక చూస్తుంది  ఈ  పసిడి వన్నె  తీగ  ఎవరని
నా నీలి ముంగురులు సవరించ చూస్తుంది పిల్ల తెమ్మెర 
 నీ  ఎడబాటుకి వగచే  నా సిగలో ఆ సిరిమల్లె  చేరి మరుమల్లెల వాన కురిపించింది 
రాజహంసతో లేఖ రాసి పంపడానికని  మంతనాలు చేస్తున్నా ...  
మారు మాట్లాడక ఆఘ  మేఘాలపై  పయనించి ఇటు రా !
ప్రకృతిలో  ప్రతి అణువు నాపై  ప్రణయాస్త్రాలు సంధిస్తుంటే 
నీకై వెతికే  నా మది తల్లడిల్లి పోతుంది  నీ చెంత చేరడానికై 
చింత తీర్చగలేవా !నీ  చిన్నదాని మదిలో 
జత చేరగా రావా ! నీ కోసం నిరీక్షించే  నీ ప్రేయసి సన్నిధికి 
                              ( శ్రీను +మణి =శ్రీమణి )
                                                                          సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

                   




21, జూన్ 2014, శనివారం

తెలుగు "ధనం"



నల్లనయ్య  పిల్లనగ్రోవి ఆలపించిన రాగంలా !
చల్లనయ్య  చిందించిన పున్నమి వెలుగు సరాగంలా !
మధుమాసం మది తాకి నటుల ,
మధుదారలు  అధరాలకు  జాలువారినటుల ,
మంచిగంధం   పూసినటుల ,
మరు మల్లియ విరబూసినటుల ,
నాలుక  నవనీతం చవి  చూసినటుల ,
పాలూ ,తేనెలు బోసి  వండిన  పరమాన్నంలా ... 
పంచదార  పాకమున పల్కులు  ముంచి  తీసినటుల ,
తియ తీయని  అనుభూతులు  నా  తెలుగుదనంలో .. 
విడదీయలేని  అనుబంధం  నా  తెలుగు దనంతో ... 
నా  తెలుగులమ్మ  సుమ సరములోని  వాడని  కుసుమంగా  నిలవాలని ,
విను వీధులు  వినిపించగ  తెలుగు పాట పాడాలని ,
ఎల్లలు  దాటి  చల్లని  మా తెలుగుతల్లి  ఖ్యాతి  దిగ్దిగంతాలా  ఎలుగెత్తి  చాటాలని ,
ఆ  గగనపు సరిహద్దు మీద తెలుగు  ఓనమాలు  లిఖించాలని , 
చిన్ని ఆశ  మాకు.   జన్మ భూమి  ఋణం  తీర్చుకోవాలని ,
పట్టా  చేతబట్టి పొట్ట  చేత  పట్టుకోని  పొరుగు నేలకై  మేము  తరలినా ... 
మరలునా  మా  మాతృభూమిపై  తరగని  మమకారం . 
అమ్మే  లేదంటే  ఏ  జీవికైన  జన్మెక్కడిది ?
తెలుగే   లేదంటే  తెలుగుబిడ్డకు  వెలుగెక్కడిది ?
అమ్మ  చేతి   గోరుముద్దకు  సరి తూగునా పరాయి  నేలపైన  పరమాన్నం . 
తేటతెలుగు  లాలిపాటకు  సాటి  ఏదీ  అధ్బుత రాగం ?
ఆకాశపుటంచులు   తాకినా ... తరువు  ఎరుగదా  తన  మూలం  నేలయని . 
ఖండాంతరాలు  దాటెగిరినా .. మా  కన్నతల్లి  గుండె చప్పుడు  మారుమ్రోగుతోందిక్కడ . 
ప్రతీ  నిమిషం  అమ్మ ఒడిని  తలుచుకొంటూ .. 
కర్తవ్య పాలనలో  పరాయి నేలపైన  పరుంటూ ... 
తెలుగుకై  తెలుగన్నదమ్ములం  తెగ  మురిసి  పోతున్నాం . 
అవనిపై  అదృష్టవశాత్తూ  తెలుగు  బిడ్డలమైనందుకు గర్విస్తున్నాం . 
      
  సాలిపల్లి మంగామణి @ శ్రీమణి ,
http://pandoorucheruvugattu.blogspot.in  








19, జూన్ 2014, గురువారం

అమ్మా ... మన్నించు


నేటి స్వంతత్ర భారతమా ... 
అవినీతికి,అన్యాయానికి  ఆలవాలమా ?
ప్రజాస్వామ్య  దేశమా 
ప్రజల పాలిట శాపమా ... 
విన్నావా .. సగటు జీవి ఆర్తనాదాలు 
కన్నావా .. కన్నీటి కధనాలు ?
మరచినావా .. మానవత్వం 
నేర్చినావా .. పైశాచికత్వం ?
కలచివేసే బ్రతుకులే కన్నులకగుపిస్తున్నా 
కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా 
తెల్ల దొరల కాలంలో బానిస బ్రతుకైనా బ్రతికాం 
నేటి ప్రజాస్వామ్య  వ్యవస్థలో బ్రతుకే బరువాయె కదా .. 
అణువణువున స్వార్ధంతో అల్లాడుతున్న వ్యవస్థ 
మంచం లేచిన మొదలు లంచమే లాంచనమాయె . 
పాపాయి పాల డబ్బాలో కల్తీ , ప్రాణం పోసే మందులలో కల్తీ 
తల్లి పాలు తప్ప కల్తీ లేనిదేది ?ఈ  లోకంలో 
నిత్యావసరాల ధరలు నిత్యం వేధిస్తుంటే 
నల్ల ఖజానాలు మాత్రం నింగికెగసిపోయెనా ?
వెల పెరిగిన వేగంతో నెల జీతం పెరగదేం ?
అవ్వల ,తాతయ్యల పించనులో లంచం 
బడుగు జీవి పధకాలలో లంచం 
ఎక్కడ చూసినా .. లంచం .. లంచం .. లంచం 
దీనికి లేదా అంతం ?
మన నుండే ప్రతి మార్పూ రావాలి 
అది సమాజాన్ని శాసించే తుది తీర్పు కావాలి 
ప్రక్షాళన చేసేద్దాం పాతుకుపోయిన పాపాన్ని 
విమోచన కల్పిద్దాం బ్రష్టు పట్టిన జాతికి 
కూకటి వేళ్ళతో పెకలిద్దాం .. అవినీతి కలుపు మొక్కల్ని 
చేయి చేయి కలిపి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం ... 
ప్రజాస్వామ్యం పరువు నిలబెడదాం .. . 
భారత పౌరులమైనందుకు
 మన జన్మభూమి ఋణం తీర్చుదాం (నిరతంతరం నిజాయితీ గా జీవిద్దాం )
                                                       సాలిపల్లిమంగా మణి @శ్రీమణి 
                          

          

15, జూన్ 2014, ఆదివారం

నాన్నా ....



అడగక ముందే అన్నీ ఇచ్చిన నాన్నా ....
నువ్వు మా ప్రాణం కన్నా మిన్న 
అమ్మకడుపారా  జన్మిచ్చినా గాని ,
మా చిటికిన వేలును పట్టి మార్గదర్శిగా మారి 
చిట్టి ,పొట్టి తడబడు అడుగుల దారు
ల్లో నీ అరిచేతిని పానుపుగా పరచి 
బొజ్జ నింపిన   అమ్మకు సరిగా 
అనురాగపు  ఉగ్గుపాలు  తాగించి అమ్మనే  తలపించావు . 
అమృతాన్నే చవి చూపించావు ,నీ లాలనలో. . 
ఎన్నెన్ని సంఘర్షణలతో  నువ్వు తలమునకలవుతున్నా 
చిరునవ్వులే మా మోమున విరబూయించావు 
కష్టాలు కన్నీళ్ళకు కావలి కాసి,
ఆవల ఆనందపు అంచులలో నను కూర్చోబెట్టావ్ .  
మా నవ్వుల ముత్యాలను  నీ దోసిట నింపి 
ముత్యాల  జల్లు  మా జీవితాలకు కానుకనిచ్చావు 
మేం ఎంతెత్తుకు ఎదిగినా....  మీ అడుగుజాడలే మా ఆదర్శం 
మీ అంతగా  మేం ఎదిగినాగాని ...   మీ కనుసైగలే మాకు శిరోధార్యం 
మా తుది శ్వాస వరకు అమ్మా ,నాన్న ఒడి  మా  సొంతం కావాలి 
ఆనక  ఆపై వాడు తధాస్తు !అంటూ ఆశీర్వదించాలి 
నాన్నా !ఎన్ని జన్మలయినా  నీ బిడ్డగానే జన్మించాలి 
ఆ దేవుడే వరమిస్తానంటే !వెనువెంటనే అడిగేస్తా 
నాన్నకి  బిడ్డగ జన్మజన్మలకీ జన్మించే భాగ్యం ఇమ్మని 
                               
 (ప్రేమతో....   మా నాన్న గారికి) 
                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

14, జూన్ 2014, శనివారం

మరువకురా....

  
వెంట రావ చెలికాడా ! ఒంటరి చేయక నన్ను ,
మనలేను మనిషిలా !మరువక  ఎన్నడు నన్ను 
నువు చెంతలేని నేను ,సిరా లేని కలాన్ని ,
వెన్నెల కురియని  పున్నమిని, విరియక వాడిన కుసుమాన్ని , 
నువు దూరమయిన  మరు క్షణం.  మొదలవుతోంది నా నిరీక్షణం 
కంటి నిండుగ  నీ రూపం.  నిలువనీదు నిమిషమయిన నిశ్చింతగా   నన్ను ,
ఝుంటి  తేనియ మధుర రసం సేవించి నా మది  
నీ సరసపు తలపుల్లో తూలుతోంది మైమరచిపోయి ,నన్నే మరచిపోయి 
నీ అనురాగం చవి చూసిన నాకు ,ఏ  రాగమైన మౌనంగా తోస్తుంది 
రోజూ ఊసులాడే  సంపంగీ  మూగ నోము పట్టింది 
పిల్ల గాలి కూడా మూతి ముడిచి కూచుంది 
 నా వలపుల  వాకిలిలో నీకై  మేల్కొని  ఉన్న నాకు , రంగవల్లి  జోల పాడింది 
పరధ్యానంలో ఉన్న నన్ను,  ప్రక్క నున్న సెలయేరు పలకరింపు కొచ్చింది
నీ పలుకు వినక చిలకలమ్మ కులుకు మరచి కూచుంది. 
నీ ఎడబాటు  మండు వేసవి లా నిప్పులు చెరిగేస్తుంటే 
సీత కన్ను వేయమాకు నాపై .. నీ  సతి నేనని  మరచి
అరక్షణములో నా ఎదుట నిలువలేవా !నీ చెలి నిరీక్షణకు నీరాకను కానుక నీవా 
 ప్రణయరాగం పల్లవించగ ,  పయనమయిరా !నీ ప్రియ సఖి  సన్నిధికి                                                            
                                                                                             సాలిపల్లిమంగామణి @శ్రీమణి 
 


13, జూన్ 2014, శుక్రవారం

ఒక తీయని కల




అమృతాన్ని అవపోసన పట్టినట్టు ,
ఆకాశాన్ని అదిమి పట్టినట్టు , మబ్బులతో  దోబూచులాడి,
ఇంద్రధనుస్సు వంపులో ఇమిడిపోయినట్టు,
చలువల రేడు వెన్నెల జల్లుకి పులకించిన  
నెచ్చెలి కలువను నేనన్నట్లు ,
అచ్చరకన్యల తలదన్నేఅప్సర నేనన్నట్లు ,
అందాల రాజ్యానికి అధినేత్రి  నైనట్టు ,
రంగూ రంగుల సీతాకోక చిలుకల్లె
విరబూసిన  పూదోటల్లో విహరించినట్టు , 
స్వాతి చినుకు ముద్దాడిన ముత్యం నేనే అన్నట్టు ,
అరుణోదయ ఉషస్సులో ఆ సంద్రంపై మెరిసే అలనైనట్టు ,
అలా ... అలా ... అలా ... అలలా మెదిలిన 
నా మధురమయిన కలల సడికి 
నులువెచ్చని నా  నిదుర చెడి 
నివ్వెరబోయా ! ఆ  రవి కిరణపు తాకిడికి 
కలలో మనకు  మనమే  కధానాయిక  ..... కదా (మీక్కూడా .. అంతేనా )
                                                                   
                                                     సాలిపల్లి మంగామణి @శ్రీమణి   

9, జూన్ 2014, సోమవారం

తరాంతరం


అలనాటి  జీవనం అజరామరమయితే 
నేటి జన జీవనం మర జీవనం 
నాడు కోడి కూతతో  ప్రశాంత ఉదయం మేలుకొలుపు
అల్లరాల మోతతో  అలజడితో తెల్లారుతోంది  కదా  నేడు
నాడు చద్ది బువ్వతో  ఊరగాయ విందు
అది  సర్వ రోగాలకు తిరుగులేని మందు
నేటి బ్రేకుఫాస్టు  బ్రెడ్డుముక్క నమలలేక
దవళ్ళు  బ్రేకవుతున్నాయి
బెడ్డు కాఫీ తాగితాగి పళ్ళు  గార పడ్తున్నాయి
ఆనాటి  స్త్రీ  ఔన్నత్యానికి , సంస్కృతీ ,సంప్రదాయాలకూ
మేలి ముసుగు ప్రతీకగా  నిలిస్తే
కన్న వారి కనులు కప్పగ  దాచి  వదనం  ముసుగు చాటున
కళ్ళు  మూసుకు పాలు త్రాగిన పిల్లి వైనం
కొందరి వెకిలి చేష్టల . దిగజారుతున్న విలువలకు
నిదర్శనం నేటి  గేలిముసుగు .
నాటి ఉమ్మడి కుటుంబాలు అనురాగం , ఆప్యాయతలకు
బంధాలకు ,అనుబంధాలకు ఆలవాలమయితే
నేటి మనమిద్దరం ,మనకొక్కరు సాంప్రదాయంలో
మచ్చుకైనా మిగులుతోందా  మానవ సంబంధం
నాడు  ఆలనా పాలనలో తనబిడ్డకి  తల్లిపాలలో
మురిపాలను కలిపిచ్చి పరవశించె . నాటి పరిపూర్ణమైన స్త్రీ
ఈనాటి తల్లి బిడ్డను కన్నంతనే పొత్తిళ్ళ లాగి
సౌందర్య రక్షణ లో పాలసీసా  చేతికిచ్చి బిడ్డ సంరక్షణ విస్మరించి
క్రష్  ల  పాల్చేస్తున్నారిప్పటి  కొందరు అత్యాధునిక  తల్లులు
నాడు  విద్య నర్దించుటకై ఫర్లాంగులు  నడచివెళ్ళి
గురు శుశ్రూషలు  చేసి గురువు మనసు మెప్పించి
రేయనక , పగలనక ,ఎండనక ,వాననక విద్యనభ్యసిస్తే
నేటితరం  విద్యార్ధులు  కొందరు కన్నవారి కలలు కూల్చగ
కళాశాలకు బయలుదేరి కులాసాలతో ,విలాసాలతో
మత్తుల్లో   తూలుతూ విర్రవీగిన కుర్రాజనం వికృత చేష్టలు ,
విపరీత వస్త్రధారణలతో అధోగతిని  చేరడానికి ఆధునిక దారుల్లో
అభ్యసించేను అక్కరలేని విజ్ఞానాలు
విద్యాలయాలెలాగూ విక్రయాశాలలయి  విరాజిల్లుతున్నాయి
ఆనాటి మనిషి కండలు కరిగింఛి
బండ చాకిరి చేసి కొండని  ఢీ కొట్టే శక్తిమంతులయితే
నేడు  ఉద్యోగాల పేరుతొ పంకా కింద కూచుని
నాలుగడుగులు కూడా తిరక్క , తిన్న  నానా గడ్డీ అరక్క
అరకొర ఆరోగ్యంతో అల్లాడుతున్నారిప్పుడు
తరాలు మారినా గాని కల్ప తరువు  లాంటి
మన సంస్కృతిని  మరుగున పెట్టొద్దు
మారుతోన్న  కాలంలో మంచి  మాత్రం  ఎంచుకో
తరతరాల  మన  జీవన శైలిని  మహత్తరంగా  మలచుకో


                                          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

7, జూన్ 2014, శనివారం

మదిమధనం




దిక్కుల  మాటున నక్కి  నా  ప్రతి  సడిని  పసిగడతావు 
చుక్కల ప్రక్కన  చేరి పక్కున నవ్వేస్తావు 
 నన్ను  వీడి  మనలేక  నా నీడపైనే  కత్తి  గడతావు . భావ్యమా! మరి 
 నా  నవ్వులొలిగి పోకుండా నీ  దోసిట  పడతావు .
  పువ్వులాంటి  నా మది  దోచగ  మధుపంగా  మురిపిస్తావు.. 
 మలయ  సమీరంలో  నీ ప్రణయ చందనాన్ని కలగలిపి  నా శ్వాసకందిస్తావు 
నన్ను మంత్రముగ్ధురాలిని చెయ్యాలని . 
నను నీ  మనో  సామ్రాజ్ఞి చేయాలని . 
నే  విహరించే  దారుల్లో సిరిమల్లెల  పానుపేసి, 
  నీలి మబ్బు పరదాల్లో దాక్కుంటావు .
నే  చిత్రించిన  చిత్తరువుకి  రంగు లద్ది 
 నీ   రూపంగా   చిత్రిస్తావు. చిత్రంగా !
వెన్నెలమ్మ  వాకిట్లో  నా  మేను  వాల్చి నిదరోతుంటే ;
చలి గాలై వచ్చి చక్కిలిగిలి  పెడతావు.  చెంప గిల్లి ముద్దాడతావు. 
కనురెప్ప  వాల్చిన మరు నిమిషం  కల లోకొచ్చి  కలవరపెడ్తావు .
తీరా ! కనులు  తెరిచి చూస్తే కనుమరుగవుతావు.. 
నీ ప్రేమో ఏమో గాని .... నా లో  అనుక్షణం మది మధనం. 
నీ  నిరీక్షణలో నివ్వేరబోయెను నా వదనం
 (ఇది నీకై  నిరీక్షించిన ఆ రోజుల్లో  నా మది మధనం )  
 నీ కై  వేచిన  క్షణాలు  నిప్పు కణిక లై  వేదిస్తుంటే 
నీతో  గడిపిన  మధురోహలు మాత్రం  మంచి గంధం పూస్తున్నాయి (మరపురాని   ఆ మధుర క్షణాలు  మంచిముత్యాలే  కదా !)                                                         సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి