పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

అక్షర తపస్సు

*అక్షర తపస్సు*

నాకు కొన్ని అక్షరాలనివ్వండి శరాలుగా మార్చి సమాజంమీదికి విడిచిపెడతాను,
తమస్సును ఛేదించాలన్న
తపస్సు నాది తప్పక శ్రేయస్సునే సమాజానికి
సంప్రాప్తింపచేస్తాను,
నాకు,నాకవిత్వానికీ కాసింత ఏకాంతాన్ని ఇవ్వండి అక్షరాలను నాహృదయంతో అనుసంధానం చేస్తాను,
ఒకింత సమయాన్ని స్వేచ్ఛగా నాకందించండి
ఉప్పొంగుతున్న భావావేశాన్ని గుమ్మరించి ఉత్కృష్టమైన కవిత్వంతో జగతి కాగితాన్ని అలంకరిస్తాను ,
సాహిత్యపు సాగుచేస్తూనే వ్యవస్థనూ
బాగుచేయాలని పరితపిసిస్తున్నాను
అలుపెరుగని అక్షరతపస్వినై,
అంతరాంతరాళాలనూ స్పృశించడానికి
నాకలం నైపుణ్యాన్ని విస్తృతం చేసుకుంటున్నాను
విశ్వయవనికపై విజయకవనాన్ని తప్పక
ప్రదర్శిస్తాను,
నన్ను నేను పోగొట్టుకున్న ప్రతిసారీ
పోగుచేసుకున్న ఆ నాలుగక్షరాలే నాఉనికిని
సుస్ధిరం గావించాయి,అంతులేని నిర్వేదం ఆవహించి అంతరించాలనుకున్న రోజు
ఆపదలతికలే నన్ను అతికించి పునఃపల్లవింపచేసాయి, అంతరంగం విహ్వలించినపుడు ఆత్మస్థైర్యం ధరించడంకోసం అక్షరాలనే ఆశ్రయించాను,
నేనప్పటినుండీ జీవనదిలా ప్రవహిస్తున్నాను
రేపటి ఉదయం మహోజ్వలంగా ప్రకాశించాలనే రేయింబవళ్ళు కవనవిహారం,
మార్పు మననుండే మొదలవ్వాలని
కలం ఉలితో నన్ను నేను పరిపూర్ణంగా మలచుకుంటున్నాను,
రేపో మాపో కిల్బిషమంటని నవసమాజాన్ని
నిస్సందేహంగా నిర్మిస్తాను,
నిశితెరలను తొలగిస్తూ నిజ ఉషస్సురేఖనై
వికసిస్తున్నాను,
నేనిప్పుడు హృదయాలను కదిలించే కవిని
అంధకారాన్ని విదిలించే రవిని
అనునిత్యం ఉదయించే చిరంజీవిని.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి