*ప్రణామాలు గురువర్యా*
ఉదయించే జ్ఞానం
నడిపించే ధైర్యం
జీవించే నైపుణ్యం
శోభించే ఔన్నత్యం
సహృదయం,సద్భావం,
అలవరచగ ఇల వెలసిన
ప్రత్యక్ష దైవమా..
ప్రణామాలు గురువర్యా..
ఉజ్వల భవిత
ఉత్తమ నడత
ఉన్నత సంస్కారం
మాన్యతను,మానవతను
ప్రబోధించి మనిషిని మనీషిగ
మలచిన మార్గదర్శీ
ప్రణామాలు గురువర్యా...
జ్ఞానసూర్యుడా...
విజ్ఞాన ప్రదాతా..
మేలుకున్నది మొదలు
మా మేలుకై పరితపించి
కర్తవ్యం స్ఫురింపజేసే
కాంతిపుంజమా...
విద్యాదాతా....
ప్రణామాలు గురువర్యా..
అజ్ఞానపు చీకట్లను బాపి
వెలుగులనిచ్చే వెలుగులదొరా...
ఒట్టి మట్టిముద్దను సైతం
మహామేథావిని గావించగల
మహిమాన్విత శిల్పీ..
అక్షరక్షీరాలనొసగి
జ్ఞానార్తిని తీర్చిన అమ్మలా
మంచి,చెడులు నేర్పించిన నాన్నలా
వేలుపట్టి దిద్దించి
వేలుపువైనావు
జన్మంతా సేవించినా
తీరునా నీ ఋణం
వెలకట్టలేని విద్యాసిరులను
వరమిచ్చిన గురువర్యా..
ప్రణామాలు గురువర్యా.
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి