పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

13, నవంబర్ 2018, మంగళవారం

సుస్వరాలకోకిలమ్మ‌‌.. మనసుశీలమ్మ


🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸

ఏ గానమాలకించగానే..
గగనం సైతం పులకిస్తుందో...
ఏ స్వరం వినగానే మది
మరుమల్లెల పరమవుతుందో

ఏ గాత్రం వింటూనే...
ప్రతి హృదయానికి
చైత్రం ఎదురవుతుందో..
ఏ మరందపు పాటల ఝరిలో..
రాగాలన్నీ... మానసరాగాలై
పరవశమవుతాయో...

ఎవరి గళంనుండి
అమృతం అలవోకగా
జాలువారుతుందో...
ఎవరి గొంతు వినిపించగానే...
ఆబాలగోపాలమూ
ఆనందరాగమాలపిస్తుందో...

ఆమే....
మనసుస్వరాల కోయిలమ్మ
మనసెరిగిన మన సుశీలమ్మ

అవును ఆ కంఠం మనసుమనసునూ
తట్టిలేపుతుంది..
తాను పాడిన పాటకు
తనువంతా... తన్మయమై
వెన్నెలతానమాడుతుంది
ఆమెపాడితే... మైమరచి
మన మది... మకరందం చవిచూస్తుంది
ఆమెపాడితే... ప్రకృతి పరవశమై ప్రణయ వీణలు మీటుతుంది
ఆమె పాడితే ఎద ఎదలో
మధురోహల పూదోట
విరబూస్తుంది

ఆహా..ఎంత భాగ్యము నాది
గాన కోకిలకు
చిరుకవనమర్పించ
నా కలమునకెంతటి సౌభాగ్యమో...
ఆ సంగీతసామ్రాజ్ఞిని సన్నుతించ
ఆ అపర విద్యున్మాలినికీ...
ఆ సుస్వరాల సుమ మాలినికీ...
అక్షర నీరాజనాలర్పిస్తూ...
సుస్వరాల పూలకొమ్మ
సుశీలమ్మకు
పుట్టినరోజు శుభాకాంక్షలతో
   
సాలిపల్లిమంగామణి(శ్రీమణి)
🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸

11, నవంబర్ 2018, ఆదివారం

నాగులచవితి


మీ పాపాలు
బాపాలని
మాపాలి పడి.....
పాలెన్ని పోసినా...
అవి మట్టిపాలే...
మీ ఇంట
కోటిదీపాలు
వెలగాలంటే
కోపాలు,తాపాలు
కాదు..కాసింత
మానవత్వపు పాలు
పెంచి చూడు...
                 ఇట్లు
               *నాగన్న*

                   శ్రీమణి

5, నవంబర్ 2018, సోమవారం

కళాసరస్వతి అవార్డు తీసుకున్న శుభతరుణం


నేడు వరంగల్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రాంగణంలో
"కళానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ, గోదావరి ఖని",  వారు నిర్వహించిన సాహితీరంగంలో జాతీయస్థాయి తెలంగాణా కళా సరస్వతీ, మదర్ థెరీసా అవార్డు 2018 అందుకొన్న శుభతరుణం... మీ ఆశీస్సులు కాంక్షిస్తూ...
🌿🌺🌸🌺🌸🙏🌸🌺🌸🌺🌿

2, నవంబర్ 2018, శుక్రవారం

దేవులపల్లి122వ జయంతి సందర్భంగా

నిన్నటి రోజున దేవులపల్లి వారి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లాలోచంద్రంపాలెంలో జరిగిన 122వ జయంత్యుత్సవాల చిత్రాల సమాహారం. ఈ సభలోనే నా తొలి అతిధి ప్రసంగం చేసినది. ఆ మహనీయుని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నందునే నాకు ఈ సదవకాశం లభించిందని నన్ను అన్నివిధాలా ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమణి
🌺🌸🌺🌸🌺🙏🙏🌺🌸🌺🌸🌺

29, అక్టోబర్ 2018, సోమవారం

గోరసం వారి సత్కారం

ఈరోజు రాజమహేంద్రవరంలో
గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు శత వర్ధంతి సందర్భంగా జరిగిన  జాతీయ కవిసమ్మేళనంలో 
" తెలుగు రక్షణ వేదిక " జాతీయ అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారిచే ఘన సన్మానం అందుకుంటున్న శుభతరుణం.... *శ్రీమణి*

27, అక్టోబర్ 2018, శనివారం

అట్లతద్ది

అచ్చతెలుగు వారింట
అట్లతద్ది
అతివలందరికీ అది
ఆనందసిద్ధి
అందాల అరచేత
గోరింటనద్ది
ముత్యమంతా
పసుపు ముదిత
ముదమార దిద్ది
ప్రొద్దుప్రొద్దున్నే
చద్దిగౌరమ్మ చలువ కొద్దీ...
అట్లతద్ది వచ్చింది
అచ్చతెలుగు లోగిలికి
ఆనందంతెచ్చింది
అతివలందరికీ
ముద్దమందారమై
మురిసి మురిపెంగా
సురదనలందరికీ....
వరములనొసగగా‌‌.‌..
సీమంతునులందరికీ
నిత్యం సౌభాగ్యమీయగా
నట్టింట శ్రీ గౌరి
నడయాడ వచ్చింది
ఊరువాడా చేరి
ఉయ్యాలలూగింది
ఉప్పొంగి గంగమ్మ
ఉరకలెత్తంగా
నీళ్ళలో గౌరమ్మ
పాలలో గౌరమ్మ యనుచు
పడతులందరుచేరి పాటపాడంగా
బంతులు,చామంతులతో
ఇంతులు మంతనాలతో
పట్టరాని సోయగాల
పట్టుపీతాంబరాల
సంబరాలు అంబరాన్ని
తాకగా....
పల్లెంతాపల్లెంతా..
ఘల్లు గజ్జె కట్టింది
పసుపుకుంకుమలతోడ
పలకరించింది
పచ్చని అక్షతలదాల్చి
పరవశించింది
తరుణి పారాణిపాదాల
ధరణి మురిసింది
సిరిచందనముతో
చిరునవ్వుసరులతో
అర్చించె అతివలందరు
అమ్మనత్యంతభక్తితో..
కొలిచిన వారికి కొంగుబంగారమై
పిలిచిన వారికి
సౌభాగ్యం దాయినియై
అమ్మలందరికమ్మ
అరుదెంచె గౌరమ్మ
పసుపుకుంకుమలతో
పాలించగా..‌.మము
పరిపాలించగా...
*అట్లతద్ది శుభాకాంక్షలతో*
                    *శ్రీమణి*

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

సి.పి.బ్రౌన్ సేవా సమితి, సత్కారం

సి.పి.బ్రౌన్ సేవా సమితి, బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయ కళామందిరం, డా. టి.సుబ్బరామిరెడ్డి కళావేదిక యందు. ప్రఖ్యాత కన్నడ సాహితీ వేత్త గౌ.పద్మశ్రీ డా.దొడ్డరంగే గౌడ గారు మరియు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు గౌ. డా. ఎ.రాధాకృష్ణ రాజు గారు మరియు సి.పి.బ్రౌన్ సేవా సమితి అధ్యక్షులు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి గారు మరియు ఇతర ప్రముఖుల చేతులమీదుగా గేయ విభాగంలో
"గుర్రం జాషువా గారి స్మారక పురస్కారం" అందుకొన్న శుభతరుణం.

29, సెప్టెంబర్ 2018, శనివారం

సాగిపో ముందుకూ...

వద్దురా...చిన్న...వద్దురా!
మొద్దు నిద్దరోవద్దురా....
వద్దురా...కన్న...వద్దురా!
మొద్దు నిద్దరోవద్దురా....

ఎంత పెద్దదో‌‌...లోకం
ఎదురీత నేర్చుకో....
అడుగడుగున గతుకులే
బ్రతుకుబాట వేసుకో...
అవరోధాలెన్నున్నా...
అధిగమించి సాగిపో
ఆరాటాలెన్నున్నా....
పోరాటం నేర్చుకో...
సాగిపో ముందుకూ...
సందేహం ఎందుకూ...
వడివడిగా...అడుగులేసి
ప్రగతి పసిడిబాటకేసి......"వ"

జీవనపోరాటమిదీ....
గెలుపు సూత్రం తెలుసుకో
అసలే కలికలికాలం
ఆచితూచి మసలుకో
వంచన జోలికి పోక
మంచి నడత అలవర్చుకో
ఆవేదనలెన్నున్నా...
ఆలోచన పెంచుకో...
సాగిపో... ముందుకు
సందేహం...ఎందుకూ...
వడివడిగా అడుగులేసి
ప్రగతి పసిడి బాటకేసి...."వ"
  
  ‌                        శ్రీమణి

27, సెప్టెంబర్ 2018, గురువారం

*మేలుకో..మేలుకై*


అయిదేళ్ళ అందలానికే...
అయ్యవార్ల తందనాలు
గద్దెనందుకోవడానికే...
వంగివంగి వందనాలు
నోటికిహద్దులేని
వాగ్ధానాలు,
చేతికెముకేలేని
బహుమానాలు,
పదవిని చేపట్టేదాకా...
కొదవేముందీ..కోతలకు,
అనుకొన్నదిసాగేవరకు
అరచేత్లో స్వర్గంచూపెడతారు
ఆకాశంలోచుక్కలనైనా..
నేలకిదించేస్తారు
తీరా...అందినాక
మనకు పట్టపగలే
చుక్కలు చూపిస్తారు
ఓట్ల భిక్షాటనలో
అడుగడుగునా...హైడ్రామాలు
ఆపై...అమాయకజనానికి
పెడతారు..పంగనామాలు
పర్యవేక్షణలు,
పాదయాత్రలంటూ..
పల్లెపల్లెకూ ...పలకరింపులు
పదేపదే..పడతారు
ప్రజలకు నీరాజనాలు
భయమేల...మీకంటూ
అందరికీ..అభయంఇస్తారు
వట్టిమాటలను కూడా
గట్టిమాటల్లాగే...
నొక్కినొక్కిచెప్తారు..
నాటకాలు,బూటకాలలో
మహానటులను తలపిస్తారు
అడుగడుగునా...
ఆత్మీయరాగమే
ఆలపిస్తారు...
అనుకొన్నది... దక్కిందో
కిక్కురుమనకుంటారు..
ఏవోదిక్కులు చూస్తుంటారు
ఇవీ..మన నాయకులనైజాలు
ఇప్పటికైనా...తెలుసుకోండి
నిజానిజాలు,
ఆసన్నమయ్యింది
అనువైన సమయం
అవినీతిరాజ్యమేలుతున్న
నేటి ప్రజాస్వామ్య వ్యవస్ధలో
నోట్ల వ్యామోహంలో
ఓట్లనమ్ముకోవద్దు
మద్యంమత్తుల్లో...
నాయకులనెన్నుకోవద్దు
మీతలకు మీరే కొరివి
పెట్టుకోవద్దు..
కోరి...కష్టాలను కొనితెచ్చుకోవద్దు
గోముఖవ్యాఘ్రాలన్నమ్మి
గొర్రెల్లా...ఓటేయద్దు
ఒక్కపూటవిందుకోసం
తాగినంతమందుకోసం
మత్తెక్కి మీఓటును
ఎటోవైపు విసిరేస్తే ..
అంతా...అయిపోయాక
అగోరించక తప్పదు
ఐదేళ్ళూ...అరకొరబ్రతుకులతో
అల్లాడకా తప్పదు
'ఓటు'అనే మహత్తరశక్తిని
అపహాస్యంచేయద్దు
అపాత్రదానం అసలేచెయ్యొద్దు
అందులకే....ఆలోచించండి
అర్హులకే పట్టంకట్టండి
ఆదమరచి..హాయిగా
బ్రతుకును కొనసాగించండి
చేయిచేయికలపండి
భరతఖ్యాతి నిలపండి
ప్రతిజ్ఞ చేయండి
ప్రజాస్వామ్యం పరువునిలబెడతామని.
                    శ్రీమణి

26, సెప్టెంబర్ 2018, బుధవారం

శ్రమైక సౌందర్య మూర్తి


ప్రకృతిపాదానికి పెట్టిన
పచ్చనిపారాణి
పదహారణాలా
అచ్చతెలుగు అలివేణి
పచ్చనిపచ్చికలో
విరబూసిన పూబోణి
మేలిమి సొగసుల రాణి
మట్టిగంధం పూసుకొన్న
మనసున్న మారాణి
మరుమల్లెల పూబోణి
మంచిముత్యాల తలదన్నే
ఆ ధరణిపుత్రిక దరహాసపు
ధగధగలకు సరితూగగలవా
ఆ నగలూనాణ్యాలూ..
ఆ శ్రమైకసౌందర్యమూర్తిని
చూసినివ్వెరపోవా...
సృష్టిలోని సోయగాలు

                          శ్రీమణి

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరంజిల్లా వారు నిర్వహించిన గురజాడ-156వ జయంతిఉత్సవాలలోభాగంగాశతాధిక కవిసమ్మేళనంలో పాల్గొని సత్కారం పొందిన శుభతరుణం మీఅందరి ఆశీస్సులుఆకాంక్షిస్తూ ...శ్రీమణి

*మనగురజాడ..*

అభ్యుదయ కవితాపితామహుడు
ఆధ్రజాతిచరిత్రలో
అలుపెరుగని
అత్యద్భుత కవీశ్వరుడు
అవిరళ కృషీవలుడు
మనిషిని మనీషిగా మార్చిన
మాన్యుడతడు
కన్యాశుల్కం కావ్యరాజమునొసగిన
కవివరేణ్యుడు
ఆధునిక సాహితీ యుగకర్తయతడు
అశేష ఆంధ్రావని గుండెల్లో
అతడెన్నటికీ కరగని జ్ఞాపకం
అభ్యుదయ కవిత్వంలో
అతడిది చెరగని సంతకం
మహిపై మనకోసం
మహాభిజ్ఞుడై
ఉదయించిన మరకతమణిమాణిక్యం
మాతృభూమి ఘనకీర్తిని
దిగ్ధిగంతాలా చాటిచెప్పిన
మహోన్నతమూర్తియతడు
వ్వవహారిక భాషోద్యమకారుడు
సాంఘికదురాచారాలపై
తన కల కరవాలం
ఝుళిపించి,
కర్తవ్యం బోధించి
కార్యోన్ముఖులను చేసి
కదంతొక్కిన కలంయోధుడు
దేశమంటే మట్టికాదని
దేశమంటే మనుషులంటూ
మనిషిమనిషిలోదేశభక్తిని
మేలుకొల్పిన కవీంద్రుడు
మతమన్నది మాసిపోవునని
మనుషుల్లో జ్ఞానదీపాలు
వెలిగించిన రవీంద్రుడు
స్త్రీలపాలిట వరమై
సంధించిన శరమై
సాంఘికసంస్కరణకై
సమరంగ గావించిన
కవిశేఖరుడు
ఆ మహనీయుని కలాన
జారిన కవనాలు
అమృతాక్షరాలై
విలసిల్లెను తెలుగునాట
నేటికీ ప్రతిధ్వనించె
ప్రతీ తెలుగునోట
పల్లవించి పాటగా
ప్రగతి పసిడిబాటగా
అతడే మనగురజాడ
ఆనాటికీ, ఏనాటికీ
ఆమహనీయుని అడుగుజాడ
తేట తెలుగు వెలుగు జాడ
ఆ మహోన్నతమూర్తికీ
ఆ మానవతా మూర్తికీ
మహాచైతన్యస్ఫూర్తికీ
ఆ సాహితీ యుగకర్తకూ నవయుగవైతాళికునికీ
ఈ చిరుకవనమాలికతో
నివాళులర్పిస్తూ....
అభివందనాలు అభిజ్ఞునికి
సహస్రకోటి వందనాలు
సాహితీమూర్తికి... *శ్రీమణి*