పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

విశ్వ సత్కారం మాకు...అంతిమ సంస్కారం మీకు


చేవ లేదనుకొన్నారా !చేత కాదనుకొన్నారా!
 చవటలమనుకొన్నారా ...?చతికిలపడ్డామనుకొన్నారా !
మా మానవత్వపు మాన్యతని గుర్తించలేని మీరు
మీ మన్య జంతువుల నైజం చూపించుకొన్నారు 
నక్క జిత్తులు పన్నుతున్నారు ... మీ కుక్క బుద్ధులు చూపిస్తున్నారు ... 
మేం ఊపిరి బిగబట్టి ఒదిలామంటే ఊగిపోదా మీ ఉగ్రవాదం 
మా   పిడికిలి బిగిస్తేనే  దిక్కులు పిక్కటిల్లి మీ గుండె గతుక్కుమనదా 
 కవ్విస్తారా!మాటిమాటికీ కాలు దువ్వుతారా కయ్యానికి ,
 మా సహనానికి సవాలెక్కుపెడతార్రా  .. .. ఇక మీ శవాల్లెక్కపెట్టుకోండిరా ...
శివాలెత్తిన మా  సైనికుల సల సల మరుగుతున్న రుధిరం సాక్షిగా చెప్తున్నా .
 మా మాతృ భూమిపై కన్నేస్తే ,మీ వాకిట్లో మరణ మృదంగం మ్రోగిస్తాం 
చుక్కలు చూపిస్తాం,ప్రక్కలో భల్లెంలా మీ కర్కశాన్ని చూపిస్తే 
ఆట్టే ఆగడాలు చూపిస్తే సరిహద్దు నడిబొడ్డున మట్టి లో కలిపేస్తాం ... 
కాచుకోండి... మా ఉగ్ర నార సింహాల పంజా ధాటికి,రాజుకున్నమా సైనిక గుండెల నిప్పుల ధాటికి,
తల దాచుకోండి,తలో వైపు పరుగులెత్తి 
బ్రతిమాలుకొండి బ్రష్టులమంటూ,నీతి  లేని నికృష్టులమంటూ 
ఈ యుద్దాన్ని కొనసాగిస్తే పర్యవసానం,ఘోర పరాజయం మీకు 
ఘన  విజయపధం మాకు,
విశ్వ సత్కారం మాకు ,అంతిమ సంస్కారం మీకు ,
(మా భారత సైనిక సహోదరులకు ఇదే ఈ ఆడపడుచు దిద్దిన కథన తిలకం,
ఏనాటికీ కావాలి మీ మీ ధైర్యం,మీ త్యాగం భరత జాతి చరితకే కరతలామలకం. )
జయహో భారత మాతాకీ ... జయహో 
వీర సైనిక సహోదరులకు ... జయహో 
                                                 సాలిపల్లి మంగామణి @శ్రీమణి  




26, సెప్టెంబర్ 2016, సోమవారం

కిట్టయ్యవు నీవు,, ఆ రాధికనేను


ఇదేమి సిత్రమో !
ఆ మదనుని మహిమాస్త్రమో!
నీ ప్రణయ రసామృత సేవన వైచిత్రమో !
ముడి వేసిన మనసుల మానస సరాగమో 
నీ జతలో నాకు  గురుతు రాదు సమయం 
నీ సరసన నా హృదయం ,నిత్య విహంగ వీక్షణము 
నిను చూడక క్షణమయినా...  తరగదు ఆ తరుణం 
ఇదేమి సిత్రమో ... నాకు నేనే  అపరిచితగా... 
నా చుట్టూరా లోకమే సరి కొత్తగా ... 
ఏ వైపు చూస్తున్నానీ  మైమరపు తెమ్మెరలే 
కనుచూపు మేరలో కమ్మని మన ప్రణయ సొరభమే 
ఏమరపాటుగా చూస్తే  యేటి కొలనుల్లో నా రూపులో నీవు 
కోటి వెన్నెల్ల జడి నాపై  వర్షించి పోతావు,
కొనగోటితో నా మది మీటి 
మేటి ముత్యాల నీ నగవు చిలుకరిస్తావు,
మురిపిస్తావు,నన్ను మరిపిస్తావు,
నవ్విస్తావు,నన్ను కవ్విస్తావు,
చెంత చేరి ఏవో  వింతలు చేసి 
తీరా చూస్తే !నా కళ్ళ గంతలు మూసి
కనుమరుగైపోతావు,కలలా కళ్ళల్లో కరిగిపోతావు. 
ఇదేమి సిత్రం ప్రభూ ... కనికరమయినా లేదా 
కదలనైనా లేను నిను సూడక,నేను 
నిశ్చలమయిపోతా  ... లేకుంటే నీ జత 
దోబూచులేల ప్రభూ ... నీ ప్రియ సతితో 
సప్త పదులు నడిచిన నీకై సదా నే కంకితం 
నువ్వు నను వీడి మరుగైన  మరు నిమిషం 
మరణానికి మరుమల్లెల పానుపేసి పిలుస్తా.. 
మరు జన్మనైనా మిమ్ము మరలా కలుస్తా ,,,  
( నిను వీడి మనలేని నీ సతి శ్రీమణికై 
 చిరంజీవివే నువ్వు నా సౌభాగ్య కానుకై  )
                                   సాలిపల్లిమంగామణి@శ్రీమణి 




24, సెప్టెంబర్ 2016, శనివారం

పల్లె ఇల్లాలు,పట్టణాలొంక.


అదిగో బిడ్డా... ఆశల తీరం ఆవల ఉండాదంట
ఆకలి దీరె దారదిగో...  అది ఆమడ దూరం ఉండాదింకా
ఉగ్గబట్టుకో ఉబుకొత్తున్న ఉడుకు కన్నీల్లని,
చేతి నిండా పని కానోత్తాది,కడుపెచ్చ బొచ్చెడు గంజేత్తాది 
కన్నపల్లె నొగ్గేసి,బయలొత్తు ఉంటే  ..గుండెకాయ భగ్గుమంతన్నా 
 అగ్గి రాజేత్తన్న ఆకలి కడుపుకి,యేరే దారి కనబడక 
మెతుకు కరువై ,బతుకు బరువై ,బతుకు తెరువుకై ఎదురు నడక 
సల సల సూరీడు కాల్చేత్తన్నా... సల్లగే ఉందది మన ఆకలి మంటలకన్నా... 
సందిట బిడ్డలనదిమిపట్టుకొని,మూటాముల్లె సంకనెత్తుకుని,
గంపెడు ఆశతో పట్టపు తోవన పరుగులు తీత్తన్నాం 
పట్టణానికెళ్తే పట్టెడన్నమయినా పుడతాదని ,
కరువుధాటికి కన్నపల్లెనొదిలి,ఉన్నపలంగా పట్టపు దారి పట్టాం,
పలకరిత్తదంతవా... మన్నిసూసి పకపకా నవ్వుకుంతదంతవా 
కనికరిత్తదంతవా.,పనిచ్చి . .... కాదు పొమ్మంత దంతవా....  
ఓ లమ్మా .. పట్నమెల్లేక పంట్లామెత్తానే,,, ఇసుకూలుకెలతానే,ఇంగిలీసు నేరతానే 
అట్టెగాని ఆట్టే కలలొద్దులేరా .. పొట్టకూటికి లోటు రాకుంతే అద్గదే పదేలు,
 రంగురంగుల మేడలవిగోరా బిడ్డా,,,  ఆట్టే సూసావంటే  ఆకాశమంటేటి ఆ మేడలొంక,
మెడ నొచ్చిపోతాది,ఎర్రాటి సూరీని ఎండ కాల్సేత్తాది.  
 గిర్రుగిర్రున బుర్ర కిర్రెక్కుతాది. బేగా పదరా బిడ్డా... పొద్దు పోతుండాది
 కోటి ఆశల తోటి,పట్టపు బాట పట్టి,
సెంగు,సెంగున ఆడే చంటి  బిడ్డలతో,సెంగుసివర నూరు రూకల్ల ముడితో 
అడుగు వేసింది పల్లె ఇల్లాలు,పట్టణాలొంక. 
బతుకెట్టాగుంటదో సూడాలి ఇంక,
(రైతు రైతుకూలీగా, పొట్టకూటికై పట్టణాల బాట పడ్తున్న నేటి తరుణంలో పల్లె వెలవెల బోతే పచ్చదనమెట్టాగో,రానున్న కాలంలో రైతుంటాడో ,లేడో,)
                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                                                                     pandoorucheruvugattu.blogspot.in

1, సెప్టెంబర్ 2016, గురువారం

చిన్నబోవా మరి ..



కలికిని ,చిలుకల కొలికిని  ,
చెలియను ని,చంద్రుని నెచ్చెలిని
కలకంఠిని,కలువకంటిని నేను
కిన్నెరసానిని,వన్నెల అలివేణిని
భామినిని ,సుందర సౌదామినిని
వలపుల విరిబోణిని,మెలికల మాలినిని
 ఎలతీగబోణిని,ఎలకోయిల రాగాన్ని
అంచను,రాయంచనునేను ,
మెలుతను,విద్యుల్లతను
 సురదనను ,సుహాసినిని
సీమంతిని,సొగసుల చామంతిని నేను 
నివ్వెరబోవా ...జవ్వని సౌదర్యానికి   
నిలువలేక  సరిసాటిగా .... సృష్టి అందాలు. 
 చిన్నబోవా మరి .. ఆ నింగి తారకలు
మిన్నకుండిపోవా... వెన్నెల రాతురులు
చెలరేగిపోవా  మరి సెలయేటి గలగలలు
ఇల చేరిపోవా .. దివి చందనాలు
వరదలా కదలవా  వింద్యామరలు
జలజలా రాలవా .. జలతారు మేఘాలు
మసకబారిపోవా .... మణులు మాణిక్యాలు 
మూగబోవా మరి ముద్దబంతిపూలు
పడచు ప్రాయాన పడతి పదనిసలివి
అతిశయించిన సొగసు మిసమిసలివి
ఊసులాడే  సన్న జాజి బాసలివి
అసలు సిసలైన కన్నె  మోజు రాశులివి.


                           సాలిపల్లి మంగామణి@ శ్రీమణి