పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, సెప్టెంబర్ 2022, శనివారం

మరువముగా

*మరువముగా....*

మరువముగా....
మదిగాంచిన
మనోహర దృశ్యాలను
మరువము మరి
మరుజన్మముదాకా...
మనసును స్పృశించిన
తీయనిఅనుభూతుల పరవశాన్ని
మరువగలమా....మరి 
ఎదఝల్లను పరిమళాల వెదజల్లే కుసుమలతల సరాగాలు,ముసిరే
 తొలకరివానల  చినుకులజడికి తడిచిన
పచ్చిక పరువాల పదనిసలను
ప్రకృతి పొదివిపట్టిన 
 తళుకులనెటు మరువగలము
మరువముగా .... మనసుతాకిన సమ్మోహన చిత్తరువులను,
పుడమి నుదుటున తీరుగ దిద్దిన తూరుపుసింధూరాన్ని
మరువగలమా..
మరుమల్లియ లతనల్లిన
 మలయసమీరాన్ని,
మరువముగద !
పూన్నమి మధుఘడియల ఒరవడిని ,
కలువలదొర వెన్నెలజడిని,
మంచు చీర కప్పుకొన్న
మన్నెపు మాగాణిని,
మకరందం దాచుకొన్న 
కోయిల మారాణిని
మరువముగద !
మైమరపునవిహరించే 
 రాయంచల సొబగులను
నీలిమేఘాల వరుసల్లో
విరిసిన హరివిల్లు వర్ణాలనెటు
మరువగలమా..
విరబూసిన కుసుమాలపై
జతులాడిన తెర ఈగల 
సరాగాన్ని,
అణువణువునా అధ్భుతాలతో
అతిశయాల సంతకాలతో
అడుగడునా పరవశాలను 
పరిచయంచేస్తూ...మైమరపిస్తున్న
ప్రకృతికి ప్రణమిల్లుతూ..

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

అక్షర తపస్సు

*అక్షర తపస్సు*

నాకు కొన్ని అక్షరాలనివ్వండి శరాలుగా మార్చి సమాజంమీదికి విడిచిపెడతాను,
తమస్సును ఛేదించాలన్న
తపస్సు నాది తప్పక శ్రేయస్సునే సమాజానికి
సంప్రాప్తింపచేస్తాను,
నాకు,నాకవిత్వానికీ కాసింత ఏకాంతాన్ని ఇవ్వండి అక్షరాలను నాహృదయంతో అనుసంధానం చేస్తాను,
ఒకింత సమయాన్ని స్వేచ్ఛగా నాకందించండి
ఉప్పొంగుతున్న భావావేశాన్ని గుమ్మరించి ఉత్కృష్టమైన కవిత్వంతో జగతి కాగితాన్ని అలంకరిస్తాను ,
సాహిత్యపు సాగుచేస్తూనే వ్యవస్థనూ
బాగుచేయాలని పరితపిసిస్తున్నాను
అలుపెరుగని అక్షరతపస్వినై,
అంతరాంతరాళాలనూ స్పృశించడానికి
నాకలం నైపుణ్యాన్ని విస్తృతం చేసుకుంటున్నాను
విశ్వయవనికపై విజయకవనాన్ని తప్పక
ప్రదర్శిస్తాను,
నన్ను నేను పోగొట్టుకున్న ప్రతిసారీ
పోగుచేసుకున్న ఆ నాలుగక్షరాలే నాఉనికిని
సుస్ధిరం గావించాయి,అంతులేని నిర్వేదం ఆవహించి అంతరించాలనుకున్న రోజు
ఆపదలతికలే నన్ను అతికించి పునఃపల్లవింపచేసాయి, అంతరంగం విహ్వలించినపుడు ఆత్మస్థైర్యం ధరించడంకోసం అక్షరాలనే ఆశ్రయించాను,
నేనప్పటినుండీ జీవనదిలా ప్రవహిస్తున్నాను
రేపటి ఉదయం మహోజ్వలంగా ప్రకాశించాలనే రేయింబవళ్ళు కవనవిహారం,
మార్పు మననుండే మొదలవ్వాలని
కలం ఉలితో నన్ను నేను పరిపూర్ణంగా మలచుకుంటున్నాను,
రేపో మాపో కిల్బిషమంటని నవసమాజాన్ని
నిస్సందేహంగా నిర్మిస్తాను,
నిశితెరలను తొలగిస్తూ నిజ ఉషస్సురేఖనై
వికసిస్తున్నాను,
నేనిప్పుడు హృదయాలను కదిలించే కవిని
అంధకారాన్ని విదిలించే రవిని
అనునిత్యం ఉదయించే చిరంజీవిని.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

7, సెప్టెంబర్ 2022, బుధవారం

కల కానిదీ

*కలకానిదీ*

నమ్ముతారో లేదో మరి
ఒక చిత్రమైన కల నను రోజూ వెంటాడేది, చెక్కుచెదరనికొన్ని ప్రదేశాలు 
కనులముందు సాక్షాత్కరిస్తూ నన్ను  అనిశ్చిత ఆలోచనల వెంట తరుముతూ
ఏవో ఇంతకు మునుపే చవిచూసిన
అనుభూతుల తుంపరలో 
తడిచిపోతున్నట్టు

ఇప్పటికీ అదే కల 
కనురెప్పలు వాలగానే ఆక్రమించుకుని
కాలాన్ని వెనక్కి త్రిప్పి తీసుకెళుతున్న భావన, ఖచ్చితంగా ఆ ప్రదేశంలో 
నేను మసలిన మరపురాని స్మృతులేవో
నా మునుపటి ఉనికిని బలపరుస్తుంటాయి
పూర్వజన్మలో అది నా ఆవాసమా
అన్న అనుమానం స్వప్నం పూర్తయిన
ప్రతీసారి అదే సందేహంతో 
ఉదయాన్ని ఆహ్వానిస్తుంటాను

అక్కడ కనుచూపుమేరలోఎవ్వరూ లేరు
నా ఉనికి నాకే తెలియని నిశ్శబ్ద ప్రదేశం
ఒక్కటి మాత్రం గుర్తుంది 
ప్రకృతితో మమేకమైన నేను
నాప్రక్కన గుబురుగా అలుముకున్న
కాగితపు పూలచెట్లు 
నేలను ముద్దాడినట్లు 
గడ్డిపూలసోయగాలు
నే నిలబడివున్న దారి కాస్త పల్లంగా
అదేదారికేసి కొంచెం దూరంగా
దృష్టిని సారిస్తే బాగా ఎత్తుగా 
దారులకిరువైపులా బారులుతీరి
చిక్కగా అల్లుకొన్న కొమ్మలు, ఆకులతో 
మహావృక్షాలు కాబోలు 
తల ఎత్తిచూసినా
ఆకాశాన్ని కనపడకుండా అడ్డుపడుతున్నాయి
అస్సలు ఆ ప్రదేశానికి సూర్యుని
కిరణాలు అపరిచితమేమో అన్నట్లు
నా వెనుకగా తరాల తరబడి
నిలబడి అలసిపోయి 
వానల అలజడికి కరుగుతూ 
సగం నేలకొరిగిన మట్టిగోడలు
వర్షం వచ్చి వెలసిన జాడలు
కుడిచేతివైపు లోపలకు సన్నని త్రోవ
ఒక్కరు మాత్రమే నడిచేట్టు,

పచ్చదనం వెచ్చగా హత్తుకున్న
మట్టి పరిమళం మనిషినిమాత్రం
నేను ఒక్కదానినే మనసునిండా
ఏదో తెలియని మంత్రజాలంలా
సర్వం మరచి ప్రకృతిలో  పరవశిస్తూ
పంచభూతాల సాక్షిగా నేను
చుట్టుప్రక్కల ఏమాత్రం సంచారం
లేకపోయినా పక్షుల స్వరవిన్యాసం
మాత్రం చెవిని చేరుతూనే వుంది
నేనెవరో నాకు తెలియని సందిగ్దత
కానీ అది నేనేనని మాత్రం స్పష్టంగా
చెప్పగలను,
అసలు అక్కడ  అలా
ఎందుకు  నిలబడ్డానో 
నిర్మానుష్యంగావున్న ఆ ప్రదేశానికి‌,
నాకు మాత్రం
ఏదో జన్మాంతర సంబంధమా అన్న
అనుమానం తలెత్తుతుంది..
ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెనువెంటనే
ఎప్పుడూ ఆదారికేసి చూస్తూ
ఎదురుచూపులు చూస్తున్న 
నా నిలువెత్తుచిత్రం మాత్రం చిత్రంగా
ప్రతీ రాత్రీ స్వప్నంలా పలకరిస్తుంటుంది

ప్రతీసారీ అదేకల, అవే ప్రదేశాలు
అదే ఎత్తుపల్లాలదారీ,ఏమాత్రం
రూపు మారని మట్టిగోడలు 
పచ్చల ఆభరణం ధరించిన నేలా
పక్షులకువకువలూ, అన్నీ యధావిధిగా
నా కళ్ళముందు కావ్యంలా
ఆవిష్కరించబడుతూనే వున్నాయి
కనులు నిద్రకుపక్రమించిన 
అతితక్కువ సమయానికే అరుదెంచి
తెల్లారుతుండగానే కరిగిపోతూ
నన్ను అబ్బురపడేలా చేస్తాయి.

కలా లేక , కలకాని భ్రమా
లేక ప్రకృతి పట్ల నాకున్న అవ్యాజమైన
అనురక్తికి నాలో నిక్షిప్తమైన
భావాలకు ఊహాచిత్రమా...
ఏమో..ఏమైనా..గానీ
ప్రకృతి ప్రసన్నమై కలలా 
నన్నుతాకి వివశను చేస్తుంటే
మది వీణియ వింతహాయిరాగాలనే
ఆలపిస్తూ నన్ను ఆమనిలా 
పలకరిస్తూనే వుంది.
(కలకానిదీ..అంతరంగ/అనుభూతి ఆవిష్కరణ)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

5, సెప్టెంబర్ 2022, సోమవారం

ప్రణామాలు గురువర్యా..

*ప్రణామాలు గురువర్యా*

ఉదయించే జ్ఞానం
నడిపించే ధైర్యం
జీవించే నైపుణ్యం
శోభించే ఔన్నత్యం
సహృదయం,సద్భావం, 
అలవరచగ ఇల వెలసిన
ప్రత్యక్ష దైవమా..
ప్రణామాలు గురువర్యా..
ఉజ్వల భవిత
ఉత్తమ నడత
ఉన్నత సంస్కారం
మాన్యతను,మానవతను
ప్రబోధించి మనిషిని మనీషిగ 
మలచిన మార్గదర్శీ
ప్రణామాలు గురువర్యా...
జ్ఞానసూర్యుడా...
విజ్ఞాన ప్రదాతా..
మేలుకున్నది మొదలు
మా మేలుకై పరితపించి
కర్తవ్యం స్ఫురింపజేసే
కాంతిపుంజమా...
విద్యాదాతా....
ప్రణామాలు గురువర్యా..
అజ్ఞానపు చీకట్లను బాపి
వెలుగులనిచ్చే వెలుగులదొరా...
ఒట్టి మట్టిముద్దను సైతం
మహామేథావిని గావించగల
మహిమాన్విత శిల్పీ..
అక్షరక్షీరాలనొసగి
జ్ఞానార్తిని తీర్చిన అమ్మలా
మంచి,చెడులు నేర్పించిన నాన్నలా
వేలుపట్టి దిద్దించి 
వేలుపువైనావు
జన్మంతా సేవించినా
తీరునా నీ ఋణం
వెలకట్టలేని విద్యాసిరులను
వరమిచ్చిన గురువర్యా..
ప్రణామాలు గురువర్యా.
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఎట్టా వేగేదీ

*ఎట్టా...వేగేదీ...నీతో*

నేన్నెట్టా...సాగేదీ..నీతో
ఏంమాయచేశావో...
ఏమంత్రమేశావో...
గమ్మత్తుగ ఏదో...
మత్తునుజల్లి..నన్నే 
ఏమార్చేశావు
నాహృదయపు
తలుపులు నీకై 
తెరిచా...కిట్టయ్యా...
నీవలపులతలపులు
మాత్రం పలుభామలపైనా
పరచేవా....
నాగుండె సప్పుడు విన్నావా..
ఎప్పుడు కిట్టయ్యంటాది
మల్లెచెండంటి
నీ మనసుమాత్రం
మగువలమద్యన
మారుతుంటదీ
మౌనంలోనూ...
నీమాటలువింటూ
మనసునూరడిస్తున్నా..
నీఊహలలోనే..నిరతం ఉంటూ..నా ఉనికే మరచిపోతున్నా..
ఉన్నమాటచెబుతున్నా
నువులేక నేనూ మనలేకపోతున్నా
ఎన్నిజన్మలబంధమో..మరి,ఏనాటిసంబంధమో మరి.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)* *(రాధాష్టమి శుభాకాంక్షలతో)*