పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

23, నవంబర్ 2017, గురువారం

మంగళంపల్లివారి వర్ధంతి సంధర్భంగా

గాన గాంధర్వులు
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి
ప్రధమ వర్ధంతి సందర్భంగా....
ఆ మహా గాయకుని స్మరణలో...
🌷చిన్న కవనంతో నివాళి🌷

ఉరికే సంగీత ఝరి,
స్వర రాజశిఖరి,
మధురిమల పలుకుసిరి, 
సరిగమల రసరమ్య లాహిరి,
కర్ణాటక సంగీత విరి సిరి
చందనాల విభావరి
ఆణిముత్యాల సరి 
మైమరపుల కచేరి 
మలయ మారుతాన్నే మీరి
అలరించిన మానసచోరుని
మహాభినిష్క్రమణం
యావత్ సంగీత సామ్రాజ్య మహాంతస్థాపము 
నిన్నటి ఆసమ్మోహన స్వరం
నేడు స్వప్నమయి ఎదురయితే
ఆ గానమినిపించక
మౌనమాయేను భాష సైతం
ఆ మురళి సవ్వడి లేక
మూగబోయేను పలుకు కూడ
సరిగమలతో స్వర్ణరాగాలు
పలికించి కొసరి, కొసరి 
సుస్వర  రాగాల వర్షించి
తత్వాన్ని, అమృతత్వాన్ని
పలుకు తేనెల తో చిలుకరించి
భక్తి కీర్తనల భజియించి
శ్రీవారి ఆస్థానమలంకరించి,
వారి నలరించగ
నేరుగా స్వామిపాదాల చేరి
వేణువై గాలిలో ఏకమైనా సామి
ఏమి సేతురా సామి మే మేమీ సేతు 
నువులేని లోటును తీర్చువారెవరూ
మన్మోహన సమ్మోహన
మాధుర్యగళం మరలి రాని
లోకాలకు తరలిపోయినా
ఘనాఘన గాన గాంధర్వ
మురళీ రవం గగనసీమలకెగసినా
రతన స్వరరస రాజమౌళి
సుర స్వర సేవకై దివికేగినా
ఏడేడు లోకాలఏడనున్నాగాని 
ఆబాల గోపాలమూ
బాలమురళీ రవమును
ఎడతెగని ఆర్తితో ఆలపిస్తూ 
మంగళం వారికి మంగళ
నీరాజనాలర్పించు కొంటూ 
మా గుండె గొంతుకలో
నిండిపోయిన సంగీత చక్రవర్తికి నివాళులర్పిస్తూ ...
ఆ గానగాంధర్వుని
ఆత్మకు శాంతి కలగాలని 
ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ...... 
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)
           

22, నవంబర్ 2017, బుధవారం

మహి"ళ"

ఆడుబుట్టువు లేక ఆదిఅంతములేదు 
సుదతి  లేని  సృష్టి శూన్యమేగా.. !ఇక
మహిళ లేని మహిపై మనుగడేదీ
పడతి పుట్టుక లేక పరిపూర్ణతుండునా..
ఇభయాన లేని ఇహముండునటయా..
కలకంఠి లేక కళగట్టునానేల
అనంతజీవన ప్రస్థానంలో 
ఆమే జగతికి ప్రధమస్ధానం
అరుదగు వాక్యం స్త్రీ మూర్తి 
అక్షరాలకందని భావం 
అత్యధ్భుత కావ్యం
అనంతసృష్టికి ప్రతిరూపం 
అమృతమయమవు
ఉర్వీ రూపం
అమ్మాయి గా పుట్టి 
అర్ధాంగిగా మెట్టి 
అమ్మగా మరుజన్మమెత్తి 
బామ్మగా పదవి  చేపట్టి 
అడుగడుగునా త్యాగం,
అంతులేని అనురాగం 
రంగరించి అద్భుతమైన స్త్రీ జన్మను 
సఫలం గావించిన స్త్రీ మూర్తిని 
పొగిడేందుకు చాలునా
పృధివి పైన పదాలు. 
రాసేందుకు చాలునా... రాతాక్షరాలు, 
ఊహించగలమా !
మహిళ లేని మహిఆనవాలు 
పసికందులను త్రుంచి,
త్రృణప్రాయముగనెంచి
ఆదిమూలమునందె చిదిమిపారేదురే...
జననిలేదన్నచో జగమున్నదటయా...
యోచించిచూడరే ఒక ఘడియయినా
పూజించుపడతిని..
పుడమితల్లిగనెంచి
గౌరవించుము తనని ఆదిశక్తిగతలచి...
(ఎంతోమంది గర్భస్ధశిశువు ఆడపిల్లలని తెలుసుకొనిఆదిలోనే అంతంగావిస్తున్న..పైశాచిక చర్యను నిరసిస్తూ...ఆడుబిడ్డలను కాపాడమని...అభ్యర్థిస్తూ...)
           సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

21, నవంబర్ 2017, మంగళవారం

కల"వరం"

"కల "వరం

అమ్మ గర్భం నుండి భూమ్మీద పడగానేమొదలైంది అడుగడుగునా వడ్డింపు ప్రక్రియ,పురుడుపోసినందుకు
చేన్తాడంత ఆసుపత్రి బిల్లు
అదిచూసి నాన్న గుండెజల్లు
అలామొదలయింది బిల్లుల పరంపర..
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
అవసరాల ధర ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటుబిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల
అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో
తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో      పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... నిద్దరెలా వస్తుంది.
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ
ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి
అమ్మ చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
"వెల"పెరిగిన వేగంతో నెలజీతం పెరగదేం?
నిత్యావసరాలు నిచ్చెనలెక్కేస్తున్నయ్  నల్లఖజానాలేమో
నింగినంటుకొన్నయ్.
మంచంలేచిన మొదలు లంఛం లాంఛనమాయె,
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవితంలోమాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
నేటి మద్యతరగతి భర్తకి
భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరే అడ్డు వస్తుంది
తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు ఎంతమంది పిల్లల్నికన్నా  అంత ఆనందంగా పెంచగల్గేవారు
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కాలని ఆశవుండేది..ఆశ మాటెలావున్నా
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  
లభో దిభో మంటుంటే
నిద్దరెలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే
చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప
మతి లేక తప్పు చేసిన వాడికంటే ,
గతి లేక చేసిన వడ్డీఅప్పే
పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు "కలవరం"తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రృత్యమయిపోయే
మద్యతరగతి మానవుడికి
ఈ కలచి వేసే మధ్యతరగతి      బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????
 సాలిపల్లిమంగామణి@శ్రీమణి
                                       

19, నవంబర్ 2017, ఆదివారం

పురుషులదినోత్సవ సందర్భంగా...

ప్రతీసారీ స్త్రీ ని ప్రస్తుతిస్తున్నాని
నేను స్త్రీ పక్షపాతినికాదు.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
అని వేమన గారే శలవిచ్చారు.
అందరూ పుణ్యపురుషులు కాకపోయినా పురుషులూ
మహనీయులే..త్యాగమూర్తులే
(అలాంటి పురుషోత్తములకోసం పురుషుల దినోత్సవసంధర్భంగా..)

స్రృష్టికి మూలం స్త్రీ అది వాస్తవమే...అయినప్పటికీ పురుషుని జతలేక స్రృష్టి ఊహించగలమా!
ఒకబిడ్డకు జన్మనిచ్చుటలో
ఒక తల్లి మరుజన్మెమెత్తితే
ఆబిడ్డజన్మించిన మరునిమిషంనుండే
తను కన్న బిడ్డను కంటిపాపగా
కంటికిరెప్పగా కాపాడుకోడానికి
ఒకతండ్రి తన జన్మంతా శ్రమిస్తూనే వుంటాడుకదా....
స్త్రీ ఎంత శక్తిస్వరూపిణి అయినా
పురుషుని సాహచర్యం తప్పనిసరి...కదా
కన్నబిడ్డల కళ్ళలోకళకళలు చూడాలని...తను కణకణమండినా
సంతోషంగా భరించడా...ఓసగటుతండ్రి
భార్యాబిడ్డల అవసరాలు
తీర్చేందుకు మండుటెండనుసైతంలెక్కచేయక రేయింబవళ్ళుగొడ్డులా కష్టపడేపురుషులులేరంటారా..
ఒకతండ్రిగా
ఒకసహోదరునిగా..ఒక భర్తగా
స్త్రీ జీవితంలో ప్రతీదశలో...విశిష్టమయిన
భాద్యత పురుషునిదే అనడంలో సందేహంలేదు
భాధ్యత వహించడంలో
భరోసా నివ్వడంలో తండ్రి,సహోదరుడు
తరువాత భర్త..
ఏదేమైనా స్త్రీ రక్షణలో ఏదేని దశలో పురుషుని భాద్యతాయుతమైన పాత్ర కనిపిస్తుందికదా...
కన్నబిడ్డలకు
అడగక ముందే అన్నీ ఇచ్చి
తన ప్రాణం కన్నా మిన్న గా
కాపాడుకోంటూ
అమ్మకడుపారా జన్మనిస్తే
తండ్రిమనసారా
మనచిటికిన వేలును పట్టి
చిట్టి ,పొట్టి తడబడుఅడుగుల దారుల నుండీ ముళ్ళుగుచ్చకుండాతన అరిచేతిని పానుపుగా పరచి 
బొజ్జ నింపిన  అమ్మకు సరిగా 
అనురాగపుఉగ్గుపాలు తాగించి
అమ్మనేతలపించడా
అమృతాన్నే చవిచూపించడా తనలాలనలో. . 
ఎన్నెన్ని సంఘర్షణల తలమునకలవుతున్నా 
చిరునవ్వులే తన బిడ్డలమోమున విరబూయిస్తూ
కష్టాలు కన్నీళ్ళకు
తనుకావలి కాస్తూ
ఆవల
ఆనందపుఅంచులలో
తనబిడ్డలకూర్చోబెట్టే ఆఅనురాగమూర్తులైన
తండ్రులూ త్యాగమూర్తులే
అందులకే అందుకోండి
పిత్రృమూర్తులూ...
అభివందనాలుమీకు.
ఆడపడచులపాలి ఆపన్నహస్తమై,
తోబుట్టు పాదాలపారాడే పచ్చనిపారాణియై
అడుగడుగునా...
అతివకొంగుబంగారమై
నేనున్నానంటూ...వెన్నంటి కాపాడే సురక్షాకవచాలు...
ఆడపిల్లల నయనాల ఆనందబాష్పాలు..
అనురాగాల రూపాలు
వేరెవరు కారుగా
అమ్మలోనిఅనురాగం
నాన్నలోని వాత్సల్యం
కలగలిపిన మమకారం
ఆఅన్నదమ్ములే....
అన్నదమ్ములూ....
అభివందనాలుమీకు
ఇక నమ్మివచ్చిన సహధర్మచారిణికి తోడుగానీడగా
నిండు నూరేళ్ళు జంటగా బాధ్యతా...భరోసా..భర్తేగా...
ధర్మేచ,అర్ధేచ,కామేచ,మోక్షేచ,నాతిచరామి అనే కళ్యాణ మంత్రంతో  చేసిన ప్రమాణాలకు విలువనిస్తూ..
సర్వకాలసర్వావస్ధల యందు తాళికట్టిన సహధర్మచారిణికి తోడుయై,నీడయై,పరిపూర్ణమై
బ్రతుకునూరేళ్ళపంటగా ఫలియింపజేసి
నూరేళ్ళూ గుండెల్లో గుడికట్టి ప్రేమించేభర్తలూ...
అభివందనంమీకు.
పురుషుల దినోత్సవం సందర్భంగా..
పురుషులూ...అభివందనాలుమీకు
శుభాభినందనాలు మీకు...
        మీ సహోదరి
               శ్రీమణి.

14, నవంబర్ 2017, మంగళవారం

ఏదీ?అమ్మ"ఒడి"

ఏదీ?అనురాగంపంచే
అమ్రృతాల అమ్మ "ఒడి"
ఏదీ?అక్షరాలు నేర్పించే
ఆనందాల ఆ"బడి"
నిర్లక్ష్యపు నీడల్లో
చేరామిక "అంగడి"
ఆకలిమంటల్లో
అడుగులు "తడబడి"
గుప్పెడుమెతుకులకై
బ్రతుకుతెరువు"కెగబడి"
వెక్కివెక్కి ఏడుస్తూ
దిక్కులుచూస్తున్నాం
ఆదుకొంటారని "పొరబడి"
(హ్రృదయవిదారకమయిన
వీధిబాలల ఈ దయనీయస్ధితినుండి
ఆదుకొనిఅక్కున చేర్చుకొని వారినీ రేపటి భావిభారతపౌరుల్లా తీర్చిదిద్దాలంటే మనలాంటి సామాన్యమానవుడి దయాదాక్షిణ్యాలు సరిపోతాయా...ప్రభుత్వమే చొరవచూపి వారికి న్యాయం జరిగేలా తగిననిర్ణయం తీసుకొని పర్యవేక్షించి సమూలంగా పరిష్కరిస్తే...అదే పరిపూర్ణమైన  బాలలదినోత్సవం...
ఆవిధమయిన బాలలదినోత్సవం రావాలని ఆకాంక్షిస్తూ.....శ్రీమణి)

7, నవంబర్ 2017, మంగళవారం

అడుగులసడి

ఎటు చూసినా ..... 
 నీ అడుగుల సడి .
ప్రతీ జడిలో  
నీవేనని తడబడి ,
ఘడిఘడికీ      మకరందపుమధుజడిలో
నీ తలపులు చొరబడి ,
నిద్దుర  కొరవడి
ఆ  ఊహల  ఒరవడిలో
నులివెచ్చని నీ ఒడిలో ...
తలవాల్చిన నా మది  
అది  తనువును విడివడి
విహంగమాయే వినీలగగనానికెగబడి,
అరఘడియైనా
నువు లేక నేను
పూవు లేని తావిని 
నీ జత లేని నేను 
సిరా లేని పెన్ను 
నువ్వెంట లేని గమనం 
అది ఎండమావి పయనం
నీతో నడచిన సప్తపదుల సాక్షి
కలనయినా...నేను
నిను చూడక నేనుండలేను,
సవరించిన నా కురులసాక్షి
నీ సాంగత్యమే  వేయిపున్నముల సాటి. 
                            శ్రీమణి.
pandoorucheruvugattu.blogspot.in
                             

27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆంధ్రజ్యోతి దినపత్రికలో

ఈరోజు ఆంధ్రజ్యోతి "తరుణి"లో నాగురించి ప్రచురించిన ఆర్టికల్ మరింతగా ఎదగాలని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ..... శ్రీమణి

19, అక్టోబర్ 2017, గురువారం

దీపావళి శుభాకాంక్షలతో....

కరిమబ్బుదొంతరల
తెరనుదీసి,చిరువానతుంపరల
చినుకుల్లకురిసి,
కోటిదీపాలకాంతుల్ల వెలుగుల్లమెరిసి
సిరిమువ్వ అందియల ఘల్లఘల్లనుచు సిరులుదోసిటబోసి,
చిరునవ్వు కలబోసి,
ముంగిళ్ళరంగుల్లముగ్గల్లె మురిసి,
ఆనందహరివిల్లై వెల్లివిరిసి
తరలొచ్చె సిరిలచ్చి పసిడిపాదాలా..
సిరులొచ్చి ప్రతిఇంట పొంగిపొరలేలా....
అందరికీ దీపావళి శుభాకాంక్షలతో....
                     . .  శ్రీమణి.

15, అక్టోబర్ 2017, ఆదివారం

ప్రపంచ రికార్డు కవిసమ్మేళనంలో నా సన్మానకార్యక్రమం

తెలుగురక్షణవేదిక ఆధ్వర్యంలోఅనంతపురంలో కళారత్నశ్రీపొట్లూరిహరిక్రృష్ణగారిసారధ్యంలో
అంగరంగవైభవంగా నిర్వహించిన 33గంట44నిమిషాల55సెకన్ల ప్రపంచరికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని సాహితీప్రముఖుల చేతులమీదుగా ఘనసత్కారం అందుకొన్న శుభతరుణం.....శ్రీమణి

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

పెద్దాయనా...మీకభివందనం

గౌరవనీయులు,మనప్రధానమంత్రి వర్యులు శ్రీ మాన్ శ్రీ నరేంద్రమోడీగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...నోట్లరద్దు  సంధర్భంలో ఆ పెద్దాయన సంచలనాత్మక నిర్ణయం గురించి నే రాసిన కవిత .

పెద్దాయనా...మీకభివందనం

సంచలనం,సంచలనం,చరిత్ర పుటలను కుదిపేసిన సంచలనం 
 విప్లవాత్మకం ఆర్ధరాతిరి మన నరేంద్రుని తెగుదెంపు నిర్ణయం.
దావానలమై కాలాసురుల ఖజానాలు దహనం గావించే ఆ నిమిషం.
మన నరేంద్రుడు సుదర్శనాస్త్రం  సంధించిన ఆ నిమిషం ,
అవినీతి బకాసురులు డొక్క చించి డోలు కట్టిన ఆనిమిషం.
అద్భుతం,చరిత్ర పుటలను కుదిపేసిన మహాద్భుతం.
గతి తప్పిన జన జీవనం.కించిత్ బాధైనా ,మతి భ్రమించిన  అక్రమార్కుల మస్తిష్కం మాత్రం అద్భుతం.
మూడో కంటికి తెలీని సొమ్ముకు ముచ్చెమటలు బోసిన ఆ నిమిషం.
నల్ల  కుభేరుల  గుండెల్లో చెలరేగిన పెను ఉత్పాతం. 
అవినీతి మాన్యాలు మంగళ గిరి మాన్యాలపట్టిన ఆ వైనం.
 దోచుకొన్నది దాచుకొందుకు దారి లేక,కక్కలేక,మ్రింగలేక గతుక్కుమన్న గజదొంగ నాయకుల
గతుక్కుమంటూ గరళ సేవనం,అత్యద్భుతం 
రాత్రికి రాత్రే చీకటి రాజ్యపు కూకటి వేళ్ళను  పెకలించిన వైనం.
ఉగ్రవాదుల ఆగడాలపై ఉక్కుపాదం . శత్రు రాజ్యపు చెమడాలు ఎక్కదీసే ఎక్కు పెట్టిన పాశుపతాస్త్రం .
ఆ ఒక్క నిమిషం భారత చరితకే బంగారు తాపడం,మన పెద్దాయన తీసుకొన్నఆ మహత్తర నిర్ణయం.
అందుకే పెద్దాయన మహా  దమ్మున్నోడు,పేదల కొమ్మును కాసేటోడు ,అవినీతి దుమ్మును దులిపేటోడు.
ఒక్క మగాడు, అవును స్వతంత్ర భారతావని లో మళ్ళీ అసలు సిసలైన మగాడు మళ్ళీ పుట్టాడు ... మాతృభూమి     రక్షణకు,మాలిన్యపు ప్రక్షాళనకు ఉదయించిన ప్రఛండ భాస్కరుడు.
ఒక్క పూటలో టక్కరి నక్కలకు చుక్కలు చూపించి,
పిక్కటిల్లిన నల్లకుక్కల పొట్టలు చెక్కలు గావించిన భారత నాయకుడతడు . 
మొక్క వోని నీ  దీక్షకు

లెక్క కట్టలేని నీ ధీరత్వానికి  

 దిక్కులు దాటిన నీ ఖ్యాతికి 

 చెక్కు చెదరని నీ స్ఫూర్తికి 

కర్తవ్య శిక్షణలో,మాతృభూమి రక్షణలో 

 ప్రజా పరిరక్షణలో,నీ మాతృ భక్తికి 

 వందనం,శిరస్సాభివందనం.  పెద్దాయనా .... నీకభివందనం 

 వెనుకడుగు వెయ్యమాకు ఏ      విమర్శలెదురాయినా ..

భారత పుణ్య భూమి జయహో 

 నను గన్న జన్మ భూమి జయహో 

    సాలిపల్లిమంగామణి @శ్రీమణి

                  pandoorucheruvugattu.blogspot.in

7, సెప్టెంబర్ 2017, గురువారం

తాటితాండ్ర

తాటితాండ్ర గుర్తుందా... తినని వారెవరైనా వున్నారా...తాటికాయను పెద్దగా గుర్తించరు గానీ దానిలో ఎన్నెన్నో ఔషధగుణాలున్నాయోనట.
చిన్నతనానికీ...తాటితాండ్రకూ ఏదో అవినాభావసంబంధం వుందనిపిస్తుంది.
అలాంటి తాటితాండ్రను ప్రస్ధుతిస్తూ.....
చిన్నకవిత(హాస్యానికి).

తాటితాండ్ర తాటితాండ్ర
ఏమి రుసే నీ రసం నిండా
నడిసంద్రంలోవున్నా.
మండుటెడారి లో వున్నా..
మానోట్లో నీ రసముండ
నీరసమంటూ..వుంటుందా..
నీ జాతి సల్లగుండా
ఏంమాయచేశావే
మా నాలుకలనిండా
పక్కన నువ్వుండ
సున్నాకదా..నేతి సున్నండ.
జయహో.. తాటితాండ్ర
జయజయహో తాటితాండ్ర.
.......శ్రీమణి